ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ సదస్సు-2025లో ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
19 NOV 2025 6:53PM by PIB Hyderabad
నమస్కారం!
తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్. రవి, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు శ్రీ ఎల్. మురుగన్, తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్. కె. రామస్వామి, వివిధ వ్యవసాయ సంస్థల నుంచి ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులు, ప్రజాప్రతినిధులు, నా ప్రియమైన రైతు సోదరీ, సోదరులు, డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ కార్యక్రమంతో అనుసంధానమైన లక్షలాదిమంది రైతులు! మీ అందరికీ వణక్కం! నమస్కారం! ముందుగా, ఇక్కడ ఉన్న మీ అందరికీ, దేశవ్యాప్తంగా ఉన్న నా రైతు సొదరీ, సోదరులకు నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నేను ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు ఒక గంట ఆలస్యం అయ్యింది. ఎందుకంటే ఈ రోజు ఉదయం నేను సత్య సాయిబాబాకు అంకితం చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు పుట్టపర్తిలో ఉన్నాను. అక్కడ ఆ కార్యక్రమం ఊహించిన దాని కంటే ఎక్కువ సమయం కొనసాగింది. అందుకే, నేను రావడానికి ఆలస్యం అయ్యింది. దీనివల్ల మీకు ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే హృదయపూర్వకంగా క్షమించాలి. దేశం నలుమూలల నుంచి ఎంతో మంది ఎదురు చూస్తున్నారనే విషయం నాకు తెలుసు. అందుకే వినయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నాను.
నేను పాండియన్ గారి ప్రసంగం వింటున్నప్పుడు…. చిన్నప్పుడే ఎవరైనా నాకు తమిళం నేర్పించి ఉంటే బాగుండేదనీ, అప్పుడు నేను ఆయన ప్రసంగాన్ని మరింత ఆస్వాదించేవాడిననీ అనిపించింది. కానీ నాకు ఆ అదృష్టం దక్కలేదు. అయినా, నేను అర్థం చేసుకోగలిగినంత వరకు, ఆయన జల్లికట్టు గురించి, కోవిడ్ కాలంలో ఎదుర్కొన్న కష్టాల గురించి మాట్లాడినట్టు నేను గ్రహించాను. పాండియన్ గారి ప్రసంగాన్ని హిందీ, ఆంగ్ల భాషల్లోకి అనువదించి పంపమని నేను రవి గారిని కోరాను. నేను దానిని చదవాలని అనుకుంటున్నాను. నేను ఆయన భావోద్వేగాన్ని పూర్తిగా గ్రహించగలిగాను. అది నాకు చాలా ప్రత్యేకమైన క్షణం. నేను ఇక్కడ వేదికపైకి వచ్చినప్పుడు, చాలా మంది రైతు సోదరీ, సోదరులు వారి మెడలోని కండువాలను ఊపుతూ ఉండటం గమనించాను. నేను ఇక్కడికి చేరుకోకముందే బీహార్ గాలి ఇక్కడికి చేరినట్లు అనిపించింది.
నా ప్రియమైన రైతు సోదరీ, సోదరులారా,
కోయంబత్తూరు పవిత్ర భూమిపై, ముందుగా నేను మరుధామలైలోని మురుగన్ దేవునికి నమస్కరిస్తున్నాను. కోయంబత్తూరు సంస్కృతి, కరుణ, సృజనాత్మకతకు నిలయం. ఈ నగరం దక్షిణ భారతదేశ పారిశ్రామిక శక్తికి కేంద్రంగా ఉంది. ఇక్కడి వస్త్ర పరిశ్రమ మన దేశ ఆర్థికవ్యవస్థకు ఎంతగానో తోడ్పడుతోంది. ఇప్పుడు, కోయంబత్తూరు మరింత ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే దీని మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా మనందరికీ మార్గనిర్దేశం చేస్తున్నారు.
మిత్రులారా,
ప్రకృతి వ్యవసాయం నా హృదయానికి చాలా దగ్గరైన అంశం. ఈ అద్భుతమైన దక్షిణ భారతదేశ ప్రకృతి వ్యవసాయ సదస్సును నిర్వహిస్తున్నందుకు తమిళనాడులోని రైతు సోదరీ, సోదరులందరినీ నేను అభినందిస్తున్నాను. ఇప్పుడే ప్రదర్శనను సందర్శించే అవకాశం నాకు లభించింది. చాలామంది రైతులతో కూడా మాట్లాడాను. కొంతమంది మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, పీహెచ్‌డీలు చేసి, ఆ తర్వాత వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. మరికొంతమంది నాసాలో చంద్రయాన్‌కు సంబంధించిన ప్రతిష్ఠాత్మకమైన పనిని వదిలిపెట్టి మరీ వ్యవసాయం చేస్తున్నారు. వారు కేవలం సొంతంగా సాగు చేయడమే కాకుండా, అనేకమంది ఇతర రైతులకు, యువతకు శిక్షణ కూడా ఇస్తున్నారు. ఈ రోజు, నేను బహిరంగంగా ఒక విషయం అంగీకరించాలి. నేను ఈ కార్యక్రమానికి రాకపోయి ఉంటే, నా జీవితంలో చాలా ముఖ్యమైన దాన్ని కోల్పోయి ఉండేవాడిని. ఈ రోజు నేను ఇక్కడ చాలా నేర్చుకున్నాను. తమిళనాడు రైతుల ధైర్యానికి, మార్పును స్వీకరించే వారి బలానికి నేను మనస్ఫూర్తిగా వందనం చేస్తున్నాను. ఇక్కడ, రైతు సొదరీ, సోదరులు వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశ్రమ భాగస్వాములు, స్టార్టప్‌లు, ఆవిష్కర్తలు అందరూ ఒకే చోటకు వచ్చారు. మీ అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
మిత్రులారా,
రాబోయే సంవత్సరాల్లో భారతీయ వ్యవసాయంలో అనేక పెద్ద మార్పులు చోటుచేసుకోవడాన్ని నేను చూస్తున్నాను. ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచ కేంద్రంగా మారే దిశగా భారత్ పయనిస్తోంది. మన జీవవైవిధ్యం కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. దేశంలోని యువత ఇప్పుడు వ్యవసాయాన్ని ఆధునికమైన, విస్తరించదగిన అవకాశంగా చూస్తున్నారు. ఇది మన దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అపారమైన శక్తిని ఇవ్వబోతోంది.
నా రైతు సోదరీ, సోదరులారా,
గత 11 సంవత్సరాలలో, దేశంలోని మొత్తం వ్యవసాయ రంగం ఒక పెద్ద మార్పునకు లోనైంది. మన వ్యవసాయ ఎగుమతులు దాదాపుగా రెట్టింపు అయ్యాయి. వ్యవసాయాన్ని ఆధునికీకరించడానికి రైతులకు ప్రభుత్వం ప్రతి అవకాశాన్ని కల్పించింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ ఒక్క సంవత్సరంలోనే రైతులకు రూ.10 లక్షల కోట్ల పైగా సహాయం అందింది. రూ.10 లక్షల కోట్ల మొత్తం చిన్న మొత్తం ఎంతమాత్రం కాదు. ఏడు సంవత్సరాల కిందట పశుపోషణ రైతులను, మత్స్యకారులను కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం లో చేర్చిన తర్వాత, వారు కూడా దీని ద్వారా ఎంతగానో లబ్ధి పొందారు. జీవ ఎరువులపై జీఎస్టీని తగ్గించడం కూడా రైతులకు గణనీయమైన ప్రయోజనాలను అందించింది.
మిత్రులారా,
కొద్దిసేపటి కిందట, దేశ రైతులకు సంబంధించిన పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి తదుపరి విడతను ఇక్కడి నుంచే విడుదల చేశాం. దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ. 18,000 కోట్లు జమ అయ్యాయి. ఇక్కడ తమిళనాడులో కూడా లక్షలాది మంది రైతులకు పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద డబ్బు అందింది.
మిత్రులారా,
ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న చిన్న రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఇప్పటివరకు రూ. 4 లక్షల కోట్లు నేరుగా బదిలీ అయ్యాయి. ఈ మొత్తం రైతులకు వ్యవసాయానికి సంబంధించిన వివిధ అవసరాలను తీర్చడానికి సహాయపడింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న కోట్ల మంది రైతు సోదరీ, సోదరులకు నా హృదయపూర్వక అభినందనలు. వెనుక వైపున ఇద్దరు బాలికలు చాలాసేపటి నుంచి ప్లకార్డులు పట్టుకొని నిలబడి ఉన్నారు. వారి చేతులు అలసిపోతాయి. భద్రతా సిబ్బంది ఆ ప్లకార్డులను వారి నుంచి తీసుకుని నాకు అందించాలని కోరుతున్నాను. వారి సందేశం ఏదైనా సరే, నేను దాని పట్ల శ్రద్ధ పెడతాను. దయచేసి వాటిని తెచ్చి నాకివ్వండి.
ధన్యవాదాలు, అమ్మాయీ! ఇంతసేపు నీ చేయిని పైకెత్తి నిలబడి ఉన్నావు.
మిత్రులారా,
ప్రకృతి వ్యవసాయం విస్తరణ 21వ శతాబ్దపు వ్యవసాయానికి అవసరం. సంవత్సరాలుగా, పెరుగుతున్న డిమాండ్ కారణంగా పొలాల్లో, వ్యవసాయ సంబంధిత అనేక రంగాలలో రసాయనాల వినియోగం వేగంగా పెరిగింది. రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం కారణంగా భూసారం తగ్గిపోతోంది. నేలలోని తేమ దెబ్బతింటోంది. వీటన్నింటితో పాటు ప్రతి సంవత్సరం వ్యవసాయ ఖర్చు పెరుగుతూనే ఉంది. దీనికి పరిష్కారం పంటల వైవిధ్యం, ప్రకృతి వ్యవసాయంలోనే ఉంది.
మిత్రులారా,
మన భూసారాన్ని, పంటల పోషక విలువను పునరుద్ధరించడానికి మనం ప్రకృతి వ్యవసాయం మార్గంలో ముందుకు సాగాలి. ఇది అవసరం కూడా. అప్పుడే మనం మన జీవవైవిధ్యాన్ని భవిష్యత్తు తరాల కోసం కాపాడగలుగుతాం. ప్రకృతి వ్యవసాయం వాతావరణ పరిస్థితులలోని మార్పులను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఇది మన నేలను ఆరోగ్యంగా ఉంచుతుంది. హానికరమైన రసాయనాల నుంచి ప్రజలను రక్షిస్తుంది. నేటి ఈ కార్యక్రమం ఈ దిశగా ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతోంది.
మిత్రులారా,
ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టేందుకు మా ప్రభుత్వం దేశంలోని రైతులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తోంది. సంవత్సరం కిందటే కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌ను ప్రారంభించింది. ఇప్పటికే లక్షలాది మంది రైతులు ఇందులో చేరారు. దీని సానుకూల ప్రభావం ముఖ్యంగా దక్షిణ భారతదేశం అంతటా కనిపిస్తోంది. ఇక్కడ తమిళనాడులోనే దాదాపు 35,000 హెక్టార్ల భూమి సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం కింద ఉంది.
మిత్రులారా,
ప్రకృతి వ్యవసాయం భారతదేశ దేశీయ భావన. మనం దీనిని ఎక్కడ నుంచీ దిగుమతి చేసుకోలేదు. ఇది మన సొంత సంప్రదాయాల నుంచి నుండి ఉద్భవించింది. మన పూర్వీకులు దీనిని గొప్ప నిబద్ధతతో అభివృద్ధి చేశారు. ఇది మన పర్యావరణానికి పూర్తిగా సరిపోతుంది. దక్షిణ భారతదేశంలోని రైతులు పంచగవ్య, జీవామృతం, బీజామృతం, ఆచ్చాదన వంటి సాంప్రదాయ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఇప్పటికీ అనుసరిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ పద్ధతులు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పంటలను రసాయన రహితంగా ఉంచుతాయి. సాగు ఖర్చులను గణనీయంగా తగ్గిస్తాయి.
మిత్రులారా,
ప్రకృతి వ్యవసాయాన్ని మనం శ్రీ అన్న - చిరుధాన్యాల సాగుతో కలిపినప్పుడు, అది భూమి తల్లిని రక్షించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. తమిళనాడులో, మురుగన్ దేవుడికి కూడా తేనుం తినై మావుం (తేనె, చిరుధాన్యాల పిండితో చేసిన పవిత్ర నైవేద్యం) సమర్పిస్తారు. తమిళ ప్రాంతాలలో కంబు (సజ్జలు), సామై (సామలు), కేరళ, కర్ణాటకలో రాగి, తెలుగు మాట్లాడే రాష్ట్రాలలో సజ్జ, జొన్న మరికొన్ని ఆహారంలో భాగమై ఉన్నాయి. ఈ సూపర్ ఫుడ్ ప్రపంచ మార్కెట్లకు చేరుకునేలా చూడటానికి మా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వాటికి ప్రపంచ ఆమోదాన్ని పెంచడంలో ప్రకృతి వ్యవసాయం, రసాయన రహిత వ్యవసాయం ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి. అందువల్ల, ఈ అంశానికి సంబంధించిన ప్రయత్నాల గురించి ఈ సదస్సులో కచ్చితంగా చర్చిస్తారని నేను నమ్ముతున్నాను.
మిత్రులారా,
ఒకే పంట సాగుకు బదులుగా బహుళ పంటల వ్యవసాయాన్ని నేను ఎప్పుడూ ప్రోత్సహిస్తాను. దీనికి సంబంధించి దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల నుంచి మనం గొప్ప స్ఫూర్తిని పొందుతాం. కేరళ లేదా కర్ణాటకలోని కొండ ప్రాంతాలకు వెడితే బహుళ అంచెల వ్యవసాయం ఉదాహరణలను చూడవచ్చు. ఒకే పొలంలో కొబ్బరి చెట్లు, పోక (వక్క) చెట్లు, పండ్ల మొక్కలు ఉంటాయి. దీని అర్థం, సరైన ప్రణాళికతో చిన్న విస్తీర్ణంలో బహుళ పంటలను పండించవచ్చు. ఇదే ప్రకృతి వ్యవసాయం ప్రాథమిక సిద్ధాంతం. మనం ఈ వ్యవసాయ నమూనాను అఖిల భారత స్థాయికి తీసుకువెళ్లాలి. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ పద్ధతులను ఎలా అమలు చేయవచ్చో పరిశీలించాలని నేను రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరుతున్నాను.
మిత్రులారా,
దక్షిణ భారతదేశం వ్యవసాయానికి ఒక సజీవ విశ్వవిద్యాలయంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, ఇప్పటికీ పనిచేస్తున్న ఆనకట్టలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. కళింగరాయన్ కాలువను ఇక్కడ 13వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడి ఆలయ కోనేరులు వికేంద్రీకృత నీటి సంరక్షణ వ్యవస్థలకు ఆదర్శంగా నిలిచాయి. నదీ జలాలను నియంత్రించి, వాటిని వ్యవసాయానికి ఉపయోగించే శాస్త్రీయ నమూనాను ఈ నేల అభివృద్ధి చేసింది. వేల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతం అధునాతన నీటి ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. అందువల్ల, దేశానికి, ప్రపంచానికి కూడా ప్రకృతి వ్యవసాయంలో నాయకత్వం ఈ ప్రాంతం నుంచే ఉద్భవిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను.
మిత్రులారా,
'వికసిత భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) కోసం భవిష్యత్ సుస్థిర వ్యవసాయ వ్యవస్థను నిర్మించడానికి మనమందరం కలిసి పనిచేయాలి. ఒక సీజన్‌లో ఒక ఎకరంతో ప్రకృతి సేద్యం ప్రారంభించాలని దేశవ్యాప్తంగా ఉన్న నా రైతు సోదరీసోదరులను, ముఖ్యంగా తమిళనాడులోని నా రైతు మిత్రులను నేను కోరుతున్నాను. అంటే, ఒక సీజన్‌లో కేవలం ఒక ఎకరంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రయత్నించండి. మీ పొలంలో ఒక మూలను ఎంచుకుని, ప్రయోగం చేయండి. దాని ఫలితాల ఆధారంగా, వచ్చే సంవత్సరం దానిని విస్తరించండి. మూడో సంవత్సరం మరింత విస్తరించండి. అలా ముందుకు సాగండి. ప్రకృతి వ్యవసాయాన్ని వ్యవసాయ పాఠ్యాంశాలలో ఒక ముఖ్యమైన భాగంగా చేయాలని శాస్త్రవేత్తలు, పరిశోధనా సంస్థలను కూడా కోరుతున్నా. గ్రామాలకు వెళ్ళండి. రైతుల పొలాలను మీ ప్రయోగశాలలుగా చేసుకోండి. మనం ప్రకృతి వ్యవసాయాన్ని సైన్సు ఆధారిత ఉద్యమంగా మార్చాలి. ప్రకృతి వ్యవసాయం కోసం ప్రచారంలో రాష్ట్ర ప్రభుత్వాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల పాత్ర చాలా ముఖ్యమైనది. గత కొన్ని సంవత్సరాలలో, దేశంలో 10,000 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్ పీఓ) ఏర్పడ్డాయి. ఎఫ్ పీఓల సహాయంతో, మనం రైతుల చిన్న సమూహాలను సృష్టించవచ్చు. మనం స్థానికంగా శుభ్రపరచడం, ప్యాకేజింగ్, ప్రాసెసింగ్ సదుపాయాలను అందించాలి. వాటిని ఈ-నామ్ వంటి ఆన్‌లైన్ మార్కెట్లకు నేరుగా అనుసంధానించాలి. ఇది ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు కలిగే ప్రయోజనాలను గణనీయంగా పెంచుతుంది. మన రైతుల సాంప్రదాయ పరిజ్ఞానం, సైన్సు సామర్ధ్యం, ప్రభుత్వ మద్దతు కలిస్తే మన రైతులకు సౌభాగ్యం తో పాటు మన నేలతల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
మిత్రులారా,
ఈ సదస్సు, ప్రత్యేకించి మన రైతు సోదరీ, సోదరులు చూపించిన నాయకత్వం దేశంలో ప్రకృతి వ్యవసాయానికి ఒక నూతన దిశానిర్దేశం చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఇక్కడి నుంచి కొత్త ఆలోచనలు, కొత్త పరిష్కారాలు రావాలి. ఈ నమ్మకంతో మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చాలా ధన్యవాదాలు!
నాతో కలసి చెప్పండి:
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
ధన్యవాదాలు!
***
(Release ID: 2192042)
Visitor Counter : 9
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam