ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పౌరులకు లేఖ రాసిన ప్రధానమంత్రి

మన దేశం వికసిత్ భారత్ దిశగా ముందుకు పోతున్న తరుణంలో
కర్తవ్య నిర్వహణకు పౌరులు అగ్ర ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ప్రధానమంత్రి పిలుపు

ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బలపరచాల్సిందిగా
పౌరులకు విజ్ఞ‌ప్తి చేసిన ప్రధానమంత్రి

Posted On: 26 NOV 2025 9:00AM by PIB Hyderabad

ఈ రోజు నవంబరు 26.. ఈ రోజే రాజ్యాంగ దినోత్సవం. ఈ సందర్భంగా దేశ పౌరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక లేఖను రాశారు. ఆ లేఖలో... రాజ్యాంగాన్ని 1949లో ఆమోదించుకోవడం చరిత్రాత్మకమని ఆయన గుర్తుకు తీసుకు వస్తూ, దేశ పురోగతికి రాజ్యాంగం నిలకడగా పోషిస్తున్న పాత్రను గురించి ప్రస్తావించారు. ఈ పవిత్ర రాజ్యాంగాన్ని గౌరవించుకొనేందుకు ఏటా నవంబరు 26ను రాజ్యాంగ దినోత్సవంగా పాటించుకుందామని ప్రభుత్వం 2015వ సంవత్సరంలో ప్రకటించిందని ఆయన అన్నారు.

సాధారణ నేపథ్యం నుంచి వచ్చన వ్యక్తులకు అత్యున్నత స్థాయులకు ఎదిగి ప్రజలకు సేవ చేసేటట్లుగా సాధికారతను రాజ్యాంగం ఎలా అందించిందో శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారు. పార్లమెంటన్నా, రాజ్యాంగమన్నా తనకు ఆదరం ఉందన్న సంగతిని కూడా ఆయన వివరించారు. 2014లో పార్లమెంటు మెట్లకు తాను మోకరిల్లడాన్ని, 2019లో గౌరవ సూచకంగా రాజ్యాంగాన్ని నొసటితో తాకిన విషయాన్ని ప్రస్తావించారు. రాజ్యాంగం అసంఖ్యాక పౌరులకు కలలు కనే శక్తితో పాటు, ఆ కలలను పండించుకొనే శక్తిని కూడా అందించిందని ఆయన స్పష్టం చేశారు.

రాజ్యాంగ పరిషత్తు సభ్యులకు ప్రధానమంత్రి నివాళి అర్పించారు. రాజ్యాంగాన్ని సమృద్ధం చేసిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌లతో పాటు అనేక మంది విశిష్ట మహిళాసభ్యుల దూరదృష్టిని కూడా ఆయన స్మరించుకొన్నారు. రాజ్యాంగ 60వ వార్షికోత్సవ సందర్భంగా గుజరాత్‌లో నిర్వహించిన రాజ్యాంగ గౌరవ యాత్రను గుర్తు చేసుకున్నారు. అలాగే రాజ్యాంగ 75వ వార్షికోత్సవాన్ని స్మరించుకోవడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశంతో పాటు దేశవ్యాప్తంగా నిర్వహించిన ముఖ్య కార్యక్రమాలనూ ప్రస్తావించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారన్నారు.

ఈ ఏడాది రాజ్యాంగ దినోత్సవం అతి ముఖ్యమైందని ప్రధానమంత్రి చెప్తూ, దీనికి కారణం సర్దార్ వల్లభ్‌భాయి పటేల్, భగవాన్ బిర్సా ముండాల 150వ జయంతులూ, వందే మాతరం 150వ వార్షికోత్సవమే కాక శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ అమరత్వానికి 350వ వార్షికోత్సవం కూడానని ఆయన అన్నారు. కర్తవ్య పాలనకు అగ్రప్రాధాన్యాన్ని ఇస్తామని చెప్పుకొన్నామని రాజ్యాంగంలోని ‘51 ఎ’ అధికరణంలో మనం పొందుపరుచుకున్న విషయాన్ని ఈ మహనీయులు, మహత్తర ఘట్టాలూ మనకు స్ఫురణకు తెస్తాయని శ్రీ మోదీ అన్నారు. కర్తవ్యాల్ని నెరవేర్చినప్పుడే హక్కులను అనుభవించగలమని మహాత్మాగాంధీ నమ్మిన సంగతిని శ్రీ మోదీ ప్రస్తావించారు. సమాజపరంగా, ఆర్థికపరంగా పురోగమించాలంటే అందుకు కర్తవ్యాల్ని నెరవేర్చడమే బలమైన పునాదిని వేయగలుగుతుందని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

