రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

రాష్ట్రపతి చేతుల మీదుగా 2023, 2024వ సంవత్సరాల జాతీయ హస్తకళా పురస్కారాల ప్రదానం

హస్తకళలు మన సాంస్కృతిక గుర్తింపులో ఓ భాగం..
అలాగే జీవనోపాధికి ఒక ముఖ్య మార్గం: రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము

వాణిజ్య సంస్థల్ని ఏర్పాటు చేయడానికి మన యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకూ, డిజైనర్లకూ
చక్కని అవకాశాల్ని అందిస్తున్న హస్తకళా రంగం: రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము

प्रविष्टि तिथि: 09 DEC 2025 2:19PM by PIB Hyderabad

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము 2023, 2024 సంవత్సరాలకు గాను జాతీయ హస్తకళా పురస్కారాలను ఈ రోజు న్యూఢిల్లీలో ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, కళ మన గతకాల జ్ఞాపకాలకూ, వర్తమాన అనుభవాలతో పాటు భవిష్యత్తు ఆకాంక్షలకు కూడా అద్దం పడుతుందన్నారు. మనుషులు ప్రాచీన కాలం నుంచీ తమ భావోద్వేగాలను చిత్రలేఖనం ద్వారానో, శిల్పకళ ద్వారానో తెలియజేస్తున్నారని రాష్ట్రపతి అన్నారు. కళ ప్రజలను సంస్కృతితో జోడిస్తుంది. అలాగే, కళ ప్రజలను ఒకరిని మరొకరితో జతపరుస్తుంది అని శ్రీమతి ద్రౌపదీ ముర్ము అన్నారు. 
శతాబ్దాల నాటి నుంచీ మన హస్తకళల సంప్రదాయం చైతన్యవంతంగానూ, పదిలంగానూ నిలిచి ఉందంటే మన చేతివృత్తి కళాకారులు తరాల తరబడి కనబరుస్తున్న నిబద్ధతే కారణమని రాష్ట్రపతి అన్నారు. మన చేతివృత్తి కళాకారులు తమ మూల స్ఫూర్తిని సజీవంగా ఉంచుకుంటూనే కళనూ, తమ సంప్రదాయాన్నీ మారుతున్న కాలాలకు తగ్గట్లు మార్చుకుంటున్నారన్నారు. వారు తమ కళారూపాల్లో దేశ మూలాల సుగంధాన్ని కాపాడుతున్నారని రాష్ట్రపతి ప్రశంసించారు.

హస్తకళలు మన సాంస్కృ‌తిక గుర్తింపులో ఓ భాగం మాత్రమే కాదు, అవి బతుకుతెరువుకు ఒక ముఖ్య మార్గంగా కూడా ఉన్నాయని రాష్ట్రపతి అన్నారు. ఈ రంగం దేశంలో 32 లక్షల మందికి ఉపాధిని అందిస్తోందని తెలిపారు. హస్తకళల నుంచి ఉపాధినీ, ఆదాయాన్నీ పొందుతున్న ప్రజల్లో చాలా మంది గ్రామీణ ప్రాంతాలు లేదా సుదూర ప్రాంతాలకు చెందిన వారే కావడం గమనించ తగినదని రాష్ట్రపతి అన్నారు.
హస్తకళా రంగం సాంప్రదాయికంగా బలహీన వర్గాల ప్రజలకు ఊతమిస్తున్నందున,  సామాజిక సాధికారత కోసం హస్తకళల్ని ప్రోత్సహించడం ముఖ్యమని రాష్ట్రపతి వివరించారు. హస్తకళలు చేతి వృత్తుల వారికి బతుకుతెరువును చూపుతున్నాయనీ, వారికి ఒక గుర్తింపునీ, సమాజంలో గౌరవాన్నీ కలిగిస్తున్నాయని శ్రీమతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఈ రంగంలో పనిచేసే వారిలో 68 శాతం మహిళలే ఉన్నందువల్ల ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తే అది మహిళ సాధికారతను పటిష్ఠం చేస్తుందన్నారు.
సహజ వనరులపై, స్థానిక వనరులపై ఆధారపడడం హస్తకళా పరిశ్రమ అత్యంత గొప్ప బలం అని రాష్ట్రపతి చెప్పారు. ఈ పరిశ్రమ పర్యావరణానికి అనుకూలమైంది, బొగ్గుపులుసు వాయువును స్వల్పంగా మాత్రమే వాతావరణంలోకి విడుదల చేస్తుంది అని శ్రీమతి ద్రౌపదీ ముర్ము అన్నారు. నేడు పర్యావరణ అనుకూలమైన, స్థిరమైన జీవనశైలిని ప్రపంచమంతా గుర్తిస్తోందన్నారు. ఈ కోణంలో చూస్తే, ఈ రంగం స్థిరత్వానికి దోహదపడుతుందని శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు.
జీఐ ట్యాగ్ భారతీయ హస్తకళా ఉత్పాదనలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపునిస్తోందని తెలిసి సంతోషిస్తున్నానని రాష్ట్రపతి అన్నారు. వాటాదారులందరూ తమ ప్రత్యేకమైన ఉత్పత్తులకు జీఐ ట్యాగును పొందడానికి కృషిచేయాలని శ్రీమతి ద్రౌపదీ ముర్ము విజ్ఞప్తి చేశారు. జీఐ ట్యాగ్ వారి ఉత్పాదనలకు ఒక విశిష్ట గుర్తింపును ఇవ్వడంతో పాటు దేశ, విదేశాల్లో వారి విశ్వసనీయతను పెంపొందిస్తుందని రాష్ట్రపతి అన్నారు. ఒక జిల్లా, ఒక ఉత్పాదన (ఓడీఓపీ) కార్యక్రమం కూడా మన ప్రాంతీయ హస్తకళా ఉత్పాదనలకు అంతర్జాతీయ గుర్తింపును పటిష్ఠ పరుస్తోంది అని శ్రీమతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేశారు.
మన చేతివృత్తుల వారు కొన్ని తరాలుగా సంపాదించుకున్న జ్ఞానం, అంకితభావం, కఠిన శ్రమ తో  భారతీయ హస్తకళా ఉత్పాదనలు ప్రపంచంలో తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాయని రాష్ట్రపతి చెప్పారు. భారతీయ హస్తకళలకు ఉన్న డిమాండు.. ఈ రంగం వృద్ధి చెందడానికి ఎన్నెన్నో అవకాశాల్ని అందిస్తోందని శ్రీమతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేశారు. ఈ రంగం మన యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకూ, డిజైనర్లకూ వాణిజ్య వ్యవస్థల్ని ఏర్పాటు చేయడానికి చక్కని అవకాశాల్ని అందిస్తోందని రాష్ట్రపతి అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగాన్ని చదవడానికి, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి..

Please click here to see the President's Speech


(रिलीज़ आईडी: 2201195) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Malayalam , Bengali , English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil