ప్రధాన మంత్రి కార్యాలయం
చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన సందర్భంగా టీమ్ ఇస్రోను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
प्रविष्टि तिथि:
26 AUG 2023 11:13AM by PIB Hyderabad
మిత్రులారా నమస్కారం,
మీ అందరి మధ్యకు వచ్చినందుకు ఈ రోజు నాకు ఒక కొత్త రకమైన ఆనందం కలుగుతోంది. బహుశా ఎవరికైనా ఇలాంటి ఉల్లాసం చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే దొరుకుతుండవచ్చు! మనసంతా ఉల్లాసంతో నిండిపోవడం, దాని ఫలితంగా అశాంతికి కూడా లోనవడం లాంటి సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతుంటాయి. ఇలాంటిదే నా విషయంలోనూ ఈసారి జరిగింది.. నేనేమో చాలా అస్థిమితానికి లోనయ్యాను. అప్పుడు దక్షిణ ఆఫ్రికాలో ఉన్నాన్నేను.. ఆ తరువాత గ్రీస్‌లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందుకని అక్కడకు వెళ్లాల్సి వచ్చింది. నా మనసు మాత్రం పూర్తిగా మీతోనే ఉంది. అయితే మీ అందరికీ నేను అన్యాయం చేస్తున్నానని కొన్ని సందర్బాల్లో నాకు అనిపిస్తూ ఉంటుంది. నా అస్థిమితం మీకు ఒక సమస్యగా మారుతోంది. మీరు ఇంత పొద్దున్నే ఇక్కడికి రావాల్సి వచ్చింది. అయితే నేనే మీ దగ్గరకు వచ్చి, మీకు నమస్సులు తెలియజేద్దామనుకున్నాను. ఇది మీకు తప్పక అసౌకర్యాన్ని కలిగించేదే కావచ్చు, కానీ, నేను భారత్‌కు వచ్చీ రాగానే మిమ్మల్ని కలవాలనుకున్నాను. మీ అందరికీ నమస్కారాలు తెలియజేయాలని భావించాను.. మీ అందరి కఠోర శ్రమకూ, మీ సహనానికీ, మీ ఉద్వేగానికీ, మీలోని చైతన్యానికీ, మీ ఉత్సాహానికీ వందనాలు చెబుదామనుకున్నాను. మీరు దేశాన్ని ఎంత ఉన్నత స్థానంలో నిలబెట్టారనేది ఏదో సాధారణ విజయం ఎంతమాత్రం కాదు. ఇది అనంత అంతరిక్షంలో భారత దేశ శాస్త్రీయ సామర్థ్యాన్ని ప్రకటించడం.
భారత్ చంద్రుని మీదకు అడుగుపెట్టింది. మనం మన జాతీయ గౌరవాన్ని చంద్ర గ్రహం మీద ప్రతిష్ఠించాం. మనం మరెవ్వరూ చేరుకోని చోటుకు చేరుకున్నాం. మనం ఇంతవరకూ ఎవ్వరూ చేయని పనిని చేశాం. ఇది నేటి భారత్. నిర్భయ భారత్. యోధ భారత్. ఈ భారత్ ఒక కొత్త కోణంలో ఆలోచిస్తుంది. చీకటిలో ఉన్నప్పటికీ వెలుగు కిరణాల్ని ప్రపంచమంతటా వ్యాపింపచేస్తుంది. 21వ శతాబ్దంలో, ఇదే భారత్.. ప్రపంచానికి ఎదురవుతున్న పెద్ద పెద్ద సమస్యల్ని పరిష్కరిస్తుంది. నా కళ్లెదుట ఆగస్టు 23వ తేదీ.. అందులోని ఒక్కొక్క క్షణమూ.. పదే పదే కనిపిస్తున్నాయి. టచ్‌డౌన్ రూఢి అయిన మరుక్షణం ఇక్కడ ఇస్రో సెంటర్లో, దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఆనందంతో గెంతులు వేశారు. ఆ దృశ్యాల్ని ఎవరు మరచిపోగలరు?! కొన్ని జ్ఞాపకాలు నిత్యమై శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆ క్షణం ఈ వందేళ్లలో మిగతా అన్నిటి కన్నా స్ఫూర్తిదాయక క్షణాల్లో ఒకటిగా మిగిలిపోయింది. భారత్‌లో ప్రతి ఒక్కరికీ ఒక పెద్ద పరీక్షలో పాసయినట్లుగా అనిపించసాగింది. ఇప్పటికీ ఇంకా అభినందనలు తెలియజేస్తూనే ఉన్నారు.. సందేశాలు పంపిస్తూనే ఉన్నారు.. మరి ఇవన్నీ సాధ్యం చేసింది మీరందరూ. ఇది చేసింది మీరు.. నా దేశ సైంటిస్టులు, దీనిని చేసి చూపించారు. మిమ్మల్ని నేను ఎంతగా ఎన్నిసార్లు పొగిడినా, అది తక్కువే అవుతుంది.
