ప్రధాన మంత్రి కార్యాలయం
ఒమన్‌లోని భారతీయులనుద్దేశించి ప్రధాని ప్రసంగం
प्रविष्टि तिथि:
18 DEC 2025 1:32PM by PIB Hyderabad
మస్కట్‌లో అక్కడి భారతీయుల భారీ సమావేశాన్నుద్దేశించి ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వివిధ భారతీయ పాఠశాలలకు చెందిన సుమారు 700 మంది విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒమన్‌లో భారతీయ పాఠశాలలను నెలకొల్పి ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్‌లోని కుటుంబాలు, మిత్రుల తరఫున వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మీయంగా, వర్ణశోభితంగా తనకు స్వాగతం పలికిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఒమన్‌లో స్థిరపడిన భారత్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలను కలవడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. వైవిధ్యమే భారతీయ సంస్కృతికి మూలమనీ, భారతీయులు ఏ సమాజంతోనైనా కలిసిపోవడానికి ఈ వైవిధ్యమే కారణమని వ్యాఖ్యానించారు. ఒమన్‌లో భారతీయ సమాజానికి లభిస్తున్న గౌరవాన్ని ప్రస్తావిస్తూ.. సహజీవనం, సహకారం భారతీయ ప్రవాసుల విశేష లక్షణమని ప్రధానమంత్రి ప్రశంసించారు.
మాండవీ నుంచి మస్కట్ వరకు.. భారత్, ఒమన్ మధ్య ఎన్నో ఏళ్లుగా సత్సంబంధాలున్నాయనీ, కఠోర పరిశ్రమ, ఐక్యత ద్వారా ఆ సంబంధాలను ఇక్కడి భారతీయ ప్రవాసులు నేడు మరింత ముందుకు తీసుకెళ్తున్నారనీ ప్రధానమంత్రి అన్నారు. భారత్ కో జానియే క్విజ్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వారిని ఆయన ప్రశంసించారు. భారత్ - ఒమన్ సంబంధాలకు విజ్ఞానమే కేంద్రంగా ఉందంటూ, ఆ దేశంలో భారతీయ పాఠశాలల్ని నెలకొల్పి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అభినందనలు తెలిపారు. ఒమన్‌లో అక్కడి భారతీయుల సంక్షేమానికి దోహదపడుతున్న గౌరవ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్‌కు శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
భారత వికాసం, అభివృద్ధిలో విప్లవాత్మక మార్పుల గురించీ.. వేగంగా, విస్తృతంగా దేశం మారుతున్న తీరు గురించీ.. గత త్రైమాసికంలో 8 శాతానికి పైగా వృద్ధిరేటుతో సత్తా చాటిన భారత ఆర్థిక వ్యవస్థ శక్తి గురించీ ప్రధానమంత్రి మాట్లాడారు. గత 11 ఏళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ.. మౌలిక సదుపాయాల అభివృద్ధి, తయారీ, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ హిత వృద్ధి, మహిళా సాధికారత రంగాల్లో దేశంలో గణనీయమైన మార్పులొచ్చాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా.. 21వ శతాబ్దం కోసం భారత్ సన్నద్ధమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అన్ని డిజిటల్ చెల్లింపుల్లో దాదాపు 50 శాతానికి పైగా వాటా ఉన్న భారత యూపీఐ.. మనకు గర్వకారణమని, అది మన గొప్ప విజయమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. చంద్రుడిపై కాలుమోపడం నుంచి త్వరలో చేపట్టనున్న గగన్‌యాన్ మానవ సహిత అంతరిక్ష యాత్ర వరకు... అంతరిక్ష రంగంలో భారత్ ఇటీవల సాధించిన అద్భుత విజయాలను ఆయన ప్రస్తావించారు. భారత్ - ఒమన్ మధ్య సహకారంలో అంతరిక్ష రంగం ముఖ్య భాగమన్న ఆయన యువతనుద్దేశించి ఇస్రో ప్రారంభించిన ‘యువికా’ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా విద్యార్థులను ఆహ్వానించారు. భారత్ కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదనీ, వస్తువులు - సేవల నుంచి డిజిటల్ మార్గాల వరకు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
అక్కడి భారతీయుల సంక్షేమానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మన ప్రజలకు ఎప్పుడు, ఎక్కడ సహాయం అవసరమైనా.. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు.
ఏఐ సహకారం, డిజిటల్ అభ్యసనం, ఆవిష్కరణల్లో భాగస్వామ్యం, వ్యాపారపరంగా ఆదానప్రదానాల ద్వారా.. భారత్ - ఒమన్ భాగస్వామ్యం భవిష్యత్ సన్నద్ధంగా ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. యువత పెద్ద కలలు కనాలని, నిశితంగా అభ్యసించాలని, సాహసోపేతమైన ఆవిష్కరణలు చేయాలనీ.. తద్వారా మానవాళికి అర్థవంతంగా సేవలందించాలనీ ఆయన పిలుపునిచ్చారు.
***
(रिलीज़ आईडी: 2206118)
आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam