కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
టెలికం విడిభాగాల రంగంలో 25 బిలియన్ అమెరికా డాలర్ల విలువైన అవకాశాలు
దేశంలో తయారుచేయాలంటూ ప్రోత్సహించిన కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని
ఆలోచనా విధానంలో మార్పు భారత్ ప్రగతికి దన్ను
రాబోయే దశాబ్దానికి రూపురేఖలను ఇవ్వడంలో సాయపడాల్సిందిగా పారిశ్రామిక జగతికి డాక్టర్ చంద్రశేఖర్ పిలుపు
భారత్‌లో పెట్టుబడులకు తదుపరి ప్రధాన గమ్యస్థానం ఆంధ్రప్రదేశేనని స్పష్టం చేసిన డాక్టర్ చంద్రశేఖర్
Posted On:
14 NOV 2025 11:38AM by PIB Hyderabad
‘‘భారత్ ప్రగతి గాథను రాయడంలో సహకరించాల్సింది’’గా ప్రపంచ పెట్టుబడిదారు సంస్థలను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. ఆలోచనా విధానంలో వచ్చిన పెద్ద పరివర్తన గత పదేళ్లలో దేశంలో మార్పు చోటుచేసుకోవడానికి కారణమైందని ఆయన అన్నారు.
విశాఖపట్నంలో నిర్వహించిన భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) భాగస్వామ్య సదస్సులో ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ పాల్గొన్నారు. సదస్సులో మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ఆలోచనతోనూ, అవగాహనతోనూ విధానాలను రూపొందించడం, దృఢసంకల్పంతో వాటిరి అమలు చేయడం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రతిభాపాటవాలూ... వీటన్నింటి ఫలితమే భారత్ ప్రస్తుత ప్రగతి ప్రస్థానమని వివరించారు.
టెలికం విడిభాగాల తయారీలో 25 అమెరికా డాలర్ల విలువైన అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. త్వరితగతిన ఆమోదాలు తెలిపేందుకూ, కొత్త పెట్టుబడులకు తోడ్పడేందుకూ కమ్యూనికేషన్ల శాఖ సిద్ధంగా ఉందన్నారు.
భారత్‌లో పెట్టుబడి పెట్టడం అంటే అది ప్రపంచంలో చాలా వేగంగా ఎదుగుతున్న మధ్యతరగతి ప్రజానీకంతో అనుబంధాన్ని ఏర్పరుచుకోవడమే కాకుండా, కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచ వాణిజ్యానికి ఊతాన్ని అందించగల అభివృద్ధి గాథలో కూడా పాలుపంచుకోవడమేనని ఆయన స్పష్టం చేశారు. ‘‘ప్రవాహంతో భారత్ కలిసి ప్రయాణించడం మాత్రమేనా, కాదు.. భారతే ఒక ప్రవాహం’’ అని ఆయన వర్ణించారు. భారత్ ఆర్థిక పురోగతిలో ఒక కొత్త అధ్యాయాన్ని చేర్చడానికి ముందుకు రావాల్సిందిగా పరిశ్రమ రంగానికి మంత్రి పిలుపునిచ్చారు.
లైసెన్స్ రాజ్ మనస్తత్వం నుంచి బయటపడి నమ్మకానికే ప్రాధాన్యాన్నిచే మనస్తత్వాన్ని ఏర్పరుచుకునే దిశగా భారత్ ముందుకు కదిలిందని కేంద్ర మంత్రి చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను అనుమానాల చూపులతో చూసే బదులు, వారిని దేశ నిర్మాతలుగా గౌరవిస్తోందన్నారు.
ముఖ్య సంస్కరణలను గురించి ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా మౌలిక సదుపాయాల కల్పన రంగంలో 1.4 ట్రిలియన్ అమెరికా డాలర్ల మేర పెట్టుబడి పెట్టడం, 26 బిలియన్ అమెరికా డాలర్ల విలువైన పీఎల్ఐ పథకాలు తీసుకురావడం, కార్మిక చట్టాలను సులభతరం చేయడం, గత కాలానికి వర్తించే పన్నుల విధానాన్ని రద్దు చేయడం, జీఎస్టీ ఆధారిత జాతీయ మార్కెట్ ఏకీకరణతో పాటు ఇన్‌సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీ కోడ్ గురించి మంత్రి వివరించారు. ఈ సంస్కరణలు భారత్‌ను వినియోగదారు దేశం అనే స్థితి నుంచి మార్చేసి, నమ్మకం పెట్టుకోదగ్గ ప్రపంచ తయారీదారుగా, భాగస్వామ్య దేశంగా తీర్చిదిద్దాయని మంత్రి చెప్పారు.
భాగస్వామ్య సదస్సును నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను గురించి డాక్టర్ చంద్రశేఖర్ వివరిస్తూ, దేశంలో అన్నింటి కన్నా పెట్టుబడి విషయంలో ఆంధ్రప్రదేశ్ ఆకర్షణీయ రాష్ట్రాల్లో ఒకటి అన్నారు. బలమైన పారిశ్రామిక అనుబంధ విస్తారిత వ్యవస్థను నిర్మించిన ఖ్యాతి ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడుదేనని మంత్రి తెలిపారు. వివిధ రంగాలకు కూడలిగా.. ఐటీకి సైబరాబాద్, పరిశ్రమ, ఆర్థిక సాంకేతికత (ఫిన్‌టెక్) రంగాలకు విశాఖపట్నం, ఆటోమొబైల్స్‌కు అనంతపురం, ఎలక్ట్రానిక్స్‌కు తిరుపతి.. ఇలా రాష్ట్రం ఎదిగిన తీరును గురించి వివరించారు. జినోమ్ వ్యాలీ వంటి కార్యక్రమాల అండ కూడా ఈ రాష్ట్రానికి లభిస్తోందనీ, ఇవి ప్రపంచ పెట్టుబడిదారు సంస్థల్లో విశ్వాసాన్ని బలపరిచాయనీ మంత్రి అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఆరు పెద్ద ఓడరేవులు, సిద్ధంగా ఉన్న పారిశ్రామిక భూములు, పునరుత్పాదక ఇంధన రంగంలో అపార అవకాశాలతో పాటు వేగానికీ, సౌలభ్యానికీ ప్రాధాన్యాన్ని ఇస్తున్న పరిపాలన నమూనా.. ఇలా వివిధ సానుకూలతలున్నాయని మంత్రి తెలిపారు. శ్రీ నారా లోకేశ్, శ్రీ టి.జి. భరత్ వంటి యువ మంత్రుల చురుకుదనం కారణంగా రాష్ట్రం పెట్టుబడులకు సంసిద్ధంగా ఉండడమే కాక, పెట్టుబడులు తరలిరావడం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తోందని కూడా డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు.





***
(Release ID: 2190451)
Visitor Counter : 5