మిత్రులారా,
మన మూన్‌ల్యాండర్ అంగదుని మాదిరిగా పాదాన్ని బలంగా చంద్ర గ్రహం మీద మోపినట్లున్న ఫోటోను నేను చూశాను. ఒక వైపు ‘విక్రమ్’ విశ్వాసం, మరో వైపు ‘ప్రజ్ఞాన్’ పరాక్రమం.. మన ‘ప్రజ్ఞాన్’ నిరంతరం చంద్ర గ్రహం మీద తన అడుగుజాడలను పరుస్తూ పోతోంది. వేర్వేరు కెమెరాలతో తీసిన చిత్రాలు ఇప్పుడే విడుదలయ్యాయి.. వాటిని చూసే భాగ్యం నాకు దక్కింది.. అద్భుతంగా ఉందిది. మానవ నాగరికతలో మొదటిసారి.. భూమి తాలూకు లక్షల సంవత్సరాల చరిత్రలో.. ఆ చోటుకు సంబంధించిన చిత్రాన్ని మానవుడు తన కళ్లతో చూస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రపంచానికి చూపించే పనిని భారత్ చేసింది.. మీ శాస్త్రవేత్తలందరూ కలిసి కదా ఈ పనిని పూర్తి చేశారు. భారతదేశ విజ్ఞానశాస్త్ర స్ఫూర్తినీ, మన సాంకేతికతనీ, మన వైజ్ఞానిక స్వభావం గొప్పతనాన్నీ ఇవాళ ప్రపంచమంతా గుర్తిస్తోంది. చంద్రయాన్ మహా ఉద్యమ సాఫల్యం ఒక్క భారత్‌ది మాత్రమే కాదు, యావత్తు మానవాళి సాధించిన విజయం ఇది. మన మిషన్లో అన్వేషించే ప్రాంతం అన్ని దేశాల మిషన్లకూ కొత్త దారుల్ని పరుస్తుంది. ఇది కేవలం చంద్ర గ్రహ రహస్యాల్ని వెల్లడి చేయడమే కాకుండా భూగ్రహం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను వెతకడంలో కూడా సాయపడుతుంది. ఈ విజయానికి గాను మన శాస్త్రవేత్తలకూ, సాంకేతికనిపుణులకూ, ఇంజినీర్లతో పాటు చంద్రయాన్ మహా ఉద్యమంతో అనుబంధాన్ని కలిగి ఉన్న సభ్యులందరికీ నేను మరో సారి అభినందనలు తెలియజేస్తున్నాను.
నా కుటుంబ సభ్యులారా,
అంతరిక్ష మిషన్లలో టచ్‌డౌన్ పాయింటుకు ఒక పేరును పెట్టే విజ్ఞానశాస్త్ర సంప్రదాయమంటూ ఒకటి ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు. చంద్ర గ్రహంలో ఏ భాగాన మన చంద్రయాన్ అడుగిడిందో, ఆ చోటుకు కూడా నామకరణం చేయాలని భారత్ నిర్ణయించింది. చంద్రయాన్-3 తాలూకు మూన్ ల్యాండర్ దిగిన చోటును ఇప్పటి నుంచి ‘శివ్ శక్తి’ అనే పేరుతో పిలుస్తారు. శివ అనే మాటలో మానవతా సంక్షేమ సంకల్పం ఇమిడి ఉంది. శక్తి మనకు ఆ సంకల్పాలను నెరవేర్చే సామర్థ్యాన్ని అందిస్తుంది. ‘శివ శక్తి’ స్థలం హిమాలయాలు కన్యాకుమారితో జత పడాలనే భావనను స్ఫురింప చేస్తుంది. మన రుషులు చెప్పారు..
యేన కర్మాణ్యపసో మనీషిణే యజ్ఞే కృణ్వన్తి విదథేషు ధీరా:
యద్‌పూర్వ యక్షమన్త: ప్రజ్ఞానాం తన్మే మన:శివ-సంకల్ప-మస్తు’’ అని.
ఈ మాటలకు, ఏ మనసుతో మనం కర్తవ్య కర్మ చేస్తామో, ఆలోచనలకూ, విజ్ఞానానికీ గతిని అందిస్తామో, ఏది అందరిలోనూ ఉందో, ఆ మనస్సు శుభమైన, సంక్షేమదాయకమైన సంకల్పాలతో ముడిపడి ఉండాలి.. అని అర్థం. మనసులో ఈ శుభసంకల్పాల్ని పండించుకోవడానికి శక్తి ఆశీర్వాదం లభించడం తప్పనిసరి. ఈ శక్తి మన మహిళా శక్తే. మన తల్లులూ, ఆడపడుచులే. మనకు ఒక సూక్తి ఉంది. అదే.. ‘సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతని’. నిర్మాణం నుంచి ప్రళయం వరకూ, పూర్తి సృష్టికి ఆధారం మహిళా శక్తే అని దీని అర్థం. చంద్రయాన్-3లో మన మహిళా శాస్త్రవేత్తలు, ఈ దేశ నారీ శక్తి ఎంత పెద్ద పాత్రను పోషించిందీ మీరంతా చూశారు. చంద్ర గ్రహం మీది శివశక్తి చోటు, విజ్ఞానశాస్త్రాన్ని మానవ సంక్షేమానికి మాత్రమే ఉపయోగించాలనే స్ఫూర్తిని రాబోయే తరాలకు అందిస్తుంది. మానవ జాతి సంక్షేమమే మన అత్యున్నత వాగ్దానం.
మిత్రులారా,
మరో నామకరణ ఘట్టం చాలా కాలంగా నిలిచిపోయింది. నాలుగేళ్ల కిందట, చంద్రయాన్-2 చంద్రగ్రహానికి సమీపంగా వెళ్లినప్పుడు, దాని అడుగుజాడలు పడిన చోట, ఆ స్థానానికి ఒక పేరును పెట్టాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ ఆ పరిస్థితుల్లో ఒక నిర్ణయాన్ని తీసుకొనేందుకు బదులు, చంద్రయాన్-3 విజయవంతంగా చంద్ర గ్రహాన్ని చేరుకొన్నప్పుడు.. ఈ రెండు చోటులకూ కలిపి పేరును అప్పుడు పెడదామని మనం శపథం చేశాం. మరి ఇవాళ నాకనిపిస్తోంది.. ఎప్పుడయితే ప్రతి ఇంట్లో, ప్రతి హృదయంలో మువ్వన్నెలు నిండుతాయో, చంద్రగ్రహంపై త్రివర్ణం రెపరెపలాడుతుందో, అలాంటప్పుడు ‘చంద్రయాన్-2’తో ముడిపడ్డ ఆ చోటుకు ‘తిరంగా’ అని కాక, మరే పేరును పెడతాం? అని. ఈ తిరంగా స్థలం భారత్ చేసే ప్రతి ప్రయత్నానికీ స్ఫూర్తిని ఇస్తూ ఉంటుంది. ఈ తిరంగా స్థలం ఏ అపజయమూ చివరిది కాదనే పాఠాన్ని మనకు బోధిస్తూ ఉంటుంది. బలమైన కోరిక ఉందీ అంటే, విజయం సిద్ధించి తీరుతుంది. నేను మళ్లీ మళ్లీ చెబుతాను.. చంద్రయాన్-2 పదచిహ్నాలు ఉన్న చోటులో, ఆ స్థలాన్ని ఈ రోజు నుంచీ ‘తిరంగా పాయింట్’ అని పిలుస్తాం. ఇక చంద్రయాన్-3 తాలూకు మూన్ ల్యాండర్ చేరుకున్న ప్రదేశాన్ని ఈ రోజు నుంచీ ‘శివశక్తి’ అని పిలుస్తాం.
