వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ముంబైలో ఆసియా విత్తన కాంగ్రెస్ 2025ను ప్రారంభించిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్


విత్తన సంబంధిత విషయాల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ప్రైవేటు రంగాన్ని కోరిన శ్రీ చౌహాన్

పెరుగుతున్న విత్తనాల ధరలను నియంత్రించడం, నాణ్యత సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించడంతో పాటు, దోషులపై చర్యలు తీసుకుంటాం: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

రాబోయే బడ్జెట్ సమావేశాల్లో విత్తనాలు, పురుగు మందులకు సంబంధించిన కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం

ప్రభుత్వానికి చెందిన సాథి పోర్టల్‌లోకి లాగిన్ అయి దానిలోని సౌకర్యాలను ఉపయోగించుకోవాలని కేంద్రమంత్రి విజ్ఞప్తి

ఆసియా విత్తన కాంగ్రెస్ 2025 లోగో ఆవిష్కరణ

Posted On: 17 NOV 2025 4:12PM by PIB Hyderabad

ముంబైలో ఆసియా విత్తన కాంగ్రెస్ 2025ను నేడు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనే ఆసియా విత్తన కాంగ్రెస్ 2025 లోగోను కూడా ఆవిష్కరించారు. ‘‘నాణ్యమైన విత్తనాల ద్వారా సమృద్ధికి బీజం వేయడం’’.. ఈ ఏడాది కాంగ్రెస్ ఇతివృత్తం .

 దేశ ఆహార భద్రతను కాపాడటం, ప్రజలకు పోషకాహారాన్ని అందించడం, రైతులకు వ్యవసాయం లాభదాయకమైన వ్యాపారంగా ఉండేలా చూడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రతి హెక్టారుకు ఉత్పాదకతను పెంచడం, రైతులకు మంచి విత్తనాలను అందించడం, ఉత్పత్తి వ్యయాలను తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. రైతుల ఉత్పత్తులకు న్యాయమైన ధరలు కల్పించడం, అవసరమైనప్పుడు వాటికి పరిహారం ఇవ్వడం, వ్యవసాయ పద్ధతుల వైవిధ్యీకరణపై దృష్టి పెట్టడం వంటి వాటికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చిందని ఆయన తెలిపారు.

తీవ్రమైన పోషకాహార లోపం సమస్యను అధిగమించడానికి.. వాతావరణ మార్పులను తట్టుకునే బయో-ఫోర్టిఫైడ్ పంట రకాలను అభివృద్ధి చేయడానికి భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్), వివిధ రాష్ట్ర సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఉన్నత నాణ్యత గల విత్తనాల అభివృద్ధికి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు రంగ సహకారం అవసరమని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. భారత వ్యవసాయ రంగానికి ప్రైవేటు రంగం నుంచి వచ్చే విత్తనాలు ఖరీదైనవని, మన రైతుల్లో ఎక్కువ మంది ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందినవారు కాబట్టి, వారు ఈ విత్తనాలను కొనుగోలు చేయలేరని చెప్పారు. అందుకే తమ విత్తనాల ధరలను మరింత సరసమైనవిగా మార్చాలని ప్రైవేటు రంగానికి విజ్ఞప్తి చేశారు.

ప్రతి సంవత్సరం మార్చాల్సిన అవసరం లేని విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచితే, వ్యయసాయ సమాజానికి ఒక పెద్ద సమస్య పరిష్కారమవుతుందన్నారు. సామర్థ్యం లేని లేదా తక్కువ నాణ్యత గల విత్తనాల సమస్యను సంస్థలు పరిష్కరించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

రైతులందరూ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రారంభించిన సాథి పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలని, ఇందులో అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకోవాలని  శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పులకు తట్టుకునే పంటలను అభివృద్ధి చేయడం అత్యవసరమని ఆయన అన్నారు. మన దేశంలో 15 వ్యవసాయ-వాతావరణ మండలాలు ఉన్నాయని, అందువల్ల కరువు, వేడి, పురుగుమందులను తట్టుకోగల రకాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.. జీనోమ్ ఎడిటింగ్  అధునిక సాంకేతికతను ఉపయోగించి రెండు రకాల వరిని అభివృద్ధి చేశామని, ఇది తక్కువ నీటి వినియోగంతో ఉత్పాదకతను 19 నుండి 40 శాతం పెంచుతుందని, కార్బన్ ఉద్గారాలను కూడా తగ్గిస్తుందని ఆయన తెలియజేశారు.

 

 

 

విత్తన ఉత్పత్తిదారులతో మాట్లాడుతూ.. తృణ ధాన్యాల రంగంలో మరింత పరిశోధన, అభివృద్ధిపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచాలని ప్రైవేటు సంస్థలకు సూచించారు. కొత్త విత్తనాలను మార్కెట్‌కు తీసుకురావడానికి పట్టే సమయాన్ని ఎలా తగ్గించవచ్చో పరిశీలించాలని ఆయన సంస్థలను కోరారు. ఈ విత్తనాలను పరీక్షించడానికి అవసరమైన సమయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. విత్తన పరీక్షల ఖర్చు కూడా ఎక్కువగా ఉందని, ఈ విషయంలో ప్రభుత్వం ప్రైవేటు రంగంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. విత్తనాల విషయంలో తప్పుడు చర్యలు తీసుకునే వారిని, అక్రమ వ్యాపారం చేసే వారిని ఎప్పటికీ క్షమించబోమని హెచ్చరించారు. అలాంటి వారిని అరికట్టించేందుకు ప్రభుత్వం, ప్రైవేటు రంగం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

విత్తన రంగంలో వస్తోన్న ఆధునిక మార్పులు, సమస్యలను పరిష్కరించేందుకు ఆసియా విత్తన సమావేశం 2025 అత్యంత కీలకమని భారత జాతీయ విత్తన సంఘం (ఎన్ఎస్ఏఐ) చైర్మన్ శ్రీ ఎన్ ప్రభాకర్ రావు తెలిపారు. భారత విత్తన పరిశ్రమ సమాఖ్య (ఎఫ్ఎస్ఐఐ) చైర్మన్ శ్రీ అజయ్ రాణా, ఆసియా, పసిఫిక్ విత్తన సంఘం (ఎపీఎస్ఈ) అధ్యక్షుడు శ్రీ టేక్ వాహ్‌కో సంయుక్తంగా కాంగ్రెస్‌కు సహ అధ్యక్షత వహిస్తున్నారు.

ప్రభుత్వ విభాగంలో విత్తన రంగానికి చేసిన కృషికి బయోటెక్నాలజీ, జన్యు శాస్త్రవేత్త శ్రీ త్రిలోచన్ మోహపాత్రను ఈ సందర్భంగా  సత్కరించారు.

నవంబర్ 17 నుంచి 21 వరకు జరగనున్న ఆసియా విత్తన కాంగ్రెస్ 2025లో అనేక సమాచార కార్యాక్రమాలు నిర్వహించనున్నారు. నేడు కాంగ్రెస్ మొదటి రోజు సమావేశంలో భాగంగా ఒక వర్క్‌షాప్ నిర్వహించారు. నవంబర్ 20, 2025న  వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది.

 

***


(Release ID: 2191033) Visitor Counter : 4