రాష్ట్రపతి సచివాలయం
సికింద్రాబాద్ రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం 2వ ఎడిషన్‌ను ప్రారంభించిన భారత రాష్ట్రపతి
ఈ మహోత్సవానికి నవంబర్ 22 నుంచి 30 వరకు సాధారణ ప్రజలకు అనుమతి
प्रविष्टि तिथि:
21 NOV 2025 8:15PM by PIB Hyderabad
సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో 2వ ఎడిషన్ భారతీయ కళా మహోత్సవాన్ని ఇవాళ (నవంబర్ 21, 2025) భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ ఉత్సవాన్ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, జౌళి మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖల సహకారంతో రాష్ట్రపతి నిలయం నిర్వహిస్తోంది. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, గోవా, దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూల సుసంపన్నమైన, విభిన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించటమే ఈ వేడుక లక్ష్యం.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ.. భారతీయ కళా మహోత్సవం మొదటి ఎడిషన్‌లో ఈశాన్య భారత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజలకు పరిచయం చేశామని, ఈసారి పశ్చిమ భారత సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని వీక్షించి, తెలుసుకునే అవకాశం ఉందని అన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, గోవా, డామన్, డయ్యూ, దాద్రా, నగర్ హవేలీ వంటి పశ్చిమ భారత ప్రాంతాల హస్తకళలు, నృత్యం, సంగీతం, సాహిత్యం, వంటకాల ద్వారా వారి జానపద సంస్కృతిని సందర్శకులు వీక్షించగలరని ఆమె తెలిపారు.

ప్రజలను ముఖ్యంగా యువతని మన సాంస్కృతిక వారసత్వంతో అనుసంధానం చేసేందుకు భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్రపతి తెలిపారు. వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రజలు పరస్పరం అర్థం చేసుకోవటానికి భారతీయ కళా మహోత్సవం వంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని, ఈ అవగాహన మన దృక్పథాలను విస్తృతం చేస్తుందన్నారు. సాంస్కృతిక వారసత్వం పట్ల గౌరవాన్ని పెంపొందించటానికి, పరిరక్షించటానికి ఇలాంటి కార్యక్రమాలు సహకరిస్తాయని చెప్పారు.

భారతీయ కళా మహోత్సవానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరై, ఈ వేడుకను ఆస్వాదిస్తారని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, రాజస్థాన్ గవర్నర్ శ్రీ హరిభౌ బాగ్డే, గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు, తెలంగాణ ప్రభుత్వ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి డి అనసూయ (సీతక్క), గుజరాత్ ప్రభుత్వ గిరిజన అభివృద్ధి, ఖాదీ, కుటీర, గ్రామీణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నరేశ్ మగన్‌భాయ్ పటేల్ హాజరయ్యారు.

భారతీయ కళా మహోత్సవానికి నవంబర్ 22 నుంచి 30, 2025 వరకు రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల మధ్య సందర్శకులకు అనుమతి ఉంటుంది. ఉచిత ప్రవేశం ఉంటుంది. ఈ లింక్‌పై క్లిక్ చేయటం ద్వారా సందర్శకులు స్లాట్లను బుక్ చేసుకోవచ్చు: https://visit.rashtrapatibhavan.gov.in/plan-visit/rashtrapati-nilayam-hyderabad/p2/p2. నేరుగా వెళ్లే సందర్శకులకు స్పాట్ బుకింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

(रिलीज़ आईडी: 2192997)
आगंतुक पटल : 68