ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్తగలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 28 NOV 2025 7:14PM by PIB Hyderabad

పార్తగలి జీవోత్తమ్ మఠం భక్తులు, అనుచరులందరికీ శుభాకాంక్షలు!

శ్రీ సంస్థాన్ గోకర్ణ్ పార్తగలి జీవోత్తమ్ మఠానికి చెందిన 24వ మహంత్ శ్రీమద్ విద్యాధీశ్ తీర్థ స్వామీజీ, గౌరవనీయ గవర్నర్ శ్రీ అశోక గజపతి రాజు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి... సోదరులు ప్రమోద్ సావంత్ గారు, మఠం కమిటీ చైర్‌పర్సన్ శ్రీ శ్రీనివాస్ డెంపో గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఆర్.ఆర్. కామత్ గారు, కేంద్ర మంత్రివర్గ సహచరులు శ్రీ శ్రీపాద్ నాయక్ గారు, దిగంబర్ కామత్ గారు, ఇతర విశిష్ట అతిథులు, సోదరీ సోదరులారా,

ఈ రోజు ఈ పవిత్ర సందర్భంలో నా మనసు శాంతితో నిండిపోయింది. సాధువులు, మహర్షుల సమక్షంలో కూర్చోవడం ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు ఉండటం శతాబ్దాల నాటి ఈ మఠం శక్తిని మరింత బలోపేతం చేస్తుంది. ఈ వేడుకలో మీ మధ్య ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి రాకముందు, రామాలయం... వీర్ విఠల్ ఆలయాల్లో పూజలో పాల్గొనే భాగ్యం నాకు లభించింది. ఇక్కడి శాంతి, ప్రశాంత వాతావరణం ఈ వేడుక ఆధ్యాత్మిక సారాన్ని మరింతగా పెంచాయి.

మిత్రులారా,

శ్రీ సంస్థాన్ గోకర్ణ్ పార్తగలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటోంది. ఇది చరిత్రాత్మక సందర్భం. గత 550 సంవత్సరాల్లో ఈ సంస్థ అనేక విపత్కర పరిస్థితులను తట్టుకుని నిలిచింది. యుగాలు మారాయి... కాలం మారింది... దేశంలో, సమాజంలో అనేక పరివర్తనలు వచ్చాయి... మారుతున్న కాలాలు, సవాళ్ల మధ్య ఈ మఠం ఎప్పుడూ తన దిశను కోల్పోలేదు. బదులుగా ఇది ప్రజలకు మార్గదర్శక కేంద్రంగా ఆవిర్భవించింది... అదే ఈ మఠం గొప్ప గుర్తింపు. చరిత్రలో పాతుకుపోయిన ఈ మఠం కాలంతో పాటు ముందుకు సాగుతూనే ఉంది. ఈ మఠం స్థాపించిన స్ఫూర్తి నేటికీ సమానంగా సజీవంగా ఉంది. ఈ స్ఫూర్తి... తపస్సును సేవతో, సాంప్రదాయాన్ని ప్రజా సంక్షేమంతో అనుసంధానిస్తుంది. తరతరాలుగా, ఆధ్యాత్మికత నిజమైన ఉద్దేశం జీవితానికి స్థిరత్వం, సమతుల్యత, విలువలను అందించడమేనని ఈ మఠం సమాజానికి తెలియజేసింది. ఈ మఠం 550 సంవత్సరాల ప్రయాణంలోని కష్ట సమయాల్లోనూ సమాజాన్ని నిలబెట్టే బలానికి నిదర్శనంగా నిలిచింది. ఈ చరిత్రాత్మక సందర్భంలో మఠాధిపతి శ్రీమద్ విద్యాధీశ్ తీర్థ స్వామీజీకి, కమిటీ సభ్యులందరికీ, ఈ కార్యక్రమంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ఒక సంస్థ సత్యం, సేవపై నిర్మితమైనప్పుడు అది మారుతున్న కాలంలో తడబడదు. అది సమాజానికి తట్టుకుని నిలబడే శక్తిని ఇస్తుంది. ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ రోజు ఈ మఠం కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. ఇక్కడ భగవాన్ శ్రీరాముని 77 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించారు. కేవలం మూడు రోజుల కిందటే అయోధ్యలోని శ్రీరాముని ఆలయంపై ధర్మ ధ్వజాన్ని ఎగురవేసే భాగ్యం నాకు లభించింది. ఈ రోజు ఇక్కడ శ్రీరాముని ఈ అద్భుతమైన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశమూ నాకు లభించింది. రామాయణం ఆధారంగా ఒక థీమ్ పార్క్ కూడా ఈ రోజు ప్రారంభమైంది.

మిత్రులారా,

ఈ మఠంతో ముడిపడి ఉన్న కొత్త కోణాలు భవిష్యత్ తరాలకు జ్ఞానం, ప్రేరణ, ఆధ్యాత్మిక సాధనలకు శాశ్వత కేంద్రాలుగా మారబోతున్నాయి. ఇక్కడ అభివృద్ధి చేస్తున్న మ్యూజియం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 3డీ థియేటర్ ద్వారా మఠం తన సంప్రదాయాన్ని కాపాడుకుంటూ, కొత్త తరాన్ని దానితో అనుసంధానిస్తోంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తుల భాగస్వామ్యంతో 550 రోజులకు పైగా నిర్వహించిన శ్రీ రామ నామ జప యజ్ఞం, దానితో పాటు జరిగిన రామ రథయాత్ర మన సమాజంలో భక్తి, క్రమశిక్షణల సామూహిక శక్తికి చిహ్నాలుగా మారాయి. ఈ సామూహిక శక్తి నేడు దేశంలోని ప్రతి మూలలో కొత్త చైతన్యాన్ని మేల్కొల్పుతోంది.

మిత్రులారా,

ఆధ్యాత్మికతను ఆధునిక సాంకేతికతతో అనుసంధానించే వ్యవస్థలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఈ అద్భుత సృష్టి కోసం మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజు జరిగిన ఈ గొప్ప వేడుకకు చిహ్నాలుగా స్మారక నాణేలు, పోస్టల్ స్టాంపులనూ విడుదల చేశాం. శతాబ్దాలుగా సమాజాన్ని ఐక్యంగా ఉంచిన ఆ ఆధ్యాత్మిక శక్తికి ఈ గౌరవాలను అంకితం చేశాం.

మిత్రులారా,

శ్రీ మఠం వారసత్వ నిరంతర ప్రవాహం... ద్వైత వేదాంత దైవిక పునాదిని స్థాపించిన గొప్ప గురు సంప్రదాయం నుంచే వచ్చింది. 1475లో శ్రీమద్ నారాయణ్ తీర్థ స్వామీజీ స్థాపించిన ఈ మఠం... జ్ఞాన సంప్రదాయానికి కొనసాగింపు. దాని అసలు మూలం జగద్గురు శ్రీ మధ్వాచార్యులు తప్ప మరెవరో కాదు. ఈ గొప్ప ఆచార్యుల పాదాలకు నేను భక్తితో తల వంచి నమస్కరిస్తున్నాను. ఉడిపి, పార్తగలి మఠాలు రెండూ ఒకే ఆధ్యాత్మిక నది శక్తిమంతమైన ప్రవాహాలు కావడం చాలా గమనార్హం. భారత పశ్చిమ తీర సాంస్కృతిక ప్రవాహాన్ని రూపొందించిన మార్గదర్శక గురు-శక్తి ఒకటే. ఈ రోజున ఈ పవిత్ర సాంప్రదాయంతో అనుసంధానించిన రెండు కార్యక్రమాల్లోనూ భాగమయ్యే భాగ్యం నాకు లభించడం ఒక ప్రత్యేక యాదృచ్చికం.

మిత్రులారా,

ఈ సాంప్రదాయంతో ముడిపడి ఉన్న కుటుంబాలు తరతరాలుగా క్రమశిక్షణ, జ్ఞానం, కృషి, శ్రేష్ఠతను తమ జీవితాలకు పునాదిగా చేసుకున్నందుకు మనమంతా గర్విస్తున్నాం. వాణిజ్యం నుంచి ఆర్థికం వరకు, విద్య నుంచి సాంకేతికత వరకు, వారిలో కనిపించే ప్రతిభ, నాయకత్వం, పని-నీతి ఈ జీవిత-తత్వపు లోతైన ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ సాంప్రదాయంతో అనుసంధానమైన వ్యక్తులు, కుటుంబాలకు చెందిన లెక్కలేనన్ని స్ఫూర్తిదాయక విజయ గాథలు ఉన్నాయి. వారి విజయాలన్నింటి మూలంలో వినయం, విలువలు, సేవా స్ఫూర్తి ఉన్నాయి. ఈ విలువలను పరిరక్షించే మూలస్తంభంగా ఈ మఠం పనిచేసింది. భవిష్యత్తులోనూ ఇది భావి తరాలను అదే విధంగా శక్తిమంతం చేస్తూ ఉంటుందని మేం విశ్వసిస్తున్నాం.

మిత్రులారా,

ఈ చరిత్రాత్మక మఠం మరో ప్రత్యేక అంశాన్ని ఈ రోజు ప్రస్తావించడం చాలా ముఖ్యం. శతాబ్దాలుగా సమాజంలోని ప్రతి వర్గానికీ మద్దతునిచ్చిన సేవా స్ఫూర్తి దాని గొప్ప గుర్తింపుల్లో ఒకటి. శతాబ్దాల కిందట ఈ ప్రాంతం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి కొత్త దేశాల్లో ఆశ్రయం పొందవలసి వచ్చినప్పుడు, ఈ మఠం వారికి అండగా నిలిచింది. ఇది సమాజాన్ని వ్యవస్థీకరించింది. కొత్త ప్రదేశాల్లో దేవాలయాలు, మఠాలు, ఆశ్రయాలను స్థాపించడంలో సహాయపడింది. ఈ మఠం మతాన్ని మాత్రమే కాకుండా... మానవత్వాన్ని, సంస్కృతినీ రక్షించింది. కాలక్రమేణా ఈ సేవా ప్రవాహం మరింత విస్తరించింది. విద్య నుంచి వసతి గృహాల వరకు... వృద్ధుల సంరక్షణ నుంచి పేద కుటుంబాలకు అండగా నిలవడం వరకు... మఠం ఎల్లప్పుడూ తన వనరులను ప్రజా సంక్షేమానికి అంకితం చేసింది. వివిధ రాష్ట్రాల్లో నిర్మించిన వసతి గృహాలు, ఆధునిక పాఠశాలలు, కష్ట సమయాల్లో అందించే సహాయ చర్యలు.... ఇలా ప్రతి కార్యక్రమం ఆధ్యాత్మికత, సేవల సమ్మిళితత్వంతో సమాజం స్థిరత్వం, పురోగతి ప్రేరణ రెండింటినీ పొందుతుందనే వాస్తవానికి నిదర్శనంగా నిలుస్తుంది.

మిత్రులారా,

భాష, సాంస్కృతిక గుర్తింపుపై ఒత్తిడి తలెత్తినప్పుడు గోవా దేవాలయాలు, స్థానిక సాంప్రదాయాలు గొప్ప సవాళ్లను ఎదుర్కొన్న సందర్భాలూ ఉన్నాయి. ఈ పరిస్థితులు సమాజం ఆత్మను బలహీనపరచలేకపోయాయి. బదులుగా అవి దానిని మరింత బలోపేతం చేశాయి. ప్రతి మార్పు ద్వారా దాని సంస్కృతి తన ప్రధాన గుర్తింపును కాపాడుకుంది... కాలక్రమేణా తనను తాను పునరుజ్జీవింపజేసుకుంది... ఇదే గోవా ప్రత్యేక బలం. పార్తగలి మఠం వంటి సంస్థలు ఈ పునరుజ్జీవనంలో కీలక పాత్ర పోషించాయి.

మిత్రులారా,

భారత్ ఈ రోజు అసాధారణమైన సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని చూస్తోంది. అయోధ్యలో రామాలయ పునర్నిర్మాణం, కాశీ విశ్వనాథ్ ధామ్ గొప్ప పునరాభివృద్ధి, ఉజ్జయినిలో మహాకాళ్ మహాలోక్ విస్తరణ మన దేశ మేల్కొలుపును ప్రతిబింబిస్తాయి. ఇది దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని కొత్త శక్తితో పునరుజ్జీవింపజేస్తుంది. రామాయణ సర్క్యూట్, కృష్ణ సర్క్యూట్, గయాజీలలో అభివృద్ధి పనులు, కుంభమేళా అపూర్వ నిర్వహణ వంటి ఉదాహరణలు నేటి భారత్ తన సాంస్కృతిక గుర్తింపును... పునరుద్ధరించిన సంకల్పం, ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపిస్తుందని చూపిస్తున్నాయి. ఈ మేల్కొలుపు భవిష్యత్ తరాలను వారి మూలాలతో అనుసంధానించడానికి ప్రేరేపిస్తుంది.

మిత్రులారా,

గోవా పవిత్ర భూమికి సొంతంగా ప్రత్యేకమైన ఆధ్యాత్మిక గుర్తింపు ఉంది. శతాబ్దాలుగా భక్తి, సాధు సాంప్రదాయాలు, సాంస్కృతిక క్రమశిక్షణల నిరంతర ప్రవాహం ఈ ప్రాంతాన్ని సుసంపన్నం చేసింది. దాని సహజ సౌందర్యంతో పాటు... ఈ భూమి 'దక్షిణ కాశీ' గా గుర్తింపు పొందింది. పార్తగలి మఠం ఈ గుర్తింపును మరింత బలోపేతం చేసింది. ఈ మఠం ప్రభావం కొంకణ్, గోవాకే పరిమితం కాలేదు. దాని సాంప్రదాయం కాశీ పవిత్ర భూమితో సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు అనుసంధానమై ఉంది. కాశీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఇది నాకు మరింత గర్వాన్ని తెస్తుంది. ఉత్తర భారతంలో తన ప్రయాణాల సమయంలో మఠం వ్యవస్థాపకులు ఆచార్య శ్రీ నారాయణ్ తీర్థులు కాశీలో ఒక కేంద్రాన్నీ స్థాపించారు. ఇది ఈ మఠం ఆధ్యాత్మిక ప్రవాహాన్ని దక్షిణం నుంచి ఉత్తరం వరకు విస్తరించింది. నేటికీ కాశీలో ఆయన స్థాపించిన కేంద్రం సామాజిక సేవకు మాధ్యమంగా పనిచేస్తోంది.

మిత్రులారా,

ఈ పవిత్ర మఠం 550 సంవత్సరాలు పూర్తి చేసుకొంటున్న ఈ రోజున మనం చరిత్రను వేడుకలా జరుపుకొంటూనే భవిష్యత్తు దిశనూ రూపొందిస్తున్నాం. 'వికసిత్ భారత్' మార్గం ఐక్యత ద్వారా సాగుతుంది. సమాజం కలిసి వచ్చినప్పుడు... ప్రతి ప్రాంతం, ప్రతి విభాగం కలిసి ఒక్కటిగా నిలిచినప్పుడు మాత్రమే ఒక దేశం గొప్ప ముందడుగు వేస్తుంది. శ్రీ సంస్థాన్ గోకర్ణ్ పార్తగలి  జీవోత్తమ్ మఠం ప్రాథమిక లక్ష్యం ప్రజలను ఏకం చేయడం... మనస్సులను ఏకం చేయడం... సాంప్రదాయం, ఆధునికత మధ్య వారధిని నిర్మించడం. అందుకే, ఈ మఠం 'వికసిత్ భారత్' దిశగా దేశ ప్రయాణంలో ప్రధాన ప్రేరణ కేంద్రంగానూ తన పాత్రను పోషిస్తోంది.

మిత్రులారా,

నాకు ఎవరిమీదైనా ప్రేమ కలిగినప్పుడు... నేను గౌరవంగా కొన్ని అభ్యర్థనలు చేస్తాను. పూజ్య స్వామీజీ నాకు ఏకాదశిని ఆచరించే పనిని ఇచ్చారు. ఆయన ఒక సాధువు. సాధారణంగా సాధువులు ఒక అభ్యర్థనతో ఏకీభవిస్తారు. కానీ నేను ఒకదానితో మాత్రమే ఏకీభవించే వ్యక్తిని కాదు. నేను ఇప్పుడు మీ మధ్య ఉన్న సమయంలో నా మనస్సులో సహజంగానే కొన్ని ఆలోచనలు తలెత్తుతాయి, వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీ సంస్థ ద్వారా ప్రజలకు చేరవేయగల 9 అభ్యర్థనలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఈ 9 అభ్యర్థనలు 9 తీర్మానాల వంటివి. పర్యావరణాన్ని పరిరక్షించడం మన పవిత్ర కర్తవ్యంగా భావించినప్పుడే 'వికసిత్ భారత్' కల నెరవేరుతుంది. భూమి మన తల్లి, మన మఠం బోధనలు ప్రకృతిని గౌరవించాలని మనకు సూచిస్తాయి. కాబట్టి మన మొదటి సంకల్పం నీటిని సంరక్షించడం, నీటిని ఆదా చేయడం, మన నదులను కాపాడుకోవడం. మన రెండో సంకల్పం చెట్లను నాటడం. "ఏక్ పేడ్ మా కే నామ్" (తల్లి పేరు మీద ఒక చెట్టు) అనే దేశవ్యాప్త ప్రచారం ఊపందుకుంది. మీ సంస్థ ఈ ప్రచారానికి తన బలాన్ని జోడిస్తే దాని ప్రభావం మరింత విస్తృతమవుతుంది. మా మూడో సంకల్పం పరిశుభ్రత కోసం ఒక లక్ష్యం కావాలి. ఈ రోజు నేను ఆలయ ప్రాంగణాన్ని సందర్శించినప్పుడు దాని అమరిక, వాస్తుశిల్ప కళా సౌందర్యం, పరిశుభ్రత నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ప్రతిదీ ఎంత అద్భుతంగా ఉందో స్వామీజీకి కూడా చెప్పాను. ప్రతి వీధి, పొరుగు ప్రాంతం, నగరం శుభ్రంగా ఉండాలి. మన నాల్గో సంకల్పంగా మనం స్వదేశీ (స్థానిక ఉత్పత్తులు) స్వీకరించాలి. ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ మంత్రంతో భారత్ ముందుకు సాగుతోంది. దేశం "స్థానికత కోసం గళం వినిపించాలి, స్థానికత కోసం గళం వినిపించాలి, స్థానికత కోసం గళం వినిపించాలి, స్థానికత కోసం గళం వినిపించాలి" అని చెబుతోంది. మనం అదే సంకల్పంతో ముందుకు సాగాలి.

మిత్రులారా,

మన ఐదో సంకల్పం దేశ దర్శన్. మన దేశంలోని వివిధ ప్రాంతాలను అన్వేషించడానికి, అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. మన ఆరో సంకల్పంలో భాగంగా సేంద్రియ వ్యవసాయాన్ని మన జీవితంలో భాగంగా చేసుకోవాలి. మన ఏడో సంకల్పం ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం. మనం శ్రీ అన్న చిరుధాన్యాలను స్వీకరించాలి... మన ఆహారంలో వినియోగించే నూనె మొత్తాన్ని 10 శాతం తగ్గించాలి. మన ఎనిమిదో సంకల్పంగా మనం యోగా, క్రీడలను స్వీకరించాలి. మన తొమ్మిదో సంకల్పంగా పేదలకు ఏదో ఒక విధంగా సహాయం చేయాలి. మనలో ప్రతి ఒక్కరూ ఒక కుటుంబాన్ని దత్తత తీసుకున్నా... మన కళ్ళ ముందే భారత భవిష్యత్తు ఎలా మారుతుందో మీరు చూస్తారు.

మిత్రులారా,

మన మఠం ఈ తీర్మానాలను ప్రజల తీర్మానాలుగా మార్చగలదు. ఈ మఠం 550 సంవత్సరాల అనుభవం... సాంప్రదాయం సజీవంగా ఉన్నప్పుడే సమాజం పురోగమిస్తుందనే సత్యాన్ని మనకు బోధిస్తుంది. సాంప్రదాయం కాలక్రమేణా తన బాధ్యతలను విస్తరించినప్పుడు మాత్రమే అది సజీవంగా ఉంటుంది. ఈ మఠం 550 సంవత్సరాలుగా సమాజానికి ఏవిధమైన సహకారాన్ని అందిస్తూ ఉందో... ఇప్పుడు అదే శక్తిని భవిష్యత్ భారత నిర్మాణానికి అంకితం చేయాలి.

మిత్రులారా,

ఈ గోవా భూమి ఆధ్యాత్మిక వైభవం ఎంత ప్రత్యేకమైనది... ఆకట్టుకునే దాని ఆధునిక అభివృద్ధీ అంతే ప్రత్యేకమైనది. అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాల్లో గోవా ఒకటి. ఇది దేశ పర్యాటక, ఔషధ, సేవా రంగాలకు గణనీయమైన సహకారాన్ని అందిస్తుంది. ఇటీవలి సంవత్సరాల్లో గోవా విద్య, ఆరోగ్య రంగంలో అద్భుత విజయాలను సాధించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇక్కడి మౌలిక సదుపాయాలను ఆధునికీకరిస్తున్నాయి. రహదారులు, విమానాశ్రయాలు, రైలు కనెక్టివిటీ విస్తరణతో భక్తులు, పర్యాటకులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారింది. 2047 నాటికి 'వికసిత్ భారత్' సాధించాలనే మన జాతీయ దార్శనికతకు పర్యాటకం ఒక మూల స్తంభం... గోవా దానికి గొప్ప ఉదాహరణ.

మిత్రులారా,

భారత్ ప్రస్తుతం ఒక నిర్ణయాత్మక యుగం మార్గంలో ముందుకు సాగుతోంది. మన యువ శక్తి, పెరుగుతున్న మన ఆత్మవిశ్వాసం, సాంస్కృతిక మూలాల పట్ల మన ప్రాధాన్యం... ఒక కొత్త భారతాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఆధ్యాత్మికత, దేశ సేవ, అభివృద్ధి కలిసి పురోగమించినప్పుడే 'వికసిత్ భారత్'ను నిర్మించాలనే మన సంకల్పం నెరవేరుతుంది. ఈ గోవా భూమి, ఈ మఠం ఆ దిశలో గణనీయ కృషి చేస్తున్నాయి. ఈ రోజు పూజ్య స్వామీజీ నా గురించి చాలా విషయాలు చెప్పారు. అనేక విజయాలకు ఆయన నాకు ఘనత ఇచ్చారు. ఆయన వ్యక్తం చేసిన భావాలకు నేను ఆయనకు చాలా కృతజ్ఞుడను. కానీ నిజం ఏమిటంటే... మీరు ఏది మంచిదని భావిస్తారో అది మోదీ వల్ల మాత్రమే సాధ్యం కాదు. ఇది 140 కోట్ల మంది భారతీయుల సంకల్పం, కృషి ఫలితంగానే సాధ్యమైంది. అందుకే మనం సానుకూల ఫలితాలను చూస్తున్నాం. మన దేశంలోని 140 కోట్ల మంది ప్రజలపై నాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఇంకా చాలా వస్తాయి. మీరు చెప్పినట్లుగా గోవా చాలా ముఖ్యమైన పాత్ర పోషించిన అనేక దశలు నా జీవితంలో ఉన్నాయి. అది ఎలా జరిగిందో నేను చెప్పలేను... కానీ ప్రతి మలుపులోనూ ఈ గోవా భూమి నన్ను ముందుకు నడిపించిందనేది నిజం. ఆ పూజ్యనీయ సాధువు ఆశీస్సులకు నేను ఆయనకు ఎంతో కృతజ్ఞుడను. ఈ పవిత్ర సందర్భంలో మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా ధన్యవాదాలు.

 

***


(रिलीज़ आईडी: 2196703) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Gujarati , Odia , Kannada