మిత్రులారా,
2014లో దేశం నాకు ప్రధానమంత్రి బాధ్యతను అప్పగించిన వేళ నా ఎదుట రెండు అవకాశాలున్నాయి. తక్షణ ప్రయోజనాల కోసమే పనిచేయడమా.. లేదంటే దీర్ఘకాలిక విధానాన్ని అవలంబించడమా? రెండేళ్లు, అయిదేళ్లు, పదేళ్లు, 15 సంవత్సరాలు, 20 ఏళ్లు... ఇలా వివిధ కాలపరిమితులతో కూడిన లక్ష్యాలతో పనిచేయాలని మేం నిర్ణయించుకున్నాం. ఈ రోజు మన ప్రభుత్వం పదేళ్లుగా అధికారంలో ఉంది. ఈ పదేళ్లలో దీర్ఘకాలిక ప్రణాళికతో దేశం మునుపెన్నడూ లేనివిధంగా నిర్ణయాలను తీసుకుంది. అపరిష్కృతంగా ఉన్న అనేక నిర్ణయాల భారాన్ని దేశంపై తగ్గించాం. జమ్మూ కాశ్మీర్‌లో అధికరణ 370ని రద్దు చేయాలనే డిమాండ్ 60 ఏళ్లుగా ఉంది. మా ప్రభుత్వం దాన్ని నెరవేర్చింది. మాజీ సైనికోద్యోగులకు ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ అందించాలన్న డిమాండ్ 40 ఏళ్లుగా ఉంది. ఈ డిమాండునూ మా ప్రభుత్వం నెరవేర్చింది. జీఎస్టీని అమలు చేయాలనే డిమాండ్ 40 ఏళ్లుగా ఉంది. దీన్ని కూడా మా ప్రభుత్వం సాకారం చేసింది.
ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా చట్టాలు చేయాలని ముస్లిం మహిళలు దశాబ్దాలుగా కోరుతున్నారు. ఆ చట్టం కూడా మా ప్రభుత్వ హయాంలో వచ్చింది. కొన్ని వారాల కిందటే లోకసభ, శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్ కోసం చట్టం చేయడాన్ని మీరు చూసే ఉంటారు. ఇది కూడా దశాబ్దాలుగా పెండింగులో ఉంది. నారీ శక్తి వందన అధినియంను కూడా మా ప్రభుత్వం రూపొందించింది.
ఈ విజయాల జాబితా చాలా పెద్దది. అవన్నీ చెప్పాలంటే ఓ రాత్రంతా పడుతుంది. మన ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకోకపోయుంటే ఎవరు నష్టపోయేవారు? మనం ఈ పనులు చేయకపోతే ఎవరు బాధపడేవారు? ఎవరు నష్టపోయేవారు? అది మీ తరమే. అందుకే ఈ ముఖ్యమైన నిర్ణయాలన్నింటినీ నేను ప్రస్తావించాను. అలా మీ తరంపై భారాన్ని కూడా నేను తగ్గించాను. దేశంలో నేటి యువతరానికి అత్యంత సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి నేను పనిచేస్తున్నాను. అవకాశాలకు కొరత లేని వాతావరణాన్ని మీ తరం కోసం సృష్టించాలనుకుంటున్నాం. భారత యువత పెద్ద కలలు కనే, వాటిని సాకారం చేసుకునే వాతావరణాన్ని సృష్టించడం మా లక్ష్యం. పెద్ద కలలు కనండి.. పెద్ద లక్ష్యాలను సాధించండి. దీన్ని నేనెందుకు మీతో చెబుతున్నానంటే.. సింధియా స్కూల్ 150 ఏళ్లు పూర్తి చేసుకుంది.. దేశం కూడా ఒక ముఖ్యమైన మైలురాయి వద్ద నిలిచి ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి త్వరలోనే వందేళ్లు పూర్తవబోతోంది.
వచ్చే 25 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలని మేం సంకల్పించుకున్నాం. ఇది మీరే చేయాలి. భారత యువతరం దీన్ని సాకారం చేయాలి. మీపై నాకు నమ్మకముంది. యువతపై నాకు నమ్మకముంది. యువత సామర్థ్యాలపై నాకు నమ్మకముంది. స్వప్నిస్తూ, వాటిని సంకల్పాలుగా మలచుకొంటూ, అవి నెరవేరే వరకు మీరు అవిశ్రాంతంగా పనిచేస్తారని ఆశిస్తున్నాను.
