ఆయుష్
సంప్రదాయ వైద్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండో సదస్సు... సన్నాహక కార్యక్రమాలను ప్రారంభించిన భారత్
2వ డబ్ల్యూహెచ్ఓ సదస్సును పురస్కరించుకొని ఢిల్లీలో తొలి కార్యక్రమం..
సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన కేంద్ర మంత్రి శ్రీ జాదవ్
సంప్రదాయ వైద్యం ద్వారా సమతుల్యతను పునరుద్ధరించడంలో ప్రపంచానికి నాయకత్వం వహిస్తోన్న భారత్: శ్రీ ప్రతాపరావు జాదవ్
ఫలితాల ఆధారంగా సంప్రదాయ వైద్య ఏకీకరణను ముందుకు తీసుకెళ్లనున్న సదస్సు: డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్
డిసెంబర్ 17 నుంచి 19 వరకు ఈ ప్రపంచ సదస్సు వేదికగా ఢిల్లీలోని భారతమండపం
సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ
సంప్రదాయ వైద్యంలో శాస్త్రీయ ధ్రువీకరణ, డిజిటల్ ఆరోగ్యం, జీవవైవిధ్య రక్షణ, ప్రపంచ సహకారంపై దృష్టి సారించనున్న సదస్సు
प्रविष्टि तिथि:
08 DEC 2025 4:35PM by PIB Hyderabad
డిసెంబర్ 17 నుంచి 19 వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించనున్న ‘సంప్రదాయ వైద్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 2వ అంతర్జాతీయ సదస్సుకు ముందస్తుగా ఈ రోజు ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ఆయుష్ మంత్రిత్వ శాఖ పత్రికా సమావేశాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా ఆయుష్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర) శ్రీ ప్రతాపరావు జాదవ్ మాట్లాడుతూ 2023లో గుజరాత్‌లో జరిగిన మొదటి విడత కార్యక్రమం విజయవంతమైన తర్వాత ఈ రెండో విడత సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం గొప్ప గర్వకారణమని అన్నారు. దేశానికి ఉన్న ‘సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః’ అనే లక్ష్యానికి అనుగుణంగా మానవాళి ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సు కోసం సంప్రదాయ వైద్యాన్ని ప్రధాన స్రవంతంలోకి తీసుకొచ్చేందుకు జరుగుతున్న సమష్టి అంతర్జాతీయ ప్రయత్నంలో ఈ సదస్సు మరో కీలక ముందడుగని ఆయన పేర్కొన్నారు.
ఈ ఏడాది సదస్సు ఇతివృత్తం ‘సమతుల్యతను పునరుద్ధరించడం: ఆరోగ్యం, శ్రేయస్సుకు సంబంధించిన విజ్ఞానం, అభ్యాసం’ అని తెలియజేసిన శ్రీ ప్రతాపరావు జాదవ్.. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంత్రులు, విధాన రూపకర్తలు, అంతర్జాతీయ ఆరోగ్య రంగానికి చెందిన మేధావులు, పరిశోధకులు, నిపుణులు, పరిశ్రమ ప్రతినిధులు, అభ్యాసకులు పాల్గొంటారని తెలిపారు. ఈ సదస్సులో 100 ఎక్కువ దేశాలు భాగస్వామ్యం అవుతాయని పేర్కొన్నారు.
భారత్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన, శాస్త్రీయ అధ్యయనాలు జరిగిన ఔషధ మొక్కల్లో ఒకటైన అశ్వగంధకు సబంధించిన ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ సదస్సు సందర్భంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుందని మంత్రి ప్రకటించారు. సంప్రదాయ, సమకాలీన ఆరోగ్య ప్రక్రియల్లో అశ్వగంధకు ఉన్న ప్రాముఖ్యతను ఈ కార్యక్రమం తెలియజేయనుంది.
సంప్రదాయ వైద్యంలో భారత్‌కు ఉన్న ప్రపంచ నాయకత్వ స్థానాన్ని ప్రధానంగా ప్రస్తావించిన ఆయన.. ఆయుష్ వ్యవస్థలైన ఆయుర్వేదం, యోగా, ప్రకృతివైద్యం, యునాని, సిద్ధ, సోవా-రిగ్పా, హోమియోపతిలు శతాబ్దాలుగా ప్రజలకు సేవలందిస్తున్నాయన్నారు. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యానికి విశ్వసనీయ పరిష్కారాలుగా ప్రపంచవ్యాప్తంగా ఇవి గుర్తింపుపొందాయని మంత్రి అన్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో భారత్ భాగస్వామ్యంతో డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ సంప్రదాయ వైద్య కేంద్రం (గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్) ఏర్పాటు చేయటం దేశ సంప్రదాయ విజ్ఞాన వ్యవస్థలపై పెరుగుతున్న ప్రపంచ విశ్వాసాన్ని తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు.
సదస్సును నిర్వహించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తోన్న నిరంతర ప్రయత్నాలను శ్రీ ప్రతాపరావు జాదవ్ ప్రశంసించారు. సంప్రదాయ వైద్యంపై అవగాహనను పెంచటం, ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో మీడియాకు కీలక పాత్ర ఉందని ఆయన అన్నారు.
సదస్సు ముగింపు కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. సదస్సులో జరిగే చర్చలు, భాగస్వామ్యాలు ఆరోగ్య సంరక్షణ విషయంలో మరింత సంపూర్ణ, సమగ్ర, సుస్థిర భవిష్యత్తును అందించే దిశగా ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా ప్రాతీయ డైరెక్టర్ ఎమెరిటస్, సంప్రదాయ వైద్యం విషయంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్‌కు సీనియర్ సలహాదారు డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ మాట్లాడుతూ.. ఆరోగ్యానికి సంబంధించిన సహకారాన్ని ముందుకుతీసుకెళ్లటంలో ఈ సదస్సు ఒక కీలక ఘట్టంగా నిలుస్తుందని ప్రముఖంగా చెప్పారు. 100 కంటే ఎక్కువ దేశాల భాగస్వామ్యంతో సంప్రదాయ, కాంప్లిమెంటరీ, ఇంటిగ్రేటివ్, దేశీయ వైద్యాలను జాతీయ ఆరోగ్య వ్యవస్థల్లో ఫలితాల ఆధారిత, సమాన, సుస్థిర ఏకీకరణ చేసే విధంగా ఒక దశాబ్ద కాలానికి సంబంధించిన రోడ్ మ్యాప్‌ను ఈ సదస్సు రూపొదించనున్నట్లు తెలిపారు.
సంప్రదాయ వైద్యంపై ప్రపంచం ఆధారపడుతోందని ఆమె ప్రధానంగా చెప్పారు. పరిశోధన, ఆవిష్కరణ, నియంత్రణలను బలోపేతం చేయటం ద్వారా ఫలితాల్లో ఉన్న అంతరాలను తగ్గించాల్సిన తక్షణ అవసరం ఉందని అన్నారు.
సదస్సులో భాగంగా ‘అశ్వగంధ: సంప్రదాయ విజ్ఞానం నుంచి ప్రపంచ ప్రభావం వరకు ప్రముఖ ప్రపంచ నిపుణుల ఆలోచనలు’ అనే శీర్షికతో 2025 డిసెంబర్ 17 నుంచి 19 వరకు ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో డబ్ల్యూహెచ్ఓ-జీటీఎంసీ (డబ్ల్యూహెచ్ఓ గ్లోబర్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్) ఈ సెషన్‌ను నిర్వహిస్తోంది. అశ్వగంధపై శాస్త్రీయ అవగాహనను మరింత పెంచేందుకు ప్రముఖ పరిశోధకులు, విధాన రూపకర్తలు, క్లినీషియన్లను ఈ కార్యక్రమం ఒక వేదికపైకి తీసుకొస్తుంది. సంప్రదాయ విజ్ఞానం నుంచి పొందిన విజ్ఞానాన్ని మిళితం చేస్తూ అశ్వగంధకు ఉన్న అడాప్టోజెనిక్, న్యూరోప్రొటెక్టివ్, ఇమ్యునోమాడ్యులేటరీ లక్షణాలపై ఉన్న సమకాలీన ఫలితాలపై ఈ చర్చలు దృష్టి సారించనున్నాయి. సేఫ్టీ అంచనాలకు ప్రాధాన్యతనిస్తూ ఫలితాల ఆధారిత ఉత్పత్తుల విషయంలో అంతర్జాతీయ ఆమోదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ సెషన్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా, పత్రికా సమాచార కార్యాలయం(పీఐబీ) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ శ్రీ ధీరేంద్ర ఓజా, ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి అలార్మేల్మంగై డి, ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి మోనాలిసా దాష్, ఆయుష్ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ సత్యజిత్ పాల్‌లతో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
2025 నవంబర్ 9- 10న జరిగిన సమావేశంలో రాయబారులను స్వాగతించారు.ఈ కార్యక్రమంలో భారత్-డబ్ల్యూహెచ్ఓ సహకారం, సదస్సుకు ఉన్న ప్రపంచ ప్రాముఖ్యత గురించి దౌత్యవేత్తలకు తెలియజేశారు.
సంప్రదాయ వైద్యానికి సంబంధించిన 2వ డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ సదస్సుకు నేటి కార్యక్రమంతో అధికారికంగా కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ, సమగ్ర, సుస్థిర ఆరోగ్య సంరక్షణను ముందుకు తీసుకెళ్లటంలో భారత దేశ నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తోంది.
(रिलीज़ आईडी: 2200657)
आगंतुक पटल : 7