ప్రధాన మంత్రి కార్యాలయం
నావికాదళ దినోత్సవం-2023 నేపథ్యంలో మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి
భారత నావికాదళ ఓడలు.. ప్రత్యేక బలగాల సామర్థ్య ప్రదర్శనలు తిలకించిన ప్రధాని;
‘‘మన నావికాదళ సిబ్బంది అంకితభావానికి దేశం అభివందనాలు అర్పిస్తోంది’’;
‘‘సింధుదుర్గ్ కోట దేశంలోని ప్రతి పౌరునిలో సగర్వ భావనను రగిలిస్తుంది’’;
‘‘వీర ఛత్రపతి మహారాజ్‌కి బలమైన నావికాదళం ప్రాముఖ్యం చక్కగా తెలుసు’’;
‘‘నావికాదళ అధికారుల కొత్త భుజకీర్తులు శివాజీ మహరాజ్ వారసత్వానికి ప్రతీక’’;
‘‘సాయుధ దళాల్లో మన నారీశక్తి బలగం పెంచడానికి మేం కట్టుబడి ఉన్నాం’’;
‘‘మన దేశానికి విజయాలు.. శౌర్యం.. జ్ఞానం.. శాస్త్రాలు.. నైపుణ్యాలుసహా
సమర్థ నావికాదళ బలగంతో కూడిన ఉజ్వల చరిత్ర ఉంది’’;
‘‘తీర ప్రాంత ప్రజల జీవితాలను మెరుగుపరచడమే మా ప్రాథమ్యం’’;
‘‘కొంకణ్ ప్రాంతం అనూహ్య అవకాశాలకు నెలవు’’;
‘‘వారసత్వంతో కూడిన అభివృద్ధి... ఇదే వికసిత భారతం దిశగా మా మార్గం’’
Posted On:
04 DEC 2023 6:43PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ‘నావికాదళ దినోత్సవం-2023’ సందర్భంగా నిర్వహించిన వేడుకలలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తార్కర్లీ బీచ్ నుంచి భారత నావికాదళం యుద్ధనౌకలు, జలాంతర్గాములు, విమానాలు, ప్రత్యేక బలగాల ‘సామర్థ్య ప్రదర్శన’ విన్యాసాలను ఆయన తిలకించారు. అలాగే నావికాదళ బలగాల గౌరవ వందనాన్ని శ్రీ మోదీ స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- భారత చరిత్రలో డిసెంబర్ 4వ తేదీ చరిత్రాత్మక దినమని పేర్కొన్నారు. మాల్వాన్, తార్కర్లీ తీరంలోని అద్భుతమైన సింధుదుర్గ్ కోట వెంబడి వీర శివాజీ మహారాజ్ వైభవం, రాజ్‌కోట్ కోటలో ఆయన అద్భుత విగ్రహావిష్కరణ, భారత నావికాదళ సింహనాదాలు దేశంలోని ప్రతి పౌరునిలో భావోద్వేగం, ఉత్సాహం నింపుతాయని చెప్పారు. నావికాదళ దినోత్సవం నేపథ్యంలో సిబ్బందికి శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సాహసులకు శిరసాభివందనం చేశారు.
విజయాలకు మారుపేరైన సింధుదుర్గ్ నుంచి నావికాదళ దినోత్సవ నిర్వహణ నిజంగా ఎంతో గర్వకారణమని ప్రధాని మోదీ అభివర్ణించారు. ‘‘సింధుదుర్గ్ కోట ప్రతి భారత పౌరునిలో సగర్వ భావనను రగిలిస్తుంది’’ ఏ దేశానికైనా నావికాదళ సామర్థ్యాల ప్రాముఖ్యాన్ని గుర్తించడంలో శివాజీ మహారాజ్ దూరదృష్టిని ప్రధానమంత్రి గుర్తుచేశారు. సముద్రాలపై నియంత్రణగల వారిదే అంతిమ విజయమని శివాజీ మహారాజ్ చక్కగా గుర్తించారని ఆయన పునరుద్ఘాటించారు. అందుకే స్వయంగా సమర్థ నావికాదళాన్ని రూపొందించారని గుర్తుచేశారు. సముద్ర యుద్ధంలో నిపుణులైన కన్హోజీ ఆంగ్రే, మాయాజీ నాయక్ భట్కర్, హిరోజీ ఇందూల్కర్ వంటి యోధులను ఆయనెంతో గౌరవించారని, వారు నేటికీ మనకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాల స్ఫూర్తితో నేటి భారతదేశం బానిస మనస్తత్వాన్ని వీడి, ముందడుగు వేస్తున్నదని ప్రధాని అన్నారు. నావికాదళ అధికారులు ధరించే భుజకీర్తులు ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ వారసత్వాన్ని సుస్పష్టం చేస్తున్నాయని, కొత్త భుజకీర్తులు ఆయన నేతృత్వంలోని నావికాదళ పతాకాన్ని పోలి ఉండటంపైనా ఆయన హర్షం వ్యక్తంచేశారు. గత ఏడాది నావికాదళ చిహ్నం ఆవిష్కరణను కూడా గుర్తు చేసుకున్నారు. స్వీయ వారసత్వం పట్ల సగర్వ భావనతో, భారత నావికాదళం నేడు భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా తన ర్యాంకులకు నామకరణం చేయబోతున్నదని ప్రధానమంత్రి వెల్లడించారు. సాయుధ దళాల్లో నారీశక్తిని బలోపేతం చేయడం గురించి కూడా ఆయన నొక్కిచెప్పారు. నావికాదళ నౌకలో భారతదేశపు తొలి మహిళా కమాండింగ్ అధికారిని నియమించడంపై శ్రీ మోదీ నావికాదళాన్ని అభినందించారు.
భారతదేశానికి 140 కోట్ల మంది ప్రజల విశ్వాసమే అతిపెద్ద బలమని, అందుకే మన దేశం బృహత్తర లక్ష్యాలను నిర్దేశించుకుంటూ, వాటిని సాధించేందుకు పూర్తి సంకల్పంతో కృషి చేస్తోందని ప్రధాని అన్నారు. విభిన్న రాష్ట్రాల ప్రజలు ‘దేశమే ప్రథమం’ అనే స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నందున సంకల్పాలు, భావోద్వేగాలు, ఆకాంక్షల సంగమంలో సానుకూల ఫలితాల సంగ్రహావలోకనం కనిపిస్తోందని పేర్కొన్నారు. ‘‘దేశం నేడు తన చరిత్ర నుంచి స్ఫూర్తిపొంది ఉజ్వల భవిష్యత్తు దిశగా మార్గ ప్రణాళిక రూపకల్పనలో నిమగ్నమైంది. ప్రతికూల రాజకీయాలను పక్కకునెట్టి, ప్రతి రంగంలోనూ ముందుకు సాగుతామని ప్రతినబూనింది. ఈ శపథం మనల్ని వికసిత భారతం వైపు నడిపిస్తుంది’’ అన్నారాయన.
భారతదేశ విస్తృత చరిత్ర గురించి ప్రస్తావిస్తూ- ఇది కేవలం బానిసత్వం, ఓటములు, నిరాశలకు సంబంధించినది మాత్రమే కాదన్నారు. భారత్ విజయాలు, ధైర్యం, విజ్ఞానం, సైన్స్, కళలు, సృజనాత్మక నైపుణ్యాలు, సముద్ర సామర్థ్యాలతో కూడిన అద్భుత అధ్యాయాల సమాహారం కూడానని నొక్కిచెప్పారు. సాంకేతికత, వనరులు ఏవీ లేనికాలంలో నిర్మించిన సింధుదుర్గం వంటి కోటలను ఉదాహరిస్తూ భారత్ శక్తిసామర్థ్యాలు ఎంత గొప్పవో వివరించారు. గుజరాత్‌లోని లోథాల్‌లో కనుగొనబడిన సింధు లోయ నాగరికతనాటి నౌకాశ్రయం వారసత్వం, సూరత్ ఓడరేవులో 80కిపైగా నౌకలు నిలపడం గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. చోళ సామ్రాజ్యం ఆగ్నేయాసియా దేశాలకు వాణిజ్యాన్ని విస్తరించడంలో భారత సముద్ర బలానిదే కీలక పాత్ర అని ప్రధానమంత్రి వివరించారు. అయితే, విదేశీ శక్తుల దాడిలో తొలుత దెబ్బతిన్నది భారత సముద్ర సామర్థ్యమేనని, ఫలితంగా పడవలు, ఓడల తయారీలో ప్రాచుర్యం పొందన భారతదేశం సముద్రంపై నియంత్రణ కోల్పోవాల్సి వచ్చిందని, తద్వారా వ్యూహాత్మక-ఆర్థిక బలాన్ని నష్టపోయిందని విచారం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో నేడు భారత్ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నందున పునర్వైభవం సాధించాల్సి ఉందని ప్రధాని ఉద్ఘాటించారు. ఇందులో భాగంగానే నీలి ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వం మునుపెన్నడూ లేనంత ప్రోత్సాహం ఇస్తున్నదని నొక్కిచెప్పారు. ‘సాగరమాల’ పథకం కింద ఓడరేవుల నేతృత్వంలో సాగుతున్న అభివృద్ధిని ఆయన ప్రస్తావించారు. ‘సముద్ర ప్రణాళిక’ కింద భారతదేశం తన మహాసముద్ర సంపూర్ణ సామర్థ్య సద్వినియోగానికి కృషి చేస్తున్నదని చెప్పారు. వాణిజ్య నౌకా కార్యకలాపాలకు ప్రోత్సాహం దిశగా కొత్త నిబంధనలను రూపొందించామని తెలిపారు. దీంతో గడచిన తొమ్మిదేళ్లలో భారత నావికుల సంఖ్య 140 శాతానికిపైగా పెరిగిందని ఆయన గుర్తుచేశారు.