వచ్చే 25 ఏళ్లలో మీకు ఏది అత్యావశ్యకమో, అది భారత్‌కు కూడా అంతే కీలకమైనది. సింధియా స్కూలుకు చెందిన ప్రతి విద్యార్థికీ ఈ నిబద్ధత తప్పక ఉండాలి – అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించుకుంటాం. మిత్రులారా, మీరిది చేస్తారా లేదా? ‘దేశమే ప్రథమం’... ఇదే తత్వంతో అన్నింటా నేను పనిచేస్తాను. నేను కొత్త ఆవిష్కరణలు చేస్తాను. నేను పరిశోధిస్తాను. వృత్తిపరంగా ఎక్కడైనా ఉండొచ్చు, కానీ అభివృద్ధి చెందిన భారత్‌ను సాకారం చేసుకునేందుకు కట్టుబడి ఉంటాను.
మిత్రులారా,
సింధియా స్కూల్ మీద నాకు అంత నమ్మకం ఎందుకో తెలుసా? ఎందుకంటే మీ స్కూల్ పూర్వ విద్యార్థుల్లో కొంతమంది నాకు దగ్గరి మిత్రులున్నారు. ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రిగా ఉన్న జితేంద్ర సింగ్ వేదికపైనే ఉన్నారు. ఆయన కూడా మీ పాఠశాల పూర్వ విద్యార్థే. రేడియోలో మనల్ని మంత్రముగ్ధులను చేసే స్వరం అమీన్ సయానీ గారు, లెఫ్టినెంట్ జనరల్ మోతీ దార్ గారు, ఇక్కడ అద్భుత ప్రదర్శన ఇచ్చిన మీట్ సోదరులు, నిర్భయంగా ఉండే సల్మాన్ ఖాన్, నా మిత్రుడు నితిన్ ముఖేశ్ గారు ఇక్కడున్నారు. సింధియా స్కూల్ విద్యార్థుల కాన్వాస్ వర్ణశోభితమై ఎంతగానో విస్తరించింది.
యువ మిత్రులారా, విష్ణు పురాణం ఇలా చెబుతోంది:
గాయంతి దేవాః కిల్ గీతకాని, ధన్యాస్తు తే భారతభూమిభాగే.
అంటే ఈ భారతదేశంలో జన్మించిన వారి కోసం దేవతలు కూడా స్తుతులు పాడతారు. వారు దేవతల కన్నా అదృష్టవంతులు. నేడు భారత్ విజయపథంలో ఉంది. మునుపెన్నడూ లేనంత ఉన్నతంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా భారత పతాకం రెపరెపలాడుతోంది. ప్రపంచంలో మరే దేశమూ ఇప్పటి వరకు చేరుకోలేని చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆగస్టు 23న భారత్ చేరింది. జీ 20 శిఖరాగ్ర సమావేశంలో భారత్ విజయాన్ని మీరు చూశారు. నేడు భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ. ఫిన్‌టెక్‌ను అవలంబిస్తున్న దేశాల్లో భారత్ అగ్రగామిగా ఉంది. రియల్ టైం డిజిటల్ లావాదేవీల నిర్వహణలో భారత్ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. స్మార్ట్‌ఫోన్ డేటా వినియోగదారుల పరంగానూ భారత్ అగ్రగామిగా ఉంది.
నేడు భారత్ ఇంటర్నెట్ వినియోగదారుల పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం. రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారు. అంకుర సంస్థల వ్యవస్థాపనలో మూడో అతిపెద్ద దేశంగా నిలిచింది. అలాగే నేడు భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారు. నేడు భారత్ అంతరిక్షంలో తన అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఉదయమే విజయవంతమైన గగనయాన్ పరీక్షను మీరంతా చూశారు. ‘సిబ్బంది రక్షణ వ్యవస్థ’ పరీక్ష కూడా విజయవంతమైంది. గ్వాలియర్‌లో అంత పెద్ద వైమానిక దళ స్థావరం ఉంది... గగనతలంలో తేజస్ విన్యాసాలు మీరు చూడలేదా? సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ గర్జన మీకు వినబడలేదా? నేడు భారత్‌కు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. పెరుగుతున్న భారత సామర్థ్యాలు ప్రతి రంగంలోనూ మీకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి.
