ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సు - 2025లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
భారత్ ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతోంది: ప్రధాని
ప్రపంచం మాంద్యం, అపనమ్మకం, విచ్ఛిన్న పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో అభివృద్ధి, నమ్మకంతో దేశాల మధ్య వారధిగా భారత్: ప్రధానమంత్రి
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలక వృద్ధి చోదకంగా మారుతున్న భారత్: ప్రధాని
భారత నారీశక్తి అద్భుతాలు చేస్తోంది:మన కుమార్తెలు నేడు ప్రతి రంగంలో రాణిస్తున్నారు: ప్రధాని
మన వేగం స్థిరంగా ఉంది: మన దిశ ఒకే విధంగా ఉంది: మన తొలి ప్రాధాన్యం ఎల్లప్పుడూ దేశమే: ప్రధానమంత్రి
ప్రతి రంగం పాత వలసవాద మనస్తత్వాన్ని విడిచిపెట్టి, గర్వంతో కొత్త విజయాలను లక్ష్యంగా పెట్టుకుంది: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
06 DEC 2025 8:32PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన హిందూస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సు - 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు ఈ సదస్సుకు హాజరు కావడాన్ని గమనించినట్టు తెలిపారు. సదస్సు నిర్వాహకులకు, తమ ఆలోచనలు పంచుకున్నవారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. శోభనాజీ ప్రస్తావించిన రెండు అంశాలను తాను శ్రద్ధగా గమనించినట్లు శ్రీ మోదీ తెలిపారు. అందులో మొదటిది, గతంలో తాను ఈ వేదికకు వచ్చినప్పుడు చేసిన ఒక సూచనను ఆమె గుర్తు చేశారని, మీడియా సంస్థల విషయంలో అలా సూచనలు ఇవ్వడం చాలా అరుదని, అయినా తాను ఆ పని చేశానని ఆయన అన్నారు. ఆ సూచనను శోభనా జీ, వారి బృందం ఉత్సాహంగా అమలు చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎగ్జిబిషన్‌ను సందర్శించినప్పుడు, ఫొటోగ్రాఫర్లు క్షణాలను చిరస్మరణీయంగా మలిచిన తీరును చూశానని, ఆ ప్రదర్శనను ప్రతి ఒక్కరూ తప్పక చూడాలని ఆయన కోరారు. శోభనా జీ ప్రస్తావించిన రెండో అంశం గురించి శ్రీ మోదీ వివరిస్తూ, తాను దేశానికి సేవ చేస్తూ ఉండాలన్నది కేవలం ఒక ఆకాంక్ష మాత్రమే కాదని, ఇదే విధంగా సేవలు కొనసాగించాలని హిందుస్థాన్ టైమ్స్ పత్రికే స్వయంగా చెబుతున్నట్లుగా తాను భావిస్తున్నానని అన్నారు. ఇందుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సంవత్సరం సదస్సు 'ట్రాన్స్‌ఫార్మింగ్ టుమారో' (రేపటిని మార్చడం) అనే ఇతివృత్తాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. హిందూస్తాన్ టైమ్స్ పత్రికకు 101 సంవత్సరాల చరిత్ర ఉందని, ఈ పత్రికకు మహాత్మా గాంధీ, మదన్ మోహన్ మాలవ్య, ఘన్శ్యామదాస్ బిర్లా వంటి మహనీయుల ఆశీస్సులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ పత్రిక 'రేపటిని మార్చడం' గురించి చర్చిస్తున్నప్పుడు, భారతదేశంలో జరుగుతున్న మార్పు కేవలం అవకాశాలకు సంబంధించినది మాత్రమే కాదని, అది జీవితాలను, ఆలోచనలను, దిశలను మారుస్తున్న నిజమైన కథనం అని దేశానికి నమ్మకం కలుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాపరినిర్వాణ దినం కూడా నేడే అని గుర్తుచేస్తూ, యావత్ భారతీయుల తరపున శ్రీ మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. 21వ శతాబ్దంలో ఇప్పటికే నాలుగో వంతు గడిచిపోయిన కీలక దశలో మనం ఉన్నామని ఆయన చెప్పారు. ఈ 25 ఏళ్లలో ప్రపంచం అనేక ఎత్తుపల్లాలను చూసిందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభాలు, ప్రపంచ మహమ్మారి, సాంకేతిక అంతరాయాలు, విచ్ఛిన్నమైన ప్రపంచం, నిరంతరం జరుగుతున్న యుద్ధాలు వంటి సవాళ్లను ప్రపంచం చవిచూసిందని ఆయన వివరించారు.ఈ పరిస్థితులన్నీ ఏదో ఒక రూపంలో ప్రపంచాన్ని సవాలు చేస్తున్నాయని, ప్రపంచం అనిశ్చితితో నిండి ఉందని ప్రధానమంత్రి చెప్పారు. “ఈ అనిశ్చిత పరిస్థితుల్లో భారత్ లో మాత్రం ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. ఒక భిన్నమైన స్థాయిలో భారత్ తనను తాను ప్రదర్శించుకుంటోంది” అని శ్రీ మోదీ అన్నారు. ప్రపంచం మాంద్యం గురించి మాట్లాడుతున్నప్పుడు, భారత్ మాత్రం వృద్ధి కథను లిఖిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచం అపనమ్మకాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో, భారత్ విశ్వాసానికి ఒక ఆధారంగా మారుతోందని వివరించారు. అలాగే, ప్రపంచం విచ్ఛిన్నం వైపు పయనిస్తున్నప్పుడు, భారత్ ఒక వారధిగా ఉద్భవిస్తోందని స్పష్టం చేశారు.
కొద్ది రోజుల క్రితమే విడుదలైన భారత రెండో త్రైమాసిక జీడీపీ (జీడీపీ) గణాంకాలను ప్రధాని ప్రస్తావిస్తూ, ఆ గణాంకాలు ఎనిమిది శాతానికి పైగా వృద్ధి రేటును చూపాయని, ఇది ప్రగతి లోని కొత్త వేగాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. ఈ వృద్ధి కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదని, ఇది ఒక బలమైన స్థూల ఆర్థిక సంకేతమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. నేడు భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వృద్ధి చోదక శక్తిగా మారుతోందనే సందేశాన్ని ఈ సంఖ్య అందిస్తోందని ఆయన తెలిపారు.
ప్రపంచ వృద్ధి మూడు శాతంగా, జీ-7 దేశాల ఆర్థిక వ్యవస్థల సగటు వృద్ధి ఒకటిన్నర శాతంగా ఉన్న సమయంలో ఈ గణాంకాలు వచ్చాయని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితులలో భారత్ అధిక వృద్ధి తక్కువ ద్రవ్యోల్బణానికి ఒక నమూనాగా ఆవిర్భవించిందని ఆయన చెప్పారు. గతంలో ఆర్థికవేత్తలు అధిక ద్రవ్యోల్బణం గురించి ఆందోళన వ్యక్తం చేసిన సమయం ఉండేదని శ్రీ మోదీ గుర్తు చేశారు. కానీ, ఈ రోజు అదే ఆర్థికవేత్తలు తక్కువ ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు.
భారత్ సాధించిన విజయాలు సాధారణమైనవి కావని, అలాగే కేవలం గణాంకాలకు సంబంధించినవి కూడా కాదని, గత దశాబ్దంలో దేశం తీసుకొచ్చిన ప్రధాన మార్పును అవి సూచిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రధాన మార్పు అంటే, సుస్థిరత్వం, సమస్యలకు పరిష్కారాలు కనుగొనే ధోరణి, అపోహల మేఘాలను తొలగించడం,ఆకాంక్షలను విస్తృతం చేయడం అని వివరించారు. ఈ కారణం చేతనే నేటి భారతదేశం తనను తాను మార్చుకుంటోందని, రాబోయే రేపటిని కూడా మారుస్తోందని ఆయన తెలిపారు.
రేపటిని మారుస్తున్నాం అని చర్చిస్తున్నప్పుడు, ఈ మార్పుపై ఉన్న విశ్వాసం నేడు జరుగుతున్న కార్యకలాపాల బలమైన పునాదిపై ఆధారపడి ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. నేటి సంస్కరణలు మాత్రమే రేపటి మార్పునకు మార్గం సుగమం చేస్తున్నాయని ఆయన చెప్పారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వివరిస్తూ, భారతదేశ సామర్థ్యంలో అధిక భాగం చాలా కాలం పాటు వినియోగంలోకి రాలేదని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ వినియోగంలోకి రాని సామర్థ్యానికి ఎక్కువ అవకాశాలు దక్కినప్పుడు, దేశ అభివృద్ధిలో అది పూర్తిగా, నిస్సంకోచంగా పాల్గొన్నప్పుడు, దేశంలో మార్పు తథ్యమని ఆయన తెలిపారు. గత దశాబ్దాలలో తూర్పు భారతదేశం, ఈశాన్య రాష్ట్రాలు, గ్రామాలు, టైర్-2, టైర్-3 నగరాలు, మహిళా శక్తి, ఆవిష్కరణలు చేసే యువత, సముద్ర సామర్థ్యం , బ్లూ ఎకానమీ, అంతరిక్ష రంగం వంటి వాటి పూర్తి సామర్థ్యం వినియోగం కాలేదని ప్రధాని తెలిపారు. గుర్తు చేశారు. ఈ వినియోగంలోకి రాని సామర్థ్యాన్ని వినియోగించే దృష్టితో నేడు భారత్ పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. తూర్పు భారతదేశంలో ఆధునిక మౌలిక సదుపాయాలు, అనుసంధానం, పరిశ్రమలలో గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిపారు. గ్రామాలు, చిన్న పట్టణాలకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయని, చిన్న పట్టణాలు స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలకు కొత్త కేంద్రాలుగా మారుతున్నాయని తెలిపారు. గ్రామాల్లోని రైతులు ఎఫ్‌పీఓలను ఏర్పాటు చేసి నేరుగా ప్రపంచ మార్కెట్లకు అనుసంధానం అవుతున్నారని ఆయన వివరించారు.
“భారతదేశ మహిళా శక్తి అసాధారణ విజయాలను సాధిస్తోంది. మన కుమార్తెలు ప్రతి రంగంలోనూ రాణిస్తున్నారు" అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఈ మార్పు కేవలం మహిళా సాధికారతకు మాత్రమే పరిమితం కాకుండా, సమాజ ఆలోచనాధోరణిని, శక్తిని సైతం సమూలంగా మారుస్తోందని ఆయన స్పష్టం చేశారు.
“నూతన అవకాశాలు సృష్టించినప్పుడు, అడ్డంకులు తొలగించినప్పుడు, ఆకాశంలో ఎదగడానికి కొత్త రెక్కలు తోడవుతాయి" అని ప్రధానమంత్రి అన్నారు. దీనికి ఉదాహరణగా, గతంలో కేవలం ప్రభుత్వ నియంత్రణలో ఉన్న భారత అంతరిక్ష రంగాన్ని ఆయన ప్రస్తావించారు. అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ రంగానికి సైతం తెరిచేందుకు సంస్కరణలు ప్రవేశపెట్టామని, ఆ ఫలితాలు ఇప్పుడు దేశానికి స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. కేవలం పది, పదకొండు రోజుల క్రితమే తాను హైదరాబాద్‌లో స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రారంభించినట్లు ఆయన గుర్తుచేశారు. స్కైరూట్ ఒక ప్రైవేట్ భారతీయ అంతరిక్ష సంస్థ అని, ఈ సంస్థ ప్రతి నెలా ఒక రాకెట్‌ను నిర్మించే సామర్థ్యం దిశగా కృషి చేస్తోందని, ప్రస్తుతం విక్రమ్-1 అనే ఫ్లైట్-రెడీ రాకెట్‌ను అభివృద్ధి చేస్తోందని ప్రధానమంత్రి వివరించారు. ప్రభుత్వం కేవలం ఒక వేదికను మాత్రమే అందించిందని, దానిపై భారత యువత ఒక నూతన భవిష్యత్తును నిర్మిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇదే నిజమైన మార్పుఅని ఆయన స్పష్టం చేశారు.
ఒకప్పుడు సంస్కరణలు అనేవి కేవలం రాజకీయ ప్రయోజనాల వలనో, లేదా ఒక సంక్షోభాన్ని నిర్వహించాల్సిన అవసరం వలనో మాత్రమే ప్రతిస్పందనాత్మకంగా ఉండేవని ఆయన గుర్తు చేశారు. కానీ, నేడు జాతీయ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని సంస్కరణలు చేపడుతున్నామని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ప్రతి రంగంలోనూ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. భారతదేశ వేగం స్థిరంగా, దాని దిశ స్థిరంగా, దాని ఉద్దేశం ‘దేశం ప్రథమం‘ అనే ధ్యేయంతో దృఢంగా పాతుకుపోయి ఉందని ప్రధానమంత్రి ప్రముఖంగా తెలిపారు.
2025 సంవత్సరం ఇటువంటి సంస్కరణల సంవత్సరంగా నిలిచిందని ఆయన చెప్పారు. వీటిలో అత్యంత ముఖ్యమైనది తదుపరి తరం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.ఈ సంస్కరణల ప్రభావం దేశవ్యాప్తంగా కనిపించిందని ఆయన తెలిపారు. ఈ సంవత్సరమే ప్రత్యక్ష పన్నుల విధానంలో కూడా ఒక ప్రధాన సంస్కరణ ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేకపోవడం ఇందుకు ఉదాహరణ అని, దశాబ్దం క్రితం వరకు కూడా ఇటువంటి చర్యను ఎవరూ ఊహించలేదని ఆయన స్పష్టం చేశారు.
సంస్కరణల పరంపర కొనసాగింపును ప్రస్తావిస్తూ, కేవలం మూడు నాలుగు రోజుల క్రితమే చిన్న కంపెనీ నిర్వచనాన్ని సవరించినట్లు శ్రీ మోదీ పేర్కొన్నారు. దీని ఫలితంగా, వేలాది కంపెనీలు ఇప్పుడు సరళమైన నియమాలు, వేగవంతమైన ప్రక్రియలు, మెరుగైన సౌకర్యాల పరిధిలోకి వచ్చాయని ఆయన చెప్పారు. అంతేకాకుండా, దాదాపు 200 ఉత్పత్తి శ్రేణులను కూడా తప్పనిసరి నాణ్యతా నియంత్రణ ఉత్తర్వుల నుంచి తొలగించినట్లు ప్రధానమంత్రి తెలిపారు.
"నేటి భారతదేశ ప్రయాణం కేవలం అభివృద్ధికి మాత్రమే పరిమితం కాకుండా, మానసిక స్థితిలో మార్పు, మానసిక పునరుజ్జీవనం దిశగా సాగుతోంది" అని ప్రధానమంత్రి తెలిపారు. ఆత్మవిశ్వాసం లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందజాలదని ఆయన స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు, సుదీర్ఘ వలస పాలన, వలస మనస్తత్వం కారణంగా భారతదేశ ఆత్మవిశ్వాసం సడలిపోయిందని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ వలస మనస్తత్వం 'వికసిత భారత్' లక్ష్యాన్ని చేరుకోవడంలో ఒక ప్రధాన అవరోధంగా ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అందుకే నేటి భారతం ఆ మనస్తత్వం నుంచి విముక్తి పొందేందుకు కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
భారతదేశాన్ని సుదీర్ఘకాలం పాలించాలంటే, భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని హరించి, వారిలో న్యూనతా భావాన్ని నింపాలని బ్రిటిష్ వారికి బాగా తెలుసని, ఆ కాలంలో వారు అదే చేశారని శ్రీ మోదీ గుర్తుచేశారు. భారతీయ కుటుంబ వ్యవస్థలను పాతబడినవిగా, భారతీయ దుస్తులు వృత్తిపరమైనవి కానివిగా, భారతీయ పండుగలు, సంస్కృతి అసమంజసమైనవిగా ముద్రవేశారని, యోగ, ఆయుర్వేదం అశాస్త్రీయమని తిరస్కరించారని, భారతీయ ఆవిష్కరణలను పరిహసించారని ఆయన అన్నారు. ఈ భావనలను దశాబ్దాలుగా పదేపదే ప్రచారం చేశారని, వీటినే బోధించారని, వీటినే బలపరిచారని ఆయన చెప్పారు. ఇది భారతీయ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీసిందని ఆయన తెలిపారు.
వలసవాద మనస్తత్వ విస్తృత ప్రభావాన్ని ప్రస్తావిస్తూ, దానిని ఉదాహరణలతో వివరిస్తానని శ్రీ మోదీ అన్నారు. నేడు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉందని, ప్రపంచ వృద్ధికి చోదకశక్తిగా, ప్రపంచ శక్తి కేంద్రంగా వరుస విజయాలతో దూసుకుపోతోందని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. భారతదేశం నేడు ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, దానిని ఎవరూ 'హిందూ వృద్ధి రేటు' అని సంబోధించడం లేదని ఆయన చెప్పారు. రెండు, మూడు శాతం వృద్ధి రేటు కోసం భారతదేశం ఇబ్బందులు పడినప్పుడు ఈ పదాన్ని ఉపయోగించారని ఆయన గుర్తుచేశారు. ఒక దేశ ఆర్థిక వృద్ధిని దాని ప్రజల మతంతో లేదా గుర్తింపుతో ముడిపెట్టడం అనేది పొరపాటున జరుగుతుందా అని ప్రధానమంత్రి ప్రశ్నించారు. అలా కాకుండా, అది వలసవాద మనస్తత్వానికి ప్రతిబింబమని ఆయన స్పష్టం చేశారు. మొత్తం సమాజాన్ని, సంప్రదాయాన్ని ఉత్పాదకత లేకపోవడంగా, పేదరికంతో సమానంగా చూశారని, భారతదేశ మందకొడి వృద్ధికి హిందూ నాగరికత, సంస్కృతే కారణమని నిరూపించే ప్రయత్నాలు జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి విషయంలోనూ మతతత్వాన్ని చూసే మేధావులు అని చెప్పుకునే వారు, వారి కాలంలో పుస్తకాలు, పరిశోధనా పత్రాల్లో భాగమైన 'హిందూ వృద్ధి రేటు' అనే పదంలో మతతత్వాన్ని చూడలేకపోవడం ఒక వైరుధ్యమని శ్రీ మోదీ అన్నారు.
వలసవాద మనస్తత్వం భారతదేశ తయారీ వ్యవస్థను కూడా ధ్వంసం చేసిందని ప్రధానమంత్రి అన్నారు. దేశం ఇప్పుడు దానిని పునరుద్ధరిస్తున్న తీరును ఆయన వివరించారు.వలస పాలన కాలంలో కూడా భారతదేశం ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉత్పత్తిలో ప్రధాన కేంద్రంగా ఉండేదని, బలమైన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల నెట్‌వర్క్ ఇక్కడ ఉందని, ఆయుధాలను ఎగుమతి చేస్తూ, వాటిని ప్రపంచ యుద్ధాలలో కూడా విస్తృతంగా ఉపయోగించారని ఆయన ప్రముఖంగా తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, రక్షణ తయారీ వ్యవస్థ నాశనమైందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వలసవాద మనస్తత్వం వల్ల ప్రభుత్వంలో ఉన్నవారు భారతదేశంలో తయారైన ఆయుధాలను తక్కువగా అంచనా వేశారని, ఇది దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ దిగుమతిదారులలో ఒకటిగా మార్చిందని పేర్కొన్నారు. .
అదే వలసవాద మనస్తత్వం శతాబ్దాలుగా భారతదేశంలో ప్రధాన కేంద్రంగా ఉన్న నౌకా నిర్మాణ పరిశ్రమను కూడా ప్రభావితం చేసిందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. సుమారు యాభై, అరవై సంవత్సరాల క్రితం కూడా భారతదేశ వాణిజ్యంలో నలభై శాతం భారతీయ నౌకల ద్వారా జరిగేదని ఆయన గుర్తు చేశారు. కానీ, వలసవాద మనస్తత్వం విదేశీ నౌకలకు ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. దాని ఫలితం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన తెలిపారు. ఒకప్పుడు సముద్రయాన శక్తికి పేరుగాంచిన దేశం, తన వాణిజ్యంలో 95 శాతం విదేశీ నౌకలపై ఆధారపడవలసి వచ్చింది. దీని కారణంగా, నేడు భారతదేశం విదేశీ షిప్పింగ్ కంపెనీలకు సంవత్సరానికి దాదాపు 75 బిలియన్ డాలర్లు (సుమారు ఆరు లక్షల కోట్ల రూపాయలు) చెల్లిస్తోందని ఆయన పేర్కొన్నారు.
“నౌకా నిర్మాణం అయినా, రక్షణ రంగ తయారీ అయినా, నేడు ప్రతి రంగం వలసవాద మనస్తత్వాన్ని విడిచిపెట్టి, నూతన వైభవాన్ని సాధించేందుకు కృషి చేస్తోంది" అని ప్రధానమంత్రి తెలిపారు.
వలసవాద మనస్తత్వం భారతదేశ పాలనా విధానానికి తీవ్ర నష్టాన్ని కలిగించిందని శ్రీ మోదీ అన్నారు. సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వ వ్యవస్థ తన ప్రజల పట్ల అవిశ్వాసంతో కూడి ఉండేదని ఆయన తెలిపారు. గతంలో ప్రజలు తమ సొంత పత్రాలను కూడా ప్రభుత్వ అధికారిచేత ధృవీకరించుకోవలసి వచ్చేదని ఆయన గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు ఆ అవిశ్వాసం పటాపంచలై, స్వీయ ధృవీకరణ సరిపోతోందని ఆయన పేర్కొన్నారు.
దేశంలో చిన్న పొరపాట్లను కూడా తీవ్రమైన నేరాలుగా పరిగణించే నిబంధనలు ఉండేవని శ్రీ మోదీ ప్రముఖంగా తెలిపారు. దీనిని మార్చేందుకు 'జన్-విశ్వాస్ చట్టాన్ని' ప్రవేశపెట్టామని, దీని ద్వారా అటువంటి వందలాది నిబంధనలను నేర రహితం చేశామని ఆయన చెప్పారు. గతంలో, కేవలం వెయ్యి రూపాయల రుణానికి కూడా, అతి అపనమ్మకం కారణంగా బ్యాంకులు హామీలు డిమాండ్ చేసేవని ఆయన గుర్తు చేశారు. ఈ అవిశ్వాస విషచక్రాన్ని ముద్రా యోజన ద్వారా ఛేదించామని తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 37 లక్షల కోట్ల రూపాయల విలువైన హామీ రహిత రుణాలను అందించామని ఆయన చెప్పారు. ఈ రుణాలు హామీ ఇవ్వడానికి ఏమీ లేని కుటుంబాల యువతలో కూడా ఆత్మవిశ్వాసాన్ని నింపాయని, వారు పారిశ్రామికవేత్తలుగా మారేందుకు సామర్ధ్యాన్ని ఇచ్చాయని ఆయన తెలిపారు.
దేశంలో గతంలో ఒక విషయంపై బలమైన నమ్మకం ఉండేదని శ్రీ మోదీ గుర్తుచేశారు: ప్రభుత్వానికి ఏదైనా ఇచ్చిన తర్వాత, అది వన్ వే ట్రాఫిక్ లా ఉంటుందని, తిరిగి ఏమీ రాదని ప్రజలు భావించేవారని, అయితే, ప్రభుత్వం, ప్రజల మధ్య విశ్వాసం బలంగా పెరిగినప్పుడు, ఆ ఫలితాలు మరొక రూపంలో స్పష్టంగా కనిపిస్తాయని ఆయన ఉద్ఘాటించారు. బ్యాంకుల్లో 78 వేల కోట్ల రూపాయలు, భీమా కంపెనీల వద్ద 14 వేల కోట్ల రూపాయలు, మ్యూచువల్ ఫండ్ కంపెనీల వద్ద 3 వేల కోట్ల రూపాయలు, అలాగే డివిడెండ్ల రూపంలో 9 వేల కోట్ల రూపాయలు ఎవరూ క్లెయిమ్ చేయకుండా నిరుపయోగంగా ఉందని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ సొమ్మంతా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినదని ఆయన స్పష్టం చేశారు. అందుకే ఈ డబ్బును హక్కుదారులకు తిరిగి అప్పగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక శిబిరాలు ప్రారంభించామని, ఇప్పటివరకు దాదాపు 500 జిల్లాల్లో నిర్వహించిన ఈ శిబిరాల ద్వారా వేల కోట్ల రూపాయలను హక్కుదారులైన లబ్ధిదారులకు తిరిగి అందించామని ఆయన తెలిపారు.
ఇది కేవలం ఆస్తుల తిరిగి చెల్లింపు గురించి మాత్రమే కాదని, విశ్వాసం గురించి, ప్రజల విశ్వాసాన్ని నిరంతరం సంపాదించుకునే నిబద్ధత గురించి అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ప్రజల విశ్వాసమే దేశానికి నిజమైన మూలధనం అని శ్రీ మోదీ పేర్కొన్నారు. అటువంటి కార్యక్రమాలు వలసవాద మనస్తత్వంతో కూడిన పాలనలో ఎన్నటికీ సాధ్యమయ్యేవి కావని ఆయన స్పష్టం చేశారు.
“ప్రతి రంగంలోనూ దేశం వలసవాద మనస్తత్వం నుంచి పూర్తిగా విముక్తి పొందాలి" అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. కొన్ని రోజుల క్రితమే తాను దేశానికి ఒక విజ్ఞప్తి చేశానని, ప్రతి ఒక్కరూ పదేళ్ల కాలపరిమితితో కృషి చేయాలని కోరానని ఆయన తెలిపారు. భారతదేశంలో మానసిక బానిసత్వ బీజాలు నాటిన మెకాలే విధానం 2035 నాటికి 200 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని, అంటే పదేళ్ల సమయం మిగిలి ఉందని, ఈ పదేళ్లలోపే, దేశంలోని పౌరులందరూ వలసవాద మనస్తత్వం నుంచి దేశాన్ని విముక్తి చేయాలని దీక్షబూనాలని ఆయన ఉద్ఘాటించారు.
"భారతదేశం కేవలం నిర్ణీత మార్గాన్ని అనుసరించే దేశం కాదు. మెరుగైన భవిష్యత్తు కోసం తన పరిధులను తప్పక విస్తరించుకోవాలి" అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దేశ భవిష్యత్ అవసరాలను అర్థం చేసుకుని, వర్తమానంలోనే పరిష్కారాలను కనుగొనవలసిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.అందుకే తాను తరచుగా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ప్రచారాల గురించి మాట్లాడతానని ఆయన ప్రముఖంగా తెలిపారు. ఈ రకమైన కార్యక్రమాలను నాలుగైదు దశాబ్దాల క్రితమే ప్రారంభించి ఉంటే, నేడు భారతదేశ పరిస్థితి మరో విధంగా ఉండేదని ఆయన పేర్కొన్నారు.సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన ఉదాహరణను శ్రీ మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. సుమారు యాభై, అరవై సంవత్సరాల క్రితం ఒక కంపెనీ భారతదేశంలో సెమీకండక్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందని, . కానీ, దానికి అప్పట్లో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, ఫలితంగా, సెమీకండక్టర్ తయారీలో భారతదేశం వెనుకబడిపోయిందని ఆయన పేర్కొన్నారు.
ఇంధన రంగం కూడా ఇదే విధమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని, ప్రస్తుతం భారతదేశం ఏటా సుమారు 125 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటోందని ప్రధానమంత్రి తెలిపారు. మన దేశానికి పుష్కలంగా సూర్యరశ్మి ఉన్నప్పటికీ, 2014 వరకు భారత సౌరశక్తి ఉత్పత్తి సామర్థ్యం కేవలం మూడు గిగావాట్లు మాత్రమేనని ఆయన చెప్పారు. గత పది సంవత్సరాలలో ఈ సామర్థ్యం సుమారు 130 గిగావాట్లకు పెరిగిందని, అందులో 22 గిగావాట్లు కేవలం రూఫ్‌టాప్ సోలార్ ద్వారానే జత అయిందని ఆయన తెలిపారు.
ఇంధన భద్రత కోసం చేపట్టినన్ పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ప్రచారంలో ప్రభుత్వం ప్రజలకు పౌరులకు ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని కల్పించిందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా వారణాసి పార్లమెంటు సభ్యుడిగా, ఆయన స్థానిక గణాంకాలను ఉదహరించారు, ఈ పథకం కింద వారణాసిలో 26,000 పైగా ఎక్కువ గృహాలు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాయని పేర్కొన్నారు. వీటి ద్వారా ప్రతిరోజూ మూడు లక్షలకు పైగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని, దీనివల్ల ప్రజలకు ప్రతి నెలా దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఆదా అవుతోందని ఆయన చెప్పారు. ఈ సౌర విద్యుత్ ఉత్పత్తి ఏటా సుమారు తొంభై వేల మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందని, లేకపోతే ఆ ప్రభావాన్ని తగ్గించడానికి నలభై లక్షలకు పైగా చెట్లను నాటవలసి ఉంటుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. కేవలం వారణాసి గణాంకాలను మాత్రమే అందిస్తున్నానని, ఈ పథకం వల్ల కలిగే అపారమైన జాతీయ ప్రయోజనం గురించి ఆలోచించాలని ప్రజలను కోరారు. కేవలం ఒకే ఒక్క కార్యక్రమం భవిష్యత్తును మార్చే శక్తిని ఎలా కలిగి ఉంటుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు.
2014 కంటే ముందు భారతదేశం తన మొబైల్ ఫోన్లలో 75 శాతం దిగుమతి చేసుకునేదని, అయితే నేడు మొబైల్ ఫోన్ల దిగుమతులు దాదాపు సున్నాకు పడిపోయాయని, దేశం ఒక ప్రధాన ఎగుమతిదారుగా మారిందని శ్రీ మోదీ ప్రముఖంగా తెలిపారు. 2014 తర్వాత ప్రవేశపెట్టిన ఒక సంస్కరణలో దేశం ఉత్తమ పనితీరును కనబరిచిందని, ఆ మార్పు ఫలితాలను ప్రపంచం ఇప్పుడు చూస్తోందని ఆయన చెప్పారు.
రేపటిని మార్చే ఈ ప్రయాణం అనేక పథకాలు, విధానాలు, నిర్ణయాలు, ప్రజల ఆకాంక్షలు, ప్రజా భాగస్వామ్యంతో కూడిన ప్రయాణమని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఇది నిరంతరాయంగా సాగే ప్రయాణమని, ఏదో ఒక సమావేశంలో చర్చకు మాత్రమే పరిమితం కాదని, ఇది భారతదేశం కోసం ఒక జాతీయ సంకల్పం అని ఆయన ఉద్ఘాటించారు. ఈ సంకల్పంలో ప్రతి ఒక్కరి సహకారం, సామూహిక కృషి అవసరమని స్పష్టం చేస్తూ, ప్రధానమంత్రి చివరిగా మరోసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు
***
(रिलीज़ आईडी: 2200025)
आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Odia
,
Kannada
,
Malayalam