ఆర్థిక మంత్రిత్వ శాఖ
అక్రమంగా దిగుమతి చేసుకున్న 30,000 టపాసులను ముంద్రా ఓడరేవులో స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ బాణసంచా విలువ రూ.5 కోట్లు.. ఒకరి అరెస్టు
Posted On:
17 NOV 2025 9:40AM by PIB Hyderabad
చైనాలో తయారు చేసిన బాణసంచాను మన దేశంలోకి అక్రమంగా దిగుమతి చేసుకొనే యత్నాన్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) విజయవంతంగా అడ్డుకుంది. చట్టవిరుద్ధంగా దిగుమతి చేసుకోవడాన్ని అరికట్టడానికి నిర్వహిస్తున్న ‘‘ఫైర్ ట్రయల్’’ కార్యకలాపాల్లో ఇది ఒక భాగం.

చైనా నుంచి వస్తున్న 40 అడుగుల కంటెయినర్ ను ముంద్రా ఓడరేవులో డీఆర్ఐ అధికారులు అడ్డుకున్నారు. ఆ కంటెయినర్లో నీళ్ల గ్లాసులు, పూల కుండీలు ఉన్నాయని మొదట సమాచారాన్ని ఇచ్చారు. అడుగున 30,000 టపాసులను ఉంచి, పైవరుసలో నీళ్ల గ్లాసులను ఉంచారు. ఇంతకు ముందూ, గత నెలలో ట్యూటికొరిన్, ముంబయిల్లో చైనా టపాసులను చట్టవిరుద్ధంగా దిగుమతి చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలను కూడా డీఆర్ఐ విజయవంతంగా అడ్డుకుంది.
విదేశీ వాణిజ్య విధానంలోని ఐటీసీ (హెచ్ఎస్) వర్గీకరణ ప్రకారం టపాసుల దిగుమతిపై నియంత్రణ ఉంది. దీని కోసం పేలుడు పదార్థాల నియమావళి-2008లో భాగంగా విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ (డీజీఎఫ్టీ) నుంచీ, పెట్రోలియం, ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పీఈఎస్ఓ) నుంచీ లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, దిగుమతిదారు సంస్థ వద్ద ఎలాంటి లైసెన్సులూ లేవు. డబ్బు కోసమే సరుకుల్ని అడ్డదారిలో రవాణా చేసినట్లుగా సంస్థ ఒప్పుకుంది. దీంతో, దిగుమతి చేసుకొన్న
టపాసులనూ, వాటిని రవాణా కోసం ఉపయోగించిన కంటెయినర్, ఇతర సరుకులు సహా కస్టమ్స్ చట్టం-1962 ప్రకారం ఈ నెల 15న స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.5 కోట్లు ఉంటుందని అంచనా. ఈ లావాదేవీకి సూత్రధారిగా ఉండడమే కాక ఆర్థికసాయాన్నందించిన వ్యక్తిని అరెస్టు చేశారు.
ప్రమాదకరమైన వస్తువులను చట్టవిరుద్ధంగా దిగుమతి చేసుకోవడం- జాతిభద్రతకూ, ప్రజలకూ, కీలక ఓడరేవులకే కాకుండా విస్తృత నౌకాయానానికీ, ఆధునిక వస్తు రవాణా వ్యవస్థకూ కూడా తీవ్ర ముప్పును తెచ్చిపెడుతుంది. వ్యవస్థీకృత దొంగరవాణా ముఠాలను పసిగట్టి వాటి భరతం పట్టి, ప్రమాదకరమైన వస్తువుల ప్రభావం నుంచి ప్రజలను రక్షించడమే కాకుండా మన దేశ వాణిజ్య, భద్రతా సంబంధిత అనుబంధ విస్తారిత వ్యవస్థ సమగ్రతను పరిరక్షించాలన్న తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి డీఆర్ఐ కట్టుబడి ఉంది.
***
(Release ID: 2191021)
Visitor Counter : 5