ప్రధాన మంత్రి కార్యాలయం
ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా పీఎం ప్రసంగం
प्रविष्टि तिथि:
04 JUL 2023 1:39PM by PIB Hyderabad
సాయి రాం! ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టి శ్రీ ఆర్.జె. రత్నాకర్ జీ, శ్రీ కె. చక్రవర్తి జీ, నా పాత మిత్రుడు శ్రీ ర్యూకో హీరా జీ, డాక్టర్ వి.మోహన్ జీ, శ్రీ ఎం.ఎస్ నాగానంద్ జీ, శ్రీ నిమిష్ పాండ్యా జీ, ప్రముఖులు, మహిళలూ, పెద్దలందరికీ స్వాగతం చెబుతూ, సాయి రాం.
ఎన్నోసార్లు పుట్టపర్తిని సందర్శించే అదృష్టం నన్ను వరించింది. మళ్లీ మీ వద్దకు వచ్చి, మిమ్మల్ని కలిసి, ఇవాళ్టి ఈ కార్యక్రమానికి నేరుగా హాజరుకావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కానీ, నా బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయాను. 'మీరు ఒక్కసారి వచ్చి ఆశీస్సులు ఇవ్వాలి' అని నన్ను ఆహ్వానించినప్పుడు రత్నాకర్ జీ అన్నారు. ఆ ప్రకటనను సరిదిద్దాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను. నేను తప్పకుండా అక్కడికి వస్తాను. కానీ, ఆశీస్సులు ఇవ్వటానికి కాదు.. తీసుకోవటానికి వస్తాను. సాంకేతికత సాయంతో ఇవాళ నేను మీ మధ్యనే ఉండగలిగాను. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టుతో అనుబంధమున్న సభ్యులందరికీ, ఇవాళ్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సత్యసాయి బాబా భక్తులందరికీ నా అభినందనలు. ఈ కార్యక్రమంలో సత్యసాయి స్ఫూర్తి, ఆశీస్సులు మనకు తోడుగా ఉంటాయి. ఈ పవిత్రమైన సందర్భంగా శ్రీ సత్యసాయి బాబా మిషన్ విస్తరిస్తుండటం పట్ల సంతోషంగా ఉంది. శ్రీ హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ రూపంలో దేశానికి ప్రధానమైన మేధో సంస్థ లభిస్తోంది. ఈ కన్వెన్షన్ సెంటర్‌కు సంబంధించిన చిత్రాలు, ఇందాక ప్రదర్శించిన లఘుచిత్రంలో దాని సంగ్రహ దృశ్యాలను చూశాను. ఇది ఆధునికతను జోడిస్తూనే ఆధ్వాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఇందులో సాంస్కృతిక దివ్యత్వం, మేధోపరమైన గొప్పదనం రెండూ ఉన్నాయి. ఆధ్యాత్మిక సమావేశాలు, విద్యా సంబంధిత కార్యక్రమాలకు కేంద్రంగా ఇది ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల పండితులు, నిపుణులు ఇక్కడ కలుసుకోవచ్చు. యువతకు ఈ కేంద్రం సహాయంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను.
మిత్రులారా,
ఏ ఆలోచనైనా కార్యరూపం దాల్చి, ఆచరణలో ముందుకు సాగినప్పుడే అత్యంత ప్రభావవంతంగా మారుతుంది. కేవలం మాటలు మాత్రమే చర్యల వంటి ప్రభావాన్ని చూపలేవు. ఇవాళ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవంతో పాటు శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ కూడా ప్రారంభమవుతోంది. అనేక దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ప్రత్యేకించి, ఈ కార్యక్రమం కోసం మీరు ఎంచుకున్న "ఆచరించండి, స్ఫూర్తినివ్వండి" అంశం ఎంతో ప్రభావవంతంగా, సమయోచితంగా ఉంది. మనదేశంలో తరచూ ఇలా చెబుతుంటారు. యత్ యత్ ఆచరతి శ్రేష్ఠః, తత్-తత్ ఏవ ఇతరః జనః II దీని అర్థం.. ఉత్తములు దేన్ని ఆచరిస్తారో, ఇతరులు కూడా దాన్నే అనుసరిస్తారు.
