రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

సంవిధాన్ సదన్‌లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు హాజరైన భారత రాష్ట్రపతి వలసవాద ఆలోచనలు వీడి, జాతీయవాద దృక్పథంతో దేశాన్ని ముందుకు నడిపించే మార్గదర్శక గ్రంథమే రాజ్యాంగం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము


సమగ్ర దృష్టితో రూపొందించిన రాజ్యాంగ విలువలే మన పరిపాలనా వ్యవస్థకు దిశా నిర్దేశం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి ధర్మకర్తలు, సృష్టికర్తలు, సాక్షులు పార్లమెంటు సభ్యులు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Posted On: 26 NOV 2025 1:44PM by PIB Hyderabad

ఇవాళ (నవంబర్ 26, 2025) న్యూఢిల్లీలో సంవిధాన్ సదన్ లోని సెంట్రల్ హాలులో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు.

 

 

ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్రపతి, 2015లో డాక్టర్ బాబాసాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్బంగా ఏటా నవంబర్, 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నిర్ణయం అర్థవంతమైనదని నిరూపితమైందన్నారు. ఈరోజున భారత ప్రజాస్వామ్యానికి పునాది అయిన రాజ్యాంగం, దాని రూపకర్తల పట్ల దేశం మొత్తం గౌరవాన్ని తెలియజేస్తుందని వ్యాఖ్యానించారు. 'భారతదేశ పౌరులమైన మనం' వ్యక్తిగతంగానూ, సమిష్టిగానూ మన రాజ్యాంగంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నామన్నారు. పలు కార్యక్రమాల ద్వారా పౌరులకు, ముఖ్యంగా యువతకు రాజ్యాంగ ఆశయాలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రారంభించి, ఈ సంప్రదాయాన్ని కొనసాగించటమనేది ప్రశంసించదగినదని తెలిపారు.

 

 

పార్లమెంటరీ వ్యవస్థను స్వీకరించేందుకు రాజ్యాంగ పరిషత్ లో వినిపించిన బలమైన వాదనలు నేటికీ ఉపయోగకరంగా ఉన్నాయని రాష్ట్రపతి అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ద్వారా ప్రజా ఆకాంక్షలను వ్యక్తపరిచే భారత పార్లమెంటు, ప్రపంచవ్యాప్తంగా నేడు అనేక ప్రజాస్వామ్య దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు.

 

 

రాజ్యాంగ ఆత్మను తెలియజేసే ఆదర్శాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం అని రాష్ట్రపతి అన్నారు. ఈ అంశాల్లో రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను పార్లమెంటు సభ్యులు వాస్తవ రూపంలోకి తీసుకువచ్చినందుకు తాను సంతోషిస్తున్నట్లు వెల్లడించారు. మన పార్లమెంటరీ వ్యవస్థ విజయానికి స్పష్టమైన నిదర్శనంగా, నేడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అభివృద్ధి చెందుతోందన్నారు. 250 మిలియన్ల ప్రజలు పేదరికం నుంచి బయటపడటంతో ఆర్థిక న్యాయం విషయంలో ప్రపంచంలోనే గొప్ప విజయాల్లో ఒకదాన్ని భారత్ సాధించిందని వెల్లడించారు.

 

 

మన రాజ్యాంగం జాతీయ గౌరవానికి రాతప్రతి. జాతీయ గుర్తింపునకు గ్రంథం. వలసవాద ఆలోచనలు వీడి, జాతీయవాద దృక్పథంతో దేశాన్ని ముందుకు నడిపించే మార్గదర్శక గ్రంథం మన రాజ్యాంగమని రాష్ట్రపతి అన్నారు. ఈ స్ఫూర్తితో సామాజిక, సాంకేతిక పరిణామాలను దృష్టిలో పెట్టుకుని, నేర న్యాయ వ్యవస్థకు సంబంధించిన కీలక చట్టాలను అమలు చేశారని చెప్పారు. శిక్షించడం కంటే న్యాయం చేయాలి అనే స్ఫూర్తి ఆధారంగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌లను అమలు చేశారని తెలిపారు.

 

 

ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించే మన పార్లమెంటరీ వ్యవస్థ, పలు కోణాల్లో బలోపేతం అయిందని రాష్ట్రపతి వెల్లడించారు. వయోజన ఓటు హక్కు ద్వారా ప్రజా విజ్ఞతపై మన రాజ్యాంగం పెట్టుకున్న నమ్మకంతో సాధించిన విజయాన్ని మరెన్నో దేశాలు ప్రశంసిస్తున్నాయని తెలిపారు. కొన్నేళ్లుగా మహిళా ఓటింగ్ శాతం పెరగటం మన ప్రజాస్వామ్య చైతన్యానికి ప్రత్యేక సామాజిక సంకేతమన్నారు. మహిళలు, యువత, పేదలు, షెడ్యూల్డ్ కులాల, తెగల ప్రజలు.. మధ్య తరగతి, అభివృద్ధి చెందుతున్న మధ్య తరగతి ప్రజలు మన ప్రజాస్వామ్య వ్యవస్థను పంచాయతీ నుంచి పార్లమెంట్ స్థాయి వరకు బలోపేతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

సమగ్ర దృష్టితో రూపొందించిన రాజ్యాంగ విలువలే మన పరిపాలనా వ్యవస్థకు దిశా నిర్దేశం చేస్తాయని రాష్ట్రపతి అన్నారు. రాజ్యాంగంలో పొందుపరచిన ఆదేశిక సూత్రాలు మన పాలనా వ్యవస్థకు మార్గదర్శకత్వం చేస్తాయన్నారు. 'మనం సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని రక్షించటం, పరిరక్షించటం, దాన్ని సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా చేయటమనేది రాజ్యాంగాన్ని అమలు చేసే వారిపైనే ఆధారపడి ఉంటుంది' అని రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చెప్పారని వెల్లడించారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆశయాలకు అనుగుణంగా జాతీయ ప్రయోజనాల కోసం మన పార్లమెంట్ పని చేసిందని, సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేసిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

రాజ్యాంగ వ్యవస్థకు అనుగుణంగా మన దేశం ముందుకు సాగటం ద్వారా కార్యనిర్వహక వ్యవస్థ, శాసనసభ, న్యాయ వ్యవస్థ దేశాభివృద్ధిని బలోపేతం చేశాయని రాష్ట్రపతి అన్నారు. తద్వారా ప్రజల జీవితాలకు స్థిరత్వం, మద్దతు అందాయని తెలిపారు. పార్లమెంటు ఉభయసభల సభ్యులు మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లటమే కాక, కీలకమైన రాజకీయ ఆలోచనతో ఆరోగ్యకరమైన సంప్రదాయాన్ని కూడా అభివృద్ధి చేశారని చెప్పారు. రాబోయే రోజుల్లో వివిధ ప్రజాస్వామ్యాలు, రాజ్యాంగాలపై తులనాత్మక అధ్యయనాలు జరిగినప్పుడు భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అమూల్యమైనవని భావిస్తారని తెలిపారు.

మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి ధర్మకర్తలు, సృష్టికర్తలు, సాక్షులు పార్లమెంటు సభ్యులని రాష్ట్రపతి అన్నారు. పార్లమెంటు మార్గదర్శకత్వంలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ని తీర్చిదిద్దాలనే సంకల్పం నెరవేరుతుందని ఆమె విశ్వాసం వ్యక్తపరిచారు.

Please click here to see the President's Speech in English

Please click here to see the President's Speech in Hindi


(Release ID: 2195076) Visitor Counter : 3