ఆయుష్
                
                
                
                
                
                    
                    
                        ప్రత్యేక ప్రచార ఉద్యమం - 5.0ను విజయవంతంగా పూర్తి చేసి   ‘స్వచ్ఛతా హీ సేవా’ను పటిష్ఠపరిచిన ఆయుష్ మంత్రిత్వ శాఖ
                    
                    
                        
అందుబాటులోకి 1365 చదరపు అడుగుల స్థలం 
రూ.7.35 లక్షల ఆదాయం
                    
                
                
                    Posted On:
                03 NOV 2025 12:19PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                గత నెల 2 నుంచి 31వ తేదీ మధ్య కాలంలో ఆయుష్ శాఖ ప్రత్యేక ప్రచార ఉద్యమం 5.0ను నిర్వహించి దక్షత, పారదర్శకత, స్వచ్ఛతల దిశగా తన కృషిని దృఢతరం చేసింది. ఈ ప్రచార ఉద్యమం పాలనను సువ్యవస్థీకరించి, రికార్డుల నిర్వహణకు మెరుగులు దిద్దడంతో పాటు ఆయుష్ సంస్థలన్నింటిలోనూ నిరంతర ప్రాతిపదికన స్వచ్ఛతా పరిరక్షణకూ, ప్రజా ఫిర్యాదుల్ని పరిష్కరించడంపై ప్రధానంగా దృష్టి పెట్టింది.
మంత్రిత్వ శాఖ ఈ ప్రచార ఉద్యమ కాలంలో అనేక అంశాలలో చెప్పుకోదగ్గ పురోగతిని సాధించింది. మొత్తంమీద 658 ప్రజా ఫిర్యాదులనూ, ప్రజా ఫిర్యాదులకు సంబంధించిన 59 అపీళ్లనూ కొలిక్కి తెచ్చారు. వీటికి తోడు పార్లమెంట్ సభ్యుల నివేదనలను కూడా పరిష్కరించి, దేశవ్యాప్తంగా ఆయుష్ సంస్థల  పరిధిలో 68 స్వచ్ఛతా ప్రచార ఉద్యమాల్ని ఫలప్రదంగా ముగించారు. 101 ఫైళ్ల ఏరివేతను చేపట్టి రికార్డుల నిర్వహణ తీరునూ, పరిపాలన సామర్థ్యాన్నీ మెరుగుపరిచారు.
చెత్త చెదారాన్నీ ఏరి పారేయడంతో 1365 చదరపు అడుగుల మేర కార్యాలయంలో చోటు అందుబాటులోకొచ్చింది. తుక్కు అమ్మకం ద్వారా రూ.7,35,500 ఆదాయం కూడా సమకూరింది. ఈ కార్యకలాపాల వనరులనూ, పని ప్రదేశ సామర్థ్యాన్నీ సమర్థంగా, సాధ్యమైనంత చక్కగా వినియోగించుకోగలిగేలా తోడ్పడ్డాయి. ఈ  కార్యకలాపాలు కేంద్ర ప్రభుత్వ ‘స్వచ్ఛతా హీ సేవా’, ‘కనీస ప్రభుత్వం, గరిష్ఠ పరిపాలన’ దృష్టికోణాలను సాకారం చేయడంలో ఆయుష్ అనుసరిస్తున్న క్రియాత్మక వైఖరికి అద్దం పట్టాయి.
ఇంతకు ముందు అమలు చేసిన విడతల్లో సాధించిన సాఫల్యాలకు తరువాయిగా మూలికా ఉద్యానవనాలు, సాముదాయిక స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన వివిధ పరిశుభ్రత, అవగాహన ప్రధాన కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బందితో పాటు ఆయుష్ సమాజ సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో పాలుపంచుకునేటట్లు ప్రత్యేక ప్రచార ఉద్యమం 5.0 వారిలో స్ఫూర్తిని నింపింది. ఆయుష్ భవన్లోనూ, ఇతర ప్రధాన సంస్థల్లోనూ ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఉన్నతాధికారులు స్వయంగా నాయకత్వం వహించారు. ఇది ఉమ్మడి బాధ్యతతో పాటు పౌరుల జాగృతికి దోహదం చేసింది.
ఫిర్యాదుల పరిష్కారంలో, స్వచ్ఛత పరిరక్షణలో ఉన్నత ప్రమాణాలను ఇక ముందూ నిలబెట్టడానికి ఆయుష్ శాఖ కట్టుబడి ఉంది. ఈ నిబద్ధత సమర్థమంతమైన, పారదర్శకతకు ప్రాధాన్యాన్నిస్తూ, పౌరుల ప్రయోజనాలకు పెద్దపీట వేసే మెరుగైన పాలనకు తోడ్పడుతుంది.
 
***
                
                
                
                
                
                (Release ID: 2185954)
                Visitor Counter : 9