మిత్రులారా,
చంద్రగ్రహం ఉపరితలాన్ని తాకిన ప్రపంచ దేశాల్లో నాలుగో దేశంగా ప్రస్తుతం భారత్ పేరు తెచ్చుకుంది. భారత్ తన ప్రయాణాన్ని ఎక్కడ మొదలుపెట్టిందో మనం గమనిస్తే, ఈ సాఫల్యం మరింత గొప్పదిగా కనిపిస్తుంది. భారత్ దగ్గర అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం లేని కాలమంటూ ఒకటి ఉండింది. ఏ మద్దతూ మనకు లభించ లేదు. మనం ‘తృతీయ ప్రపంచ’ దేశాల్లో ఒకటిగా ఉంటూ, ‘మూడో వరుస’లో నిలబడే వాళ్లం. అక్కడి నుంచి, ఇవాళ భారత్ ప్రపంచంలో అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ప్రస్తుతం, వాణిజ్యం మొదలు సాంకేతిక విజ్ఞానం వరకూ.. భారత్ మొదటి వరుసలో నిలబడ్డ దేశాల సరసన చోటు దక్కించుకుంది. అంటే, ఈ ప్రయాణంలో ‘మూడో వరుస’ నుంచి ‘ఒకటో వరుస’కు చేరాం. ఇందులో ‘ఇస్రో’ వంటి సంస్థలు ప్రధాన పాత్రను పోషించాయి. ప్రస్తుతం మీరు ‘మేక్ ఇన్ ఇండియా’ను చంద్ర గ్రహం వరకూ తీసుకువెళ్లారు.
నా కుటుంబ సభ్యులారా,
ఈ రోజున మీ మధ్యకు వచ్చాన్నేను.. మరీ ముఖ్యంగా దేశ ప్రజలకు మీరు పడ్డ శ్రమను గురించి తెలియజేయాలని అనుకుంటున్నాన్నేను. నేను చెబుతున్న మాటలు మీ దృష్టిలో కొత్తవేం కావు. కానీ మీరు చేసిందంతా, మీ సాధనంతా దేశ ప్రజలకు తెలియాలి. భారత్ దక్షిణ భాగంలో నుంచి చంద్ర గ్రహం దక్షిణ ధృవం వరకూ సాగిన ఈ చంద్రయాన్ యాత్ర సులభమైందేమీ కాదు. మూన్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం మన శాస్త్రవేత్తలు ఇస్రో పరిశోధన కేంద్రంలో ఏకంగా ఓ కృత్రిమ చంద్ర గ్రహాన్నే రూపొందించారు. ఈ కృత్రిమ జాబిల్లి మీద విక్రమ్ ల్యాండర్‌ను రకరకాల పద్ధతుల్లో ఉపరితలం మీదకు దించి, దానిని వారు పరీక్షించారు. ఇప్పుడిక ఇన్ని విధాల పరీక్షల్నీ రాసి మరీ మన ‘మూన్ ల్యాండర్’ అక్కడకు వెళ్లిందంటే, దానికిక విజయం ఖాయంగా దక్కాల్సిందే, కదా.
మిత్రులారా,
ఇవాళ, భారత యువతరాన్ని నేను చూస్తుంటే సైన్సు, అంతరిక్షం, నవకల్పన.. వీటికి సంబంధించిన విషయాల్లో యువతలో ఎంతటి శక్తి ఉట్టిపడుతోందో. ఇదంతా మన అంతరిక్ష మిషన్లు సఫలం అయిన తాలూకు చలవే. మంగళ్‌యాన్ సాఫల్యం, చంద్రయాన్ సిద్ధి, గగన్‌యాన్ సన్నాహాలు, దేశ యువ తరానికి ఒక కొత్త మన:స్థితిని అందించాయి. ప్రస్తుతం, చంద్రయాన్ పేరు భారత్‌లో చిన్న పిల్లల నోళ్లలోనూ నానుతోంది. ఇవాళ భారత్‌లో చిన్నారులు తమ భవిష్యత్తును మీలో.. అంటే శాస్త్రవేత్తల్లో.. చూసుకోగలుగుతున్నారు. ఈ కారణంగానే మీ కార్యసాధన చంద్రగ్రహం మీద మూడు రంగుల జెండాను ఎగురవేయడమొక్కటే కాదు.. మరో గొప్ప పనిని కూడా సూచిస్తోంది. ఆ ఘనత భారత్‌లో పూర్తి తరాన్ని మేల్కొలపడమూ, దానికి ఒక కొత్త శక్తిని అందజేయడమూను. మీరు మీ విజయం తాలూకు చెరపరాని ముద్రను ఒక పూర్తి తరంపైన వేశారు. ఈ రోజు మొదలుకుని, ఏ చిన్నారి అయినా రాత్రిళ్లు చంద్రుడికేసి చూస్తే, తన దేశం ఏ ధైర్యంతో, ఏ ఉత్సాహంతో చంద్ర గ్రహాన్ని చేరుకొందో అంతే సమానమైన ధైర్యం, ఉత్సాహం తనలో కూడా ఉన్నాయన్న దృఢవిశ్వాసం ఆ చిన్నారికి కలుగుతుంది. ప్రస్తుతం భారతదేశ బాలల్లో మీరు నాటిన ఆకాంక్షల విత్తనాలు రాబోయే కాలంలో వటవృక్షాలు గా మారి అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు వేయడానికి వారిలో స్ఫూర్తిని నింపుతాయి.
