హోం మంత్రిత్వ శాఖ
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలుడు జరిగిన ప్రాంతాన్ని సందర్శించి, పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా
లోక్ నాయక్ జై ప్రకాశ్ ఆస్పత్రిలో గాయాలతో చికిత్స పొందుతున్న వారిని కలిసిన హోంమంత్రి
ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభమైందని తెలిపిన కేంద్ర హోంమంత్రి
పేలుడు సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం, క్రైమ్ బ్రాంచ్, ఎన్ఐఏ, ఎన్ఎస్ జీ, ఎఫ్ఎస్ఎల్ బృందాలు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు
పేలుడు ఘటనా సమాచారం తెలిసిన వెంటనే ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ఈ ఘటనపై ప్రతి కోణంలో దర్యాప్తు.. పేలుడు ప్రాంతం నుంచి సేకరించిన సాక్ష్యాలను విశ్లేషిస్తున్న దర్యాప్తు బృందం
Posted On:
10 NOV 2025 11:37PM by PIB Hyderabad
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలుడు జరిగిన ప్రాంతాన్ని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి, ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
ప్రమాదంలో గాయపడి, లోక్ నాయక్ జై ప్రకాశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కేంద్ర హోంమంత్రి కలిశారు. వైద్యులతో మాట్లాడి, క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభమైందని కేంద్ర హోంమంత్రి తెలిపారు. పేలుడు సమాచారం అందిన వెంటనే ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం, క్రైమ్ బ్రాంచ్, ఎన్ఐఏ, ఎన్ఎస్ జీ, ఎఫ్ఎస్ఎల్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు మొదలుపెట్టాయని వెల్లడించారు.
పేలుడు ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు హోంమంత్రి వెల్లడించారు. ఈ ఘటనపై ప్రతి కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, పేలుడు ప్రాంతం నుంచి సేకరించిన సాక్ష్యాలను పూర్తిగా విశ్లేషించే వరకు ఏ అవకాశాన్నీ వదులుకోబోమన్నారు.
***
(Release ID: 2188726)
Visitor Counter : 6