హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘వందేమాతరం‘ ఒక స్వేచ్ఛా గీతం, అంచలమైన సంకల్ప స్ఫూర్తి, భారతదేశ చైతన్యానికి తొలి మంత్రం: కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా


‘వందేమాతరం’ కేవలం భారతదేశ జాతీయ గేయం, స్వాతంత్య్ర పోరాట భావన మాత్రమే కాదు.. సాంస్కృతిక జాతీయవాదానికి తొలి ప్రకటన కూడా: శ్రీ అమిత్ షా

కదలిక లేని రక్తాన్ని కూడా ఉరకలెత్తించే శక్తి వందేమాతారానికి ఉందన్న మహాత్మా గాంధీ: శ్రీ అమిత్ షా

వందేమాతరానికి ఉన్న అద్భుతమైన వారసత్వాన్ని దేశానికి గుర్తు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ: శ్రీ అమిత్ షా

నేటికీ... వికసిత్ భారత్ 2047, ఆత్మవిశ్వాసం, స్వయం సమృద్ధి, పునరుజ్జీవనం పొందిన భారత్ అనే మన దార్శనికతకు ప్రేరణనిస్తోన్న వందేమాతరం: శ్రీ అమిత్ షా

శాశ్వతంగా ప్రతిధ్వనిస్తూనే ఉండే పవిత్ర మంత్రం ఇది: శ్రీ అమిత్ షా

మన చరిత్ర, సంస్కృతి, విలువలు, సంప్రదాయాలను గుర్తుంచుకోవాలని స్ఫూర్తినిస్తోన్న వందేమాతరం: శ్రీ అమిత్ షా

Posted On: 07 NOV 2025 6:16PM by PIB Hyderabad

అచంచలమైన సంకల్ప స్ఫూర్తి, భారతదేశ చైతన్యానికి తొలి మంత్రమైన 'వందేమాతరం' ఒక స్వేచ్ఛా గీతమని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. బంకించంద్ర ఛటోపాధ్యాయ రచించిన జాతీయ గీతం ‘వందేమాతరానికి’ 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆయన బ్లాగ్ రాశారు. వందేమాతరం కేవలం భారతదేశ జాతీయ గేయం, స్వాతంత్య్ర పోరాట ఆత్మ మాత్రమే కాదని.. సాంస్కృతిక జాతీయవాదానికి తొలి ప్రకటన కూడా అని ఆయన వ్యాఖ్యానించారు. 

మన చరిత్రలో పాటలు, కళలు, సామాజిక, రాజకీయ ఉద్యమాలకు ఆత్మగా మారిన అనేక నిర్ణయాత్మక ఘట్టాలు ఉన్నాయని బ్లాగ్‌‌లో కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ సైన్యం యుద్ధ గీతాలు, స్వాతంత్య్ర పోరాట దేశభక్తి గీతాలు, ఎమర్జెన్సీ సమయంలో యువత ఆలపించిన ప్రతిఘటన పాటలు ఇలా ఎల్లప్పుడూ భారతీయ సమాజంలో సామూహిక చైతన్యాన్ని, ఐక్యతను తీసుకొచ్చాయన్నారు. 

వీటన్నింటిలో భారతదేశ జాతీయ గేయం ‘వందేమాతరం’ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇది యుద్ధక్షేత్రం నుంచి రాలేదు. ఇది ఒక మేధావి అయిన బంకించంద్ర ఛటోపాధ్యాయ ప్రశాంతమైన, దృఢమైన మనస్సులో రూపుదిద్దుకుంది. 1875లో జగద్ధాత్రి పూజ (కార్తీక శుక్ల నవమి లేదా అక్షయ నవమి) రోజున ఆయన దేశ స్వాతంత్య్రానికి సంబంధించిన ఈ శాశ్వత గేయాన్ని రచించారు. ఆయన... అత్యంత లోతుగా పాతుకుపోయిన భారతదేశ నాగరిక మూలాలతో పాటు అథర్వ వేదంలోని "మాతా భూమిః పుత్రో అహం పృథివ్యాః" (భూమి నా తల్లి, నేను ఆమె బిడ్డను) అనే భావన నుంచి మొదలుకొని దేవీ మాహాత్మ్యంలోని అమ్మవారి ఆవాహన వరకు అన్నింటి నుంచి స్ఫూర్తిని పొందారు.

బంకించంద్ర చటర్జీ మాటలు ఒకే సమయంలో ప్రార్థన, భవిష్యత్తును సూచించే వాక్కుగా ఉన్నాయి. ఇది సాంస్కృతిక జాతీయవాదానికి బంకించంద్ర చేసిన తొలి ప్రకటన. భారతదేశం కేవలం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు.. భౌగోళిక-సాంస్కృతిక నాగరికత అని ఇది మనకు గుర్తు చేసింది.

మహర్షి అరవిందులు వర్ణించినట్లుగా.. మాటల ద్వారా జాతి ఆత్మను తిరిగి మేల్కొల్పిన ఆధునిక భారతదేశ ఋషి బంకించంద్ర చటర్జీ . ఆయన నవల ఆనందమఠ్ కూడా ఒక గద్య రూపంలోని మంత్రం లాంటిది. ఇది నిద్రిస్తోన్న దేశాన్ని దాని దివ్య శక్తిని తిరిగి తెలుసుకునేలా కదలిక తీసుకొచ్చింది. బంకించంద్ర చటర్జీ ఒక లేఖలో "నా రచనలన్నీ గంగానదిలో కొట్టుకుపోయినా నాకు అభ్యంతరం లేదు. ఈ ఒక్క గీతం మాత్రమే శాశ్వతంగా జీవిస్తుంది. ఇది గొప్ప పాట అవుతుంది. ప్రజల హృదయాలను గెలుచుకుంటుంది" అని రాశారు. ఈ మాటలు భవిష్యత్తును తెలియజేస్తున్నాయి. మాతృభూమి పట్ల భక్తితో నిండిన వారు మాత్రమే ఇటువంటి వ్యాఖ్యలను రాయగలరు. 

‘వందేమాతరం’ భాషా, ప్రాంతీయ అడ్డంకులను అధిగమించి భారతదేశం అంతటా ప్రతిధ్వనించింది. దీనిని తమిళనాడులో సుబ్రమణ్య భారతి తమిళంలోకి అనువదించారు. పంజాబ్‌లో విప్లవకారులు దీనిని బ్రిటిష్ పాలనను ధిక్కరిస్తూ ఆలపించారు.

1905లో బెంగాల్ విభజన సమయంలో బెంగాల్ ప్రావిన్స్ అంతటా తిరుగుబాటు చెలరేగినప్పుడు.. ‘వందేమాతరాన్ని’ బహిరంగంగా ఆలపించడాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ 1906 ఏప్రిల్ 14న  బారిసాల్‌లో వేలాది మంది ఈ ఆదేశాన్ని ధిక్కరించారు. పోలీసులు శాంతియుత సమూహంపై దాడి చేసినప్పుడు పురుషులు, మహిళలు ఇద్దరికీ రక్తం కారుతుున్నప్పటికీ ఏకధాటిగా 'వందేమాతరం' అని నినాదించారు. 

కాలిఫోర్నియాలోని గదర్ పార్టీ విప్లవకారులు, ఆజాద్ హింద్ ఫౌజ్.. 1946 నాటి రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు కూడా ఈ పవిత్రమైన నినాదాన్ని ఉపయోగించాయి. ఖుదీరాం బోస్ నుంచి అష్ఫాకుల్లా ఖాన్ వరకు, చంద్రశేఖర్ ఆజాద్ నుంచి తిరుప్పూర్ కుమరన్ వరకు ఈ నినాదం ఒక్కటిగా ప్రతిధ్వనించింది. మహాత్మా‌గాంధీ స్వయంగా ‘మొద్దుబారిన రక్తాన్ని కూడా ఉరకలెత్తించే శక్తి వందేమాతరానికి ఉందని’ అన్నారు. ఇది ఉదారవాదులు- విప్లవకారులను, పండితులు- సైనికులను కూడా ఏకం చేసింది. మహర్షి అరవిందులు చెప్పినట్లుగా ఇది ‘భారతదేశ పునర్జన్మకు మంత్రం’. 

అక్టోబర్ 26న మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వందేమాతర గేయం అద్భుతమైన వారసత్వాన్ని దేశానికి గుర్తు చేశారు. ఈ అమర గీతానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా నవంబర్ 7 నుంచి  సంవత్సరం పొడవునా దేశవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉత్సవాల ద్వారా ‘వందేమాతరం’ పూర్తి రూపం దేశవ్యాప్తంగా మళ్లీ ప్రతిధ్వనిస్తుంది. ఇది ‘సాంస్కృతిక జాతీయవాదం’ అనే ఆలోచనను యువత అంతర్గతం చేసుకునేలా స్ఫూర్తినిస్తుంది.

‘భారత్ పర్వ్‌’ ఉత్సవం చేసుకోవటం, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించటం చేస్తున్న ప్రస్తుత సమయంలో పటేల్‌ భారత్‌ను ఏకీకృతం చేయడం అనేది ‘వందేమాతరం’ స్ఫూర్తికి సజీవ రూపం అని తెలుసుకుంటున్నాం. ఈ గేయం కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడానికి మాత్రమే కాదు.. భవిష్యత్తుకు ఒక పిలుపు కూడా. నేటికీ వందేమాతరం..  ఆత్మవిశ్వాసం- స్వయం సమృద్ధి- పునరుజ్జీవనం పొందిన భారత్‌, వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను సాధించటంలో మనకు ప్రేరణనిస్తూనే ఉంది.

‘వందేమాతరం’ అనేది స్వేచ్ఛా గీతం. ఇదొక అచంచలమైన సంకల్ప స్ఫూర్తి. ఇది భారతదేశ చైతన్యానికి తొలి మంత్రం. ఈ పవిత్రమైన గేయం శాశ్వతంగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. మన చరిత్ర, సంస్కృతి, విలువలు, సంప్రదాయాలను భారతీయ దృష్టికోణం నుంచి చూడాలని ఇది మనకు గుర్తుచేస్తుంది. 

వందేమాతరం!

బ్లాగ్- 

https://amitshah.co.in/myview/blog/Vande-Mataram-%E2%80%93-The-First-Proclamation-of-Cultural-Nationalism-11-7-2025

 

***


(Release ID: 2187672) Visitor Counter : 2