వర్తమాన కాలం ప్రాముఖ్యాన్ని కూడా ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ‘‘ఇది భారత చరిత్రలో ఎలాంటి కాలమంటే- రాబోయే 5-10 ఏళ్ల భవిష్యత్తును మాత్రమేగాక రాబోయే శతాబ్దాలదాకా కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది’’ అని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో 10వ స్థానంలోగల భారత ఆర్థిక వ్యవస్థ గడచిన పదేళ్లలో ప్రగతి పథాన పయనించి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గుర్తుచేశారు. ఈ పరుగు ఇక్కడితో ఆగేది కాదని, మరింత వేగం పుంజుకుని 3వ స్థానానికి దూసుకెళ్లగలదని ఆయన ఆత్మవిశ్వాసం వెలిబుచ్చారు. ‘‘భారతదేశం ‘విశ్వమిత్రుని’ (ప్రపంచ మిత్రుడు)గా ఎదగడాన్ని ప్రపంచం నేడు ప్రత్యక్షంగా చూస్తోంది’’ అని పేర్కొన్నారు. ప్రపంచ ప్రసిద్ధమైన సుగంధ మార్గం కనుమరుగైన నేపథ్యంలో దాని పునరుద్ధరణకు భారత-మధ్యప్రాచ్య-ఐరోపా ఆర్థిక కారిడార్ వంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని శ్రీ మోదీ అన్నారు. భారతదేశంలో తయారీ (మేడ్ ఇన్ ఇండియా) సామర్థ్యాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. తేజస్, వ్యవసాయ డ్రోన్, యూపీఐ వ్యవస్థ, చంద్రయాన్-3లను ఇందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు. రవాణా విమానాలు, విమాన వాహక నౌక ‘ఐఎన్ఎస్’ విక్రాంత్ వంటివి ఉత్పత్తి చేయడం ద్వారా రక్షణ రంగంలో భారత స్వావలంబన సుస్పష్టమవుతున్నదని వివరించారు.
తీరప్రాంత, సరిహద్దు గ్రామాలను చివరనున్నవిగా కాకుండా ఆరంభ గ్రామాలుగా పరిగణించే ప్రభుత్వ విధానాన్ని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. ‘‘తీరప్రాంతంలో నివసించే ప్రతి కుటుంబం జీవితాన్ని మెరుగుపరచడం నేడు కేంద్ర ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం’’ అని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో 2019లో ప్రత్యేకంగా మత్స్య మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, ఈ రంగంలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడాన్ని ఆయన ప్రస్తావించారు. కాగా, 2014 తర్వాత మత్స్య ఉత్పత్తి 8 శాతం, ఎగుమతులు 110 శాతం పెరిగాయని తెలిపారు. రైతులకు బీమా రక్షణను రూ.2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచామని, వారికి కిసాన్ క్రెడిట్ కార్డు ప్రయోజనం కూడా లభిస్తున్నదని చెప్పారు.
మత్స్య రంగంలో విలువ శ్రేణి అభివృద్ధి గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ- సాగరమాల పథకం తీరప్రాంతాల్లో ఆధునిక అనుసంధానాన్ని బలోపేతం చేస్తున్నదని చెప్పారు. ఇందుకోసం రూ.లక్షల కోట్లు వెచ్చిస్తున్నందున తీరప్రాంతాలకు కొత్త వ్యాపారాలు, పరిశ్రమలు వస్తాయన్నారు. సముద్ర ఆహార తయారీ సంబంధ పరిశ్రమ, ఫిషింగ్ బోట్ల ఆధునికీకరణ కూడా చేపడుతున్నట్లు తెలిపారు.
