ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ‘సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ 2023’లో ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 28 JUL 2023 2:30PM by PIB Hyderabad

గుజరాత్ ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, నా మంత్రివర్గ సహచరులు శ్రీ అశ్విని వైష్ణవ్, శ్రీ రాజీవ్ చంద్రశేఖర్‌, పారిశ్రామికవేత్తలైన మన మిత్రులు శ్రీ సంజయ్ మెహ్రోత్రా, శ్రీ యంగ్ లియూ, శ్రీ అజిత్ మనోచా, శ్రీ అనిల్ అగర్వాల్, శ్రీ అనిరుధ్ దేవగన్, శ్రీ మార్క్ పేపర్‌మాస్టర్, శ్రీ ప్రభు రాజా, ఇతర ప్రముఖులు, సోదరీ సోదరులారా!
ఈ సదస్సులో నాకు చాలా మంది పరిచయస్తులు కనిపిస్తున్నారు. కొందరిని నేను మొదటిసారి కలుస్తున్నాను. ఈ కార్యక్రమం నవీకరించాల్సిన సాఫ్ట్‌వేర్ లాంటిది. ఈ  ‘సెమికాన్ ఇండియా'  ద్వారా పరిశ్రమతో, నిపుణులతో, అధికారులతో సంబంధాలు కూడా అప్‌డేట్ అవుతున్నాయి. మన సంబంధాల సమన్వయానికి కూడా ఇది చాలా ముఖ్యమని నేను నమ్ముతున్నాను. భారత్‌, విదేశాల నుంచి అనేక కంపెనీలు సెమికాన్ ఇండియాకు వచ్చాయి. మన అంకుర సంస్థలు కూడా ఈ రోజు మనతో చేరాయి. సెమికాన్ ఇండియాకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ రంగంలో సాధించిన పురోగతిని, కొత్త ఉత్సాహంతో కొత్త వ్యక్తులు, కొత్త కంపెనీల భాగస్వామ్యాన్ని, కొత్త ఉత్పత్తులను ప్రతిబింబించే ప్రదర్శనను నేను ఇప్పుడే చూశాను. నేను కొద్దిసేపు మాత్రమే గడపగలిగాను, కానీ నాకు అద్భుతమైన అనుభవం కలిగింది. కొన్ని రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనను వచ్చి చూడాలని నేను ప్రతి ఒక్కరినీ, ముఖ్యంగా గుజరాత్ యువతను కోరుతున్నాను. ఈ కొత్త సాంకేతికత ప్రపంచంలో సృష్టించిన శక్తిని అర్థం చేసుకునేందుకు, తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
మిత్రులారా,
గత సంవత్సరం మనమందరం సెమికాన్ ఇండియా తొలి విడతలో పాల్గొన్నాం. ఆ సమయంలో దేశంలోని సెమీకండక్టర్ రంగంలో ఎందుకు పెట్టుబడి పెట్టాలనే దానిపై చర్చ జరిగింది. ప్రజలు ‘‘ఎందుకు పెట్టుబడి పెట్టాలి?’’ అని అడిగారు. ఇప్పుడు మనం ఒక సంవత్సరం తర్వాత కలుస్తున్నాం. ఇప్పుడు ప్రశ్న మారింది. అదే ప్రజలు ‘‘ఎందుకు పెట్టుబడి పెట్టకూడదు?’’ అని అడుగుతున్నారు. ప్రశ్న మారడమే కాదు, దిశ కూడా మారింది. మీరూ, మీ ప్రయత్నాలు ఈ దిశను మార్చాయి. అందుకే ఈ విశ్వాసాన్ని చూపించి, ఈ చొరవ తీసుకున్నందుకు ఇక్కడ ఉన్న అన్ని కంపెనీలను నేను అభినందిస్తున్నాను. మీరు మీ భవిష్యత్తును దేశ ఆకాంక్షలతో ముడిపెట్టారు. మీరు మీ కలలను భారతసామర్థ్యంతో కలిపారు. భారత్‌ ఎవరినీ నిరాశపరచదు. 21వ శతాబ్దపు దేశంలో మీకు అవకాశాలు ఉన్నాయి. దేశ ప్రజాస్వామ్యం, ఇక్కడి జనాభా, దేశం నుంచి లభించే ప్రయోజనాలు మీ వ్యాపారాన్ని కూడా రెట్టింపు, మూడు రెట్లు చేస్తుంది.
