గాయం నుంచి విజయం దాకా: ఐఎఫ్ఎఫ్ఐ-2025లో సినీ ప్రియులను ఆకర్షించిన 12 ఏళ్ల బాలిక శక్తిమంతమైన కథ ‘కర్లా’
ఫుకీ కళ్ల ద్వారా: బాల్యంలోని అద్భుతాలను, సంక్లిష్టతను ప్రదర్శించిన ‘రెనోయిర్’
కోర్టు గదిలో 12 ఏళ్ల కార్లా ధైర్యమైన పోరాటం నుంచి 11 ఏళ్ల ఫుకీ మాయాజాల, ఊహాత్మక ప్రపంచం దాకా... హృదయంలో నిలిచిపోయే కథలు, వాటి వెనక ప్రయాణాల విశేషాలతో ఇఫి తెరలు మెరిశాయి. ఇక్కడ ధైర్యం, ఉత్సుకత, ఊహాశక్తి... బాల్యంలోని పరీక్షలను విజయవంతమైన సినిమాలుగా మార్చాయి.
56వ ఐఎఫ్ఎఫ్ఐలో ఈ రోజు విలేకరుల సమావేశం ఉత్సాహంగా సాగింది. కార్లా చిత్ర దర్శకురాలు క్రిస్టినా థెరిసా టోర్నాట్జెస్, రెనోయిర్ చిత్ర సహ-నిర్మాత క్రిస్టోఫ్ బ్రంచర్... ఎన్నో ప్రశంసలు పొందిన తమ చిత్రాల వెనక గల కథలను పంచుకున్నారు.
కార్లా: సత్యం, గౌరవం కోసం ఒక చిన్నారి పోరాటం
దర్శకురాలు క్రిస్టినా థెరిసా టోర్నాట్జెస్ తెరపై సున్నితమైన, భావోద్వేగభరితమైన ప్రయాణంతో కార్లా పాత్రకు ప్రాణం పోసిన తీరు గురించి మాట్లాడారు. ఈ చిత్రం 12 ఏళ్ల కార్లా గురించిన భయంకరమైన వాస్తవాలతో కూడిన కథను చెబుతుంది. ఆమె తనను వేధించే తండ్రిని కోర్టులో ఎదుర్కొనే ధైర్యవంతురాలైన అమ్మాయి. కేవలం ఇద్దరు సాక్షులతో ఆ విచారణ "మాటకు మాట"తో ఉద్రిక్త యుద్ధంగా మారుతుంది. కార్లా తన గాయాన్ని వివరించడం హృదయ విదారకంగా, సవాలుతో కూడినదిగా ఉంటుంది.
ఈ చిత్రం కార్లా దృక్పథాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. గాయం వల్ల కలిగే నిశ్శబ్దాలు, సంకోచాలు, మాట్లాడలేని స్థితిని హైలైట్ చేస్తుంది. న్యాయమూర్తి పాత్ర చాలా కీలకమైనది. కార్లా మాటలను విని ఆమె బాధను అర్థం చేసుకోవడంలో సహాయపడే ఏకైక వ్యక్తిగా ఆ పాత్ర ఉంటుంది. కథ ప్రామాణికత కుటుంబ చరిత్రతో ముడిపడి ఉంటుంది. కార్లా బంధువు కథతో పాటు దీనిని జీవితకాల ప్రాజెక్టుగా మార్చారు, చివరికి దానిని అద్భుతంగా తెరపైకి తీసుకువచ్చారు.
క్రిస్టినా ఈ చిత్ర సార్వత్రిక ఔచిత్యాన్ని ప్రస్ఫుటం చేసింది. పిల్లలపై లైంగిక దాడి అనేది ఒక విస్తృతమైన ప్రపంచ సమస్యగా మారింది. పిల్లల గౌరవాన్ని జాగ్రత్తగా కాపాడుతూ ప్రాణాలతో బయటపడిన వ్యక్తి కథనంపై కార్లా దృష్టి సారించింది.
మ్యూనిచ్‌లో ఈ సినిమా ప్రీమియర్‌ను ఆమె గుర్తుచేసుకుంది, దీనిని "హోమ్ రన్"గా అభివర్ణించింది. భారత్‌లో తొలిసారిగా ఇఫిలో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. 12 ఏళ్ల ప్రధాన పాత్రతో కలిసి పనిచేస్తున్న క్రిస్టినా, సురక్షితమైన, భావోద్వేగపరమైన మద్దతు గల వాతావరణాన్ని సృష్టించడం గురించి స్పష్టంగా తెలియజేసింది. తద్వారా బాల నటుల నటన సహజంగా, వాస్తవికంగా, ధృడంగా ఉండటానికి వీలు కల్పించింది.
