ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అనువాదం: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ విజేతలతో ప్రధానమంత్రి సంభాషణ

Posted On: 06 NOV 2025 1:32PM by PIB Hyderabad

ప్రధానమంత్రి: ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఇవాళ దేవ్ దీపావళి.. గురుపూర్ణిమ కూడా. అందుకే ఇది నిజంగా చాలా ముఖ్యమైన రోజు. 

క్రీడాకారులు: గురుపూర్ణిమ శుభాకాంక్షలు సర్!

ప్రధానమంత్రి: మీ అందరికీ చాలా చాలా అభినందనలు!

కోచ్: గౌరవ ప్రధానమంత్రి గారూ.. మీకు చాలా ధన్యవాదాలు. ఇక్కడికి రావటం మాకు గౌరవంగా ఉంది. దీనిని మేం అదృష్టంగా భావిస్తున్నాం. నేను కేవలం మా ఆట గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ అమ్మాయిలు అద్భుతాలు చేశారు.. నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. గత రెండు సంవత్సరాలుగా వీళ్లు చాలా కష్టపడ్డారు. అపారమైన కృషి చేశారు. ప్రతి ప్రాక్టీస్ సెషన్‌లో వీళ్లు పూర్తి తీవ్రత, శక్తితో ఆడారు. వారి కష్టానికి నిజంగా ఫలితం దక్కిందని నేను చెబుతాను.

హర్మన్‌ప్రీత్ కౌర్: సర్ 2017లో మిమ్మల్ని కలిసింది నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పుడు మేం ట్రోఫీతో రాలేదు. కానీ ఈ రోజు ఈ ట్రోఫీని తీసుకురావడం మాకు గొప్ప గర్వంగా ఉంది. దీనికోసం ఇన్నేళ్లుగా మేం చాలా కష్టపడ్డాం. ఈ రోజు మీరు మా సంతోషాన్ని రెట్టింపు చేశారు.. ఇది మాకు చాలా పెద్ద గౌరవం. భవిష్యత్తులో ప్రతిసారీ ఒక ట్రోఫీతో మళ్లీ మళ్లీ మిమ్మల్ని కలవటం, మీతో టీమ్ ఫోటోలు తీసుకుంటూ ఉండటమే ఇప్పుడు మా లక్ష్యం.

ప్రధానమంత్రి: నిజంగా మీరంతా అద్భుతమైన పని చేశారు. భారతదేశంలో క్రికెట్ అనేది కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రజల జీవితాల్లో ఒక భాగమైపోయింది. క్రికెట్ బాగా ఆడినప్పుడు  భారతదేశం సంతోషిస్తుంది. కొంచెం తడబడినా దేశం మొత్తం నిరాశకు గురవుతుంది. మీరు వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడిపోయినప్పుడు ట్రోలింగ్ సైన్యం మీ వెంట పడింది.

హర్మన్‌ప్రీత్ కౌర్: 2017లో మిమ్మల్ని కలిసినప్పుడు మేం ఫైనల్‌లో ఓడిపోయి తిరిగి వచ్చాం. కానీ అప్పుడు మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేరేపించారు. మళ్లీ ఆడే అవకాశం వచ్చినప్పుడు ఎలా ఆడాలి, ఉత్తమ ప్రదర్శన ఎలా ఇవ్వాలో మీరు మాకు చెప్పారు. ఈ రోజు చివరికి మేం ట్రోఫీతో తిరిగి వచ్చినప్పుడు మళ్లీ మీతో మాట్లాడటం చాలా బాగుంది.

ప్రధానమంత్రి: అవును. స్మృతి గారూ, దయచేసి మాకు చెప్పండి.

స్మృతి మంధాన: 2017లో మేం వచ్చినప్పుడు ట్రోఫీని తీసుకురాలేకపోయాం. మీరు మమ్మల్ని అంచనాల గురించి ఒక ప్రశ్న అడిగారు. దాని సమాధానం అప్పటి నుంచి నాతోనే ఉంది. అది మాకు నిజంగా సహాయపడింది. తర్వాతి 6-7 సంవత్సరాలలో మేం చాలా ప్రయత్నాలు చేశాం. కానీ ప్రపంచ కప్‌లలో అనేక నిరాశలను ఎదుర్కొన్నాం. అయితే భారత్‌కు మొదటి ప్రపంచ కప్ ఇప్పుడు రావాలనేది విధి అనుకుంటున్నాను. సర్ మీరు ఎల్లప్పుడూ మా అందరికీ ఒక స్ఫూర్తిగా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రతి రంగంలోనూ మహిళలు రాణించడం చూస్తున్నాం. అది ఇస్రో రాకెట్ ప్రయోగాలైనా లేదా మరేదైనా కావచ్చు.. అంతా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. మేం దీనిని చూసిన ప్రతిసారీ మరింత మెరుగ్గా ప్రదర్శించాలని, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర మహిళలను ప్రేరణనివ్వాలన్న ఆలోచన మాకు లభిస్తుంది.

ప్రధానమంత్రి: దేశం మొత్తం చూస్తోంది.. గర్వపడుతోంది. వాస్తవానికి నేను మీ అందరి నుంచి మీ అనుభవాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. 

స్మృతి మంధాన: సర్ ఈ సారి ఆటలో ఉత్తమమైన విషయం ఏమిటంటే.. ప్రతి క్రీడాకారిణికి చెప్పేందుకు కథ ఉంది. ఎవరి ఆట కూడా మరొకరి కంటే తక్కువ కాదు.

క్రితంసారి మీరు అంచనాలను ఎలా ఎదుర్కోవాలన్న విషయం గురించి చెప్పారు. అది ఎల్లప్పుడూ నా మనస్సులో ఉంది.  మీరు శాంతంగా, నిశ్చలంగా ఉండే విధానం కూడా మాకు ఎంతో స్ఫూర్తిదాయకం.

జెమీమా రోడ్రిగ్స్: సర్, మేం మూడు మ్యాచ్‌లు ఓడిపోయినప్పుడు.. ఎన్నిసార్లు గెలిచారనే దాని వల్ల ఒక జట్టు ఆధారపడదు. కానీ పడిపోయిన తర్వాత ఎలా నిలబడ్డారనే దాని ద్వారా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ జట్టు ఇదే చేసిందని అనుకుంటున్నాను. అందుకే ఇది ఒక ఛాంపియన్ జట్టు. ఈ జట్టు గురించి నేను చెప్పే మరో విషయం ఏమిటంటే.. జట్టులోని ఐక్యత. నేను చూసిన దానిలో అన్నింటిలో ఇదే అత్యుత్తమంగా ఉంది. ఎవరు బాగా ఆడినా సొంతంగా పరుగులు చేసినట్లు లేదా ఆ వికెట్లు తీసినట్లు అందరూ సంతోషించారు.. చప్పట్లు కొట్టారు.. సంబరాలు చేసుకున్నారు. ఎవరైనా నిరాశగా ఉన్నప్పుడు.. అన్ని వేళలా వారి భుజంపై చేయి వేసి ’పర్వాలేదు..  తదుపరి మ్యాచ్‌లో బాగా ఆడతావు" అని చెప్పడానికి ఎవరో ఒకరు పక్కన ఉన్నారు. అది ఈ జట్టు అంటే ఏంటో తెలియజేస్తుందని అని నేను అనుకుంటున్నాను.

స్నేహ్ రాణా: నేను జెమ్మీతో ఏకీభవిస్తున్నాను. విజయంలో అందరం కలిసి ఉండాలని మేం నిర్ణయించుకున్నాం. కానీ ఓటమిలో ఒకరికొకరు తోడుగా ఉండటమే నిజమైన పరీక్ష. ఒక జట్టుగా.. ఒక యూనిట్‌గా.. ఏం జరిగినా  ఎవరినీ వదిలిపెట్టకూడదని, ఎల్లప్పుడూ ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని మేం నిర్ణయించుకున్నాం. ఇది మా జట్టులో ఉత్తమమైన అంశం అని నేను అనుకుంటున్నాను.

క్రాంతి గౌడ్: హర్మన్ అక్క ఎప్పుడూ ‘నవ్వుతూ ఉండండి’ అని చెబుతుంటారు. అందుకే ఎవరైనా నిరుత్సాహంగా లేదా నిశ్శబ్దంగా కూర్చుంటే అందరూ నవ్వేలా మేం చూసుకునేవాళ్లం. ఒకరినొకరు నవ్వుతూ చూడటం వలన మేమంతా మరింత తేలికగా, సానుకూలంగా భావించాం. 

ప్రధానమంత్రి: అయితే మీ జట్టులో అందరినీ నవ్వించే వ్యక్తి ఒకరు ఉండే ఉంటారు కదా!

క్రీడాకారిణి: జెమ్మీ సోదరి!

జెమీమా రోడ్రిగ్స్: సర్, నిజానికి హర్లీన్ కూడా! ఆమె జట్టును కలిపి ఉంచడాన్ని చాలా విలువైన అంశంగా భావిస్తుంది.

హర్లీన్ కౌర్ దేవోల్: సర్.. నిజానికి ప్రతి జట్టులో భావోద్వేగాలు తేలికగా ఉంచే వ్యక్తి ఒక్కరైనా అవసరం అని అనిపిస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా ఒంటరిగా లేదా నిశ్శబ్దంగా కూర్చోవడం చూసినా లేదా నేను కొంచెం ఖాళీగా ఉన్నా.. సరదాగా లేదా తేలికపాటి పనులు చేస్తూ తిరుగుతాను. నా చుట్టూ ఉన్న వాళ్లు సంతోషంగా ఉన్నప్పుడు నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. 

ప్రధానమంత్రి: మీరు ఖచ్చితంగా సరైన విషయం చెప్పారు. క్రీడల్లో అన్నింటికంటే బృంద స్ఫూర్తి (టీమ్ స్పిరిట్) చాలా ముఖ్యం. ఇది కేవలం మైదానంలో జట్టు స్ఫూర్తికి సంబంధినది మాత్రమే కాదు. మీరు 24 గంటలు కలిసి ఉన్నప్పుడు ఒక రకమైన బంధం ఏర్పడుతుంది. మీరు ఒకరి బలహీనతలను తెలుసుకొని వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. అలాగే ఒకరి బలాన్ని మరొకరు గుర్తించి.. ఒకరికి మరొకరు మద్దతిచ్చేందుకు, వారి బలాలను వెలుతురులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడే నిజమైన టీమ్‌వర్క్ ఉంటుంది. 

ప్రధానమంత్రి: మీరందరూ ఇతరులకు ఒక గొప్ప ప్రేరణనిచ్చే వనరుగా మారగలరని నేను భావిస్తున్నాను.  ఎందుకంటే విజయం మీకు గొప్ప శక్తినిస్తుంది. ఉదాహరణకు మీరు ఇంటికి వెళ్ళినప్పుడు సహజంగానే సంబరాలు, ఉత్సాహం ఉంటాయి. కానీ కొన్ని రోజుల తర్వాత మీ పాఠశాలను, మీరు చదువుకున్న పాఠశాలను సందర్శించండి. అక్కడ కేవలం ఒక్క రోజు గడపండి. పిల్లలతో మాట్లాడండి. వారు మిమ్మల్ని అన్ని రకాల ప్రశ్నలు అడుగుతారు. వారితో స్వేచ్ఛగా మాట్లాడండి. ఆ పాఠశాల.. మీరు చదువుకున్న అదే పాఠశాల మిమ్మల్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని, ఆ పిల్లలు ఆ రోజును ఎప్పటికీ మరచిపోరని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు ఆ అనుభవాన్ని ఆస్వాదించినట్లయితే అప్పుడు మూడు పాఠశాలలను ఎంచుకోండి. సంవత్సరంలో వీలైనప్పుడల్లా ఒక్కొక్క దానిలో ఒక రోజు గడపండి. అది వారికి స్ఫూర్తిని ఇవ్వడమే కాకుండా.. తిరిగి మీకు కూడా ప్రేరణనివ్వటాన్ని మీరు తెలుసుకుంటారు. రెండోది.. ఫిట్ ఇండియా ఉద్యమం. మీకు తెలిసినట్లుగా మన దేశంలో ఊబకాయం ఒక పెద్ద సమస్యగా మారుతోంది. దానిని ఎదుర్కోవడానికి ఫిట్‌నెస్ ఉత్తమ మార్గం. నేను ఎప్పుడూ చెప్పినట్లుగా చిన్న విషయాలు కూడా ముఖ్యమే. ఉదాహరణకు మీ వంట నూనెను 10% తగ్గించడం. మీరు నూనె కొనుగోలు చేసేటప్పుడే ఆ నిర్ణయం చేసుకోండి. ప్రజలు మీ నుండి ఈ చిన్న, ఆచరణాత్మక సూచనలను విన్నప్పుడు.. వారు వాటిని శ్రద్ధగా తీసుకుంటారు. మీరు యువతులను ఫిట్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనాలని ప్రోత్సహిస్తే.. అది చాలా పెద్ద మార్పును తీసుకొస్తుంది. మీ అందరితో ఈ సాధారణ, హృదయపూర్వక సంభాషణను నేను నిజంగా ఆస్వాదించాను. మీలో కొందరిని నేను ఇంతకుముందు కలిశాను.. మరికొందరిని మొదటిసారిగా కలిశాను. కానీ మీ అందరినీ కలవడానికి నేను ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాను. మరియు మీరు (ప్రతీక) త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

స్మృతి మంధాన: సర్, మీరు చెప్పిన దాన్ని మేం ఖచ్చితంగా గుర్తుంచుకుంటాం. ప్రజలతో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడల్లా మేం ఈ సందేశాన్ని పంచుకోవడానికి ప్రయత్నిస్తాం. సర్, మా జట్టు తరఫున చెబుతున్నాను. ఈ సందేశాన్ని ఎక్కడైనా వ్యాప్తి చేసేందుకు మీరు మమ్మల్ని ఉపయోగించాలనుకుంటే  మాకు కాల్ చేయండి.. మేం అన్నివేళలా సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే ఇది ముఖ్యమైన కారణం. 

ప్రధానమంత్రి: మనమందరం కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం. 

స్మృతి మంధాన: అవును సర్. 

ప్రధానమంత్రి: సరే అయితే.. మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు.

 

***


(Release ID: 2187678) Visitor Counter : 10