జీ20 శిఖరాగ్ర సదస్సు మూడో సమావేశంలో “అందరికీ సమానమైన, న్యాయమైన భవిష్యత్తు – క్లిష్టమైన ఖనిజాలు, మంచి పని, కృత్రిమ మేధస్సు” అనే అంశంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. క్లిష్టమైన సాంకేతికతలను ప్రోత్సహించే విధానంలో మౌలికమైన మార్పు అవసరమని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అటువంటి సాంకేతిక అన్వయాలు ఆర్థిక ప్రాధాన్యాలుగా కాకుండా ప్రజా ప్రాధాన్యాలుగా, ఉండాలని, 'జాతీయ' కాకుండా ‘అంతర్జాతీయం’ గా ఉండాలని, 'ప్రత్యేక నమూనాలకు' బదులుగా ‘స్వేచ్చా వనరుల‘ ఆధారంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ దృక్పథం భారత సాంకేతిక వ్యవస్థలో భాగమైందని, ఇది అంతరిక్ష ప్రయోగాలు, కృత్రిమ మేధ, డిజిటల్ చెల్లింపులు మొదలైన ప్రతి రంగంలోనూ భారత్ ను ప్రపంచ నాయకత్వ స్థాయిలో నిలిపి గణనీయమైన ప్రయోజనాలు అందించిందని ఆయన వివరించారు.
కృత్రిమ మేధ గురించి మాట్లాడుతూ, సమానమైన లభ్యత, జనాభా స్థాయి నైపుణ్యం, బాధ్యతాయుతమైన వినియోగం ఆధారంగా ఉన్న భారత్ విధానాన్ని ప్రధానమంత్రి వివరించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ ఏఐ ప్రయోజనాలను చేర్చే లక్ష్యంతో, 'ఇండియా-ఏఐ మిషన్' కింద అందరికీ అందుబాటులో ఉండే అత్యున్నత పనితీరు గల కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేధ (ప్రపంచ శ్రేయస్సుకు దోహదపడాలని స్పష్టం చేస్తూ, పారదర్శకత, మానవ పర్యవేక్షణ, నిర్మాణ పరమైన భద్రత, దుర్వినియోగ నిరోధం వంటి సూత్రాలపై ఆధారపడిన ప్రపంచ ఒప్పందం అవసరమని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
ఏఐ ద్వారా మానవ సామర్థ్యాలను విస్తరించినప్పటికీ, అంతిమ నిర్ణయం మనుషులే తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. భారత్ 2026 ఫిబ్రవరిలో సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అనే ఇతివృత్తంతో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ను నిర్వహించనుందని ఇందులో జీ 20 దేశాలన్నీ పాల్గొనాలని ప్రధానమంత్రి ఆహ్వానించారు.
ఏఐ యుగంలో మన దృష్టిని 'నేటి ఉద్యోగాల' నుంచి 'రేపటి సామర్థ్యాలకు' వేగంగా మార్చాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. న్యూఢిల్లీ జీ20 సదస్సులో నైపుణ్యాల సమీకరణపై సాధించిన పురోగతిని గుర్తుచేస్తూ, రాబోయే సంవత్సరాలలో ఈ కూటమి ప్రపంచ స్థాయిలో నైపుణ్య వనరుల సమీకరణ కోసం 'గ్లోబల్ టాలెంట్ మొబిలిటీ ఫ్రేమ్‌వర్క్' ను అభివృద్ధి చేయాలని ఆయన ప్రతిపాదించారు.
***