రెనోయిర్: చిన్నారి మ్యాజికల్ ఊహాశక్తితో ప్రపంచాన్ని చూడటం
11 ఏళ్ల ఫుకీ కళ్ళ ద్వారా బాల్య దశలోని మంత్ర ముగ్ధ ప్రపంచాన్ని ప్రదర్శించే రెనోయిర్ చిత్రంలోని సన్నివేశాల తెర వెనక కథల గురించి సహ-నిర్మాత క్రిస్టోఫ్ బ్రంచర్ అద్భుతంగా వివరించారు.
ఈ టైటిల్ ప్రఖ్యాత ఫ్రెంచ్ చిత్రకారుడి పేరును సూచిస్తున్నప్పటికీ, బ్రంచర్ దీని గురించి ఇలా వివరించారు, “ఇది బయోపిక్ కాదు. ఇంప్రెషనిస్ట్ పెయింటింగ్ లాగా... ఈ కథను చిన్న చిన్న క్షణాలతో రూపొందించాం. వాటన్నింటిని కలిపి చూసినప్పుడు గొప్ప భావోద్వేగ చిత్రాన్ని అది సృష్టిస్తుంది. అదే ఈ చిత్రాన్ని సజీవమైనదిగా, కవితాత్మకమైనదిగా భావించేలా చేస్తుంది.”
1987లో జపాన్ ఆర్థిక వృద్ధి సమయంలో టోక్యోలో జరిగిన రెనోయిర్ కథ... తన తండ్రి ప్రాణాంతక అనారోగ్యం, పెరుగుతున్న తల్లి ఒత్తిడిని ఎదుర్కొంటున్న సున్నితమైన, జిజ్ఞాసగల అమ్మాయి ఫుకీ గురించినది. ఒంటరితనం, ఎదుగుతున్న వయస్సులోని ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఆమె... ఊహాశక్తి, టెలీపతీ, ఉల్లాసభరితమైన ప్రయోగాలకు నెలవైన మాయా ప్రపంచంలోని గతానికి వెళుతుంది - డేటింగ్ హాట్‌లైన్‌కు కూడా కాల్ చేస్తుంది!
"ఫుకీ ప్రయాణ సార్వత్రికతను బ్రంచర్ హైలైట్ చేశారు. "పిల్లలు తమ సొంత అంతర్గత తర్కంతో పెద్ద, యుక్తవయస్సులో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నారో మేం చూపించాలనుకున్నాం. ఫుకీ ఊహాశక్తి... ఆమె ప్రపంచాన్ని అర్థం చేసుకునే మార్గం" అని ఆయన తెలిపారు.
బాల్యం, కుటుంబం, సామాజిక మార్పుల తీపీ-చేదు వాస్తవాలను ఈ చిత్రం సున్నితంగా స్పృశించిందని బ్రంచర్ అన్నారు. "ఫుకీ పాత్రలో నటించిన చిన్నారి నటన సాంకేతికంగా బలంగా, సహజంగా, భావోద్వేగపరంగా ఆకర్షణీయంగా ఉంది. ఆమె కేన్స్‌లో ఉత్తమ నటి అవార్డును తృటిలో కోల్పోయినప్పటికీ, ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డుల్లో ఉత్తమ నూతన నటి గౌరవాన్ని అందుకుంది. ఆమె అద్భుతమైన ప్రతిభతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది" అని ఆయన అన్నారు.
రెనోయిర్ చిత్రం అద్భుతమైన, ఉత్సుకత గల, ధైర్యంతో కూడిన బాల్య దశను అద్భుతంగా ప్రదర్శించింది. ఆటలు, జీవితంలోని కఠినమైన వాస్తవాల మధ్య సున్నితమైన సమతుల్యతను అన్వేషిస్తున్న చిన్నారి కళ్ళ ద్వారా ప్రపంచాన్ని చూడటానికి ప్రేక్షకులను ఆహ్వానిస్తుంది.
చిత్రం గురించి
1. కార్లా
జర్మనీ | 2025 | జర్మన్ | 104’ | కలర్
కార్లా కథ 1962లో మ్యూనిచ్‌లో జరిగిన ఒక భావోద్వేగభరితమైన నిజ జీవిత కథ. ఇది 12 ఏళ్ల కార్లా వాస్తవ జీవిత కథను వివరిస్తుంది. ఆమె తనను వేధించే తండ్రిపై... సంవత్సరాల లైంగిక వేధింపుల నుంచి రక్షణ కోరుతూ ధైర్యంగా అభియోగాలు మోపింది. తరచుగా బాల బాధితులను విస్మరించే న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తూ, కార్లా తన కథను తనదైన రీతిలో చెప్పాలని పట్టుబడుతుంది. ఒక న్యాయమూర్తి ఆమెకు కీలక మద్దతుదారుగా మారతారు. ఈ చిత్రం లైంగిక గాయాలను ప్రదర్శిస్తుంది... అశ్లీలత లేకుండా ఆమె గళాన్ని గౌరవిస్తూ గౌరవం కోసం ధైర్యంగా కార్లా చేస్తున్న పోరాటాన్ని వర్ణిస్తుంది.
2. రెనోయిర్
జపాన్, ఫ్రాన్స్, సింగపూర్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఖతార్ | 2025 | జపనీస్ | 116’ | కలర్
1987లో జపాన్ ఆర్థికాభివృద్ధి సమయంలో టోక్యోలో జరిగిన ఈ కథ, 11 ఏళ్ల ఫుకీ అనే ఔత్సాహిక, సున్నితమైన అమ్మాయి... ప్రాణాంతక అనారోగ్యంతో ఉన్న తన తండ్రి, బాధలో ఉన్న తల్లి ఉటాకో ఒకిటాను ఎలా ఎదుర్కొంటుందో వివరిస్తుంది. ఆమె తల్లిదండ్రులు భావోద్వేగ, ఆర్థికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న సమయంలో నిర్లక్ష్యానికి గురైన ఫుకీ తన సొంత ప్రపంచంలో ఆశ్రయం పొందుతుంది... మాయాజాలం, టెలీపతీని అన్వేషిస్తుంది... డేటింగ్ హాట్‌లైన్‌కూ కాల్ చేస్తుంది. స్నేహాలను ఏర్పరుచుకుంటూ, యుక్త వయస్సు సవాళ్లను ఎదుర్కొంటూ ఆమె ఒంటరితనాన్ని, ఎదుగుదల సమయంలో ఎదురయ్యే బాధలను అనుభవిస్తుంది. బాల్యం, కుటుంబ పోరాటాలు, సామాజిక మార్పుల తీపీ-చేదు సంక్లిష్టతలను స్పృశిస్తూ ఈ చిత్రం... నష్టాలు, ఎదుగుదల మధ్య ప్రశాంతంగా, ధైర్యంగా సాగుతున్న చిన్నారి ప్రయాణాన్ని చక్కగా ప్రదర్శిస్తుంది.
ఐఎఫ్ఎఫ్ఐ గురించి
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం దక్షిణాసియాలోనే పురాతనమైన, అతిపెద్ద సినిమా వేడుకగా నిలుస్తుంది. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్... భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ... గోవా రాష్ట్ర ప్రభుత్వం... గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం ప్రపంచ సినిమాకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది. ఇక్కడ అలనాటి అపురూప చిత్రాలు, సాహసోపేతమైన ప్రయోగాత్మక చిత్రాలు, లెజెండరీ మాస్ట్రోలు, నిర్భయంగా రూపొందించిన తొలి సినిమాలు ఒకే చోట కలిసి ఈ వేడుకలకు హాజరైన ప్రేక్షకులను అలరిస్తాయి. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, ఘన నివాళులతో పాటు... ఆలోచనలు, ఒప్పందాలు, సహకారాలకు అపార అవకాశాలను అందించే శక్తిమంతమైన వేవ్స్ ఫిల్మ్ బజార్ వంటి కార్యక్రమాలు ఐఎఫ్ఎఫ్ఐని మరింత అద్భుత వేదికగా మార్చుతున్నాయి. నవంబర్ 20–28 వరకు అందమైన గోవా తీరప్రాంతంలో ప్రదర్శితమయ్యే 56వ ఎడిషన్.... ప్రపంచ వేదికపై భారత సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించే ఒక అద్భుతమైన వేడుకగా... భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుత సంగమంగా నిలుస్తుంది.
పూర్తి విలేకరుల సమావేశాన్ని ఇక్కడ చూడండి:
మరింత సమాచారం కోసం, క్లిక్ చేయండి:
IFFI Website: https://www.iffigoa.org/
PIB’s IFFI Microsite: https://www.pib.gov.in/iffi/56/
PIB IFFIWood Broadcast Channel: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
X Handles: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
***
Release ID:
2193864
| Visitor Counter:
4