ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
పాస్‌పోర్టు ధ్రువీకరణ రికార్డు ఇక డిజిలాకర్‌లో….
ప్రజల సౌలభ్యం, భద్రతే లక్ష్యం
प्रविष्टि तिथि:
04 DEC 2025 4:19PM by PIB Hyderabad
ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (ఎన్ఈజీడీ) పౌర సేవలను మెరుగుపరిచడంలో భాగంగా ఓ కీలక ప్రకటన చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో.. పాస్‌పోర్ట్ ధ్రువీకరణ రికార్డు (పీవీఆర్)ను డిజిలాకర్ వేదికపై అందుబాటులోకి తెస్తున్నట్టు పేర్కొన్నది. డిజిటల్ పత్రాలు, సర్టిఫికెట్లను జారీ చేయడానికి, భద్రపరచడానికి, పంచుకోవడానికి అవకాశం కల్పించే సురక్షిత, క్లౌడ్ ఆధారిత వేదిక డిజిలాకర్. డిజిటల్ ఇండియాలో భాగంగా దీన్ని అమలు చేస్తున్నారు.
పత్రాల నిర్వహణను ప్రజలకు సులభతరం చేయడం, కాగితపు ధ్రువీకరణ పత్రాలపై ఆధారపడడాన్ని తగ్గించడం ద్వారా.. డిజిటల్ ఇండియా దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో ఈ చర్య కీలక ముందడుగు కానుంది. ఈ ఏకీకరణ ద్వారా.. పాస్‌పోర్టు ధ్రువీకరణ రికార్డులు ఇకపై డిజిలాకర్ వ్యవస్థలో సురక్షితంగా అందుబాటులో ఉంటాయి. వాటిని అందులో భద్రపరచుకోవచ్చు, షేర్ చేయొచ్చు.. అలాగే డిజిలాకర్‌లోనే డిజిటల్‌గా ధ్రువీకరించనూ వచ్చు. భౌతిక పత్రాల అవసరం లేకుండా, నేరుగా కార్యాలయాలకు వెళ్లనవసరం లేకుండా, పౌర కేంద్రీకృత సేవలందించడాన్ని ఇది ప్రోత్సహిస్తుంది.
విజయవంతంగా ధ్రువీకరణ పూర్తయిన అనంతరం.. పౌరులు తమ డిజిలాకర్ ఖాతాలోని ‘ఇష్యూడ్ డాక్యుమెంట్స్’ విభాగంలో తమ పాస్‌పోర్టు ధ్రువీకరణ రికార్డులను పొందవచ్చు. ఈ ఏకీకరణ ప్రజల పత్రాల అధికారిక ధ్రువీకరణలో సౌలభ్యాన్ని పెంచడంతోపాటు దాన్ని మరింత అందుబాటులోకి తెస్తుంది. డిజిలాకర్‌లో వారి రికార్డులు సురక్షితంగా, విశ్వసనీయంగా, డిజిటల్ ధ్రువీకరణకు అనుకూలంగానూ ఉంటాయి.
డిజిలాకర్‌లో పాస్‌పోర్టు ధ్రువీకరణ రికార్డు (పీవీఆర్) అందుబాటులోకి రావడంతో పౌరులకు అనేక ప్రయోజనాలున్నాయి:
-
సౌలభ్యం, అన్ని సమయాల్లో అందుబాటులో: ధ్రువీకరణ విజయవంతంగా పూర్తయిన తర్వాత, పౌరులకు తమ డిజిలాకర్ ఖాతాలోని ‘ఇష్యూడ్ డాక్యుమెంట్స్’ విభాగంలో పాస్‌పోర్ట్ ధ్రువీకరణ రికార్డులు సజావుగా అందుబాటులోకి వస్తాయి. వాటిని తిరిగి పొందడం కూడా సాధ్యపడుతుంది. ఇందుకోసం కాగితపు పత్రాలను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.. వెబ్ పోర్టల్ లేదా మొబైల్ అప్లికేషన్ రెండింటి ద్వారా ఇది అందుబాటులో ఉంటుంది.
-
వేగవంతమైన ప్రక్రియలు, రాతపని తగ్గడం: పాస్‌పోర్టు ధ్రువీకరణ రికార్డు (పీవీఆర్) డిజిటల్‌గా అందుబాటులోకి రావడం.. ప్రయాణం, ఉద్యోగాల వంటి అంశాల్లో ధ్రువీకరణ సంబంధిత ప్రక్రియలనూ, అలాగే నియమ పాలననూ విశేషంగా క్రమబద్ధీకరిస్తుందని భావిస్తున్నారు. తద్వారా రాతపని తగ్గడంతోపాటు.. ప్రజలకూ, ధ్రువీకృత పాస్‌పోర్టు రికార్డులపై ఆధారపడిన సంస్థలకూ సమయం ఆదా అవుతుంది.
-
సురక్షిత, తారుమారు చేయలేని, ప్రామాణిక రికార్డులు: డిజిలాకర్ ద్వారా అందుబాటులో ఉన్న పాస్‌పోర్టు ధ్రువీకరణ రికార్డులు (పీవీఆర్) సంబంధిత ప్రభుత్వ వ్యవస్థల ద్వారా నేరుగా డిజిటల్ రూపంలో జారీ అవుతాయి. డిజిలాకర్ సురక్షిత నిర్మాణానికి అనుగుణంగా.. ప్రామాణికంగా, సమగ్రంగా, తారుమారు చేయలేనివిగా ఉంటాయి.
-
సులభంగా డిజిటల్ షేరింగ్, ధ్రువీకరణ: ఆధీకృత అభ్యర్థనల మేరకు ప్రజలు తమ పాస్‌పోర్టు ధ్రువీకరణ రికార్డులను డిజిలాకర్ ద్వారా డిజిటల్‌గా షేర్ చేసుకోవచ్చు. ఇది తక్షణమే, అంగీకారం మేరకు పత్రాలను అందుబాటులోకి తేవడంతోపాటు ధ్రువీకరణకు అవకాశం కల్పిస్తుంది. ధ్రువీకృత నకలు పత్రాల అవసరాన్ని, అనేకసార్లు నేరుగా వాటిని సమర్పించాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది.
-
రాతపని లేని, పర్యావరణ హిత నిర్వహణకు చేయూత: పాస్‌పోర్టు సంబంధిత ధ్రువీకరణ రికార్డులను పూర్తిస్థాయి డిజిటల్ లావాదేవీగా మార్చడం ద్వారా... ఈ చర్య - రాతపని లేకుండా కార్యకలాపాల నిర్వహణ దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను, వనరుల సమర్థతను, బాధ్యతాయుతమైన పాలన పద్ధతనులను మరింత ముందుకు తీసుకెళ్తుంది.
డిజిలాకరుతో పీవీఆర్ ఏకీకరణ.. పౌర సేవల ఆధునికీకరణలో, భారత డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో కీలక మైలురాయిగా నిలుస్తుంది. సురక్షిత డిజిటల్ రికార్డులను, యూజర్ ఫ్రెండ్లీగా లభ్యతను మిళితం చేయడం ద్వారా.. ‘పౌరుడే ప్రథమం (సిటిజన్ ఫస్ట్)’ విధానాన్ని ఇది పునరుద్ఘాటిస్తోంది. తద్వారా పారదర్శకతను, ప్రభుత్వ ప్రక్రియలపై విశ్వాసాన్ని పెంచుతుంది.
విదేశీ వ్యవహారాల శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్, ఎలక్ట్రానిక్స్- ఐటీ మంత్రిత్వశాఖల మధ్య సహకారం... సురక్షిత, సమర్థ సేవలందించడం కోసం డిజిటల్ వేదికలను సద్వినియోగం చేసుకోవడం లక్ష్యంగా ఏకోన్ముఖ ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేస్తోంది. ధ్రువీకరణను క్రమబద్ధీకరించడం, సేవల్లో సమయపాలనను మెరుగుపరచడం, ప్రభుత్వ, ప్రైవేటు వినియోగ సందర్భాల్లో సురక్షిత డిజిటల్ పత్రాల వినియోగాన్ని మరింత పెంచడం ద్వారా.. ఈ చర్య లక్షలాది మంది పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు, పాస్‌పోర్టు వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 2199150)
आगंतुक पटल : 14