రైల్వే మంత్రిత్వ శాఖ
సంపూర్ణ విద్యుదీకరణకు చేరువలో భారతీయ రైల్వే
నికర-సున్నా కర్బన ఉద్గారాలతో ప్రయాణికుల కోసం పరిశుద్ధమైన, వేగవంతమైన రవాణా
సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు డీజిల్ వినియోగాన్ని తగ్గిస్తూ ప్రపంచస్థాయి ప్రమాణాలను నెలకొల్పనున్న భారతీయ రైల్వే విద్యుదీకరణ
प्रविष्टि तिथि:
14 DEC 2025 4:29PM by PIB Hyderabad
భారతీయ రైల్వేల బ్రాడ్-గేజ్ నెట్‌వర్క్ సంపూర్ణ విద్యుదీకరణకు చేరువలో ఉంది. 99 శాతానికి పైగా విద్యుదీకరణ ఇప్పటికే పూర్తి కాగా, మిగిలిన విస్తరణ పనులూ త్వరలోనే పూర్తికానున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా పనులు వేగంగా సాగుతున్నాయి. 2019-2025 మధ్య కాలంలోనే భారతీయ రైల్వే 33,000 కిలోమీటర్లకు పైనే విద్యుదీకరణను పూర్తి చేసింది. అంటే రోజుకు సగటున 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ మార్గాన్ని విద్యుదీకరిస్తూ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ కాలంలో విద్యుదీకరించిన మొత్తం దూరం జర్మనీ మొత్తం రైల్వే నెట్‌వర్క్‌కు దాదాపు సమానం. ఇది పరిశుద్ధ, సమర్థ రైలు ట్రాక్షన్‌ను విస్తరించడంలో భారత్ స్థాయి, నిబద్ధతలకు నిదర్శనం.
25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 99.2 శాతం కవరేజీతో భారత బ్రాడ్-గేజ్ రైలు నెట్‌వర్క్ విద్యుదీకరణ దాదాపుగా పూర్తయింది.
దీర్ఘకాలంగా రైల్వే వ్యవస్థలను కలిగి ఉన్న దేశాలతో పోల్చినప్పుడు భారత్ సాధించిన విజయం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత రద్దీగా ఉండే రైల్వే వ్యవస్థను నిర్వహిస్తూనే దాదాపు మొత్తం బ్రాడ్-గేజ్ వ్యవస్థను భారత్ విద్యుదీకరించగలిగింది.
ఈ పరివర్తన డీజిల్ వినియోగాన్ని, ఉద్గారాలను, నిర్వహణ ఖర్చులను తగ్గించింది. రైలు కార్యకలాపాల సామర్థ్యం, వేగాన్ని మెరుగుపరిచింది. అనేక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికీ ఖర్చు, నిర్మాణాత్మక పరిమితుల కారణంగా డీజిల్ ఇంధనంపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నప్పటికీ... భారత్ మాత్రం స్పష్టమైన ప్రణాళిక, స్థిరమైన అమలుతో ముందుకు సాగింది.
చివరి లైన్ల విద్యుదీకరణ పూర్తయ్యేసరికి ప్రపంచంలోనే అతిపెద్ద సంపూర్ణ విద్యుదీకరణ గల రైల్వే వ్యవస్థల్లో ఒకదానిని నడపడానికి దేశం సిద్ధంగా ఉంది. ఇది నికర-సున్నా కర్బన ఉద్గారాలు గల వ్యవస్థగా మారాలనే భారతీయ రైల్వేల లక్ష్యానికి మద్దతునిస్తుంది. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులకు పరిశుద్ధమైన, వేగవంతమైన, మరింత విశ్వసనీయమైన రవాణాను అందిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2204172)
आगंतुक पटल : 10