మిత్రులారా,
మీ పరిశ్రమలో 'మూర్‌ నియమం' గురించి చాలా మాట్లాడుకుంటారు. దాని వివరాలు నాకు తెలియవు కానీ దాని మూలంలో 'ఘాతాంక వృద్ధి' ఉందని నాకు తెలుసు. మన దగ్గర ఒక సామెత ఉంది. ‘‘పగలు రెట్టింపు, రాత్రి నాలుగింతలు అభివృద్ధి చెందడం’’.. అంటే వేగంగా పురోగతి సాధించడం..ఇది కూడా అలాంటిదే. ఈ రోజు మనం దేశ డిజిటల్ రంగంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో అదే ‘ఘాతాంక వృద్ధిని’ చూస్తున్నాం. కొన్నేళ్ల క్రితం దేశం ఈ రంగాలంలొ అభివృద్ధి చెందుతున్న దేశం. నేడు ప్రపంచ ఎలక్ట్రానిక్స్‌ తయారీలో మన వాటా అనేక రెట్లు పెరిగింది. 2014లో దేశ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి 30 బిలియన్ల డాలర్ట కంటే తక్కువగా ఉండేది. ఈ రోజు అది 100 బిలియన్ డాలర్లను కూడా దాటింది. భారత్‌ నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు కూడా కేవలం రెండు సంవత్సరాలలో రెట్టింపు కంటే ఎక్కువ అయ్యాయి. దేశంలో తయారైన మొబైల్ ఫోన్ల ఎగుమతి కూడా ఇప్పుడు రెట్టింపు అయింది. ఒకప్పుడు మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకున్న దేశం.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ మొబైల్ ఫోన్లను తయారు చేస్తూ ఎగుమతి చేస్తోంది.
మిత్రులారా,
కొన్ని రంగాలంలొ మన వృద్ధి మూర్‌ నియమం అంచనా వేసిన దానికంటే ఎక్కువగా ఉంది. 2014కు ముందు దేశంలో కేవలం 2 మొబైల్ తయారీ యూనిట్లు మాత్రమే ఉండేవి. నేడు వాటి సంఖ్య 200కు పెరిగింది. 2014లో దేశంలో 6 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ వినియోగదారులు ఉండేవారు. నేడు వారి సంఖ్య కూడా 800 మిలియన్లు అంటే 80 కోట్లకు పైగా పెరిగింది. 2014లో దేశంలో 250 మిలియన్లు అంటే 25 కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్‌లు ఉండేవి. నేడు ఈ సంఖ్య కూడా 850 మిలియన్లకు అంటే 85 కోట్లకు పైగా పెరిగింది. ఈ గణాంకాలు భారత్‌ విజయాన్ని ప్రతిబింబించడమే కాకుండా.. ప్రతి సంఖ్య మీ పరిశ్రమకు పెరుగుతున్న వ్యాపార సామర్థ్యాన్ని సూచిస్తుంది. సెమీకండక్టర్ పరిశ్రమ ‘ఘాతాంక వృద్ధి’ లక్ష్యంతో ముందుకు సాగుతున్న విధానంలో.. దానిని సాధించడంలో దేశ ముఖ్య పాత్ర పోషిస్తుంది.