‘‘కొంకణ్ ప్రాంతం అపార అవకాశాలకు నెలవు’’ అని ప్రధానమంత్రి అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వ నిబద్ధతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ- సింధుదుర్గ్, రత్నగిరి, అలీబాగ్, పర్భాని, ధరాశివ్‌లలో వైద్య కళాశాలల ప్రారంభోత్సవం, చిపి ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు, ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్‌ను మాంగావ్ వరకు కొనసాగించడం వంటి అంశాలను ప్రధాని ఉదాహరించారు. జీడి రైతుల కోసం రూపొందించిన ప్రత్యేక పథకాలను కూడా ప్రధానమంత్రి వెల్లడించారు. సముద్ర తీర ఆవాసాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని నొక్కిచెప్పారు. ఇందులో భాగంగా మడ అడవుల పరిధి విస్తరణపై దృష్టి పెడుతుండటాన్ని ఆయన ప్రస్తావించారు. మడ అడవుల నిర్వహణ కోసం మహారాష్ట్రలోని మాల్వాన్, అచారా-రత్నగిరి, దేవ్‌గఢ్-విజయదుర్గ్ వంటి అనేక ప్రదేశాలను ఎంపిక చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
‘‘వారసత్వం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇవ్వడం వికసిత భారతం దిశగా పయనంలో మన మార్గం’’ అని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఛత్రపతి వీర శివాజీ మహారాజ్ హయాంలో కొంకణ్ సహా మహారాష్ట్రలోని కోటలుసహా మొత్తం వారసత్వ సంపద పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉన్నాయని, ఇందుకోసం రూ.వందలాది కోట్లు వెచ్చిస్తున్నాయని చెప్పారు. ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని కూడా ప్రోత్సహిస్తామని, తద్వారా కొత్త ఉపాధి-స్వయం ఉపాధి అవకాశాలు అందివస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. చివరగా- సైనిక దినోత్సవం, నావికాదళ దినోత్సవం వంటి సాయుధ దళాల వేడుకలను రాజధాని ఢిల్లీలో కాకుండా ఇతర ప్రాంతాల్లో నిర్వహించే కొత్త సంప్రదాయం గురించి ప్రధాని ప్రస్తావించారు. తద్వారా ఆయా సందర్భాల గురించి దేశమంతటా అవగాహన పెరుగుతుందని, కొత్త ప్రదేశాలు పర్యాటకుల దృష్టిని సరికొత్తగా ఆకర్షిస్తాయని చెబుతూ తన ప్రసంగం ముగించారు.
ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ రమేష్ బైస్, ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే, కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడణవీస్/శ్రీ అజిత్ పవార్, రక్షణ బలగాల అధిపతి జనరల్ అనిల్ చౌహాన్, నావికాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం
దేశంలో ఏటా డిసెంబర్ 4న నావికాదళ దినోత్సవం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో సింధుదుర్గ్‌లో నిర్వహించిన ‘నావికాదళ దినోత్సవం-2023’ వేడుకలు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఘనమైన సముద్ర వారసత్వానికి నివాళి అర్పించాయి. ఆయన కాలంలోని నావికాదళ చిహ్నమే నిరుడు తొలి స్వదేశీ విమాన వాహక నౌక ‘ఐఎన్ఎస్’ విక్రాంత్ సముద్ర ప్రవేశం సందర్భంగా ఆమోదించబడిన నావికాదళ కొత్త చిహ్నానికి ప్రేరణ.
ఏటా నావికాదళ దినోత్సవం నిర్వహణలో భాగంగా భారత నావికాదళ యుద్ధనౌకలు, జలాంతర్గాములు, విమానాలు, ప్రత్యేక బలగాల ‘సామర్థ్య ప్రదర్శన’ విన్యాసాలు ఆనవాయితీగా వస్తున్నాయి. వీటిద్వారా భారత నావికాదళ బహుళ-రంగ కార్యకలాపాల సంబంధిత భిన్న కోణాలు ప్రజలకు అవగతమవుతాయి. పౌరులలో సముద్ర చైతన్యం పెంచుతూ, జాతీయ భద్రతలో నావికాదళం పాత్రను ఈ వేడుకలు ప్రస్ఫుటం చేస్తాయి.
ప్రధానమంత్రి తిలకించిన నావికాదళ సామర్థ్య ప్రదర్శనలో- ‘‘కంబాట్ ఫ్రీ ఫాల్, హై స్పీడ్ రన్, జెమిని-బీచ్ అసాల్ట్ స్లిథరింగ్ కార్యకలాపాలు, ఎస్ఎఆర్ డెమో, వెర్‌ట్రెప్, ఎస్ఎస్ఎం లాంచ్ డిల్, సీ-కింగ్ కార్యకలాపాలు, డంక్ డెమో, సబ్‌మెరైన్ ట్రాన్సిట్, కమోవ్ కార్యకలాపాలు, న్యూట్రలైజింగ్ ఎనిమీ పోస్ట్, స్మాల్ టీమ్ ఇన్సర్షన్-ఎక్స్‌ట్రాక్షన్ (ఎస్టీఐఇ కార్యకలాపాలు), ఫ్లై పాస్ట్, నావల్ సెంట్రల్ బ్యాండ్ డిస్‌ప్లే, కంటిన్యుటీ డ్రిల్, హోంపిప్ డ్యాన్స్, లైట్ టాటూ డ్రమ్మర్స్ కాల్, సెరిమోనియల్ సన్‌సెట్ అనంతరం జాతీయ గీతాలాపన తదితరాలున్నాయి.
****
(Release ID: 2187113)
Visitor Counter : 7
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam