ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు ప్రధాని మీడియా ప్రకటన
प्रविष्टि तिथि:
01 DEC 2025 12:11PM by PIB Hyderabad
నమస్కారం మిత్రులారా!
మీరూ ఈ వాతావరణాన్ని ఆస్వాదించండి.
మిత్రులారా,
పార్లమెంటు శీతాకాల సమావేశం కేవలం లాంఛనప్రాయం మాత్రమే కాదు. దేశం పురోగామి పథంలో దూసుకెళ్లేలా తీసుకుంటున్న చర్యలను ఈ శీతాకాల సమావేశాలు మరింత బలోపేతం చేస్తాయన్నది నా దృఢమైన నమ్మకం. భారత్ నిజంగా ప్రజాస్వామ్యాన్ని బతికించింది. ప్రజాస్వామ్యం పట్ల ప్రజల విశ్వాసం మరింత బలపడేలా.. ప్రజాస్వామ్య స్ఫూర్తి, ఉత్సాహం ఎప్పటికప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికలు, అక్కడ నమోదైన రికార్డు స్థాయి ఓటింగ్ శాతం మన ప్రజాస్వామ్యానికి అతి పెద్ద బలం. తల్లులూ, అక్కాచెల్లెళ్ల భాగస్వామ్యం పెరగడం కొత్త ఆశలను రేకెత్తిస్తోంది, ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. ఒకవైపు ప్రజాస్వామ్యం బలోపేతమవుతోంది.. మరోవైపు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలోనే మన ఆర్థిక వ్యవస్థ శక్తిమంతమవుతుండడాన్ని ప్రపంచం నిశితంగా గమనిస్తోంది. ప్రజాస్వామ్యం విజయాలను సాధించగలదని భారత్ నిరూపించింది. నేడు భారత ఆర్థిక స్థితి కొత్త శిఖరాలకు చేరుకుంటున్న వేగం... మనలో కొత్త విశ్వాసాన్ని నింపడంతోపాటు, ‘వికసిత భారత్’ లక్ష్యం దిశగా పురోగమించేందుకు నవోత్తేజాన్ని అందిస్తోంది.
మిత్రులారా,
దేశం కోసం పార్లమెంటు ఏం ఆలోచిస్తోంది.. దేశం కోసం పార్లమెంటు ఏం చేయాలనుకుంటోంది.. దేశం కోసం పార్లమెంటు ఏం చేయబోతోంది అన్న అంశాలపై ఈ సమావేశంలో దృష్టి పెట్టాలి. ప్రతిపక్షం కూడా తన బాధ్యతను నిర్వర్తించాలి, చర్చల్లో సమస్యలను లేవనెత్తాలి, బలమైన అంశాలను ముందుకు తీసుకురావాలి. ఓటమి నిరాశ నుంచి వారు బయటకు రావాలి.
దురదృష్టవశాత్తు ఒకట్రెండు పార్టీలు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాయి. బీహార్ ఫలితాలు వెలువడి కావాల్సినంత సమయం గడిచింది.. వారు కోలుకుని ఉంటారని నేననుకున్నాను. కానీ నిన్నటి వారి ప్రకటనలు వింటే.. ఓటమి వారినింకా బాధపెడుతున్నట్టు కనిపిస్తోంది. కానీ ఈ శీతాకాల సమావేశాలు ఓటమి నిరాశకు యుద్ధభూమిగా మారకూడదని అన్ని పార్టీలకూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈ శీతాకాల సమావేశాలు విజయ గర్వానికి వేదికగానూ మారకూడదు. దేశ ప్రజలు తమ ప్రతినిధులుగా మనకు అప్పగించిన బాధ్యతలు, వారు మనపై ఉంచిన అంచనాలను దృష్టిలో పెట్టుకుని.. సమతౌల్యంతో, బాధ్యతతో మనం ఆలోచించాలి. ఉన్నదానిని ఎలా మెరుగుపరచాలో, ఏదైనా తప్పు జరుగుతుంటే.. దేశ ప్రజలు కూడా అవగాహన పొందేలా కచ్చితమైన, నిర్మాణాత్మక వ్యాఖ్యలు ఎలా చేయవచ్చో మనం చూడాలి. దీనికి కచ్చితంగా బలమైన కృషి అవసరం. కానీ దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇది తప్పనిసరి.
చాలా కాలంగా నాకున్న అతి పెద్ద ఆందోళన ఏమిటంటే.. అన్ని పార్టీల నుంచీ మొదటిసారి ఎన్నికైన లేదా యువ ఎంపీలు చాలా ఇబ్బంది పడుతూ, విచారంగా ఉండడం. తమ సామర్థ్యాలను ప్రదర్శించడానికి గానీ, తమ నియోజకవర్గాల సమస్యల గురించి మాట్లాడడానికి గానీ వారికి అవకాశం ఇవ్వడం లేదు. తమ అభిప్రాయాలను వ్యక్తపరచడం ద్వారా దేశ అభివృద్ధి ప్రయాణానికి తోడ్పాటు అందించాలని వారు కోరుకుంటున్నారు. కానీ దానికీ అవకాశం దొరకడం లేదు. పార్టీ ఏదైనా.. ఈ యువ, కొత్తగా ఎన్నికైన ఎంపీలకు మనం అవకాశాలివ్వాలి. వారి అనుభవాల నుంచి సభ ప్రయోజనం పొందాలి. ఈ కొత్త తరం అనుభవాలతో.. పార్లమెంటు ద్వారా దేశం కూడా ప్రయోజనం పొందుతుంది. కాబట్టి, ఈ అంశాలను మనం నిశితంగా పరిశీలించాలని నేను అభ్యర్థిస్తున్నాను. నాటకాలాడేందుకు చాలా ప్రదేశాలున్నాయి. నాటకాలే వేయాలనుకునే వారు వేరే ఎక్కడైనా వేయండి. ఇందులో నాటకీయత కాదు, పనితీరు ముఖ్యం. నినాదాలు చేయడానికి దేశంలో చాలా స్థలముంది. ఓడిపోయిన చోట మీరిప్పటికే అరిచారు. త్వరలో మీరు ఓడిపోబోయే చోట కూడా అరవొచ్చు. కానీ ఇక్కడ మనం నినాదాలకు కాదు, విధానాలకు ప్రాధాన్యమివ్వాలి. అదే మీ ఉద్దేశం అయి ఉండాలి.
మిత్రులారా,
రాజకీయాల్లో ప్రతికూలత కొంతవరకు ఉపయోగపడే అవకాశముంది. కానీ అంతిమంగా.. దేశ పురోగతి దిశగా కొంత సానుకూల ఆలోచన కూడా ఉండి తీరాలి. ప్రతికూలతను పరిమితుల్లోనే ఉంచి, దేశ పురోగతిపై శ్రద్ధ పెట్టాలని నేను ఆశిస్తున్నాను.
మిత్రులారా,
గౌరవనీయులైన మన కొత్త చైర్‌పర్సన్ నేటి నుంచి మన ఎగువ సభకు మార్గనిర్దేశం చేయడం ప్రారంభిస్తారు. ఈ విధంగానూ ఈ శీతాకాల సమావేశాలు చాలా ముఖ్యమైనవి. ఆయనకు నా శుభాకాంక్షలు.
మిత్రులారా,
జిఎస్టి సంస్కరణలు తదుపరి తరం సంస్కరణల కోసం ప్రజలలో నమ్మకమైన వాతావరణాన్ని సృష్టించాయి. ఆ దిశగా అనేక ముఖ్యమైన చర్యలను కూడా ఈ సమావేశాల్లో తీసుకుంటాం. మన మీడియా మిత్రులు కొందరు విశ్లేషించవచ్చు... కొంతకాలంగా మన పార్లమెంటును ఎన్నికలకు సన్నాహక వేదికగానో, లేదా ఓటమి తర్వాత నిరాశను వ్యక్తపరిచే వేదికగానో ఉపయోగించుకుంటూ ఉండడాన్ని వారు గమనించవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎంతగా ఉందంటే.. అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులు ప్రజల మధ్యకు వెళ్లలేకపోతున్నారు, వారితో మాట్లాడలేకపోతున్నారు. అందుకే వాళ్లు పార్లమెంటుకు వచ్చి తమ కోపాన్నంతా ఇక్కడే ప్రదర్శిస్తారు. కొన్ని పార్టీలు తమ రాష్ట్ర స్థాయి రాజకీయాల కోసం పార్లమెంటును ఉపయోగించుకునే కొత్త సంప్రదాయాన్ని మొదలుపెట్టాయి. గత పదేళ్లుగా ఈ పద్ధతులను దేశం అంగీకరించలేదన్న వాస్తవాన్ని వారు గుర్తించాలి. వారు ఇప్పుడు తమ విధానాన్ని మార్చుకోవాలి.. వ్యూహాన్ని మార్చుకోవాలి. వారెలా పనిచేయాలో చిట్కాలివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ కనీసం ఎంపీల హక్కులను హరించకండి. ఎంపీలకు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే అవకాశమివ్వండి. మీ నిరాశకు, మీ ఓటమికి ఎంపీలను బాధితులుగా మార్చకండి. ఈ బాధ్యతలను గుర్తెరిగి మనమందరం ముందుకు సాగాలని నేను ఆశిస్తున్నాను. అయితే, దేశం అభివృద్ధి పథంలో పయనించడం మొదలుపెట్టిందని నేను దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాను. కొత్త శిఖరాలను అధిరోహించే దిశగా దేశం పురోగమిస్తోంది. ఈ సభ కూడా ఆ ప్రయాణంలో జవసత్వాలను నింపుతుంది. ఈ నమ్మకంతో.. మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు.
(रिलीज़ आईडी: 2197367)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam