హరిత దృక్పథంతో సినిమా: కళానైపుణ్యం, సంస్కృతి, వాతావరణాన్ని ప్రతిబింబించిన నాలుగు దేశాలు
కథలు, సెట్‌లు, సృజనాత్మక ఎంపికలను సుస్థిరత ప్రభావితం చేస్తున్న తీరుపై సినీ దర్శకుల అన్వేషణ
సంస్కృతి, మనస్సాక్షి, బాధ్యతాయుతమైన చలనచిత్ర నిర్మాణ భవిష్యత్తు గురించి లోతుగా విశ్లేషించిన ప్యానెల్ చర్చ
భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో నిర్వహించిన “ రీల్ గ్రీన్: నాలుగు దేశాల సినిమాల్లో సుస్థిరత, కథనం” పేరిట జరిగిన ప్యానెల్ చర్చలో భారత్, జపాన్, స్పెయిన్ ఆస్ట్రేలియా దేశాలకు చెందిన దర్శకులు, నిర్మాతలు పాల్గొన్నారు. సుస్థిరత ఆధారిత సినిమాను గురించి ఇంత విభిన్నమైన అంతర్జాతీయ దృక్కోణాలు ఒకే వేదికపై కలవడం అరుదైన సందర్భంగా నిలిచింది. అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన జర్నలిస్ట్, సినీ విమర్శకుడు నమన్ రామచంద్రన్ సమన్వయ కర్తగా వ్యవహరించిన ఈ సమావేశం పర్యావరణ బాధ్యత కేవలం సినిమా నిర్మాణ పద్ధతులనే కాకుండా కథనాల స్వరూపాన్నికూడా ఎలా ప్రభావితం చేయగలదో పరిశీలించింది. ఇది కళ, సంస్కృతి, మనస్సాక్షి మధ్య ఒక అనుసంధానాన్ని సృష్టించే చర్చగా నిలిచింది.
భారతీయ చిత్ర నిర్మాత, దర్శకుడు నీలమాధబ్ పాండా సినిమా నిర్మాణం పర్యావరణంపై చూపే ప్రభావంపై స్పష్టమైన ఆలోచనతో చర్చను ప్రారంభించారు. చలనచిత్ర నిర్మాణంలో కార్బన్ ప్రభావం గణనీయంగా ఉంటుందని, చిన్న సినిమాలు తరచుగా పర్యావరణ అనుకూల పద్ధతులను అమలు చేయడానికి సౌలభ్యాన్ని కలిగి ఉంటాయని ఆయన ప్రేక్షకులకు గుర్తు చేశారు. “సినిమా ఒక ప్రజామాధ్యమం. మనకు ఒక్క గ్రహమే ఉంది. మన ఇంధన వనరుల్లో సగం ఇప్పటికే ఖర్చయ్యాయి” అంటూ, సాధ్యమైన ప్రతి స్థాయిలో సుస్థిరమైన చర్యలను చేపట్టాలని ఆయన పరిశ్రమను కోరారు.

అయితే, నీలా మాధబ్ పాండా చెప్పిన దానికి భిన్నంగా, జపాన్‌కు చెందిన చలనచిత్ర నిర్మాత మినా మోటెకి, తక్కువ బడ్జెట్ చిత్ర నిర్మాణాలలో పర్యావరణ అనుకూల పద్ధతులను అమలు చేయడంలో ఉన్న సవాళ్లను ప్రముఖంగా పేర్కొన్నారు. పెద్దస్థాయి ప్రాజెక్టులు ఆవిష్కరణకు అవకాశం ఇస్తాయని, అయితే చిన్న ప్రాజెక్టులు తరచుగా ఇంధన వినియోగం, సెట్ నిర్వహణ, రవాణాపరమైన ఇబ్బందులు పడతాయని ఆమె అన్నారు. "సాధ్యమైన చోటల్లా మేం ఇంధనాన్ని ఆదా చేయడానికి ప్రయత్నిస్తున్నాం” అని ఆమె అన్నారు. జపనీస్ చలనచిత్ర నిర్మాణ సంస్కృతిలో క్రమంగా మార్పు వస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
స్పానిష్ చిత్ర నిర్మాత అన్నా సౌరా కూడా ఇదే ఆందోళనను పునరుద్ఘాటిస్తూ, సుస్థిరత అనేది సృజనాత్మక బాధ్యత అని అన్నారు. పంపిణీ నుంచి సెట్స్ నిర్వహణ వరకు ప్రతి దశలో నిర్దిష్టమయిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కథన నాణ్యతను తగ్గించకుండా పర్యావరణ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. “ మనం వేసే ప్రతి అడుగు ముఖ్యం” అని ఆమె అన్నారు. చిన్న చిన్న ఆలోచనాత్మక చర్యలు కూడా మరింత హరిత భవిష్యత్తుకు దోహదపడతాయని పేర్కొన్నారు.