అందువల్ల మన ప్రవర్తనే ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. సత్యసాయి బాబా జీవితమే ఇందుకు స్పష్టమైన ఉదాహరణ. విధులకు ప్రాధాన్యతనిస్తూ, స్వాతంత్ర్యం పొంది 100వ వార్షికోత్సవం నాటికి, నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి ఇవాళ భారత్ ముందుకు సాగుతోంది. 'అమృత కాలం' పేరుని 'కర్తవ్య కాలం' గా మేము మార్చాం. ఎందుకంటే, కేవలం ఆధ్యాత్మిక విలువల మార్గదర్శకత్వాన్నే కాక, భవిష్యత్ ఆకాంక్షలను కూడా తనలో ఇముడ్చుకుందని నమ్ముతున్నాం. ఇది అభివృద్ధి, వారసత్వం రెండింటినీ సూచిస్తుంది. దేశంలో ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రాల పునరుద్ధరణ జరుగుతున్న తరుణంలోనే ఆర్థికంగా, సాంకేతిక రంగాల్లో భారత్ అగ్రస్థానంలో దూసుకెళ్తుంది. ఇవాళ ప్రపంచంలోనే ఐదు అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఉంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ భారత్‌లో ఉంది. డిజిటల్ సాంకేతికత, 5జీ వంటి రంగాల్లో అగ్ర దేశాలతో మనం పోటీ పడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్ టైమ్ ఆన్‌లైన్ లావాదేవీల్లో నలభై శాతం ఒక్క భారత్‌లోనే జరుగుతున్నాయి. నూతనంగా ఏర్పడిన, సాయిబాబా పేరుతో ముడిపడున్న పుట్టపర్తి జిల్లాను 100 శాతం డిజిటల్ చేయాలని.. రత్నాకర్ జీ, మన సాయి భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. ప్రతి లావాదేవీ డిజిటల్ రూపంలో జరగాలి. ప్రపంచంలోనే ఈ జిల్లా ప్రత్యేక గుర్తింపుని పొందటం మీరు చూస్తారు. బాబా ఆశీస్సులతో, నా మిత్రుడు రత్నాకర్ జీ ఈ బాధ్యతను తీసుకుంటే, బాబా తదుపరి జన్మదినోత్సవం నాటికి మొత్తం జిల్లాను డిజిటల్ చేయగలం. అప్పుడు ఒక్క రూపాయి నగదు కూడా అవసరం లేకుండా పోతుంది. ఇది సాధ్యమే.
మిత్రులారా,
సమాజంలోని అన్ని వర్గాల సహకారంతోనే మార్పు సాధ్యపడుతుంది. భారత్ గురించి తెలుసుకోవటానికి, ప్రపంచంతో అనుసంధానం చేయటానికి గ్లోబల్ కౌన్సిల్ వంటి కార్యక్రమాలు సమర్థవంతమైన సాధనాలుగా ఉపయోగపడతాయి.
మిత్రులారా,
సాధువులను మన దేశంలో నిరంతర ప్రవాహంతో పోలుస్తారు. ఎందుకంటే వారి ఆలోచనలకు విరామం ఉండదు. పనులకు అంతం ఉండదు. వారి జీవితం నిరంతర ప్రవాహంతో అవిశ్రాంత ప్రయత్నంతో ఉంటుంది. ఈ సాధువులు ఎక్కడ జన్మించారనేది సామాన్య భారతీయుడికి ముఖ్యం కాదు. నిజమైన సాధువు తన విశ్వాసాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తూ, అందరికీ ఆత్మీయుడవుతాడు. అందుకే మన సాధువులు వేల ఏళ్లుగా 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' (ఒకే భారత్, గొప్ప భారత్) స్ఫూర్తిని పెంపొందిస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా జన్మించారు. కానీ ఆయన భక్తులు, అభిమానులు ప్రపంచంలోని ప్రతి మూలనా కనిపిస్తారు. దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ సత్యసాయికి సంబంధించిన ప్రదేశాలు, ఆశ్రమాలు ఉన్నాయి. ఒకే ధ్యేయంతో ప్రతి భాష, సంప్రదాయానికి చెందిన ప్రజలు ప్రశాంతి నిలయం కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఐక్యతా భావనతో దేశాన్ని శాశ్వతంగా కలిపి ఉంచే చైతన్యమిది.
మిత్రులారా,
సేవ అనే రెండక్షరాల్లోనే అనంతమైన శక్తి ఉందని శ్రీ సత్యసాయి బాబా అనేవారు. దీని భావం మానవ సేవే మాధవ సేవ. సత్యసాయి బాబా జీవితం ఈ స్ఫూర్తికి జీవన సాక్ష్యం. సత్యసాయి బాబా జీవితాన్ని దగ్గరగా పరిశీలించి, ఆయన నుంచి నేర్చుకునే, ఆయన ఆశీస్సుల నీడలో ఉండే అదృష్టం నాకు లభించింది. నాపై ఆయనకు ఎప్పుడూ ప్రత్యేకమైన అభిమానం ఉండేది. నేను ఎల్లప్పుడూ ఆయన దీవెనలను పొందాను. నేను ఆయనతో మాట్లాడినప్పుడల్లా బాబా ఆలోచనలను అత్యంత సరళంగా చెప్పేవారు. ఆయన చేసిన బోధనలు ఇప్పటికీ నాకు, భక్తులకు గుర్తుండిపోయాయి. 'అందరినీ ప్రేమించండి - అందరికీ సేవ చేయండి', 'ఎల్లప్పుడూ సహాయం అందించండి - ఎవరినీ బాధించవద్దు', 'తక్కువ మాటలు - ఎక్కువ పని', 'ప్రతి అనుభవం ఒక పాఠం, ప్రతి నష్టం ఒక లాభం' ఇలాంటి ఎన్నో జీవిత పాఠాలను సత్యసాయి మనకు అందించారు. వాటిలో మానవత్వం, జీవితం పట్ల లోతైన అవగాహన ఉన్నాయి. గుజరాత్లో భూకంపం వచ్చినపుడు, ప్రత్యేకంగా ఆయన నన్ను పిలిచిన సందర్భం నాకు గుర్తుంది. వ్యక్తిగతంగా ప్రతి విషయంలోనూ సహాయక చర్యలు, ఉపశమనం అందించటంలో పాలుపంచుకున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో సంస్థకు చెందిన వేలాది మంది ప్రజలు భుజ్‌లోని ప్రభావిత ప్రాంతాల్లో రేయింబవళ్లు పనిచేశారు. ఎవరినైనా సొంత మనిషిలాగే భావించి, వారి క్షేమాన్ని ఆయన కాంక్షించేవారు. సత్యసాయి బాబా దృష్టిలో 'మానవ సేవే మాధవ సేవ’. 'ప్రతి మానవుడిలో నారాయణుడిని’, 'ప్రతి ప్రాణిలో శివుడిని' దర్శించే సేవా దృక్పథమే మనిషిని దైవంగా మారుస్తుంది.
మిత్రులారా,
భారత్ లాంటి దేశంలో మతపరమైన, ఆధ్యాత్మిక సంస్థలు సామాజిక అభ్యున్నతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయ్యాయి. రాబోయే 25 ఏళ్ల కాలానికి ఎన్నో లక్ష్యాలతో 'అమృత కాలం'లోకి అడుగుపెట్టాం. వారసత్వ సంపదను కాపాడుకుంటూనే అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో సత్యసాయి ట్రస్టు వంటి సంస్థల పాత్ర కీలకం. మీ ఆధ్యాత్మిక విభాగం 'బాల వికాస్'(బాలల అభివృద్ధి) వంటి కార్యక్రమాల ద్వారా దేశంలోని యువతరానికి సాంస్కృతిక వారసత్వాన్ని అందించటం సంతోషకరం. మానవతా సేవకు సత్యసాయి బాబా ఆసుపత్రులను స్థాపించారు. ప్రశాంతి నిలయంలో అత్యాధునిక సదుపాయాలతో ఉన్న ఆసుపత్రి ఇందుకు నిదర్శనం. ఉచిత విద్యను అందించటానికి కొన్నేళ్లుగా సత్యసాయి ట్రస్టు.. పాఠశాలలు, కళాశాలలను నడుపుతోంది. దేశ నిర్మాణంలో, సామాజిక సాధికారతలో మీ సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయం. దేశం చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో సత్యసాయి సంస్థలు అంకితభావంతో పనిచేస్తున్నాయి. 'జల్ జీవన్ మిషన్' ద్వారా దేశంలోని ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన నీటిని ప్రభుత్వం అందిస్తోంది. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు కూడా మారుమూల గ్రామాలకు ఉచితంగా తాగునీటిని అందిస్తూ, ఈ గొప్ప మానవతా కార్యక్రమంలో భాగస్వామి కావడం విశేషం.
మిత్రులారా,
21వ శతాబ్దంలో యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో వాతావరణ మార్పు ఒకటి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వేదికపై భారతదేశం మిషన్ "లైఫ్" వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ఇవాళ ప్రపంచం భారత నాయకత్వాన్ని విశ్వసిస్తోంది. ఈ ఏడాది జీ-20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహిస్తోంది. ఈ కార్యక్రమం భారత ప్రాథమిక సిద్ధాంతమైన 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' ఇతివృత్తం ఆధారంగా సాగుతోంది. భారత్ దృక్పథం ప్రపంచాన్ని ప్రభావితం చేయటమే కాక, ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రపంచ రికార్డు సృష్టించటం మీరు చూశారు. మెజారిటీ దేశాల ప్రతినిధులు ఒకే సమయంలో, ఒక చోట చేరి యోగా చేశారు. ప్రపంచవ్యాప్తంగా యోగా, ప్రజల జీవితాల్లో అంతర్భాగంగా మారుతోంది.
ఆయుర్వేదాన్ని ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. భారతదేశ స్థిరమైన జీవనశైలి నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారు. మన సంస్కృతి, వారసత్వం, గతంపై ఉత్సుకతతో పాటు విశ్వాసం కూడా పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా వివిధ దేశాల నుంచి అనేక విగ్రహాలు తిరిగి భారతదేశానికి చేరుకున్నాయి. ఈ విగ్రహాలు 50-100 ఏళ్ల కిందట మన దేశం నుంచి దొంగిలించినవి. మన సాంస్కృతిక సిద్ధాంతమే భారతదేశ ప్రయత్నాలు, నాయకత్వానికి గొప్ప బలమై నిలుస్తోంది. అందుకే సత్యసాయి ట్రస్టు వంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంస్థలు ఇటువంటి ప్రయత్నాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రాబోయే రెండేళ్లలో కోటి 'ప్రేమ తరు' (ప్రేమ వృక్షాలు) నాటాలని మీరు సంకల్పించారు. ఈ కార్యక్రమం విజయవంతమవాలని ఆకాంక్షిస్తున్నా. నా మిత్రుడు హీరా జీ ఇక్కడ ఉన్నప్పుడు, జపాన్లోని 'మియావాకీ' పద్ధతిలో చిన్న అడవులను సృష్టించే సాంకేతికతను మనం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా. ట్రస్ట్ సభ్యులు దీన్ని అమలు చేయాలని, తద్వారా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిన్న అడవులను సృష్టించే ఒక నమూనాను మనం ప్రదర్శించవచ్చని ఆశిస్తున్నాను. ఇది చాలా పెద్ద ఎత్తున జరగాలి. ఎందుకంటే మొక్కలు ఒకదానికొకటి ప్రాణం పోసుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఒక మొక్కకు మరో మొక్కను బతికించే శక్తి ఉంటుంది. హీరా జీకి ఇందులో ప్రావీణ్యం ఉందని నాకు తెలుసు. అందుకే నేను ఆయనకు ఏ పనినైనా నమ్మకంతో అప్పగించగలను. ఈ విషయాన్ని ఆయనతోనూ చెప్పాను. భారత్ను ప్లాస్టిక్ రహితంగా చేయాలనే సంకల్పంతో పాటు, వీలైనంత ఎక్కువ మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేద్దాం.
స్వచ్ఛ ఇంధన ప్రత్యామ్నాయాల వైపు ప్రజలను ఉత్తేజపరచటానికి సౌరశక్తి కీలకం. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు, ఆంధ్రా సమీపంలోని సుమారు 40 లక్షల మంది విద్యార్థులకు శ్రీ అన్నమైన రాగి, జావ వంటి ఆహారాన్ని అందిస్తున్నారని చెప్పారు. దాన్ని నేను ఒక వీడియోలో కూడా చూశాను. ఇది అభినందించదగిన విషయం. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు చేపడితే దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. శ్రీ అన్న కేవలం పోషకాహారాన్ని అందించడమే కాక, మరెన్నో అవకాశాలనూ కల్పిస్తుంది. ప్రపంచ స్థాయిలో ఇలాంటి ప్రయత్నాలన్నీ భారతదేశ సామర్థ్యాన్ని పెంపొందించటంతో పాటు దేశ గుర్తింపును బలపరుస్తాయి.
మిత్రులారా,
సత్య సాయి బాబా ఆశీస్సులు మనందరిపై ఉన్నాయి. ఈ దివ్య శక్తితో మనం అగ్రగామి భారతదేశాన్ని నిర్మిద్దాం. ప్రపంచానికి సేవ చేయాలనే సంకల్పాన్ని నెరవేర్చుకుందాం. వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవలేకపోయాను. కానీ భవిష్యత్తులో తప్పకుండా వస్తాను. మీ మధ్య గడిపిన ఆ అద్భుతమైన క్షణాలను, పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసుకుంటాను. హీరా జీని నేను అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాను. ఇవాళ అక్కడికి నేను రాలేకపోయినా, భవిష్యత్తులో ఖచ్చితంగా వస్తానని మీకు హామీ ఇస్తున్నా. ఈ నమ్మకంతో, మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. సాయి రాం!
గమనిక: ఇది ప్రధానమంతి ప్రసంగానికి సంబంధించిన అనువాదం. అసలు ప్రసంగం హిందీలో ఇచ్చారు.
***
(रिलीज़ आईडी: 2205088)
आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam