కలలు, ఆవిష్కరణలు, వారసత్వాల ప్రస్థానం: రెండు తరాల సినిమాపై ముజఫర్ అలీ, షాద్ అలీ
· గమన్ నుంచి జూని వరకు... ఘన విజయాలు, హృదయ విదారకాలు, చిత్రనిర్మాతల ఆత్మను ఆవిష్కరించే సునిశిత స్వప్నాలపై మాటా మంతీ
· తండ్రీ కొడుకులిద్దరినీ ఒకే వేదికపై నిలిపిన అరుదైన చర్చా వేదిక ఇది...
జ్ఞాపకాలు, సంస్కృతి, వారిని తీర్చిదిద్దిన కలపై ఆలోచనాత్మక చర్చ
ఇఫీలో నిర్వహించిన ‘సినిమా, సంస్కృతి: రెండు తరాల వ్యాఖ్యానాలు’ చర్చా సదస్సు వివిధ తరాల భారతీయ సినిమాను పరిచయం చేసింది. జ్ఞాపకలు, స్వప్నాలు, కళాత్మకత అంశాలపై తండ్రీ కొడుకుల మధ్య చర్చ సాగింది. ప్రారంభంలో ప్రముఖ చిత్ర నిర్మాత రవి కొట్టారకర వారిద్దరినీ సత్కరించారు. చిరస్థాయిలో నిలిచే వారి కృషిని ప్రశంసిస్తూ.. వారి సేవలపై మాట్లాడారు. అనంతరం షాద్ అలీ ఆత్మీయంగా, కౌశలంతో కార్యక్రమాన్ని నడిపించారు. దశాబ్దాల అనుభవాలు, ఆలోచనలు, నేర్చుకున్న అంశాలపై జ్ఞాపకాలను పంచుకోవాలని తన తండ్రి, సినీ దిగ్గజం ముజఫర్ అలీని షాద్ అలీ కోరారు.

ఓ చిలిపి ప్రశ్నతో షాద్ అలీ మొదలుపెట్టారు. పెద్దవుతున్నప్పుడు మీరు మొదట కలలుగన్న వృత్తేమిటని అడిగారు. చిన్ననాటి చిత్రాలు, ఆర్ట్ క్లాసులో గెలుచుకున్న బహుమతులు, తననెప్పుడూ ఆకర్షించే కవిత్వానుభవాలతో కూడిన మధుర జ్ఞాపకాల సమాహారంగా ముజఫర్ అలీ మాటలు సాగాయి. సినిమాలు తర్వాత వచ్చాయనీ.. ప్రధాన స్రవంతి కథనంలోని సాధారణ చిత్రణ నుంచి విముక్తుడిని చేసి, భావుకత స్వేచ్ఛగా విహరించేందుకు ఓ రంగస్థలాన్ని అందించాయని ఆయన చెప్పారు. తనకు సినిమా, కళాత్మకత రెండూ కలగలిసిన ప్రపంచాన్ని కలకత్తా పరిచయం చేసిందని, అక్కడ ఊహకందని అంశాలు వాస్తవమయ్యే అవకాశం దొరికిందని ఆయన గుర్తుచేసుకున్నారు. సృజనాత్మకత మూలాల గురించి మాట్లాడుతూ.. ‘‘చిత్ర నిర్మాణమన్నది మీ రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, భూగర్భ శాస్త్రం వంటిదే’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ముజఫర్ అలీ తన తొలినాళ్లలో వలస వెళ్లే ప్రజల దుస్థితిని, నిస్సహాయతను చూశాడు. ఈ అనుభవమే స్థానచలనం వల్ల కలిగే బాధపై ఆయన తీసిన చిత్రం ‘గమన్’లో భావోద్వేగ కేంద్రంగా నిలిచింది. ఈ చిత్రం ఇఫీలో సిల్వర్ పీకాక్ అవార్డు గెలుచుకున్నప్పటికీ.. ఈ విజయంతో తానెన్నడూ ఉప్పొంగిపోలేదని ముజఫర్ అలీ చెప్పారు. విజయంతో తాను శక్తిమంతుడినైనట్లు ఎన్నడూ భావించలేదనీ.. కొత్త పోరాటాలు, కొత్త సవాళ్లు ముందున్నాయనే విజయాలు తనకెప్పుడూ గుర్తుచేశాయన్నారు.
అనంతరం చర్చ కళలు, సంగీతం వైపు మళ్లింది. ముజఫర్ అలీ తొలినాళ్ల సినిమాల్లో విలక్షణ ప్రదర్శనను షాద్ అలీ ప్రస్తావించారు. గమన్ నుంచి ఉమ్రావ్ జాన్ వరకు మూలాలను మరువకపోవడమే తన విధానంలోని ముఖ్యమైన అంశమని ముజఫర్ అలీ తెలిపారు. కవిత్వం, తాత్వికత, అంకితభావమే సంగీతానికి మూలమని ఆయన పేర్కొన్నారు. అణకువ, భాగస్వామ్యం అవసరమైన కవితా సునిశితత్వం నుంచి ఉమ్రావ్ జాన్‌లోని పాటలు పుట్టాయని ఆయన వివరించారు. ‘‘కవిత్వం మిమ్మల్ని కలలు కనేలా చేస్తుంది, కవి మనతో కలిసి కల గనాలి’’ అని ఆయన అన్నారు.

తరువాత జూని గురించి మాట్లాడారు. అది ఒక సవాలుగా మారిన కల. కాశ్మీర్‌లో ద్విభాషా చిత్రం తీయాలనుకోవడం వల్ల.. రవాణా, నిర్వహణ, సాంస్కృతిక, వాతావరణ పరంగా అనేక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో చివరికి షూటింగ్ ఆగిపోయింది. ముజఫర్ అలీ ఆ ప్రాజెక్టును ‘కలలన్నింటినీ మించిన కల’గా పేర్కొన్నారు. అది ఆగిపోయినప్పుడు కలిగిన బాధను ఎంతో వేదనతో వివరించారు. అయితే, అది పూర్తి కాకపోయినా ఆ ప్రాజెక్టు స్ఫూర్తి ఇప్పటికీ కొనసాగుతోంది. కాశ్మీర్ కేవలం ఓ ప్రాంతం మాత్రమే కాదని, అది సజీవ సంస్కృతి అని ఆయన వ్యాఖ్యానించారు. “కాశ్మీర్ కోసం తీసే చిత్రాలు కాశ్మీర్‌లోనే పుట్టాలి’’ అన్నారు. ఈ పరంపరను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ప్రతిభావంతులైన స్థానిక యువతను కోరారు.
నెగెటివ్‌లు, సౌండ్ ట్రాకులను తిరిగి పరిశీలిస్తూ, తన తండ్రి సినీ దృక్పథంలో తిరిగి మమేకమవుతూ.. జూనీ సినిమా పునరుద్ధరణ తీరుపై షాద్ అలీ మాట్లాడారు. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదని, అది ఎలా స్వస్థత చేకూర్చగలదో ఈ ప్రయాణంలో తనకు తెలిసిందన్నారు. ‘జూనీ: లాస్ట్ అండ్ ఫౌండ్’ పేరుతో ఓ ఆకర్షణీయమైన వీడియోను ప్రదర్శించారు. తండ్రీ కొడుకుల కలల ప్రయాణాన్ని, ఎదురుదెబ్బలను, సినిమాను తిరిగి చిత్రించాలనే ఆశను ఇందులో చిత్రించారు.
పాటలకు నేపథ్యంగా మాత్రమే కాకుండా, కాశ్మీర్ నిజమైన సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాల పునరుజ్జీవంపై ప్రశ్నోత్తరాల సందర్భంగా ఓ ప్రశ్న వచ్చింది. ముజఫరీ కచ్చితమైన నమ్మకంతో బదులిస్తూ.. అలాంటి సినిమాగానే జూనీని నిర్మించామన్నారు. “కాశ్మీర్‌లో అన్నీ ఉన్నాయి” అన్నారు. “ప్రతిభను ఆహ్వానించాల్సిన పని లేదు, ఇక్కడే దాన్ని పెంచుకోవాలి” అన్నారు.
ఈ సదస్సు ముగిసే సమయానికి ఇది కేవలం ఓ సంభాషణ మాత్రమే కాదని ప్రేక్షకులకు అర్థమైంది. ఒక తరం నుంచి మరో తరానికి జాగ్రత్తగా, భక్తితో, ఆశతో.. కలలు, పోరాటాలు, వారసత్వాలు సాగే సినీ పరంపరను వారు అవగతం చేసుకున్నారు.
ఇఫీ గురించి
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) దక్షిణాసియాలోనే అతి ఎక్కువ చరిత్ర కలిగిన, అతిపెద్ద సినీ వేడుక. జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్డీసీ), కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, గోవా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని గోవా ఎంటర్టయిన్మెంట్ సొసైటీ సంయుక్తంగా ఈ కార్యక్రమానికి ఆతిథ్యమిస్తున్నాయి. ఈ ఉత్సవం అంతర్జాతీయ సినిమా కేంద్రంగా నిలిచింది. ఇందులో ఆపాత మధురాలకు అద్భుత ప్రయోగాలను జోడిస్తారు. దిగ్గజాలైన నిపుణులు, కొత్తగా సినీ రంగంలో అడుగిడుతున్నవారు నిర్భయంగా వేదికను పంచుకుంటారు. అనేక కార్యక్రమాల ఉత్తేజకరమైన సమ్మేళనం ఇఫీకి ప్రత్యేక శోభనిస్తుంది. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్ క్లాసులు, ప్రముఖులకు నివాళి, భావాలు – ఒప్పందాల మధ్య సహకారం కుదిరే ఉత్తేజకరమైన వేవ్స్ ఫిల్మ్ బజార్.. ఇవన్నీ ఇఫీలో భాగంగా ఉంటాయి. నవంబర్ 20–28 మధ్య అద్భుతమైన గోవా తీరప్రాంతంలో నిర్వహించే 56వ ఎడిషన్.. భాషలు, శైలులు, ఆవిష్కరణలు, కొత్త గళాల అద్భుత సమాహారంగా నిలవనుంది. భారత సృజనాత్మక ఔన్నత్యాన్ని అంతర్జాతీయ వేదికపై వీక్షకులను కట్టిపడేసేలా చాటే అద్భుత వేడుక ఇది.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2190381
ఇఫీ వెబ్‌సైట్: https://www.iffigoa.org/
పీఐబీ ఇఫీ మైక్రోసైట్: https://www.pib.gov.in/iffi/56new/
పీఐబీ ఇఫీవుడ్ ప్రసార చానల్: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
X Handles: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
***
Release ID:
2192937
| Visitor Counter:
3