ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

మహారాష్ట్ర, గుజరాత్‌లలోని 4 జిల్లాల పరిధిలో ఉండే రెండు రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్ట్‌లకు ఆమోదం తెలిపిన క్యాబినెట్


భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్‌ను సుమారు 224 కిలోమీటర్లు పెంచనున్న ఈ ప్రాజెక్టులు

ఈ ప్రాజెక్ట్‌ల మొత్తం అంచనా వ్యయం రూ. 2781 కోట్లు

Posted On: 26 NOV 2025 4:17PM by PIB Hyderabad

సుమారు రూ. 2781 కోట్ల వ్యయంతో కూడిన రెండు రైల్వే ప్రాజెక్టులకు ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. 

ఈ ప్రాజెక్టులు:
అ. దేవభూమి ద్వారక (ఓఖా) – కనలుస్ డబ్లింగ్ : 141 కి.మీ
ఆ. బద్లాపూర్ – కర్జాత్ 3వ, 4వ మార్గం: 32 కి.మీ

ఈ మార్గాల్లో సామర్థ్యం పెరగటం వల్ల ప్రయాణ సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడుతాయి. ఫలితంగా భారతీయ రైల్వేలకు మెరుగైన నిర్వహణ సామర్థ్యం, సేవల విశ్వసనీయత లభిస్తుంది. కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు, రద్దీని తగ్గించడానికి ఈ మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులు ఉపయోగపడుతాయి. ఈ ప్రాజెక్ట్‌లు 'నవ భారత్‌' అనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఉన్నాయి. ఇవి ఈ ప్రాంత ప్రజలకు సమగ్ర అభివృద్ధిని అందించటం ద్వారా ఆత్మనిర్భరతను చేకూర్చి వారి ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను పెంచుతాయి.

ఈ ప్రాజెక్ట్‌లను పీఎం-గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ప్రణాళిక చేశారు. సమగ్ర ప్రణాళిక, భాగస్వాముల సంప్రదింపుల ద్వారా బహుళ నమూనా అనుసంధానత, రవాణా సామర్థ్యాన్ని పెంచడంపై ఇది దృష్టి పెడుతుంది. ఈ ప్రాజెక్ట్‌లు ప్రజలు, వస్తువులు, సేవలు రవాణాకు ఎటువంటి ఆటంకం లేని అనుసంధానతను అందిస్తాయి. 

మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో 4 జిల్లాల పరిధిలో ఉండే ఈ రెండు ప్రాజెక్ట్‌లు భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్‌ను సుమారు 224 కి.మీ పెంచుతాయి. ఈ మల్టీట్రాకింగ్ ప్రాజెక్ట్‌లు ఇంచుమించు 32 లక్షల జనాభా ఉన్న సుమారు 585 గ్రామాల అనుసంధానతను మెరుగుపరుస్తాయి. 

ప్రతిపాదిత కనలుస్ - ఓఖా (దేవభూమి ద్వారక) డబ్లింగ్ మార్గం వల్ల ద్వారకాధీష్ ఆలయానికి మెరుగైన అనుసంధాన లభిస్తుంది. ముఖ్యమైన దేవస్థానానికి ప్రజలు సులభంగా చేరుకునే సౌకర్యాన్ని ఇది అందిస్తుంది. మొత్తంగా సౌరాష్ట్ర ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి ఇది దారితీస్తుంది.

బద్లాపూర్ – కర్జాత్ విభాగం ముంబయి సబర్బన్ కారిడార్‌లో భాగంగా ఉంది. 3వ, 4వ మార్గం వల్ల ముంబయి నగర శివారు ప్రాంతాల్లో అనుసంధానత మెరుగుపడుతుంది. ఇది దక్షిణ భారతదేశానికి అనుసంధానతను అందిస్తూనే భవిష్యత్ ప్రయాణ డిమాండ్‌లను తీరుస్తుంది.

బొగ్గు, ఉప్పు, కంటైనర్, సిమెంట్, పీఓఎల్ వంటి వస్తువుల రవాణాకు ఇదొక ముఖ్యమైన మార్గం. సామర్థ్యం పెంపుదల ఫలితంగా అదనంగా 18 ఎంటీపీఏ (సంవత్సరానికి మిలియన్ టన్నులు) సరుకు రవాణా జరగనుంది. రవాణా విషయంలో రైల్వేలు పర్యావరణ అనుకూలమైవి. ఇంధన ఉపయోగం విషయంలో కూడా ఇవి సమర్థవంతమైనవి. ఇది వాతావరణ లక్ష్యాలను సాధించేందుకు, దేశం రవాణా వ్యయాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. దీనివల్ల 3 కోట్ల లీటర్ల చమురు దిగుమతి తగ్గుతుంది. 64 లక్షల చెట్లను నాటడంతో సమానంగా నిలిచే 16 కోట్ల కిలోల కర్బన్ డై యాక్సైడ్ ఉద్గారాలు దీనివల్ల తగ్గుతాయి. 

 

***


(Release ID: 2195069) Visitor Counter : 4