వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
మోసపూరిత విధానాల తొలగింపునకు స్వయంగా ఆడిట్ చేసుకున్నామంటూ ప్రకటించిన 26 ప్రముఖ ఈ-కామర్స్ వేదికలు
Posted On:
20 NOV 2025 10:59AM by PIB Hyderabad
డిజిటల్ మార్కెట్లో వినియోగదారుల ప్రయోజనాల సంరక్షణకు తీసుకునే చర్యల్లో భాగంగా, 26 ప్రముఖ ఈ-కామర్స్ వేదికలు స్వచ్ఛందంగా స్వీయ ప్రకటన లేఖలను సమర్పించాయి. మోసపూరిత చర్యల నివారణ, నియంత్రణ మార్గదర్శకాలు - 2023కు కట్టుబడి ఉన్నట్లు తెలిపాయి. వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు, ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కీలకమని చెప్పవచ్చు.
మోసపూరిత విధానాలను గుర్తించటానికి, అంచనా వేయటానికి, తొలగించేందుకు 26 కంపెనీల యాజమాన్యాలు స్వయంగా లేదా బయట సంస్థల ద్వారా ఆడిట్లు నిర్వహించాయి. మోసపూరిత చర్యల నుంచి తమ వేదికలు విముక్తి పొందాయని, వినియోగదారులను తప్పుదోవ పట్టించే ఎలాంటి డిజైన్లను ఉపయోగించటం లేదని కంపెనీలు ప్రకటించాయి.
పరిశ్రమలన్నీ నిబంధనలకు కట్టుబడి ఉండటమనేది.. వినియోగదారుల పారదర్శకత, నాణ్యమైన వాణిజ్య కార్యకలాపాలు, విలువలతో కూడిన డిజిటల్ వ్యవస్థల పట్ల ప్రాధాన్యతను సూచిస్తుంది. ఈ స్వచ్ఛంద నిర్ణయం ద్వారా వినియోగదారుల రక్షణ, వ్యాపార వృద్ధి ఏకకాలంలో జరుగుతాయి. ఇది బ్రాండ్‌పై నమ్మకాన్ని, దీర్ఘకాలిక విశ్వసనీయతను పెంచుతాయి.
నిబంధనల అమలును గుర్తించిన సీసీపీఏ; పరిశ్రమల ఉత్తమ పద్ధతిగా అభివర్ణన
ఈ ప్రకటనలను కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) అభినందించింది. వీటిని అసాధారణమైన చర్యలుగా పేర్కొంటూ, ఇలాంటి స్వీయ-నియంత్రణను అనుసరించాలని ఇతర కంపెనీలను ప్రోత్సహించింది. కంపెనీలు స్వయంగా-ఆడిట్ చేసి, విడుదల చేసిన ప్రకటనలను ప్రజలు చూసేందుకు వీలుగా తమ వెబ్‌సైట్లలో పొందుపరచాలని సీసీపీఏ గతంలో ఆదేశించింది.
ఈ ప్రకటనలను సీసీపీఏ వెబ్‌సైట్‌లో చూడవచ్చు: https://www.doca.gov.in/ccpa/slef-audit-companies-dark-pattern.php
ఇతర ఈ-కామర్స్ వేదికలు, మార్కెట్ సంబంధింత సంస్థలు, సేవల కంపెనీలు, యాప్ డెవలపర్లు ఈ కంపెనీలను ఉదాహరణగా తీసుకుని ఆయా విధానాలను అనుసరించాలని సీసీపీఏ సూచించింది. భారత డిజిటల్ ప్రపంచంలో వినియోగదారులను తప్పుదారి పట్టించే చర్యలన్నీ కూడా- దీర్ఘకాల ఫలితాలను ఇచ్చేవి కాదనీ, దీర్ఘకాలంలో ఇవి వినియోగదారులు, వ్యాపారానికి హాని చేస్తాయని గుర్తించాలని పేర్కొంది.
సోషల్ మీడియా క్యాంపెయిన్లు, సమాచార వీడియోలు, విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహించి మోసపూరిత చర్యలను గుర్తించటం, నివేదించటంపై వినియోగదారులకు జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ (ఎన్సీహెచ్) అవగాహన కల్పించింది. అలాంటి ఫిర్యాదులను వ్యవస్థీకృతంగా పరిష్కరించటంతో పాటు అవసరమైన చోట చర్యలు తీసుకుంది. నిబంధనల ఉల్లంఘన జరిగే అవకాశమున్న అంశాలను గమనిస్తున్నామని, మోసాలకు పాల్పడిన వేదికలపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని సీసీపీఏ స్పష్టం చేసింది.
నేపథ్యం
నవంబర్ 30న విడుదల చేసిన మోసపూరిత చర్యల నివారణ, నియంత్రణకు మార్గదర్శకాల-2023 నోటిఫికేషన్ ప్రకారం.. 13 మోసపూరిత చర్యలను గుర్తించి, నిషేధించారు. అవి:
-
నకిలీ అత్యవసర స్థితి (ఫాల్స్ అర్జెన్సీ)
-
బాస్కెట్ స్నీకింగ్
-
కన్‌ఫర్మ్ షేమింగ్
-
బలవంతపు చర్య (ఫోర్సుడ్ యాక్షన్)
-
సబ్‌స్క్రిప్షన్ ట్రాప్
-
ఇంటర్‌ఫేస్ ఇంటర్‌ఫియరెన్స్
-
బైట్ అండ్ స్విచ్
-
డ్రిప్ ప్రైసింగ్
-
మోసపూరిత వాణిజ్య ప్రకటనలు
-
న్యాగింగ్
-
ట్రిక్ వర్డింగ్
-
సాస్ బిల్లింగ్
-
మాల్ వేర్
వినియోగదారుల రక్షణ చట్టం -2019 ద్వారా జారీ చేసిన ఈ మార్గదర్శకాలు.. పారదర్శకమైన, విశ్వసనీయమైన, వినియోగదారుల-కేంద్రీకృత డిజిటల్ మార్కెట్‌ను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ వ్యూహంలో కీలకమైనవి.
నిబంధనల అమలును తప్పనిసరి చేయాలని.. జూన్ 5, 2025న సీసీపీఏ అడ్వయిజరీ జారీ చేసింది. దీని ప్రకారం, అన్ని ఈ-కామర్స్ వేదికలు, ఆన్ లైన్ సర్వీస్ ప్రొవైడర్లు మూడు నెలల్లోపు స్వయంగా ఆడిట్ నిర్వహించాలని ఆదేశించింది. మోసపూరిత చర్యలను గుర్తించి, తొలగించాలని సూచించింది. పారదర్శకత, స్పష్టమైన అంగీకారం, వివరాల స్పష్టత, సరైన విధానాల రూపకల్పనను ఈ అడ్వయిజరీ పేర్కొంది.
పరిశ్రమలు, విద్యాసంస్థలు, వినియోగదారుల సంస్థలతో వివిధ స్థాయిల్లో భాగస్వాముల సంప్రదింపుల తర్వాత, మోసపూరిత డిజిటల్ డిజైన్ ను తొలగించాలన్న లక్ష్యంతో సీసీపీఏ ఒక బలమైన నియంత్రణ వ్యవస్థను రూపొందించింది.
స్వయంగా ఆడిట్ ప్రకటనలను సమర్పించిన వేదికల జాబితా:
-
పేజ్ ఇండస్ట్రీస్ (జాకీ, స్పీడో) - అంతర్గత సమీక్ష. మోసపూరిత విధానాల్లేవు.
-
విలియమ్ పెన్ ప్రైవేట్ లిమిటెడ్ (షీఫర్, లపిస బర్డ్) - అంతర్గత సమీక్ష. మోసపూరిత విధానాల్లేవు.
-
ఫామ్ ఈజీ (అక్సేలియా సొల్యూషన్స్ ప్రైవేడ్ లిమిటెడ్) - మార్గదర్శకాలకు అనుగుణంగా అంతర్గత ఆడిట్ నిర్వహించింది.
-
జెప్టో మార్కెట్ ప్లేస్ ప్రైవేడ్ లిమిటెడ్ - యూఐ, యూఎక్స్ ఆడిటింగ్ జరిగింది. పర్యవేక్షణ కొనసాగుతోంది.
-
కురాడెన్ ఇండియా (కురాప్రాక్స్) - మోసపూరిత చర్యల్లేవని అంతర్గత సమీక్షలో తేలింది.
-
డ్యూరోఫ్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ - ఈ వేదిక నిబంధనలకు అనుగుణంగా ఉందని స్వయంగా నిర్వహించిన ఆడిట్ నివేదించింది.
-
ఫ్లిప్ కార్ట్ ఇంటర్ నెట్ ప్రైవేట్ లిమిటెడ్ - మోసపూరిత విధానాల్లేవని బయటి సంస్థలు నిర్వహించిన అంతర్గత సమీక్ష నిర్ధారించింది.
-
మింత్రా డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ - నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు బయటి సంస్థలు నిర్వహించిన అంతర్గత సమీక్ష తెలిపింది.
-
క్లియర్ ట్రిప్ ప్రైవేట్ లిమిటెడ్ - మోసపూరిత విధానాలేమీ లేవని బయటి సంస్థలు నిర్వహించిన అంతర్గత సమీక్ష నిర్ధారించింది.
-
వాల్ మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ - మోసపూరిత చర్యలు లేవని బయటి సంస్థలు నిర్వహించిన అంతర్గత సమీక్ష చెప్పింది.
-
మేక్ మై ట్రిప్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ - ఈ వేదికకు వినియోగదారుల నుంచి స్పష్టమైన అంగీకారం అవసరం. ముందుగానే టిక్ చేసిన బాక్సులు లేవు.
-
బిగ్ బాస్కెట్ (ఇన్నోవేటివ్ రిటైల్ కాన్సెప్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్) - అంతర్గత సమీక్ష పూర్తి అయింది. దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు.
-
టీరా బ్యూటీ (రిలయన్స్ రిటైల్ లిమిటెడ్) - నిబంధనలకు కట్టుబడి ఉన్నట్లు అంతర్గత సమీక్ష తెలిపింది.
-
జియోమార్ట్ (రిలయన్స్ రిటైల్ లిమిటెడ్) - మోసపూరిత విధానాల నుంచి ఈ వేదిక విముక్తి పొందింది. పర్యవేక్షణ కొనసాగుతోంది.
-
రిలయన్స్ జ్యూవెల్స్ - పూర్తి నిబంధనలు పాటిస్తున్నట్లు ప్రకటించింది.
-
అజియో - మోసపూరిత విధానాల్లేవు, పరిశీలన కొనసాగుతోంది.
-
రిలయన్స్ డిజిటల్ - నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు అంతర్గత పరిశీలనలో తేలింది.
-
నెట్ మెడ్స్ - మోసపూరిత విధానాల నుంచి బయటపడింది.
-
హమ్ లేస్ - నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు అంతర్గత సమీక్షలో తేలింది.
-
మిల్ బాస్కెట్ - నిబంధనలను పాటిస్తుంది.
-
స్విగ్గీ లిమిటెడ్ - స్వయంగా అంతర్గత సమీక్షను పూర్తి చేసింది. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ప్రాధాన్యత.
-
టాటా 1ఎంజీ - అంతర్గత సమీక్షను సమగ్రంగా చేశారు. వినియోగదారుడి తీరుకు అనుగుణంగా ఈ వేదికను రూపొందించారు.
-
జొమాటో - సీసీపీఏ సూచనతో అంతర్గత పరిశీలన ద్వారా ఈ వేదికను ధ్రువీకరిస్తుంది.
-
బ్లింకిట్ - పారదర్శకమైన, బాధ్యతాయుతమైన రూపకల్పనను అంతర్గత సమీక్ష నిర్ధారించింది.
-
ఇక్సిగో - మోసపూరిత చర్యలు లేవు. అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉంది.
-
మీషో లిమిటెడ్ - సీసీపీఏ గుర్తించిన 13 మోసపూరిత విధానాలు లేవని నిర్ధారించింది. క్రమం తప్పకుండా స్వయంగా తనిఖీలు నిర్వహిస్తోంది.
***
(Release ID: 2192242)
Visitor Counter : 3