కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థతో ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకు ఒప్పందం
Posted On:
03 NOV 2025 4:32PM by PIB Hyderabad
కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ పరిధిలోని పోస్టు విభాగం ఆధ్వర్యంలో పని చేస్తున్న ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకు.. కార్మిక, ఉపాధి మంత్రిత్వకు చెందిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థతో (ఈపీఎఫ్ఓ) ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఉద్యోగుల పెన్షన్ పథకం 1995 కింద పెన్షన్ పొందుతున్న వారి ఇంటి వద్దకే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవలను అందించనున్నారు.
ఈ ఒప్పంద పత్రంపై ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శ్రీ ఆర్. విశ్వేశ్వరన్.. ఈపీఎఫ్ఓ కేంద్ర భవిష్య నిధి కమిషనర్ శ్రీ రమేష్ కృష్ణమూర్తి సంతకం చేశారు. ఈపీఎఫ్ఓ 73వ స్థాపన దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు కార్మిక, ఉపాధి శాఖ, యువజన, క్రీడా వ్యవహారాల మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్మిక, ఉపాధిశాఖ కార్యదర్శి శ్రీమతి వందనా గుర్నానీ, సెంట్రల్ బోర్డ్ ట్రస్టీస్ సభ్యులు, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ, ఈపీఎఫ్ఓ, ఐపీపీబీ ఉన్నతాధికారులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ భాగస్వామ్యంతో ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకు.. తన పరిధిలోని 1.65 లక్షలకుపైగా పోస్టు కార్యాలయాలు, 3 లక్షలకుపైగా పోస్టుమెన్లు, గ్రామీణ పోస్టు సేవకులను వినియోగించుకోనుంది. వీరందరికీ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ పరికరాలు అందిస్తుంది. వీటి సహాయంతో సిబ్బంది ముఖ గుర్తింపు సాంకేతికత, వేలిముద్ర బయోమెట్రిక్ ధ్రువీకరణ వంటి డిజిటల్ విధానాలను ఉపయోగించి పింఛనర్ల ఇంటికే వెళ్లి డిజిటల్ లైఫ్ ధ్రువపత్రం సేవలను అందిస్తారు. దీనివల్ల పింఛనర్లు ఇకపై బ్యాంక్ శాఖలకు లేదా ఈపీఎఫ్ కార్యాలయాలకు వెళ్లి సంప్రదాయ పేపర్ ఆధారిత లైఫ్ ధ్రువపత్రాన్ని సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఈపీఎఫ్ఓ డిజిటల్ లైఫ్ ధ్రువపత్రం జారీకి సంబంధించిన ఖర్చును తగ్గిస్తుంది. ఈ సేవను పెన్షనర్లు పూర్తిగా ఉచితంగా పొందవచ్చు.
ఈ ఒప్పందపై ఐపీపీబీ ఎండీ, సీఈఓ శ్రీ ఆర్ విశ్వేశ్వరన్ మాట్లాడుతూ..
‘‘ఈపీఎఫ్ఓతో జరిగిన ఈ ఒప్పందం దేశంలోని ప్రతి ఇంటికి అవసరమైన ఆర్థిక, పౌర సేవలను అందించాలనే ఐపీపీబీ లక్ష్యాన్ని మరింత బలపరుస్తుంది. మా సాంకేతికత ఆధారిత పోస్టల్ వ్యవస్థతో ఈపీఎఫ్ ఓపెన్షనర్లు, ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు కూడా తమ లైఫ్ సర్టిఫికేటల్ సమర్పణను సులభంగా, గౌరవంగా, సౌకర్యవంతంగా పూర్తి చేయగలరు. ఈ కార్యక్రమం భారత ప్రభుత్వ 'డిజిటల్ ఇండియా', 'ఈజీ ఆఫ్ లివింగ్' దార్శనికతకు అనుగుణంగా రూపొందించారు. సాంకేతికత, పోస్టల్ మౌలిక సదుపాయాలను ఉపయోగించి వృద్ధులు, పెన్షనర్లకు సమగ్ర సేవలను అందించడమే దీని లక్ష్యం’’
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు 2020లోనే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ డోర్‌స్టెప్ సేవాలను ప్రారంభించింది. ఈ సేవ ద్వారా పింఛనర్లు తమ ఇంటి నుంచే ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా జీవన్ ప్రమాణ ధ్రువపత్రాన్ని పొందగలుగుతారు. పెన్షనర్లకు ధ్రువపత్రం జారీ ప్రక్రియలో సమయాన్ని తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం.
పెన్షనర్లు చేయాల్సిందల్లా పోస్ట్‌మ్యాన్/గ్రామీణ పోస్టు సేవకులను సంప్రదించాలి. లేదా సమీపంలోని పోస్టాఫీస్‌కు వెళ్లి తమ ఆధార్ నంబర్, పెన్షన్ వివరాలు అందించాలి. తరువాత ఆధార్ తో లింక్ అయిన ముఖ గుర్తింపు లేదా వేలిముద్ర బయోమెట్రిక్ ద్వారా అభ్యర్థనను ధ్రువీకరిస్తారు. సర్టిఫికేట్ జనరేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పెన్షనర్ మొబైల్ నంబర్ కు నిర్దారణ ఎస్ఎమ్ఎస్ వస్తుంది. ఆ తరువాతి రోజు నుంచి వారు తమ జీవన్ ప్రమాణ ధ్రువపత్రాన్ని ఆన్‌లైన్‌లో ఈ వెబ్‌సైట్‌లో చూడవచ్చు: https://jeevanpramaan.gov.in/v1.0/
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు గురించి...
కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ పరిధిలోని పోస్టు విభాగం కింద ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకును ఏర్పాటు చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో100 శాతం ఈక్విటీతో పనిచేస్తుంది. ఐపీపీబీని సెప్టెంబర్ 1, 2018న ప్రారంభించారు. దేశంలోని ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండే, చవకైన నమ్మదగిన బ్యాంకు సేవలను అందించాలన్న ఉద్దేశంతో దీనిని స్థాపించారు. బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్నవారికి, అలాగే పూర్తిగా సేవలు అందని వర్గాలకు ఆర్థిక సేవలను చేరవేయడం. ఇందుకోసం సుమారు 1,65,000 పోస్టు కార్యాలయాలు (వాటిలో సుమారు 1,40,000 గ్రామీణ ప్రాంతాల్లో), 3 లక్షలకుపైగా పోస్టల్ సిబ్బంది కలిగిన విస్తృత పోస్టల్ వ్యవస్థను వినియోగిస్తుంది.
ఐపీపీబీ విస్తరణ, కార్యకలాపాలు ఇండియా స్టాక్ ఆధారంగా నిర్మితమయ్యాయి. దీని ద్వారా.. కాగితం రహిత, నగదు రహిత, బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బ్యాంకింగ్ సేవలను వినియోగదారుల ఇంటి వద్దే సురక్షితంగా సులభంగా అందిస్తుంది. ఇది సీబీఎస్-ఇంటిగ్రేటెడ్ స్మార్ట్‌ఫోన్, బయోమెట్రిక్ పరికరాల సహాయంతో సాధ్యమవుతుంది.
తక్కువ వ్యయంతో కూడిన సాంకేతిక ఆవిష్కరణలను వినియోగిస్తూ, ప్రజలకు సులభమైన బ్యాంకింగ్ అనుభవం కల్పించాలన్న లక్ష్యంతో ఐపీపీబీ పనిచేస్తోంది. వినియోగదారులకు సులభంగా అర్థమయ్యే విధంగా ప్రస్తుతం 13 భాషల్లో దేశంలోని 5.57 లక్షల గ్రామాలు, పట్టణాలలోని 11 కోట్లకుపైగా వినియోగదారులకు సేవలు అందిస్తోంది. దేశంలో నగదు వినియోగాన్ని తగ్గించి, డిజిటల్ ఇండియా లక్ష్యాలను సాధించడంలో ఐపీపీబీ కీలక పాత్ర పోషిస్తోంది.
దేశంలో నగదు వినియోగం తక్కువగా ఉండే ఆర్థిక వ్యవస్థకు తోడ్పటుకు, డిజిటల్ ఇండియా దార్శనికతకు దోహదపడేందుకు ఐపీపీబీ కట్టుబడి ఉంది. ప్రతి పౌరుడు ఆర్థిక భద్రత, సాధికారత పొందేందుకు సమాన అవకాశం లభించినప్పుడు మాత్రమే దేశం నిజంగా అభివృద్ధి చెందుతుంది. ‘‘ప్రతి వినియోగదారుడు ముఖ్యం, ప్రతి లావాదేవీ ముఖ్యమైనది, ప్రతి డిపాజిట్ విలువైనది.” అదే నిజమైన మా నినాదం.
మమ్మల్ని ఇక్కడ సంప్రదించండి:
ఈమెయిల్: marketing@ippbonline.in
వెబ్‌సైట్: www.ippbonline.bank.in
సోషల్ మీడియా హ్యాండిల్స్:
ట్విట్టర్ -https://twitter.com/IPPBOnline
ఇన్‌స్టాగ్రామ్ -https://www.instagram.com/ippbonline
లింక్డ్ఇన్ -https://www.linkedin.com/company/india-post-paymentsbank
ఫేస్‌బుక్ -https://www.facebook.com/ippbonline
యూట్యూబ్-https://www.youtube.com/@IndiaPostPaymentsBank
***
(Release ID: 2186520)
Visitor Counter : 7