ఒక్కసారి ఆలోచించండి.. 2014కు ముందు మన దేశంలో అంకుర సంస్థలు కొన్ని వందల సంఖ్యలోనే ఉండేవి. కానీ నేడు దేశంలో వాటి సంఖ్య దాదాపు లక్షకు చేరింది. గత కొన్నేళ్లలో భారత్‌లో వందకు పైగా యునికార్న్‌లు ఉద్భవించాయి. యునికార్న్ అంటే ఏమిటో మీక్కూడా తెలుసు... అంటే కనీసం 8 బిలియన్ రూపాయల కంపెనీ. సింధియా స్కూల్ విద్యార్థులు కూడా ఇక్కడి నుంచి పట్టా పొందిన తర్వాత యునికార్న్‌లను నెలకొల్పి.. స్కూల్ పేరును నిలబెట్టడంతోపాటు దేశాన్ని దేదీప్యం చేయాల్సిన అవసరముంది.
‘ప్రపంచమే మీ ఆధీనంలో ఉంది!!!’ ప్రభుత్వంగా.. కొత్త రంగాలను కూడా మీ కోసం మేం అందుబాటులోకి తెచ్చాం. గతంలో ప్రభుత్వం మాత్రమే ఉపగ్రహాలను అభివృద్ధి చేయడమో, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడమో ఉండేది. యువకులారా, మేం మీకు అంతరిక్ష రంగంలోనూ అవకాశాలను అందిస్తున్నాం. గతంలో రక్షణ పరికరాలను ప్రభుత్వం మాత్రమే తయారు చేసేది, లేదా విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకునేది. యువకులారా, ఆ రక్షణ రంగంలోనూ మేం మీకు అవకాశాలను అందించాం. నేడు దేశంలో అనేక రంగాలను మీకోసం అభివృద్ధి చేస్తున్నాం.
‘మేకిన్ ఇండియా’ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. ‘ఆత్మనిర్భర భారత్’ సంకల్పాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలి. మరో విషయాన్ని గుర్తుంచుకోండి.. నేను దాన్ని మంత్రప్రదంగా భావిస్తాను – ఎప్పుడూ భిన్నంగా ఆలోచించండి. జ్యోతిరాదిత్య సింగ్ గారి తండ్రి మన మాధవరావు సింధియా గారిలా ఆలోచించండి. ఆయన రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు శతాబ్ది రైళ్లను ప్రారంభించారు. తర్వాత మరో మూడు దశాబ్దాలపాటు దేశంలో అలాంటి ఆధునిక రైళ్లు ప్రారంభం కాలేదు. ఇప్పుడు వందే భారత్ కూడా దేశంలో తనదైన ముద్ర వేసింది. నమో భారత్ వేగాన్ని మీరు నిన్ననే చూశారు.
మిత్రులారా,
ఇక్కడికి రావడానికి ముందు సింధియా స్కూల్‌లోని వివిధ హౌస్‌ల పేర్లను నేను చూశాను. జ్యోతిరాదిత్య గారు నాకు వాటిని వివరించారు. స్వయంపాలన సంకల్పంతో ముడిపడి ఉన్న పేర్లు మీకు గొప్ప స్ఫూర్తినిస్తాయి. శివాజీ హౌస్... మహాద్‌జీ హౌస్, రానోజీ హౌస్, దత్తాజీ హౌస్, కనేర్‌ఖేడ్ హౌస్, నీమాజీ హౌస్, మాధవ్ హౌస్... ఓ రకంగా ఏడుగురు ఋషుల శక్తి మీతో ఉంది. ఈ పవిత్ర నవరాత్రి సందర్భంగా నేను మీకు తొమ్మిది పనులను అప్పగించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది పాఠశాల కార్యక్రమం. మీకు హోంవర్క్ ఇవ్వకపోతే ఇది పూర్తి కాదు. కాబట్టి ఈ రోజు నేను తొమ్మిది పనులు ఇవ్వాలనుకుంటున్నాను. గుర్తుంచుకుంటారా? సోదరులారా, మీ స్వరంలో ఎందుకంత బలహీనంగా ఉంది? మీరు దీన్ని గుర్తుంచుకుంటారా? దీని కోసం మీరు సంకల్పిస్తారా? దాన్ని నెరవేర్చేందుకు జీవితాంతం కృషి చేస్తారా?
మొదటిది - మీరంతా ఇక్కడ నీటి సంరక్షణ కోసం చాలా పనిచేస్తున్నారు. నీటి భద్రత 21వ శతాబ్దంలో ఒక పెద్ద సవాలు. దానిపై అవగాహన పెంచేలా కార్యక్రమాన్ని నిర్వహించండి.
రెండోది - సింధియా స్కూల్‌లో గ్రామాలను దత్తత తీసుకునే సంప్రదాయం ఉంది. మీరు గ్రామాలకు వెళ్లి డిజిటల్ లావాదేవీల గురించి ప్రజలకు తెలియజేయాలి.
మూడోది - స్వచ్ఛతా మిషన్. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పరిశుభ్రతలో మొదటి స్థానంలో ఉండగలిగితే, గ్వాలియర్ ఎందుకు ఉండలేదు? మీ నగరాన్ని పరిశుభ్రతలో ముందంజలో నిలిపే సవాలును స్వీకరించండి.
నాలుగోది - వోకల్ ఫర్ లోకల్... వీలైనంత వరకు స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించండి. భారత్‌లో తయారైన ఉత్పత్తులనే ఉపయోగించండి.
అయిదోది - భారత్‌లోనే ముందుగా ప్రయాణించండి... వీలైనంత వరకు మీ స్వదేశాన్ని ముందుగా చూడండి. మీ దేశంలో ప్రయాణించండి. తర్వాత విదేశాల వైపు మళ్లండి.
ఆరోది - సహజ వ్యవసాయం పట్ల రైతుల్లో అవగాహన పెంచండి. భూమి తల్లిని కాపాడుకునేందుకు ఇది అత్యావశ్యకమైన ప్రచారం.
ఏడోది - చిరుధాన్యాలను స్వీకరించండి – ‘శ్రీ అన్న’.. మీ జీవితంలో దీన్ని భాగం చేసుకోండి. గట్టిగా ప్రచారం చేయండి. మీకు తెలుసా, ఇదొక సూపర్ ఫుడ్.
ఎనిమిదోది - శారీరక దృఢత్వం.. యోగా అయినా, క్రీడలయినా... మీ జీవనంలో దాన్నొక భాగంగా చేసుకోండి. ఈ రోజే ఇక్కడ బహుళార్థ సాధక క్రీడా సముదాయానికి శంకుస్థాపన చేశాం. దీన్ని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోండి.
తొమ్మిదోది - కనీసం ఒక పేద కుటుంబాన్ని ఆదుకోండి. దేశంలో గ్యాస్ కనెక్షన్, బ్యాంకు ఖాతా, పక్కా ఇల్లు, ఆయుష్మాన్ కార్డు లేని వ్యక్తి ఒక్కరున్నా మనం హాయిగా కూర్చోలేము. భారత్‌లో పేదరికాన్ని నిర్మూలించడం అత్యావశ్యకం. ఈ మార్గాన్ని అనుసరించి.. అయిదేళ్లలోనే 13.5 కోట్లకు పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ఈ మార్గాన్ని అనుసరించి, భారత్ పేదరికాన్ని జయిస్తుంది, అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుంది.
మిత్రులారా,
నేడు భారత్ ప్రతీదీ భారీ స్థాయిలో చేస్తోంది. కాబట్టి మీ భవిష్యత్తు గురించి మీరు చిన్నగా ఆలోచించకూడదు. మీ కలలూ, సంకల్పాలూ భారీగా ఉండాలి. మీకు చెబుతున్నా వినండి.. మీ స్వప్నాలే నా సంకల్పాలు. నమో యాప్‌లో కూడా మీరు మీ ఆలోచనలను, భావాలను పంచుకోవచ్చు. ఇప్పుడు నేను కూడా వాట్సాప్‌లోనూ ఉన్నాను. అక్కడ కూడా మీరు నాతో కనెక్ట్ అవ్వొచ్చు. కావాలంటే మీ రహస్యాలను కూడా మీరు పంచుకోవచ్చు. నేను వాటిని ఎవరికీ చెప్పనని హామీ ఇస్తున్నాను.
మిత్రులారా,
నవ్వులతో, జోకులతో జీవితం సాగాలి. సంతోషంగా, ఆరోగ్యంగా ఉండండి. మీ అందరిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. గుర్తుంచుకోండి.. సింధియా స్కూల్ కేవలం ఓ సంస్థ మాత్రమే కాదు, ఇదొక వారసత్వం. స్వతంత్రానికి ముందు మాత్రమే కాదు.. స్వాతంత్ర్యానంతరం కూడా మహారాజా మాధవరావు ఆశయాలను ఇది ముందుకు తీసుకెళ్లింది. దీని పతాకం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఇంతకుముందే సత్కారం పొందిన యువతకు నా అభినందనలు. యువ మిత్రులందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ.. మీకు, సింధియా స్కూలుకు మరోసారి శుభాకాంక్షలు.
అందరికీ ధన్యవాదాలు. నమస్కారం!
గమనిక: ప్రధానమంత్రి ప్రసంగానికి ఇది ఇంచుమించుగా చేసిన అనువాదం. మూల ప్రసంగం హిందీలో ఉంది.
***