మన యువ తరానికి నిరంతరం స్ఫూర్తి లభిస్తూ ఉండేటట్లుగా మరో నిర్ణయాన్ని తీసుకున్నాం.. ఆగస్టు 23న భారత్ చంద్ర గ్రహం మీద మువ్వన్నెల జెండాను ఎగరేసిన రోజును ఇక నుంచి ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా భారత్ పాటిస్తుంది. ఇక మీదట ప్రతి ఏటా దేశం జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని సైన్స్, టెక్నాలజీ, నవకల్పనల స్ఫూర్తికి అద్దం పట్టే ఓ ఉత్సవంలా జరుపుకొంటుంది. ఇది మనకు ఎప్పటికీ స్ఫూర్తిని అందిస్తూనే ఉంటుంది మరి.
నా కుటుంబ సభ్యులారా,
అంతరిక్ష రంగానికి ఉన్న సామర్థ్యం కేవలం ఉపగ్రహాల్ని ప్రయోగించడమో లేదా అంతరిక్షాన్ని శోధించడమో కాకుండా, అంతకు మించింది అనే విషయాలు మీకు కూడా తెలుసు. అంతరిక్ష రంగానికున్న అతి గొప్ప బలాల్లో ఒకటి.. నేను గమనించినంతవరకు.. జీవన సౌలభ్యంతో పాటు పరిపాలన సౌలభ్యాన్ని కలగజేయడం. ఇవాళ దేశంలో స్పేస్ అప్లికేషన్లను పాలనకు సంబంధించిన ప్రతి అంశంలో ముడిపెట్టే దిశగా చాలా విస్తృతమైన పని పూర్తి అయింది. మీరు ప్రధానమంత్రిగా పనిచేసే బాధ్యతను నాకు అప్పజెప్పినప్పుడు, నేను ప్రధానమంత్రిని అయిన తరువాత కేంద్ర ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులకూ, అంతరిక్ష శాస్త్రవేత్తలకూ ఒక వర్క్ షాప్ నిర్వహించాను. పాలక వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడానికి అంతరిక్ష రంగ బలాన్ని సాధ్యమైనంత ఎక్కువగా ఎలా ఉపయోగించుకోవచ్చనేదే ఆ కార్యక్రమం ముఖ్యోద్దేశం. ఆ కాలంలో కిరణ్ గారు బహుశా మాతో కలిసి పని చేసే వారనుకుంటాను.. ఫలితంగా, దేశం స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను మొదలుపెట్టినప్పుడు, టాయిలెట్ల నిర్మాణాన్ని ఆరంభించారు. అలాగే, కోట్లాది ఇళ్లను నిర్మించే ఉద్యమాన్ని కూడా. వీటికి సంబంధించిన పనుల్ని, పురోగతినీ పర్యవేక్షించడానికి స్పేస్ సైన్స్ చాలా తోడ్పడింది.
ఇవాళ దేశంలోని మారుమూల ప్రాంతాలకు విద్యనీ, కమ్యూనికేషన్లనీ, ఆరోగ్య సేవల్నీ అందజేయడానికి అంతరిక్ష రంగం చాలా ప్రధాన పాత్రను పోషిస్తోంది. ఈ రోజుల్లో స్వాతంత్య్ర అమృత మహోత్సవం కోసం ప్రతి జిల్లాలో అమృత సరోవరాలను నిర్మిస్తున్నారు. వాటికి కూడా ట్యాగింగ్ ఉంది.. దాని పర్యవేక్షణ అంతరిక్షంలో నుంచి జరుగుతోంది. అంతరిక్ష సాంకేతికత లేకుండా మనం టెలి-మెడిసిన్, టెలి-ఎడ్యుకేషన్.. వీటిని ఊహించనైనా ఊహించలేం. దేశంలో వనరులను అత్యంత అనుకూల రీతిలో ఉపయోగించుకోవడంలోనూ అంతరిక్ష విజ్ఞానశాస్త్రం చాలా సాయపడింది. మన దేశంలో వ్యవసాయ రంగానికి బలాన్ని ఇవ్వడంలో, వాతావరణాన్ని అంచనా వేయడంలో అంతరిక్షరంగం చేస్తున్న సాయం ఏమిటన్నది దేశంలో ప్రతి రైతుకూ తెలుసు. వచ్చే వారం వాతావరణం ఎలా ఉండేదీ ప్రస్తుతం రైతులు తమ మొబైల్ ఫోన్లలో తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలో కోట్లాది మత్స్యకారులకు ‘నావిక్’ వ్యవస్థ కచ్చితమైన సమాచారాన్ని అందిస్తోంది. ఇదీ మీరు అందించిన కానుకే. ఇవాళ దేశంలో వరదలు వస్తే, ఏదైనా ప్రాకృతిక ఆపద వస్తే, భూమి కంపిస్తే.. పరిస్థితి ఎంత గంభీరంగా ఉందో తెలుసుకోవడానికి ఇతరుల కన్నా ముందుగా రంగంలోకి దిగేది మీరు. తుపాను వస్తే, అప్పుడు మన ఉపగ్రహాలు దాని మొత్తం మార్గాన్ని తెలియజేస్తాయి.. ఎప్పటికప్పుడు వివరాలను అందజేస్తుంటాయి.. దీనివల్ల ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆస్తి నష్టాన్ని కూడా నివారించవచ్చు.. ఒక్క తుపాను వల్ల నష్టం సంభవించకుండా కాపాడుకొంటున్న ఆస్తులను లెక్కించామంటే, ప్రస్తుతం అంతరిక్ష సాంకేతికతకు పెట్టిన ఖర్చు కన్నా ఇలా కాపాడిన ఆస్తుల విలువే ఎక్కువగా ఉంటుంది. మన పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌కు కూడా అంతరిక్ష సాంకేతికతే ఆధారంగా ఉంది. భారత గతి శక్తి వేదికను ప్రపంచ దేశాలు ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నాయి. పథక రచన లో, నిర్వహణలో ఈ వేదిక ఎంత ఉపయోగకరం కావచ్చో పరిశీలిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టుల ప్లానింగ్, అమలు, పర్యవేక్షణలో ఎంతో తోడ్పాటు లభిస్తోంది. కాలంతో పాటే అంతకంతకూ విస్తరిస్తున్న స్పేస్ అప్లికేషన్ల పరిధి మన యువతకు కూడా అవకాశాల్ని పెంచుతోంది. ఈ కారణంగా ఇవాళ నేను ఒక సూచనను ఇవ్వదలుస్తున్నాను. మీ దగ్గర పదవీ విరమణ చేసిన వారు ఈ విషయంలో చాలా సహాయాన్ని అందించాలని నేను కోరుకుంటున్నాను. ఇక మోదీ గారు ఇంత పొద్దున్నే ఇక్కడి రావడమే కాక, చేయడానికి కొంత పనిని కూడా మాకు ఇచ్చి వెళ్తున్నారేమిటా అని మాత్రం మీరు అనొద్దు.
మిత్రులారా,
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలూ, రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి ‘స్పేస్ టెక్నాలజీ ఇన్ గవర్నెన్స్’ అంశంపై ఒక జాతీయ హ్యాకథాన్‌ను ఇస్రో నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. ఈ హ్యాకథాన్‌లో యువత గరిష్ఠ సంఖ్యలో పాల్గొనాలి. ఈ జాతీయ హ్యాకథాన్ మన పరిపాలనను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్ది, దేశ ప్రజలకు ఆధునిక పరిష్కార మార్గాలను అంతదిస్తుందని నేను నమ్ముతున్నాను.
మరి మిత్రులారా,
మీకు కాక, మన యువ తరం వారికి విడిగా మరో పనిని ఇవ్వాలని నేను అనుకుంటున్నాను.. పిల్లలకు హోం వర్క్ ఇవ్వందే పని చేయడం ఉల్లాసంగా ఉండదు కదా మరి, అందుకనే. భారత్ ఎలాంటి దేశం అంటే.. ఈ భూమికి వెలుపల అనంత అంతరిక్షం కేసి చూడటం వేల సంవత్సరాలకు పూర్వమే మొదలుపెట్టిందని మీ అందరికీ తెలుసు. శతాబ్దాల కిందటే మనకు ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు, వరాహమిహిరుడులతో పాటు భాస్కరాచార్యుడు వంటి వారు పరిశోధన సంప్రదాయానికి నాంది పలికారు. భూమి ఏ ఆకారంలో ఉంటుందన్న విషయంలో అస్పష్టత ఉన్న కాలంలో, ఆర్యభట్ట భూమి గోళాకారంలో ఉండటాన్ని గురించి తన ఆర్యభటీయ గ్రంథంలో విస్తారంగా రాశారు. ఒక ఇరుసు మీద ఈ పృథ్వి తిరుగుతోందని. దీని చుట్టుకొలతను కూడా ఆయన లెక్కగట్టారు. ఇదే మాదిరిగా, సూర్య సిద్ధాంత వంటి గ్రంథాల్లోనూ -
‘సర్వత్రైవ మహీగోళే, స్వస్థానమ్ ఉపరి స్థితమ్
మన్యన్తే ఖే యతో గోళస్, తస్య క్వ ఊర్థ్వమ్ క్వ వాధ:’ అని చెప్పారు.
ఈ మాటలకు, భూమి మీద కొంత మంది తాము అందరి కన్నా ఉన్నత స్థానంలో ఉన్నామనుకుంటూ ఉంటారు అని అర్థం. కానీ, గోళాకారంలో ఉన్న ఈ భూగ్రహం ఆకాశంలో కదా ఉంది.. దీనికి పైన గాని లేదా కింద గానీ ఏం ఉంటుందంటారు? ఈ సమాచారాన్ని ఆ కాలంలోనే గ్రంథస్థం చేశారు. నేనయితే ఒక్క శ్లోకాన్నే ప్రస్తావించాను. అలాంటి లెక్కలేనన్ని రచనల్ని మన పూర్వికులు రాసిపెట్టారు. గ్రహణం సూర్యుడు, చంద్రుడు, భూమిల కారణంగానే ఏర్పడుతుందన్న విషయాన్ని మన గ్రంథాలెన్నింటిలోనో వివరించడాన్ని మనం గమనించవచ్చు. భూమికి తోడు ఇతర గ్రహాల ఆకారాల లెక్కలూ, వాటి కదలికలతో జతపడ్డ సమాచారం కూడా మన ప్రాచీన గ్రంథాల్లో దొరుకుతుంది. గ్రహాలూ, ఉపగ్రహాల గమనం గురించి కచ్చితమైన లెక్కలు కట్టే సామర్థ్యాన్ని మనం సొంతం చేసుకున్నాం. ఈ కారణంగానే క్యాలెండర్లను వందల ఏళ్ల కిందటే మొదలుపెట్టారు. ఇందువల్ల, దీనికి సంబంధించిన ఒక పనిని నేను మన నవ తరానికి.. బడికి వెళ్లే, కాలేజీలో చదువుకునే విద్యార్థులకు.. అప్పగించదలచాను. భారత శాస్త్రాల్లోని ఖగోళ సూత్రాల్ని విజ్ఞానశాస్త్రం ప్రాతిపదికగా నిరూపించడం కోసమూ, వాటిని కొత్త కోణంలో అధ్యయనం చేయడం కోసమూ కొత్త తరం ముందుకు రావాలి. మన వారసత్వ పరంగా , మన విజ్ఞానశాస్త్ర పరంగా కూడా ఇది అవసరం.
ఇవాళ, బళ్లూ, కాలేజీలూ, యూనివర్సిటీల విద్యార్థులతో పాటు పరిశోధకులకు రెండు బాధ్యతలున్నాయి. భారత్ దగ్గరున్న విజ్ఞానశాస్త్ర ఖజానా చాలాకాలం పాటు సాగిన బానిసత్వ హయాంలో కప్పబడిపోయి, మరుగున ఉండిపోయింది. ఈ ‘స్వాతంత్య్ర అమృత కాలం’లో, ఈ ఖజానాను మనం అన్వేషించి తీరాలి, దీనిని గురించి పరిశోధనలు చేయాలి, మరి దీనిని గురించి ప్రపంచానికి కూడా చాటి చెప్పాలి . రెండో బాధ్యత ఏదంటే.. మన యువ తరం నేటి ఆధునిక విజ్ఞానశాస్త్రాలకూ, అధునాతన సాంకేతికతకూ కొత్త కోణాల్ని అందించాలి. సాగరాల అగాథాల మొదలు గగనంలోని అంతరాళాల వరకూ, ఆకాశాన్ని అంటే శిఖరాల మొదలు అంతరిక్షంలోని లోతుల వరకూ.. మీకు పూర్తి చేసి చూపించడానికి ఎన్ని పనులున్నాయనీ. మీరు పాతాళాన్నీ గమనించండి, అలాగే మహాసముద్ర అంతర్భాగాన్నీ శోధించండి. మీరు కొత్త తరం కంప్యూటరునూ తయారు చేయండి.. మరి దాంతో పాటే, జన్యు ఇంజినీరింగ్‌లోనూ రాణించండి. భారత్‌లో కొత్త కొత్త అవకాశాలు నిరంతరం రారమ్మంటూ మిమ్మల్ని పిలుస్తున్నాయి. ఈ 21వ శతాబ్ద కాలంలో, సైన్సులోనూ, టెక్నాలజీలోనూ మార్గదర్శకత్వం వహించే దేశమే మిగతా అన్ని దేశాల కన్నా ముందు ముందుకు దూసుకు పోతుంది.
మిత్రులారా,
రాబోయే కొన్ని సంవత్సరాల్లో భారత్ అంతరిక్ష పరిశ్రమ 800 కోట్ల డాలర్ల స్థాయి నుంచి పెరిగి, 1600 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకుంటుందని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం కూడా ఈ మాటల్లోని గంభీరత్వాన్ని అర్థం చేసుకుని రోదసి రంగంలో నిరంతరం సంస్కరణల్ని అమలు చేస్తోంది. మన యువత కూడా నడుం బిగించడానికి సిద్ధంగా ఉన్నారు. గడచిన నాలుగు సంవత్సరాల్లో రోదసి రంగంలో కృషి చేస్తున్న అంకుర సంస్థలు 4 నుంచి దాదాపు 150కి ఎదిగిన సంగతి తెలిస్తే మీరు ఆశ్చర్యానందాలకు లోనవుతారు. అనంతాకాశంలో ఎన్నెన్ని అపార అవకాశాలు భారత్ రాక కోసం ఎదురుచూస్తున్నాయో మనం ఊహించొచ్చు. మరి కొన్ని రోజుల్లో, సెప్టెంబరు 1వ తేదీ నుంచీ, మైగవ్ మన చంద్రయాన్ మిషన్‌కు సంబంధించి ఒక చాలా పెద్ద క్విజ్ పోటీని ప్రారంభించబోతోంది. మన దేశ విద్యార్థులు దీంతో కూడా ముందడుగు వేయడాన్ని మొదలుపెట్టొచ్చు. ఈ క్విజ్‌లో పాలుపంచుకోవాల్సిందిగా దేశంలో అన్ని ప్రాంతాల విద్యార్థులకూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
నా కుటుంబ సభ్యులారా,
దేశ భావి తరానికి మీ మార్గదర్శకత్వం అత్యంత అవసరం. మీరు అనేక ముఖ్య మిషన్లపై పనిచేస్తున్నారు.. మరి ఈ మిషన్లను ముందుకు తీసుకుపోయేది రాబోయే తరమే. వారందరికీ మీరు ఆదర్శప్రాయులు. మీ పరిశోధన, ఏళ్ల తరబడి మీరు చేస్తున్న కఠోర పరిశ్రమ.. ఇవి మీరు ఏం చేయాలని నిర్ణయించుకున్నారో అది చేస్తారని నిరూపించాయి. దేశ ప్రజలు మిమ్మల్ని నమ్మారు.. నమ్మకాన్ని సాధించుకోవడం అంటే మిత్రులారా, అది చిన్న విషయమేమీ కాదు. ఈ నమ్మకాన్ని మీరు మీ కఠోర శ్రమతో సంపాదించుకున్నారు. మీకు దేశ ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఆశీస్సులతో, దేశమంటే ఉన్న ఈ అంకితభావంతో, భారత్ విజ్ఞానశాస్త్రంలో, సాంకేతికతలో ప్రపంచానికే దారిని చూపే దేశంగా మారుతుంది. మనకున్న నవకల్పన తాలూకు ఉత్సాహమే 2047లో అభివృద్ధి చెందిన భారత్ కలను నిజం చేస్తుంది. దేశ ప్రజానీకం గర్వంతో ఉప్పొంగిపోతోంది. కలలు సంకల్పాలుగా శరవేగంగా రూపుదాల్చుతున్నాయి, మరి ఆ సంకల్పాలు ఫలించేటట్లుగా చూడటానికి మీ కఠోర శ్రమే ఒక గొప్ప ప్రేరణ. మీకు నేను ఎన్ని అభినందనలను చెప్పినా సరిపోదు. మీ అందరికీ నేను నా వైపు నుంచి మన:పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు, ప్రపంచం నలుమూలల విజ్ఞానశాస్త్ర సమాజం తరఫున కూడా మీకు ధన్యవాదాలు పలుకుతున్నాను.
భారత్ మాతా జీ జై
భారత్ మాతా జీ జై
భారత్ మాతా జీ జై
మీకు ధన్యవాదాలు.
గమనిక: ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఇది.
***
(रिलीज़ आईडी: 2200274)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam