ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సం, శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
प्रविष्टि तिथि:
02 OCT 2023 8:48PM by PIB Hyderabad
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, క్యాబినెట్లో నా సహ మంత్రులు శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, శ్రీ వీరేంద్ర కుమార్, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, ఇతర విశిష్ట అతిథులకు, ఇక్కడికి పెద్ద సంఖ్యలో విచ్చేసిన నా కుటుంబ సభ్యులకు! చరిత్రాత్మకమైన గ్వాలియర్ భూమికి నా వందనాలు!
ధైర్యానికీ, ఆత్మగౌరవానికీ, సైనిక వైభవానికీ, సంగీతానికీ, రుచులకూ, ఆవాలకూ ఈ నేల ప్రసిద్ధి చెందింది. దేశానికి గొప్ప విప్లవ యోధులను గ్వాలియర్ అందించింది. దేశ రక్షణ కోసం మన సైన్యానికి ధైర్యవంతులను గ్వాలియర్-చంబల్ ప్రాంతం అందించింది. బీజేపీ విధానాన్ని, నాయకత్వాన్ని కూడా గ్వాలియర్ తయారు చేసింది.
రాజమాత విజయ రాజే సింధియా, శ్రీ కుషాభావు ఠాక్రే, శ్రీ అటల్ బిహారీ వాజపేయీలను గ్వాలియర్ మట్టి తీర్చిదిద్దింది. ఈ నేల దానికదే స్ఫూర్తిదాయకం. ఈ మట్టిలో పుట్టిన ప్రతి దేశభక్తుడూ ఈ దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు.
నా కుటుంబ సభ్యులారా,
దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడే అదృష్టం మనలాంటి కోట్లాది మందికి దక్కలేదు. కానీ, భారత్‌ను అభివృద్ధి చేయాల్సిన, సుసంపన్నంగా మార్చాల్సిన బాధ్యత మన భుజాలపై ఉంది. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మరోసారి గ్వాలియర్‌కు వచ్చాను. సుమారుగా రూ. 19 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ఈ రోజు శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవం చేసుకున్నాం.
ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనకు సంబంధించిన శిలాఫలకాల ఆవిష్కరణను నేను వీక్షించాను. ఒక్కొక్కటీ ఆవిష్కరిస్తూ ఉంటే.. చప్పట్లు కొట్టలేక మీరు అలసిపోయారు. ఏ ప్రభుత్వమూ చేయని విధంగా మా ప్రభుత్వం ఒక్క ఏడాదిలో అనేక ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఎలా చేయగలుగుతోందో మీరు ఆలోచించండి. చప్పట్లు కొట్టలేక ప్రజలు కూడా అలసిపోతారు. చాలా పనులు చేయగల సామర్థ్యం మన దగ్గర ఉంది.
నా కుటుంబ సభ్యులారా,
దసరా, ధంతేరాస్, దీపావళి పర్వదినాలకు ముందు మధ్యప్రదేశ్‌లోని 2.25 లక్షల కుటుంబాలు ఈ రోజు నూతన గృహప్రవేశాలను చేస్తున్నాయి. ఈ రోజు అనేక రవాణా అనుసంధాన ప్రాజెక్టులు ఇక్కడ ప్రారంభమయ్యాయి. మధ్యప్రదేశ్ పారిశ్రామికీకరణలో భాగంగా ఉజ్జయినిలోని విక్రమ్ ఉద్యోగపురి, ఇండోర్‌లోని బహుళ విధ లాజిస్టిక్స్ పార్కు విస్తరణ జరుగుతుంది. ఫలితంగా, ఇక్కడి యువతకు వేలాది నూతన ఉద్యోగాలు, కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇండోర్ ఐఐటీలో కూడా వివిధ నూతన ప్రాజెక్టులు ఈ రోజు ప్రారంభమయ్యాయి.
గ్వాలియర్‌తో పాటు విదిశ, బెతుల్, కట్ని, బుర్హాన్పూర్, నర్సింగ్‌పూర్, దామో, షాజపూర్లకు ఈ రోజు కొత్త ఆరోగ్య కేంద్రాలు వచ్చాయి. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక వసతుల కార్యక్రమం ద్వారా ఈ కేంద్రాలను నిర్మించాం. తీవ్రమైన వ్యాధుల చికిత్సకు అవసరమైన సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. ఈ కార్యక్రమాల నేపథ్యంలో మీ అందరికీ, మధ్యప్రదేశ్ కుటుంబ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
స్నేహితులారా,
ఈ కార్యక్రమాలన్నీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చేస్తున్న సంయుక్త కృషి ఫలితం. ప్రజాసంక్షేమానికి అంకితమై ఉన్న ప్రభుత్వాలు ఢిల్లీ, భోపాల్ రెండు చోట్లా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. అందుకే.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై మధ్యప్రదేశ్ పూర్తి విశ్వాసంతో ఉంది. డబుల్ ఇంజిన్ అంటే.. మధ్యప్రదేశ్‌లో రెట్టింపు అభివృద్ధి అని అర్థం!
నా కుటుంబ సభ్యులారా,
గత కొన్నేళ్లలోనే ‘బీమారు’ రాష్ట్రం స్థాయి నుంచి దేశంలోని పది అగ్ర రాష్ట్రాల స్థాయికి మధ్యప్రదేశ్‌ను మా ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇక్కడి నుంచి దేశంలో మూడు అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా మధ్యప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే మా లక్ష్యం. టాప్-3లో మధ్యప్రదేశ్ ఉండాలా వద్దా? మధ్యప్రదేశ్ టాప్-3లో ఉండాలా వద్దా? అది గర్వంగా టాప్ -3కి చేరుకోవాలా వద్దా? ఈ పని ఎవరు చేస్తారు? దీనికి ఎవరు హామీ ఇస్తారు? మీ సమాధానం తప్పు. బాధ్యతాయుతమైన పౌరుడిగా మీరు వేసిన ఓటే ఈ హామీని ఇచ్చింది. మీరు వేసే ఓటే మధ్యప్రదేశ్‌ను మూడు అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా మారుస్తుంది. డబుల్ ఇంజిన్‌కు మీరు వేసే ప్రతి ఓటూ మధ్యప్రదేశ్‌ను టాప్-3కి చేరుస్తుంది.
నా కుటుంబ సభ్యులారా,
అభివృద్ధి గురించి కొత్త ఆలోచనా విధానం లేదా ప్రణాళిక లేని వారు మధ్యప్రదేశ్‌ను అభివృద్ధి చేయలేరు. వీళ్లకి ఒకటే పని ఉంది- అదే దేశ పురోగతినీ, దేశంలో అమలు చేస్తున్న పథకాలనూ వ్యతిరేకించడం. దేశం సాధించిన విజయాలను సైతం ద్వేషం కారణంగా వారు గుర్తించలేకపోతున్నారు. ఈ రోజు ప్రపంచమంతా భారత్ గొప్పతనాన్ని ప్రశంసిస్తోంది. అంతర్జాతీయంగా భారత్ గొంతు వినిపిస్తోందా? లేదా? ఇప్పుడు భారత్‌లోనే తన భవిష్యత్తును ఈ ప్రపంచం చూస్తోంది. రాజకీయ ఊబిలో కూరుకుపోయిన వారు, అధికారాన్ని తప్ప మరొకదాన్ని చూడనివారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న భారత వాణిని ఇష్టపడరు.
ఆలోచించండి మిత్రులారా, తొమ్మిదేళ్లలోనే పదో స్థానం నుంచి అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. కానీ, ఇది జరగలేదని నిరూపించేందుకు ఈ అభివృద్ధి వ్యతిరేక శక్తులన్నీ ప్రయత్నిస్తున్నాయి. తర్వాతి పాలనా కాలంలో ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా మారుతుందని మోదీ హామీ ఇచ్చారు. అధికార దాహంతో ఉన్న కొందరికి ఇది నిరాశ కలిగించింది.
నా కుటుంబ సభ్యులారా,
అభివృద్ధిని వ్యతిరేకించే వారికి ఈ దేశం ఆరు దశాబ్దాలను ఇచ్చింది. 60 ఏళ్లంటే అది తక్కువ సమయమేమీ కాదు. తొమ్మిదేళ్లలోనే ఇంత పని జరిగిందంటే.. 60 ఏళ్లలో ఇంకెంత పని జరగాలి! వారికి అవకాశం ఉన్నా వారు చేయలేకపోయారు. అంటే ఇది వారి వైఫల్యమే. ఆ సమయంలో వారు పేదల భావోద్వేగాలతో ఆడుకొనేవారు. ఇప్పటికీ అదే చేస్తున్నారు. అప్పట్లో.. కులం పేరుతో ఈ సమాజాన్ని విభజించారు. ఇప్పటికీ అదే పాపం చేస్తున్నారు. ఆ సమయంలో వారు అవినీతిలో కూరుకుపోయారు. ఇప్పుడు మరింత అవినీతిపరులుగా మారారు. ప్రత్యేకంగా ఒక కుటుంబాన్ని పొగడటంలో వారు నిమగ్నమై ఉండేవారు. ఇప్పటికీ తమ భవిష్యత్తును పదిలపరుచుకొనేందుకు అదే పనిని కొనసాగిస్తున్నారు. అందుకే వారికి దేశాన్ని కీర్తించడం నచ్చదు.
నా కుటుంబ సభ్యులారా,
పేదలు, దళితులు, వెనబడిన, గిరిజన కుటుంబాలకు పక్కా ఇళ్లు ఇస్తానని మోదీ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం ద్వారా దేశంలో 4 కోట్ల కుటుంబాలకు పక్కా ఇళ్లు లభించాయి. మధ్యప్రదేశ్‌లో సైతం లక్షలాది గృహాలను పేద కుటుంబాలకు అందించాం. ఈ రోజు కూడా పెద్ద సంఖ్యలో ఈ ఇళ్లను ప్రారంభించుకున్నాం. ఈ వ్యక్తులు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు.. పేదలకు ఇళ్లు ఇచ్చే నెపంతో దోపిడీ చేశారు. వారు నిర్మించిన ఇళ్లు నివాసయోగ్యమైనవి కావు. ఇలాంటి గృహాల్లో కనీసం అడుగు కూడా పెట్టని లక్షలాది మంది లబ్దిదారులు దేశవ్యాప్తంగా ఉన్నారు. ఇప్పుడు నిర్మించిన ఇళ్లలో.. సంతోషంగా గృహప్రవేశాలు జరుగుతున్నాయి. ఎందుకంటే.. ప్రతి లబ్ధిదారుడూ తన ఇంటిని తన సౌలభ్యానికి తగిన విధంగా నిర్మించుకున్నారు. వారి కలలు, అవసరాలకు అనుగుణంగా తమ ఇళ్లను నిర్మించుకుంటున్నారు.
సాంకేతికత సహాయంతో ఈ పనులు పూర్తయ్యేలా మా ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. అలాగే నేరుగా బ్యాంకు ఖాతాలకే డబ్బును జమ చేస్తుంది. ఇందులో డబ్బును దొంగిలించడానికి, పక్కదారి పట్టించడానికి, అవినీతి చేయడానికి ఆస్కారం లేదు. ఈ ఇళ్ల నిర్మాణం సజావుగా సాగుతోంది. గతంలో ఇంటి పేరు చెప్పి నాలుగు గోడలు కట్టేవారు. ఇప్పుడు నిర్మిస్తున్న ఈ గృహాల్లో టాయిలెట్, విద్యుత్, నల్లా నీరు, ఉజ్వల గ్యాస్, అన్ని వసతులు అందుబాటులో ఉంటాయి. గ్వాలియర్, శ్యోపూర్ జిల్లాల్లో ముఖ్యమైన జల సంబంధిత ప్రాజెక్టుల కూడా ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఇవి ఈ ఇళ్లకు నీటిని సరఫరా చేయడంలో తోడ్పడతాయి.
స్నేహితులారా,
ఇంటి యజమానిగా ఈ గృహలక్ష్ములు అంటే నా తల్లులు, ఆడపడుచులే ఉండాలని మోదీ నిర్ణయం తీసుకున్నారు. పీఎం ఆవాస యోజన పరిధిలో నిర్మించే గృహాలు మహిళల పేరు మీదే రిజిస్టర్ అవుతున్నాయని మీకు తెలుసా? పీఎం ఆవాస యోజన ద్వారా నిర్మించిన గృహాలతో కోట్లాది మంది ఆడపడుచులు ‘లక్షాధికారులు’గా మారారు. గతంలో తమ పేరు మీద ఎలాంటి ఆస్తి లేని వారి పేరుతో లక్షల రూపాయల విలువైన ఈ ఇళ్లు రిజిస్టర్ అయ్యాయి. ఈ రోజు ప్రారంభించిన ఇళ్లలో సైతం ఎక్కువ భాగం మహిళల పేరు మీదే రిజిస్టరయ్యాయి.
సోదరీసోదరులారా,
మోదీ తన హామీని నెరవేర్చారు. అలాగే నా సోదరీమణుల నుంచి కూడా నేను ఓ హామీని కోరుతున్నాను. నేను మీకిచ్చిన మాటను నిలబెట్టుకున్నాను కాబట్టి.. మీరూ నాకు ఓ మాటిస్తారా అని అడుగుతున్నాను. మీరు నాకు మాటిస్తారా? నిజంగా? మీ ఇంటిని మీరు పొందిన తర్వాత మీ పిల్లలను బాగా చదివించాలి. వారికి నైపుణ్యాలు నేర్పించాలి. మీరది చేస్తారా? మీరిచ్చే ఈ మాటే నాకు పనిచేసే బలాన్నిస్తుంది.
నా కుటుంబ సభ్యులారా,
మహిళా సాధికారత అంటే భారత్‌కు ఓటు బ్యాంకు కాదు. అది జాతి సంక్షేమం కోసం, జాతి నిర్మాణం కోసం అంకితమైన కార్యక్రమం. గతంలో ఎన్నో ప్రభుత్వాలను మనం చూశాం. పార్లమెంటులోని లోక్‌సభలో 33 శాతం రిజర్వేషన్ అని అబద్ధపు హామీలను ఇచ్చి మన అక్కాచెల్లెళ్ల ఓట్లను పదే పదే అడుగుతుండేవారు. కానీ పార్లమెంటులో కుట్ర కారణంగా అది చట్టంగా మారలేదు. మళ్లీ మళ్లీ దానిని తిరస్కరించేవారు. ఆడపడుచులకు మోదీ ఓ హామీనిచ్చారు. మోదీ గ్యారంటీ అంటే.. ప్రతి హామీ నెరవేరుతుందని అర్థం.
ఈ రోజు నారీ శక్తి వందన్ అధీనియం వాస్తవ రూపం దాల్చింది. భవిష్యత్తు కోసం అభివృద్ధి ప్రయాణంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే, పురోగతి మార్గంలో ముందుకు సాగే దిశగా మనం పనిచేయాలని ఈ సమావేశంలోనూ.. భవిష్యత్తులోనూ చెబుతాను.
సోదరీసోదరులారా,
ఈ చట్టానికి లభించిన ఆమోదం నుంచే ఈ రోజు మనం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ స్ఫూర్తిని పొందుతున్నాయి.
నా కుటుంబ సభ్యులారా,
గ్వాలియర్-చంబల్ ప్రాంతం ఇప్పుడు అవకాశాల భూమిగా మారింది. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. కొన్ని దశాబ్దాల పాటు ప్రభుత్వంలో ఉన్న, ఇప్పుడు శ్రుతి మించి మాట్లాడుతున్న నాయకుల ట్రాక్ రికార్డు ఏంటి? మన యువ స్నేహితులు, మొదటిసారి ఓటు వేస్తున్నవారు.. వారి జీవితమంతా బీజేపీ ప్రభుత్వాన్నే చూసి ఉంటారు. వారు పురోగమిస్తున్న మధ్యప్రదేశ్‌ను చూశారు. ఇప్పుడు అతిగా మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులు.. దశాబ్దాల తరబడి మధ్యప్రదేశ్‌ను పాలించారు.
వారి పాలనలో.. గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో అన్యాయం, అణచివేత రాజ్యమేలాయి. వారి పాలనలో సామాజిక న్యాయం అందని ద్రాక్షలా మారింది. ఆ సమయంలో బలహీన, దళిత, వెనకబడిన వర్గాల ఘోషను పట్టించుకొనేవారు కాదు. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొనేవారు. సామాన్యుడికి రహదారులపై స్వేచ్ఛగా తిరగడం కష్టమైపోయేది. మా ప్రభుత్వం తీవ్రంగా శ్రమించి.. ప్రస్తుతమున్న స్థితికి ఈ ప్రాంతాన్ని తీసుకువచ్చింది. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.
వచ్చే అయిదేళ్లు మధ్యప్రదేశ్‌కు అత్యంత కీలకం. ప్రస్తుతం గ్వాలియర్లో కొత్త ఎయిర్‌పోర్టు టెర్మినల్, ఎలివేటెడ్ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వేయి పడకల ఆసుపత్రి ఇక్కడ ఏర్పాటైంది. కొత్త బస్టాండు, ఆధునిక రైల్వే స్టేషన్, కొత్త పాఠశాలలు, కళాశాలలను నిర్మిస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా మొత్తం గ్వాలియర్ ముఖచిత్రమే మారిపోతోంది. అదేవిధంగా, మొత్తం మధ్యప్రదేశ్ గుర్తింపును మార్చాలంటే.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఇక్కడ ఉండటం అవసరం.
స్నేహితులారా,
ఆధునిక మౌలిక వసతులు జీవితాన్ని సులభతరం చేయడంతో పాటుగా.. సంక్షేమానికి బాటలు వేస్తాయి. జబువా, మాండసోర్, రత్లామ్లను అనుసంధానించే 8 వరుసల ఎక్స్‌ప్రెస్ మార్గాన్ని ఈ రోజు ప్రారంభించాం. గత శతాబ్దంలో నాణ్యమైన రెండు వరుసల రహదారి కోసం కూడా మధ్యప్రదేశ్ పరితపించేది. ఇప్పుడు ఇక్కడ 8 వరుసల ఎక్స్‌ప్రెస్ మార్గాలు ఏర్పాటవుతున్నాయి. ఇండోర్, దేవాస్, హర్దా మధ్య 4 వరుసల రహదారి పనులు ఈ రోజే ప్రారంభమయ్యాయి. గ్వాలియర్-సుమావళి మధ్య రైల్వే సెక్షన్ను బ్రాడ్‌గేజ్‌గా మార్చే పనులు కూడా పూర్తయ్యాయి. ఈ సెక్షన్లో మొదటి రైలు ప్రారంభమైంది. ఈ రవాణా అనుసంధాన ప్రాజెక్టులతో ఈ ప్రాంతానికి పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరుతుంది.
స్నేహితులారా,
ఆధునిక మౌలిక వసతులు, శాంతి భద్రతలు ఉంటే.. రైతులు, పరిశ్రమలు.. అందరూ అభివృద్ధి చెందుతారు. అభివృద్ధి నిరోధక ప్రభుత్వాలు అధికారంలో ఉన్న చోట ఈ వ్యవస్థలన్నీ నాశనమవుతాయి. రాజస్థాన్ వైపు ఓసారి చూడండి. అక్కడ బహిరంగంగా హత్యలు చేస్తుంటే.. ప్రభుత్వం చోద్యం చూస్తోంది. అభివృద్ధి వ్యతిరేక శక్తులు ఎక్కడికి వెళ్తే అక్కడ బుజ్జగింపులు మొదలవుతాయి. దీనివల్లే గూండాలు, నేరస్థులు, అల్లరి మూకలు, అవినీతిపరులు అదుపు తప్పుతారు. మహిళలు, వెనకబడిన తరగతులు, గిరిజనులపై అఘాయిత్యాలు పెరుగుతాయి. గత కొన్నేళ్లలో ఈ అభివృద్ధి వ్యతిరేక శక్తులు పాలిస్తున్న రాష్ట్రాల్లో నేరాలు, అవినీతి పెరిగాయి. కాబట్టి.. వీరి విషయంలో మధ్యప్రదేశ్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
నా కుటుంబ సభ్యులారా,
ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి అభివృద్ధిని చేరువ చేయాలనే అంకితభావంతో మా ప్రభుత్వం ఉంది. నిరాదరణకు గురయిన వారిపై మోదీ శ్రద్ధ వహిస్తారు. వారిని మోదీ ఆరాధిస్తారు. మీ నుంచి ఓ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. 2014కు ముందు ఎవరైనా ‘దివ్యాంగ’ అనే పదాన్ని విన్నారా? శారీరక వైకల్యంతో ఉన్నవారిని నిస్సహాయ స్థితిలో గత ప్రభుత్వాలు వదిలేశాయి.
మా ప్రభుత్వం దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలున్న వారి పట్ల శ్రద్ధ వహిస్తోంది. వారికి అత్యాధునిక సామగ్రిని అందించింది. ఉమ్మడి సంజ్ఞా భాషను అభివృద్ధి చేసింది. గ్వాలియర్లో దివ్యాంగుల కోసం కొత్త క్రీడా కేంద్రాన్ని ఈ రోజే ప్రారంభించాం. ఇది దేశంలో ప్రధాన క్రీడాకేంద్రంగా గ్వాలియర్ గుర్తింపును మరింత బలోపేతం చేస్తుంది. స్నేహితులారా, నన్ను నమ్మండి. ఈ ప్రపంచం క్రీడల గురించి, దివ్యాంగ క్రీడల గురించి మాట్లాడుతుంది. నా మాటలు గుర్తుంచుకోండి.. భవిష్యత్తులో గ్వాలియర్ గర్వంతో ఉప్పొంగుతుంది.
అందుకే ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురయ్యే వారిపై మోదీ దృష్టి సారిస్తారని చెప్పాను. వారిని మోదీ ఆరాధిస్తారు. దేశంలో చిన్నకారు రైతులను చాలా కాలం పాటు ఎవరూ పట్టించుకోలేదు. చిన్నకారు రైతులపై మోదీ తన ప్రేమను కురిపించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఇప్పటి వరకు దేశంలోని ప్రతి చిన్న రైతు ఖాతాలోకి రూ.28,000ను మా ప్రభుత్వం జమ చేసింది. మనదేశంలో తృణ ధాన్యాలను పండించే రైతులు 2.5 కోట్ల మంది ఉన్నారు. తృణధాన్యాలను పండించే రైతులను గతంలో ఎవరూ పట్టించుకోలేదు. తృణధాన్యాలకు ‘శ్రీ-అన్న’ గుర్తింపునిచ్చి అంతర్జాతీయ మార్కెట్లకు మా ప్రభుత్వమే తీసుకెళ్లింది.
స్నేహితులారా,
పీఎం విశ్వకర్మ యోజన ఈ ప్రభుత్వ స్ఫూర్తికి మరో ప్రధాన నిదర్శనం. మన కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, స్వర్ణకారులు, పూల దండలు అల్లేవారు, దర్జీలు, రజకులు, క్షురకులు, తదితర వృత్తుల్లో ఉన్నవారంతా మన జీవితాల్లో ప్రధాన భాగంగా ఉన్నారు. వారు లేకుండా మన జీవితాలను ఊహించడం కష్టం. స్వాతంత్ర్యం వచ్చిన అనేక సంవత్సరాల తర్వాత వారి విషయంలో మా ప్రభుత్వం శ్రద్ధ వహించింది.
ఈ మిత్రులంతా మన సమాజంలో వెనకబడిపోయారు. ఇప్పుడు వారిని ముందుకు తీసుకొచ్చేందుకు మోదీ ఓ విస్తృత ప్రచారాన్ని ప్రారంభించారు. వీరికి శిక్షణ అందించేందుకు మా ప్రభుత్వం వేల రూపాయలను అందిస్తోంది. ఆధునిక పరికరాల కోసం బీజేపీ ప్రభుత్వం రూ.15,000ను అందిస్తోంది. వీరికి లక్షల రూపాయల రుణాలను తక్కువ వడ్డీకే అందిస్తోంది. విశ్వకర్మ మిత్రులకు అందించే రుణాలకు మోదీ, కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చాయి.
నా కుటుంబ సభ్యులారా,
దేశంలోని అభివృద్ధి వ్యతిరేక పార్టీలు మధ్యప్రదేశ్‌ను వెనక్కి తీసుకెళ్లాలని భావిస్తున్నాయి. కానీ మా డబుల్ ఇంజిన్ పభుత్వం మాత్రం భవిష్యత్తు కోసం ఆలోచిస్తోంది. కాబట్టి.. అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని మాత్రమే మీరు విశ్వసించాలి. అభివృద్ధి విషయంలో దేశంలో అగ్ర రాష్ట్రాల సరసన మధ్యప్రదేశ్‌ను నిలబెట్టే హామీని మా ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది.
పారిశుద్ద్యంలో దేశంలోనే మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ ఉందని ఇప్పుడే శ్రీ శివరాజ్ నాతో చెప్పారు. ఈ రోజు గాంధీ జయంతి. పారిశుద్ధ్యం గురించి ఎల్లప్పుడూ గాంధీ చెబుతూ ఉండేవారు. నిన్నే దేశవ్యాప్తంగా స్వచ్ఛతా ఉద్యమం నిర్వహించాం. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా శుభ్రపరచడం లేదా పారిశుద్ధ్యాన్ని పాటించాలని పిలుపునివ్వడం మీరు చూశారా? పరిశుభ్రతలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉందన్న నిజాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారా? అలాంటి వారు మధ్యప్రదేశ్ కోసం ఏం చేస్తారు? అలాంటి వారిని మనం నమ్మొచ్చా?
అందుకే.. ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని, వేగవంతం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. నన్ను ఆశీర్వదించడానికి మీ అందరూ పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. నన్ను దీవించడానికి ఇక్కడికి వచ్చిన గ్వాలియర్-చంబల్ ప్రాంత స్నేహితులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
నాతో కలసి చెప్పండి -
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
ధన్యవాదాలు.
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం.
***
(रिलीज़ आईडी: 2200037)
आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam