ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవంబర్ 9న డెహ్రాడూన్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి


ఉత్తరాఖండ్ రాష్ట్ర రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి

రూ. 8140 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న ప్రధానమంత్రి

ప్రధాన రంగాలు: తాగునీరు, నీటిపారుదల, సాంకేతిక విద్య, ఇంధనం, పట్టణాభివృద్ధి, క్రీడలు నైపుణ్యాభివృద్ధి

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 28,000 మందికి పైగా రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ. 62 కోట్లు జమచేయనున్న ప్రధానమంత్రి

Posted On: 08 NOV 2025 9:26AM by PIB Hyderabad

నవంబర్ 9న మధ్యాహ్నం 12:30 గంటలకు డెహ్రాడూన్‌లో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు (రజత మహోత్సవం) పూర్తైన సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా స్మారక తపాలా బిళ్లను కూడా విడుదల చేసి, సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రూ.8140 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో రూ.930 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు.. రూ.7210 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ఉన్నాయి. వీటిలో తాగునీరు, నీటిపారుదల, సాంకేతిక విద్య, ఇంధనం, పట్టణాభివృద్ధి, క్రీడలు,  నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాలు ఉన్నాయి.

అలాగే పీఎం ఫసల్ బీమా యోజన కింద 28,000 మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.62 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రధానమంత్రి జమ చేయనున్నారు.

ప్రధానమంత్రి ప్రారంభించనున్న ప్రాజెక్టుల్లో అమృత్‌ పథకం కింద 23 మండలాలకు సంబంధించిన డెహ్రాడూన్ నీటి సరఫరా ప్రాజెక్టు, పిథోరాగఢ్ జిల్లాలోని విద్యుత్ సబ్‌స్టేషన్, ప్రభుత్వ భవనాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు, నైనిటాల్‌లోని హల్ద్వానీ స్టేడియంలోని ఆస్ట్రోటర్ఫ్ హాకీ గ్రౌండ్ మొదలైనవి ఉన్నాయి.

రెండు కీలక హైడ్రో రంగ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శుంకుస్థాపన చేయనున్నారు. వాటిలో ఒకటి ‘‘సోంగ్ డ్యామ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు’’. ఇది డెహ్రాడూన్ నగరానికి రోజుకు 150 మిలియన్ లీటర్ల తాగునీటిని సరఫరా చేయనుంది. రెండోది ‘‘జమరానీ డ్యామ్ బహుళార్ధసాధక ప్రాజెక్టు’’. నైనిటాల్ జిల్లాలో అమలు కానున్న ఈ ప్రాజెక్టు తాగునీటి సరఫరాతో పాటు నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తికి కూడా తోడ్పడుతుంది. వీటితోపాటు విద్యుత్ సబ్‌స్టేషన్లు, చంపావత్‌లో మహిళల క్రీడా కళాశాల స్థాపన, నైనిటాల్‌లో ఆధునిక డైరీ ప్లాంట్ వంటి ఇతర ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్నారు.

 

***


(Release ID: 2188172) Visitor Counter : 18