మిత్రులారా,
నేడు ప్రపంచం నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని ‘ఇండస్ట్రీ 4.0’ను చూస్తోంది. గతంలో ప్రపంచం ఏ పారిశ్రామిక విప్లవాన్ని ఎదుర్కొన్నా.. దాని పునాది ఎక్కడో ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షలే అయ్యాయి. గత పారిశ్రామిక విప్లవానికి, అమెరికన్ డ్రీమ్‌కు మధ్య ఉన్న సంబంధం దీనికి ఉదాహరణ. నేడు అదే విధమైన సంబంధాన్ని నేను నాలుగో పారిశ్రామిక విప్లవం, భారతీయ ఆకాంక్షలకు మధ్య చూస్తున్నాను. నేడు భారతీయుల ఆశయాలే అభివృద్ధిని ముందుకు నడిపిస్తున్నాయి. నేడు  తీవ్ర పేదరికం వేగంగా అంతమవుతున్న దేశాల్లో భారత్‌ ఒకటి. నేడు దేశం ప్రపంచంలో నవ మధ్యతరగతి వేగంగా పెరుగుతున్న దేశం. దేశ ప్రజలు సాంకేతిక పరిజ్ఙానంతో స్నేహపూర్వకంగా ఉండటమే కాకుండా, సాంకేతికతను స్వీకరించడంలో కూడా వేగంగా ఉన్నారు.
దేశంలో నేడు చౌకగా లభిస్తున్న డేటా, ప్రతి గ్రామానికి చేరుతున్న నాణ్యమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు, నిరంతర విద్యుత్ సరఫరా కారణంగా డిజిటల్ ఉత్పత్తుల వినియోగం విపరీతంగా పెరుగుతుంది.ఆరోగ్యం నుంచి వ్యవసాయం, సరుకు రవాణా వరకు సాంకేతిక వినియోగంపై భారత్  విశాలమైన దృష్టితో ముందుకు సాగుతోంది. ఇక్కడ మనకు భారీ జనాభా ఉంది. వారిలో చాలామంది ఇప్పటి వరకు ప్రాథమిక గృహోపకరణాలను కూడా ఉపయోగించకపోయినా, నేరుగా పరస్పరం అనుసంధానమైన స్మార్ట్ పరికరాలను ఉపయోగించబోతున్నారు. అలాగే దేశంలో యువత సంఖ్య చాలా ఎక్కువ. వారిలో కొందరు సాధారణ ద్విచక్ర వాహనాన్ని కూడా ఉపయోగించని వారు ఉండవచ్చు, కానీ ఇప్పుడు వారు స్మార్ట్ ఎలక్ట్రిక్ మొబిలిటీని వినియోగించబోతున్నారు.
భారతదేశంలో పెరుగుతున్న నవ మధ్య తరగతి కుటుంబాలు భారతీయ ఆకాంక్షలకు ప్రధాన శక్తిగా నిలుస్తోంది. దేశంలో విస్తారమైన అవకాశాలు ఉన్న మార్కెట్ కోసం మీరు చిప్‌ తయారీ వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ దిశలో వేగంగా ముందడుగు వేసే వారే ఖచ్చితంగా ఫస్ట్-మూవర్ ప్రయోజనాన్ని పొందడం ఖాయం అని నేను నమ్ముతున్నాను.
మిత్రులారా,
మీ అందరూ  కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. సెమీకండక్టర్లు కేవలం దేశ అవసరమే కాదు, నేడు ప్రపంచానికే ఒక విశ్వసనీయమైన, నమ్మదగిన చిప్ సరఫరా వ్యవస్థ అవసరమని భారత్ గ్రహిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కంటే మెరుగైన విశ్వసనీయ భాగస్వామి మరెవరు ఉండగలరు? భారత్‌పై ప్రపంచం పెట్టుకున్న నమ్మకం రోజురోజుకీ పెరుగుతుండటం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ నమ్మకం ఎందుకు ఏర్పడింది? ఇక్కడ స్థిరమైన, బాధ్యతాయుతమైన, సంస్కరణలపై ప్రభుత్వం దృష్టి పెట్టినందున నేడు పెట్టుబడిదారులు భారత్‌పై నమ్మకం ఉంచుతున్నారు. ప్రతి రంగంలో మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నందున పరిశ్రమలకు భారత్‌పై విశ్వాసం ఉంది. సాంకేతిక రంగం వేగంగా విస్తరిస్తున్న కారణంగా టెక్ రంగానికి కూడా భారత్‌పై నమ్మకం పెరిగింది. విస్తారమైన ప్రతిభావంతులు, నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు, డిజైనర్లు ఉండటం వల్ల సెమీకండక్టర్ పరిశ్రమకు కూడా భారత్‌పై పూర్తి విశ్వాసం ఉంది. ప్రపంచంలోనే అత్యంత చైతన్యవంతమైన, ఏకీకృత మార్కెట్‌లో భాగస్వామిగా మారాలని కోరుకునే ప్రతి ఒక్కరికీ భారత్‌పై నమ్మకం ఉంది. మేం మిమ్మల్ని ‘‘మేక్ ఇన్ ఇండియా’’ అని చెప్పినప్పుడు, దాని అర్థం కేవలం భారత్‌లో తయారు చేయడమే కాదు, భారత్ కోసం తయారు చేయడం, ప్రపంచం కోసం కూడా తయారు చేయడం అని కూడా.
మిత్రులారా,
భారత్‌ తన ప్రపంచ బాధ్యతను బాగా అర్థం చేసుకుని, దేశంలో శక్తిమంతమైన సెమీకండక్టర్‌ వ్యవస్థను నిర్మించేందుకు భాగస్వామ్య దేశాలతో కలిసి ఒక సమగ్ర విధానంతో ముందుకు సాగుతున్నాం. ఇటీవల మేం నేషనల్ క్వాంటం మిషన్‌ను ఆమోదించాం. జాతీయ పరిశోధన సంస్థ బిల్లును కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నాం. ఇప్పుడు సెమీకండక్టర్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు  ఇంజనీరింగ్ పాఠ్యాంశాల్లో కూడా మార్పులు చేస్తున్నాం. దేశంలో 300 కంటే ఎక్కువ గుర్తించిన ప్రధాన కళాశాల్లో ఈ రంగంలోసెమీకండక్టర్లపై కోర్సులు అందుబాటులో ఉంటాయి. మన చిప్స్ టు స్టార్టప్స్ కార్యక్రమం ఇంజనీర్లకు సహాయపడుతుంది. రాబోయే 5 సంవత్సరాల్లో మన దేశంలో లక్షకు పైగా డిజైన్ ఇంజనీర్లను తయారు చేయాలనే అంచనా. భారతదేశంలో పెరుగుతున్న అంకుర సంస్థల వ్యవస్థ కూడా సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయబోతోంది. సెమికాన్ ఇండియాలో పాల్గొనే వారందరికీ ఈ అంశాలు తమలో మనోబలాన్ని అందిస్తాయి.
మిత్రులారా,
కండక్టర్లు, ఇన్సులేటర్లు మధ్య ఉన్న వ్యత్సాసం గురించి మీకు బాగా తెలుసు. కండక్టర్ల ద్వారా శక్తి ప్రవహిస్తుంది. కానీ ఇన్సులేటర్ల ద్వారా కాదు. సెమీకండక్టర్ పరిశ్రమకు ఒక మంచి శక్తి వాహకంగా మారేందుకు భారత్‌ ప్రతి అంశంలోనూ ముందుకు దూసుకుపోతుంది. ఈ రంగానికి విద్యుత్ అత్యంత కీలకం. గత దశాబ్దంలో దేశంలో సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం 20 రెట్లకు పైగా పెరిగింది. ఈ దశాబ్దం చివరికి 500 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని మేం నిర్దేశించుకున్నాం. సౌర పీవీ మాడ్యూల్స్, గ్రీన్ హైడ్రజన్, ఎలక్ట్రోలైజర్ల ఉత్పత్తి కోసం అనేక కీలక చర్యలు తీసుకున్నాం. దేశంలో జరుగుతున్న విధాన సంస్కరణలు కూడా సెమీకండక్టర్ వ్యవస్థ అభివృద్ధిపై సానుకూల ప్రభావాన్ని చూపనున్నాయి. కొత్త తయారీ పరిశ్రమలకు మేం అనేక పన్ను మినహాయింపులను ప్రకటించాం. నేడు ప్రపంచంలోనే అత్యల్ప కార్పొరేట్ పన్ను ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. పన్ను విధానాన్ని మేం సులభంగా మార్చాం. వ్యాపారం చేయడంలో అడ్డంకిగా నిలిచిన అనేక పాత చట్టాలు, అనవసర అనుసరణలను తొలగించాం. సెమీకండక్టర్ పరిశ్రమ కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. ఈ నిర్ణయాలు, ఈ విధానాలు, సెమీకండక్టర్ పరిశ్రమకు భారత్ ఎర్ర తివాచీ పరుస్తోందనడానికి నిదర్శనంగా మారాయి. సంస్కరణల మార్గంలో భారత్ ముందుకు సాగుతున్న కొద్దీ, మీ కోసం మరిన్ని కొత్త అవకాశాలు సృష్టిస్తాం. సెమీకండక్టర్ పెట్టుబడుల కోసం భారత్ ఒక అద్భుతమైన వాహకంగా మారుతోంది.
మిత్రులారా,
ఈ ప్రయత్నాల మధ్య ప్రపంచ సరఫరా వ్యవస్థ అవసరాలపై కూడా భారత్‌కు పూర్తైన అవగాహన ఉంది. ముడి పదార్థాలు, శిక్షణ పొందిన మానవ వనరులు, యంత్ర సామగ్రి విషయంలో మీ అంచనాలు ఏంటో మేం బాగా అర్థం చేసుకుంటున్నాం. అందుకే మీతో కలిసి పనిచేయడంపై మేం ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేసిన ప్రతి రంగం కొత్త శిఖరాలకు చేరుకుంది. అది అంతరిక్ష రంగమైనా, జియోస్పేషియల్ రంగమైనా, అన్నింటిలోనూ మాకు అద్భుతమైన ఫలితాలు లభించాయి. గత సంవత్సరం జరిగిన సెమికాన్ కార్యక్రమంలో సెమీకండక్టర్ పరిశ్రమలోని భాగస్వాముల నుంచి ప్రభుత్వం సూచనలను కోరిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ సూచనల ఆధారంగా ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలను తీసుకుంది. సెమికాన్ ఇండియా కార్యక్రమం కింద ఇచ్చే ప్రోత్సాహకాలను మరింత పెంచాం. ఇప్పుడు సెమీకండక్టర్ తయారీ సౌకర్యాలను భారత్‌లో ఏర్పాటు చేయడానికి సాంకేతిక సంస్థలకు 50 శాతం వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నాం. దేశంలోని సెమీకండక్టర్ రంగం వేగంగా అభివృద్ధి చెందేలా మేం నిరంతరం విధాన సంస్కరణలను అమలు చేస్తూనే ఉన్నాం.
మిత్రులారా,
జీ-20 అధ్యక్ష హోదాలో భారత్ ప్రతిపాదించిన ఇతివృత్తం ‘‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’’. ఇదే ఆత్మస్ఫూర్తితో భారత్‌ను ఒక సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలని మేం భావిస్తున్నాం. భారత నైపుణ్యం, సామర్థ్యం, ఇక్కడి శక్తి యావత్‌ ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చాలన్నదే మా ఆకాంక్ష. ప్రపంచ శ్రేయస్సు కోసం, మెరుగైన ప్రపంచం కోసం భారత్ తన సామర్థ్యాన్ని పెంచుకోవాలని మేం కోరుకుంటున్నాం. మీ భాగస్వామ్యం, మీ సూచనలు, మీ ఆలోచనలు మాకు ఎంతో ఆహ్వానయోగ్యమైనవి. మీ ప్రతి అడుగులోనూ భారత ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ సెమికాన్ సదస్సుకు మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది ఒక గొప్ప అవకాశం. ఇది దేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా సరైన సమయం అని నేను ఎర్రకోట నుంచి చెప్పాను. మీ అందరికీ నా శుభాకాంక్షలు. ధన్యవాదాలు!

(ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి స్వేచ్ఛానువాదం)

 

***


(रिलीज़ आईडी: 2204504) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam