సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశ సాఫ్ట్ పవర్, ప్రపంచవ్యాప్త సాంస్కృతిక విస్తరణకు కీలక చోదక శక్తిగా ఆవిర్భవించిన ఓటీటీ రంగం


2024లో 11 శాతం వృద్ధితో రూ. 9,200 కోట్లకు చేరుకున్న వీడియో సబ్‌స్క్రిప్షన్ రాబడి


ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే 80 లక్షల డౌన్‌లోడ్‌లను సాధించిన ప్రసార భారతికి చెందిన వేవ్స్ ఓటీటీ

प्रविष्टि तिथि: 17 DEC 2025 3:55PM by PIB Hyderabad

భారతీయ కథలు, సృజనాత్మక ప్రతిభ, సాంస్కృతిక వారసత్వం, స్వతంత్ర చిత్ర నిర్మాణాన్ని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావటం ద్వారా భారతదేశ సాఫ్ట్ పవర్ పెరుగుదలకు ఓటీటీ (ఓవర్ ద టాప్) రంగం గణనీయంగా దోహదపడింది.

పరిశ్రమ అంచనాల (ఫక్కీ-ఈవై మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ రిపోర్ట్ 2025) ప్రకారం 2024లో వీడియో సబ్‌స్క్రిప్షన్ రాబడి 11 శాతం పెరిగి రూ. 9,200 కోట్లకు చేరుకుంది. ఓటీటీలో కంటెంట్ కోసం నగదు చెల్లించే వినియోగదారుల సంఖ్య సుమారు 9.5 కోట్ల నుంచి 11.8 కోట్ల వరకు ఉంది.  

ప్రభుత్వ రంగ ప్రసార సంస్థ ప్లాట్‍ఫామ్ అయిన వేవ్స్ ఓటీటీ.. దూరదర్శన్- ఆల్ ఇండియా రేడియోకు చెందిన గొప్ప ఆర్కైవ్‌లు, ప్రాంతీయ కళలు, డాక్యుమెంటరీలు, శాస్త్రీయ సంగీతం, సాహిత్యం ఆధారిత కార్యక్రమాలు, బహుభాషా కంటెంట్‌ను ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడం అనేది ఈ పెరుగుదలను మరింత బలోపేతం చేసింది.

వర్థమాన చలనచిత్ర రూపకర్తలు, క్రియేటర్లకు మద్దతునిచ్చేందుకు వేవ్స్ ఓటీటీ ఒక నూతన ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టింది. ఇది ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను చేరుకోవడానికి సాంకేతిక ఆధారిత పంపిణీ వేదికను అందిస్తోంది. వేవ్స్ ఓటీటీ అనేది ప్రధానంగా సబ్‌స్క్రిప్షన్ లేని ప్రజా సేవా ప్లాట్‌ఫా‌మ్. ఇది సబ్‌స్క్రిప్షన్ ఆధారిత మోడల్‌లో పనిచేయదు. ప్రకటనలే దీనికి ప్రధాన ఆదాయ వనరు. భారతదేశం అంతటా, ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ కంటెంట్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంపై ఇది దృష్టి సారిస్తోంది. 

ఈ ప్లాట్‌ఫామ్ ప్రస్తుతం వృద్ధి, విస్తరణ దశలో ఉంది. దీని అంతర్జాతీయ వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చే ఆదాయ వనరులను క్రమంగా అభివృద్ధి చేస్తున్నారు.

యూజర్ల విషయంలో ఇది గణనీయమైన వృద్ధి కనబరిచింది. ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే 80 లక్షల కంటే ఎక్కువ మంది యూజర్లు దీనిని డౌన్‌లోడ్ చేసుకున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫా‌మ్‌లలో బహుభాషా భారతీయ కంటెంట్, పబ్లిక్ సర్వీస్ మీడియాకు పెరుగుతున్న డిమాండ్‌ను ఇది తెలియజేస్తోంది. 

పైరేటెడ్ చలనచిత్ర కంటెంట్‌ ఉన్న మధ్యవర్తులపై చర్యలు తీసుకునేందుకు సమాచార సాంకేతిక చట్టం- 2000లోని సెక్షన్ 79(3) కింద సినిమాటోగ్రాఫ్ చట్టం- 1952లో కొత్తగా తీసుకొచ్చిన సెక్షన్ 7(1బీ)(ii) (2023 సవరణ ప్రకారం) కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది.

శ్రీమతి పూనంబెన్ హేమత్ భాయ్ మాడమ్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సమాచార- ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈరోజు లోక్‌సభలో ఈ సమాచారాన్ని అందించారు. 

 

***


(रिलीज़ आईडी: 2205631) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Tamil , Kannada , Malayalam