 

భవిష్యత్తుకేసి శ్రీ మోదీ దృష్టిని సారిస్తూ, ఈ శతాబ్దంలో ఇప్పటికే 25 సంవత్సరాలు గడచిపోయాయనీ, వలసవాద పాలన నుంచి భారత్ స్వేచ్ఛను సంపాదించుకొన్న భారత్ మరో రెండు దశాబ్దాల్లో100 ఏళ్లు పూర్తి చేసుకోనుందన్నారు. రాజ్యాంగాన్ని స్వీకరించి 2049వ సంవత్సరానికల్లా వంద సంవత్సరాలు పూర్తి కానుందని కూడా ఆయన అన్నారు. ప్రస్తుతం తీసుకొనే నిర్ణయాలు, రూపొందించే విధానాలు రాబోయే తరాల వారి జీవనం ఎలా సాగాలో నిర్దేశిస్తాయని ఆయన చెప్పారు. ‘వికసిత్ భారత్’ గమ్యాన్ని చేరుకొనేందుకు ఇండియా వేగంగా పయనిస్తోందనీ, ఈ కారణంగా దేశ పౌరులు వారి కర్తవ్య పాలనను అన్నిటి కన్న మిన్నగా చూడాలనీ ఆయన విజ్ఞ‌ప్తి చేశారు.      

ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బలపరచే బాధ్యతను గుర్తించుకోవాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. 18 ఏళ్ల వయసు వచ్చిన వారు తొలి సారి ఓటర్లుగా మారడాన్ని గౌరవిస్తూ పాఠశాలలు, కళాశాలలు రాజ్యాంగ దినోత్సవాన్ని పాటించాల్సిందిగా ప్రధానమంత్రి సూచించారు. యువతలో బాధ్యతనూ, అభిమాన భావననూ మేల్కొలపడం వల్ల ప్రజాస్వామిక విలువలతో పాటు దేశ భవిష్యత్తు కూడా బలోపేతం అవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

వికసిత్ భారత్‌నూ, సాధికార భారత్‌నూ ఆవిష్కరించడంలో సార్థక తోడ్పాటును అందించే విధంగా ఈ గొప్ప దేశ పౌరులు తమ కర్తవ్యాల్ని నెరవేరుస్తామన్న ప్రతిజ్ఞ‌ను పునరుద్ఘాటించాలని ప్రధానమంత్రి పిలుపును ఇస్తూ, తన లేఖను ముగించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వేర్వేరు సందేశాలను శ్రీ మోదీ పొందుపరుస్తూ -

‘‘రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నేను నా తోటి పౌరులకు ఒక లేఖను రాశాను. ఆ లేఖలో.. మన రాజ్యాంగానికి ఉన్న గొప్పతనాన్ని, మన జీవనంలో మౌలిక కర్తవ్యాలకున్న ప్రాధాన్యాన్ని, మనం తొలి సారి ఓటరుగా మారే సందర్భాన్ని ఎందుకు ఒక సంరంభంగా జరుపుకోవాలనే విషయాన్నీ.. ఇలా అనేక విషయాలపైన నా ఆలోచనల్ని పంచుకున్నాను’’ అని పేర్కొన్నారు.  

“संविधान दिवस पर मैंने देशभर के अपने परिवारजनों के नाम एक पत्र लिखा है। इसमें हमारे संविधान की महानता, जीवन में मौलिक कर्तव्यों का महत्त्व और हमें पहली बार मतदाता बनने का उत्सव क्यों मनाना चाहिए, ऐसे कई विषयों पर अपने विचार साझा किए हैं…’’


(Release ID: 2194539) Visitor Counter : 6