రైల్వే మంత్రిత్వ శాఖ
భారీగా రైల్వేల ఆధునికీకరణ: 11 ఏళ్లలో 42,600 కంటే ఎక్కువ ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల తయారీ
మరింత సమర్థవంతమైన సురక్షిత రైల్వే ప్రయాణాన్ని అందించే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు
స్వదేశీ ఉత్పత్తిని పెంచడం ద్వారా 'ఆత్మనిర్భర్ భారత్', 'భారత్‌లో తయారీ' కార్యక్రమాలను
బలోపేతం చేస్తోన్న భారతీయ రైల్వేలు
నాడు పోస్టు చేయడమైనది:
14 DEC 2025 4:04PM by PIB Hyderabad
మెరుగైన భద్రత, ప్రయాణ సౌకర్యం, నిర్వహణ పనితీరు కనబరిచే ఎల్‌హెచ్‌బీ (లింకే హాఫ్‌మన్ బుష్) కోచ్‌ల తయారీలో భారతీయ రైల్వేలు స్థిరమైన పురోగతిని నమోదు చేశాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో (నవంబర్ 2025 వరకు) మొత్తం 4,224 కంటే ఎక్కువ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఉత్పత్తయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంలో తయారైన 3,590 కోచ్‌లతో పోల్చితే ఈ విషయంలో 18 శాతం వృద్ధి నమోదైంది. రైల్వే యూనిట్లలో ఉత్పాదక సామర్థ్యాన్ని నిరంతరం బలోపేతం చేయడంతో పాటు ఉత్పత్తి ప్రణాళిక మెరుగుదలను ఇది తెలియజేస్తోంది.
ఫ్యాక్టరీల పరంగా చూసుకుంటే 1659 ఎల్‍హెచ్‌బీ కోచ్‌లతో చెన్నై ఐసీఎఫ్ (ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) మొదటి స్థానంలో ఉంది. 1234 కోచ్‌లతో రాయ్‌బరేలీ ఎంసీఎఫ్ (మాడరన్ కోచ్ ఫ్యాక్టరీ) రెండో స్థానంలో నిలవగా 1331 కోచ్‌లతో కపుర్తలా ఆర్‌సీఎఫ్ (రైల్ కోచ్ ఫ్యాక్టరీ) మూడో స్థానంలో ఉంది. ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల ఉత్పత్తి వృద్ధికి ఈ మూడు ఫ్యాక్టరీలే గణనీయంగా దోహదపడ్డాయి.
ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల ఉత్పత్తి విషయంలో గత కొన్ని సంవత్సరాల్లోనే అద్భుతమైన పురోగతి నమోదైంది. 2014- 2025 మధ్య భారతీయ రైల్వే 42,600 కంటే ఎక్కువ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఉత్పత్తి చేసింది. 2004- 2014 మధ్య తయారైన 2,300 కోచ్‌లతో పోలిస్తే 18 రెట్ల పెరుగుదల నమోదైంది. ఉన్నత భద్రతా ప్రమాణాలు, తక్కువ నిర్వహణకు గుర్తింపు పొందిన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను విస్తృతంగా ఉపయోగించటం ద్వారా బోగీల ఆధునికీకరణకు రైల్వేలు ఇస్తోన్న సుస్థిర ప్రాధాన్యతను ఇది తెలియజేస్తోంది.
దేశీయ తయారీ సామర్థ్యాలను పెంచుతూ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా 'ఆత్మనిర్భర్ భారత్', 'భారత్‌లో తయారీ' కార్యక్రమాల లక్ష్యాలకు భారతీయ రైల్వేలు గణనీయ సహకారం అందిస్తూనే ఉన్నాయి. ప్రయాణికులకు సురక్షితమైన, సజావైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తూ దేశంలో పెరుగుతున్న ప్రయాణ అవసరాలను తీర్చేందుకు ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచటంపై భారతీయ రైల్వే దృష్టి సారించింది.
***
(రిలీజ్ ఐడి: 2204174)
సందర్శకుల సూచీ సంఖ్య : : 36