సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ గేయం ‘వందేమాతరానికి’ 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏడాది పొడవునా జరిగే ఉత్సవాలను నవంబర్ 7న ప్రారంభించనున్న ప్రధానమంత్రి

Posted On: 05 NOV 2025 8:58PM by PIB Hyderabad

జాతీయ గేయం ‘వందేమాతరానికి’ 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న ఉత్సవాలకు సంబంధించి 2025 నవంబర్ 7న ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో చేపట్టనున్న  ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని, ఐక్యతను పెంపొందిస్తున్న ఈ అద్భుతమైన గేయం 150 సంవత్సరాల వేడుకలు 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా జరగనున్నాయి. నవంబర్ 7 కార్యక్రమంతో ఈ ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమౌతాయి. 

బంకించంద్ర ఛటర్జీ రచించిన జాతీయ గేయం ‘వందేమాతరం’ 2025 నాటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. 1875 నవంబర్ 7న అక్షయ నవమి పర్వదినం సందర్భంగా దీనిని రచించినట్లు చెబుతారు. ఆయన నవల 'ఆనందమఠ్'లో మొదటగా ఈ గేయం వెలుగు చూసింది. ఈ నవల అప్పట్లో 'బంగదర్శన్' అనే సాహిత్య పత్రికలో ధారావాహికగా వెలువడింది. ఆ తర్వాత 1882లో ఒక ప్రత్యేక పుస్తకంగా వచ్చింది. భారత్‌ భారీ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మార్పులకు లోనవుతున్న కాలమది. జాతీయ గుర్తింపు భావన, వలస పాలనపై ప్రతిఘటన పెరుగుతున్న ఆ కాలంలో వందేమాతరం.. మాతృభూమిని బలం, శ్రేయస్సు, దైవత్వానికి ప్రతీకగా మార్చింది. జాతీయ సమైక్యత, ఆత్మగౌరవాన్ని పెంపొందించింది. తర్వాత కొద్ది కాలంలో ఇది దేశభక్తికి శాశ్వత చిహ్నంగా మారింది. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.. వందేమాతరం స్వాతంత్య్ర పోరాటంలో చారిత్రక పాత్ర పోషించిందని ప్రకటిస్తూ, జాతీయ గీతం జనగణమనతో సమానంగా సమాన గౌరవం ఇచ్చారు. 

ఉత్సవాల్లో ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి సమక్షంలో జరిగే ప్రధాన కార్యక్రమంలో వందేమాతరం ఆలాపన చేయనున్నారు. దీనికి సమాంతరంగా దేశవ్యాప్తంగా ప్రజా ప్రదేశాల్లో వందేమాతర గేయాన్ని సామూహికంగా ఆలపిస్తారు. ఇందులో ప్రజలు, పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, పోలీసు సిబ్బంది, వైద్యులు, ఉపాధ్యాయులు, డ్రైవర్లు, దుకాణదారులు, సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన వారందరూ పాల్గొంటారు. ఈ కార్యక్రమంతోనే ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. 

వందేమాతరానికి ఉన్న చారిత్రక, జాతీయ ప్రామూఖ్యతను గుర్తించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఈ గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించే ప్రతిపాదనకు 2025 అక్టోబర్ 1న ఆమోదం తెలిపింది. 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహించేందుకు జాతీయ అమలు కమిటీ 2025 అక్టోబర్ 24న ఆమోదం తెలిపింది. 

'వందే మాతరం' 150 సంవత్సరాల ఉత్సవాల ప్రారంభ కార్యక్రమం విశేషాలు:

* ముఖ్య అతిథి రాకముందు సాంస్కృతిక కార్యక్రమం
* జాతీయ గేయం 'వందే మాతరం' 150 సంవత్సరాల చరిత్రపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను ముఖ్య అతిథి సందర్శన.
* భారత మాతకు పుష్పాంజలి
* వందే మాతరం- నాద్ ఏకం, రూపమ్ అనేకమ్: అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన వయోలిన్ మాస్ట్రో డా. మంజునాథ్ మైసూర్ ఆధ్వర్యంలో సుమారు 75 మంది సంగీతకారులతో కచేరి. ఇది విభిన్న సంప్రదాయ భారతీయ సంగీత శైలుల సమ్మేళనాన్ని ముఖ్య అతిథి సమక్షంలో ప్రదర్శిస్తుంది.
* డాక్యుమెంటరీ ప్రదర్శన: '150 ఏళ్ల వందే మాతరం' అనే లఘు డాక్యుమెంటరీ చిత్రం ప్రదర్శన.
* ప్రత్యేక స్టాంప్, నాణెం విడుదల
* ప్రముఖుల ప్రసంగాలు: వేదికపై ఉన్న విశిష్ట ప్రముఖులు, అతిథుల ప్రసంగాలు
* ముఖ్య అతిథి కీలకోపన్యాసం: ముఖ్య అతిథి అయిన ప్రధానమంత్రి కీలకోపన్యాసం
* వందేమాతరం సామూహిక గీతాలాపన

ప్రారంభోత్సవ కార్యక్రమంతో సమాంతరంగా అన్ని రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు - విభాగాలు, వాటి అనుబంధ- అధీన కార్యాలయాలు 2025 నవంబర్ 7న ఉదయం 10:00 గంటలకు సంబంధిత కార్యాలయ ప్రాంగణాల్లో ‘వందే మాతరం’ సామూహిక గీతాలాపనను చేయనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాలు, సంస్థలు..  ప్రధానమంత్రి ప్రసంగాన్ని అందరూ కలిసి వీక్షించేందుకు ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లను కూడా చేయనున్నాయి.

ప్రజలతో పాటు సంస్థల భాగస్వామ్యం కోసం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను https://vandemataram150.in/ తీసుకొచ్చింది. ఈ వెబ్‌సైట్‌లో కింది ఫీచర్లు ఉన్నాయి:

* ఆమోదించిన హోర్డింగ్‌లు, బ్యానర్లు, వెబ్ క్రియేటివ్స్‌ వంటివి అందుబాటులో ఉంటాయి.

* లఘ చిత్రాలతో పాటు ప్రత్యేకంగా రూపొందించి ప్రదర్శన

* సామూహిక ఆలాపన కోసం సాహిత్యంతో కూడిన పూర్తి గీతం ఆడియో అందుబాటులో ఉంటుంది.

* ‘వందే మాతరంతో కరవోకే’: ఈ ప్రత్యేక ఫీచర్ ద్వారా నచ్చిన విధంగా గేయాన్ని ఆలపించి, ఆ రికార్డింగ్‌ను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయొచ్చు. మాతృభూమిపై ప్రేమను వ్యక్తం చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు ఇందులో చురుకుగా పాల్గొనాలని ప్రోత్సహిస్తున్నారు. 

మన గర్వం, గౌరవం, ఉమ్మడి గుర్తింపును పెంపొందిస్తూ మనందరికీ ఐక్యం చేస్తున్న జాతీయ గేయాన్ని గౌరవించేందుకు.. దేశభక్తి, కృతజ్ఞతకు సమష్టి ప్రతీకగా ఈ కార్యక్రమాలలో దేశ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నారు.


(Release ID: 2186899) Visitor Counter : 159