ప్రధాన మంత్రి కార్యాలయం
నవంబర్ 26న ‘శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా’ కేంద్రాన్ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి
ఎస్ఏఈఎస్ఐ అనేది లీప్ ఇంజిన్ల కోసం ఉద్దేశించిన శాఫ్రాన్ కంపెనీ ఎంఆర్ఓ కేంద్రం
మొదటిసారిగా భారత్‌లో ఎంఆర్ఓ కార్యకలాపాలను ప్రారంభించనున్న ఒక అంతర్జాతీయ ఇంజిన్ ఓఈఎం
విమానయాన రంగంలో ఆత్మనిర్భరత లక్ష్యాన్ని సాధించే దిశగా ఎంఆర్ఓ కేంద్రం
Posted On:
25 NOV 2025 4:16PM by PIB Hyderabad
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన జీ.ఎం.ఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ సెజ్‌లో ఉన్న శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (ఎస్ఏఈఎస్ఐ) కేంద్రాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 26న ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించనున్నారు.
ఎస్ఏఈఎస్ఐ అనేది లీప్ (లీడింగ్ ఎడ్జ్ ఏవియేషన్ ప్రొపల్షన్) ఇంజిన్లకు సంబంధించిన నిర్వహణ, మరమ్మత్తు, సమగ్ర మార్పు (ఎంఆర్ఓ) కేంద్రం. ఈ ఇంజిన్లు ఎయిర్‌బస్ ఏ320నియో, బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో ఉంటాయి. ఈ కేంద్రం ఏర్పాటు అనేది ఒక ముఖ్యమైన ప్రస్థానంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్లోబల్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ఎంఆర్ఓ కేంద్రాల్లో ఒకటి కావడం మాత్రమే కాకుండా మొదటిసారిగా ప్రపంచస్థాయి- ఇంజిన్ ఓఈఎం భారత్‌లో ఎంఆర్ఓ కార్యకలాపాలను ప్రారంభిస్తోంది.
జీ.ఎం.ఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ సెజ్‌లో 45,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న అత్యాధునిక కేంద్రాన్ని సుమారు రూ. 1300 కోట్లతో ఏర్పాటు చేశారు. సంవత్సరానికి 300 లీప్ ఇంజిన్‌లను నిర్వహించే ఈ ఎస్ఏఈఎస్ఐ కేంద్రం.. 2035 నాటికి పూర్తి కార్యాచరణ సామర్థ్యాన్ని చేరుకున్న తర్వాత 1,000 మందికి పైగా ఉన్నత నైపుణ్యం గల భారతీయ సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉద్యోగాలు కల్పిస్తుంది. ప్రపంచ స్థాయి ఇంజిన్ల నిర్వహణ, మరమ్మత్తు సేవలను అందించేందుకు ఈ కేంద్రంలో అధునాతన పరికరాలు ఉన్నాయి.
విమానయాన రంగంలో ఆత్మనిర్భరత లక్ష్యం దిశగా భారత్ సాధించే భారీ పురోగతిగా ఈ కేంద్రం ఉంటుంది. ఎంఆర్ఓ విభాగంలో స్వదేశీ సామర్థ్యాలను ఏర్పాటు చేసుకోవటం ద్వారా విదేశీ మారక ద్రవ్యం బయటకు వెళ్లడం తగ్గటంతో పాటు ఉన్నత విలువ గల ఉద్యోగాల సృష్టి, సరఫరా వ్యవస్థ ధృడత్వం పెరుగుతుంది. దీనితో పాటు ప్రపంచ విమానాయాన కేంద్రంగా భారత్ ఎదుగుతుంది. ఈ విభాగం వేగవంతమైన వృద్ధికి మద్దతునిచ్చేందుకు దృఢమైన ఎంఆర్ఓ వ్యవస్థను తయారుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం క్రీయాశీలకంగా పనిచేస్తోంది. జీఎస్టీ సంస్కరణలు - 2024, ఎంఆర్ఓ మార్గదర్శకాలు-2021, జాతీయ పౌర విమానయాన విధానం- 2016 వంటి కీలక ప్రభుత్వ సంస్కరణలు.. పన్నులను హేతుబద్ధీకరించడం, రాయల్టీ భారాన్ని తగ్గించడం ద్వారా ఎంఆర్ఓ సంస్థల కార్యకలాపాలను సులభతరం చేశాయి.
***
(Release ID: 2194390)
Visitor Counter : 4