ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని దేడియాపడలో ‘ధర్తీ ఆబా’ భ‌గ‌వాన్ బిర్సా ముండా 150వ జ‌యంతి వేడుక‌ల్లో భాగమైన గిరిజ‌న ఆత్మ‌గౌర‌వ దినోత్స‌వం ముఖ్యాంశాల‌ను ప్ర‌జ‌ల‌తో పంచుకున్న ప్ర‌ధానమంత్రి

Posted On: 15 NOV 2025 10:23PM by PIB Hyderabad

గుజరాత్‌లోని దేడియాపడలో ‘ధర్తీ ఆబా’ భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకల్లో భాగమైన గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక ప్రత్యేక సందేశంలో:

“గుజరాత్‌లోని దేడియాపడలో ఇవాళ భగవాన్ బిర్సా ముండా కుటుంబ సభ్యులతో ముచ్చటించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.”

“గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం సందర్భంగా గుజరాత్‌లో గిరిజన వారసత్వాన్ని దేశవ్యాప్తంగా ప్రస్ఫుటం చేస్తూ నిర్వహించిన ఉత్సాహభరిత సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి.”

“అలాగే దేడియాపడలో గిరిజన బాలలకు సౌలభ్య, సురక్షిత విద్యనందించడం లక్ష్యంగా భగవాన్ బిర్సా ముండా పేరిట గిరిజన రవాణా బస్సులను ప్రారంభించే భాగ్యం నాకు దక్కింది.”

“గుజరాత్‌లోని దేడియాపడలో వేడుకలతోపాటు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనకు హాజరైన నా సోదరీసోదరులలో కనిపించిన ఆనందోత్సాహాలను బట్టి గిరిజనం కోసం మేం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై వారెంత సంతోషంగా ఉన్నారో స్పష్టమవుతోంది.”

“రాముడితో అనుబంధంగల మన గిరిజనాన్ని కాంగ్రెస్ పార్టీ వారి ఖర్మకు వదిలేసింది. మరోవైపు  విద్య, ఆరోగ్యం, గృహనిర్మాణం, అనుసంధానం వంటి సౌకర్యాలతో వారికి జీవనసౌలభ్యం కల్పించేందుకు ‘ఎన్‌డీఏ’ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది.”

“నా గిరిజన సోదరీసోదరుల సంక్షేమానికి భరోసా ఇస్తానని భగవాన్‌ బిర్సా ముండా జన్మభూమిలో మట్టిని నుదుటన తిలకంగా దిద్దుకుని మరీ నేను ప్రతిజ్ఞ చేశాను. ఆ మేరకు ‘పీఎం-జన్మాన్ యోజన’తోపాటు ‘ధర్తీ ఆబా జన్‌జాతి గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్‌’ వంటి కార్యక్రమాలతో ఆ ప్రతిన నెరవేరుతోంది.”

“మన గిరిజన సోదరీసోదరుల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరచడమే కాకుండా వారి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యనూ పరిష్కరించడానికి మేం కృషి చేస్తున్నాం. ఇందుకు ఒకటీరెండూ కాదు... అనేక నిదర్శనాలున్నాయి.” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***


(Release ID: 2191041) Visitor Counter : 7