ఆస్ట్రేలియన్ చిత్ర దర్శకుడు గార్త్ డేవిస్ చర్చకు కథా పరమైన కోణాన్ని జోడించారు. కథలే పర్యావరణ అవగాహనపై ప్రభావం చూపగలవని ఆయన అన్నారు. “సినిమాలు మనుషులను మళ్లీ ప్రకృతితో కలుపుతాయి” అని ఆయన అన్నారు. “యువతరం మార్పును కోరుకుంటోంది. ప్రవర్తనను, విలువలను తీర్చిదిద్దే శక్తి కథ చెప్పడంలోనే ఉంది” అన్నారు.

చర్చలో ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న పద్ధతులను, అవి స్థానిక సందర్భాల్లో ఎలా అనుసరించవచ్చో విశ్లేషించారు. గార్త్ మాట్లాడుతూ, ఆస్ట్రేలియాలో సినిమా నిర్మాణాలు మనుషులకు, సంస్కృతికి, పర్యావరణానికి గౌరవం ఇవ్వడాన్ని కేంద్రబిందువుగా ఉంచుతాయని వివరించారు. షూటింగ్ పూర్తయ్యే సమయానికి లొకేషన్లు ఉన్నది ఉన్నట్లుగా లేదా మరింత మెరుగ్గా ఉండేలా చూసుకోవడం వారి ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. జపాన్‌లో ఉన్న సంప్రదాయ, ఆధునిక పద్ధతుల మేళవింపును మినా వివరించారు. ప్రజా రవాణా, స్థానికంగా ఉద్యోగాల కల్పన, జాగ్రత్తగా వనరుల వినియోగం వంటి అంశాలను ప్రస్తావిస్తూ, అన్నా సౌరా స్పెయిన్‌లోని గ్రీన్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వ్యవస్థను వివరించారు. ఇది సినిమా నిర్మాణాల సుస్థిరతను అంచనా వేసి సర్టిఫై చేస్తుంది. ఈ వ్యవస్థ కేటరింగ్, ఉపకరణాలు, రవాణాలో పర్యావరణ అనుకూల పద్ధతులను అనుసరించడానికి మార్గనిర్దేశం చేస్తుంది.
మొత్తం చర్చలో ప్యానెల్ సభ్యులు యువత పాత్రను ప్రముఖంగా పేర్కొన్నారు. పర్యావరణ అనుకూల సెట్ల సృష్టి నుంచి కథలలో సుస్థిరతకను ప్రోత్సహించడం వరకు, యువతే మార్పునకు ప్రధాన ప్రేరకులు అని గుర్తించారు. సరిహద్దులు, తరాలను దాటి విస్తరించే సుస్థిరత సంస్కృతిని పెంపొందించడానికి మార్గదర్శకత్వం, విద్య, సెట్‌లో అలవాటైన పద్ధతుల ప్రాముఖ్యతను ప్యానెల్ సభ్యులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. వినియోగాన్ని తగ్గించడం, దుస్తులను పునర్వినియోగించడం, నిర్మించిన సెట్ల కంటే వాస్తవ లొకేషన్లకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి ఆచరణాత్మక వ్యూహాలు గురించి చర్చించారు. ప్రభుత్వ, సంస్థల మద్దతు అవసరాన్ని కూడా ప్యానెల్ సభ్యులు స్పష్టంగా పేర్కొన్నారు. సుస్థిరత ప్రయత్నాలను గుర్తించేందుకు సర్టిఫికేషన్ పద్ధతిని నీలమాధబ్ పాండా సూచించారు, నిర్మాణ ప్రోత్సాహకాలను పర్యావరణ బాధ్యతతో అనుసంధానించే విధానాలను గార్త్ డేవిస్ ప్రతిపాదించారు.
ప్రపంచ సమాజానికి ప్రోత్సాహకంగా,ఇతర దేశాలతో మరింత సహకార సమావేశాలు నిర్వహించాలని, ఉత్తమ పద్ధతులను పంచుకోవాలని, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి సమర్థవంతమైన వ్యూహాలను అవలంబించాలని ప్యానెలిస్టులు సూచించారు. సృజనాత్మకత, లేదా కథ చెప్పే విధానంపై రాజీ పడకుండానే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ దర్శకులు సుస్థిరతను స్వీకరించడానికి అంతర్జాతీయ చర్చలు, విజ్ఞాన మార్పిడి సహాయపడతాయని వారు అన్నారు.
చర్చ ముగిసే సమయానికి, సుస్థిరత అనేది కేవలం ఒక సాంకేతిక మార్గదర్శకం మాత్రమే కాదని, అది మనం అనుసరించాల్సిన ఒక ఆలోచనాత్మక మార్పు అని స్పష్టమైంది. భారత్, జపాన్, స్పెయిన్ ఆస్ట్రేలియాల్లో పర్యావరణ అవగాహన కథ చెప్పే తీరు, సాంస్కృతిక బాధ్యతతో ముడిపడి ఉంటుందని ఈ చర్చ నిరూపించింది. సినిమా ప్రభావవంతం గానూ, బాధ్యతాయుతంగానూ ఉండగలదని, ఇది ప్రేక్షకులు, సృజనాత్మకులను స్ఫూర్తిదాయకంగా ప్రభావితం చేస్తుందని, తదుపరి తరం దర్శకులు పచ్చదనంతో, మరింత నైతికతతో కూడిన ప్రపంచాన్ని కల్పించేలా ప్రేరేపిస్తుందని ప్యానెల్ ఉద్ఘాటించింది.
ఇఫీ గురించి
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ), దక్షిణ ఆసియాలోనే అత్యంత పురాతనమైన, అతిపెద్ద సినిమా ఉత్సవంగా పేరు గాంచింది. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ), గోవా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ఈఎస్జీ) సంయుక్తంగా దీనిని నిర్వహిస్తున్నాయి. పునరుద్ధరించిన పాత సినీ కళాఖండాలు, ఆధునిక ప్రయోగ చిత్రాల ప్రదర్శనతో దిగ్గజ దర్శకులు, మొదటిసారి చిత్రాలు తీసిన కొత్త, సాహసోపేత దర్శకులు ఒకే వేదికను పంచుకునే ఈ ఉత్సవం, అంతర్జాతీయ సినీశక్తి కేంద్రంగా ఎదిగింది. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, నివాళులు ఆలోచనలు, ఒప్పందాలు, భాగస్వామ్యాలు, అత్యంత ఉత్సాహభరితమైన 'వేవ్స్ ఫిల్మ్ బజార్' వంటి వైవిధ్యభరిత అంశాల కలయిక ఇఫీని ప్రకాశవంతంగా మార్చాయి. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవా సుందర తీరప్రాంత నేపథ్యంలో జరిగే 56వ ఎడిషన్ భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుతమైన వైవిధ్యాన్ని హామీ ఇస్తోంది. ఇది ప్రపంచ వేదికపై భారతదేశ సృజనాత్మక ప్రతిభను సమగ్రంగా ప్రదర్శించే వేడుక.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
IFFI Website: https://www.iffigoa.org/
PIB’s IFFI Microsite: https://www.pib.gov.in/iffi/56new/
PIB IFFIWood Broadcast Channel: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
X Post Link: https://x.com/PIB_Panaji/status/1991438887512850647?s=20
X Handles: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
Release ID:
2192993
| Visitor Counter:
3