ప్రధాన మంత్రి కార్యాలయం
प्रविष्टि तिथि:
31 OCT 2025 4:13PM by PIB Hyderabad
నేను సర్దార్ పటేల్ అన్నప్పుడు మీరంతా అమర్ రహే, అమర్ రహే అని చెప్పండి.
సర్దార్ పటేల్ – అమర్ రహే, అమర్ రహే.
సర్దార్ పటేల్ – అమర్ రహే, అమర్ రహే.
సర్దార్ పటేల్ – అమర్ రహే, అమర్ రహే.
సర్దార్ పటేల్ 150వ జయంతి చరిత్రాత్మక సందర్భం. ఏక్తానగర్లో ఈ నాటి దివ్యమైన ఉదయం...ముఖ్యంగా ఈ విశాల దృశ్యం గొప్ప ఆరాధనా భావాన్ని కలిగిస్తోంది. సర్దార్ సాహెబ్ పాదాల వద్ద మనమంతా సామూహికంగా ఐక్యతా స్ఫూర్తిని చాటుతున్న ఒక గొప్ప సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఐక్యతా పరుగులో పాల్గొంటున్న కోట్లాది మంది భారతీయుల ఉత్సాహం ద్వారా మనం నవ భారత సంకల్పాన్ని కార్యాచరణలో చూస్తున్నాం. నిన్న సాయంత్రం జరిగిన అద్భుతమైన ప్రదర్శన సహా ఇటీవల ఇక్కడ నిర్వహించిన కార్యక్రమాలు గత కాలపు సంప్రదాయాన్ని, వర్తమానపు శ్రమనీ- శౌర్యాన్నీ, భవిష్యత్తు విజయాల సంగ్రహావలోకనాన్ని ప్రదర్శించాయి. సర్దార్ సాహెబ్ 150వ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు ఒక స్మారక నాణెంతో పాటు పోస్టల్ స్టాంపును విడుదల చేశాం. సర్దార్ సాహెబ్ జయంతి, రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా 140 కోట్ల మంది దేశవాసులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
చరిత్రను రాయడంలో సమయం వృధా చేయకుండా మనమంతా చరిత్ర సృష్టించడానికి కష్టపడి పనిచేయాలని సర్దార్ పటేల్ విశ్వసించారు. ఈ భావన ఆయన జీవన గమనంలో చూడొచ్చు. సర్దార్ సాహెబ్ అనుసరించిన విధానాలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు సరికొత్త చరిత్రను సృష్టించాయి. స్వాతంత్య్రానంతరం 550 సంస్థానాలను ఏకం చేసి, అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్ దార్శనికత ఆయనకు అత్యంత ముఖ్యం. అందుకే సర్దార్ పటేల్ జయంతి సహజంగానే జాతీయ ఐక్యతకు గొప్ప పండగగా మారింది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని, జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లుగానే 140 కోట్ల మంది దేశవాసులు ఈ రోజు ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. ఆయన జయంతికి గల ప్రాముఖ్యత మనకు స్ఫూర్తిదాయకమైన, గర్వకారణమైన క్షణం. కోట్లాది మంది ఈ రోజు ఐక్యతా ప్రమాణం చేశారు. దేశ ఐక్యతను బలోపేతం చేసే అటువంటి పనులను ప్రోత్సహిస్తామని మనం సంకల్పించాం. ఇక్కడ ఏక్తా నగర్‌లోని ఏక్తా మాల్, ఏక్తా గార్డెన్ ఐక్యతా స్ఫూర్తిని బలోపేతం చేస్తున్నాయి.
మిత్రులారా,
దేశ ఐక్యతను బలహీనపరిచే విషయాలకు ప్రతి పౌరుడు దూరంగా ఉండాలి. ఇది జాతీయ కర్తవ్యం. ఇది సర్దార్ సాహెబ్‌కు నిజమైన నివాళి. దేశానికి ఈ రోజు ఇదే అవసరం. ప్రతి భారతీయుడి ఐక్యతా దినోత్సవ సందేశం, సంకల్పం కూడా ఇదే.
మిత్రులారా,
సర్దార్ సాహెబ్ దేశ సార్వభౌమత్వానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. దురదృష్టవశాత్తూ, సర్దార్ సాహెబ్ మరణం తరువాతి కాలంలో అప్పటి ప్రభుత్వాలు దేశ సార్వభౌమత్వాన్ని అంతగా పట్టించుకోలేదు. ఒకవైపు కాశ్మీర్ విషయంలో జరిగిన తప్పులు... మరోవైపు ఈశాన్యంలో తలెత్తిన సమస్యలు... దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో వృద్ధి చెందిన నక్సలైట్-మావోయిస్ట్ తీవ్రవాదం... దేశ సార్వభౌమత్వానికి ప్రత్యక్ష సవాళ్లుగా పరిణమించాయి. సర్దార్ సాహెబ్ విధానాలను అనుసరించడానికి బదులుగా నాటి ప్రభుత్వాలు వెన్నెముక లేని విధానాన్ని ఎంచుకున్నాయి. దీని పర్యవసానాలను దేశం హింస, రక్తపాతం రూపంలో ఎదుర్కోవాల్సి వచ్చింది.
మిత్రులారా,
దేశంలోని ఇతర సంస్థానాలను విలీనం చేసినట్లుగానే మొత్తం కాశ్మీర్ ప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేయాలనే సర్దార్ సాహెబ్ ఆకాంక్ష నేటి యువతరంలో చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ నెహ్రూజీ కారణంగా ఆయన ఆకాంక్ష నెరవేరలేదు. ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక జెండాతో నెహ్రూజీ కాశ్మీర్‌ను విభజించారు!
మిత్రులారా,
దశాబ్దాలుగా కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ చేసిన తప్పుల కారణంగా దేశం అగ్నికి ఆహుతైంది. కాంగ్రెస్ తప్పుడు విధానాల కారణంగానే కాశ్మీర్‌లోని కొంత భాగం పాకిస్తాన్ అక్రమ ఆక్రమణలోకి వెళ్ళింది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి, ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదానికీ ఊతమిచ్చింది.
మిత్రులారా,
కాశ్మీర్, దేశం భారీ మూల్యం చెల్లించుకున్నాయి. అయినప్పటికీ ఎల్లప్పుడూ కాంగ్రెస్ ఉగ్రవాదానికి లొంగిపోయింది.
మిత్రులారా,
సర్దార్ సాహెబ్ దార్శనికతను కాంగ్రెస్ మరచిపోయింది... కానీ మనం మర్చిపోలేదు. 2014 తర్వాత దేశం మరోసారి స్ఫూర్తిదాయకమైన ఆయన ఉక్కు సంకల్పాన్ని చూసింది. ఆర్టికల్ 370 సంకెళ్ల నుంచి విముక్తి పొంది కాశ్మీర్ ప్రధాన స్రవంతిలో పూర్తిగా కలిసిపోయింది. భారత్ నిజమైన బలం ఏమిటో పాకిస్తాన్‌తో పాటు ఉగ్రవాదులూ తెలుసుకున్నారు! ఎవరైనా భారతదేశాన్ని సవాలు చేస్తే... భారత్ వారి ఇంటికెళ్లి మరీ సమాధానమిస్తుందని ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచమంతా చూసింది. భారత్ ప్రతిస్పందన ప్రతీసారి గతంలో కంటే పెద్దదిగా... గతంలో కంటే మరింత నిర్ణయాత్మకంగా ఉంటుంది. ఇది శత్రువులకు భారత్ అందించే బలమైన సందేశం... భారత్ భద్రత, గౌరవం విషయంలో ఎప్పుడూ రాజీపడదని ఉక్కు మనిషి సర్దార్ పటేల్ ఇచ్చిన సందేశం.
మిత్రులారా,
నక్సలిజం-మావోయిస్టు తీవ్రవాదం వెన్ను విరిచేయడం గత 11 సంవత్సరాల్లో జాతీయ భద్రతకు సంబంధించి భారత్ సాధించిన అతిపెద్ద విజయం. 2014కి ముందు మన దేశంలో పరిస్థితి ఎలా ఉండేదంటే... నక్సలైట్లు, మావోయిస్టులు దేశం లోపల, దేశం నడిబొడ్డున వారి కార్యకలాపాలు సాగించారు. నక్సలైట్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో దేశ రాజ్యాంగం అమలు కాలేదు. పోలీసు వ్యవస్థ కూడా అక్కడ ఏమీ చేయలేకపోయింది. నక్సలైట్లు బహిరంగంగా కొత్త ఉత్తర్వులు జారీ చేసేవారు. వారు రహదారుల నిర్మాణాన్ని అడ్డుకున్నారు. పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులనూ బాంబులతో పేల్చారు. నాటి ప్రభుత్వం, పరిపాలన వ్యవస్థ వారి ముందు నిస్సహాయంగా నిలబడింది.
మిత్రులారా,
2014 తర్వాత మా ప్రభుత్వం నక్సలిజం-మావోయిస్టు తీవ్రవాదంపై భారీ దాడిని ప్రారంభించింది. అర్బన్ నక్సలైట్ మద్దతుదారులను, అర్బన్ నక్సలైట్లను కూడా మేం అణచివేశాం. సైద్ధాంతిక యుద్ధంలో మనం గెలిచాం. వారు బలంగా ఉన్న ప్రదేశాల్లోనూ వారిని ఎదుర్కొన్నాం. వాటి ఫలితాలు ఈ రోజు దేశం ముందు ఉన్నాయి. 2014కి ముందు దేశంలోని దాదాపు 125 జిల్లాలు మావోయిస్టు తీవ్రవాదం గుప్పిట్లో ఉన్నాయి. వాటి సంఖ్య ఈ రోజు ఏకంగా 11కి తగ్గింది. వాటిలో ప్రస్తుతం మూడు జిల్లాల్లో మాత్రమే ప్రభావం ఉంది. దేశం నక్సలిజం, మావోయిజం, తీవ్రవాదం నుంచి పూర్తిగా విముక్తి పొందే దాకా మేం ఆగబోమని.. మేం శాంతియుతంగా కూర్చోబోమనీ ఈ రోజు సర్దార్ పటేల్ సమక్షంలో, ఈ ఏక్తా నగర్ భూమి నుంచి నేను మొత్తం దేశానికి హామీ ఇస్తున్నాను.
మిత్రులారా,
ప్రస్తుతం చొరబాట్లు దేశ ఐక్యతకు, అంతర్గత భద్రతకు గణనీయమైన ముప్పును కలిగిస్తున్నాయి. దశాబ్దాలుగా విదేశీ చొరబాటుదారులు దేశంలోకి వస్తూనే ఉన్నారు. వారు దేశ ప్రజల వనరులను ఆక్రమించుకుంటూనే ఉన్నారు. జనాభా సమతుల్యతను దెబ్బతీస్తూనే ఉన్నారు. దేశ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వాలు ఇంత పెద్ద సమస్యనూ పట్టించుకోలేదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వారు దేశ భద్రతను ఉద్దేశపూర్వకంగా ప్రమాదంలో పడేశారు. ఇప్పుడు మొదటిసారిగా దేశం ఈ పెద్ద ప్రమాదానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక పోరాటం చేయాలని నిర్ణయించింది. నేను ఎర్రకోట నుంచి డెమోగ్రఫీ మిషన్‌నూ ప్రకటించాను.
మిత్రులారా,
మనం ఈ అంశాన్ని తీవ్రంగా లేవనెత్తుతున్నప్పుడూ, కొంతమంది జాతీయ ప్రయోజనాల కంటే తమ సొంత ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఈ వ్యక్తులు చొరబాటుదారులకు హక్కులు ఇవ్వడానికి రాజకీయ పోరాటం చేస్తున్నారు. దేశాన్ని విభజించిన తర్వాత కూడా... వారు విభజన కొనసాగినా తమకు పోయేదేమీ లేదని నమ్ముతారు. నిజం ఏమిటంటే... దేశ భద్రత, గుర్తింపు ప్రమాదంలో ఉంటే, దేశంలోని ప్రతి వ్యక్తీ ప్రమాదంలో ఉంటాడు. దేశంలో నివసిస్తున్న ప్రతి చొరబాటుదారుడినీ తరిమేస్తామని ఈ రోజు జాతీయ ఐక్యతా దినోత్సవ సందర్భంలో మనం మరోసారి ప్రతిజ్ఞ చేయాలి.
మిత్రులారా,
ప్రజాస్వామ్యంలో జాతీయ ఐక్యత గురించి మనం మాట్లాడేటప్పుడు దానిలోని ఒక అంశం ఏమిటంటే... మనం ఆలోచనల వైవిధ్యాన్ని గౌరవిస్తాం. ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలు ఆమోదయోగ్యమైనవే, కానీ మనసుల మధ్య భేదాలు ఉండకూడదు. కానీ విచిత్రం ఏమిటంటే... స్వాతంత్య్రానంతరం దేశాన్ని పాలించే బాధ్యతను పొందిన వ్యక్తులే... 'అధికారం ప్రజలు ఇచ్చినదే' అనే స్ఫూర్తిని నాశనం చేయడానికి ప్రయత్నించారు. వారు తమ సొంత ఆలోచనలు, భావజాలానికి భిన్నంగా ఉన్న ప్రతి వ్యక్తినీ, సంస్థనూ తృణీకరించారు. వారిని అప్రతిష్ఠపాలు చేయడానికి ప్రయత్నించారు. దేశంలో రాజకీయ అంటరానితనాన్ని ఒక సంస్కృతిగా మార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో సర్దార్ పటేల్ గారికి, ఆయన వారసత్వానికి ఏమి జరిగిందో మనందరికీ తెలుసు. బాబా సాహెబ్ అంబేద్కర్ జీవితకాలంలో, ఆయన మరణం తర్వాత కూడా ఈ వ్యక్తులు ఏం చేశారు? నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు వారు ఏం చేశారు? డాక్టర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్ వంటి వ్యక్తులకు కాంగ్రెస్ అదే చేసింది. ఈ సంవత్సరం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 100వ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. సంఘ్‌పైనా ఎలాంటి దాడులూ, కుట్రలు జరిగిందీ మీరు చూశారు. ఒక పార్టీ, ఒక కుటుంబం వెలుపల ఉన్న ప్రతి వ్యక్తినీ, ప్రతి ఆలోచననీ అంటరానివిగా చేయడానికి ప్రతి ఒక్క ప్రయత్నం జరిగింది.
సోదరీ సోదరులారా,
దేశాన్ని విభజించే ఈ రాజకీయ అంటరానితనాన్ని అంతం చేయడం మాకు గర్వకారణం. సర్దార్ పటేల్ కోసం ఐక్యతా విగ్రహాన్ని నిర్మించాం. బాబా సాహెబ్ పంచతీర్థాన్ని నిర్మించాం. ఢిల్లీలోని బాబా సాహెబ్ మహా పరినిర్వాణ స్థలమైన ఆయన ఇల్లు కాంగ్రెస్ కాలంలో నిర్లక్ష్యం కారణంగా శిథిలావస్థలో ఉండేది. ఆ పవిత్ర స్థలాన్ని మేం చారిత్రక స్మారక చిహ్నంగా మార్చాం. కాంగ్రెస్ పాలనలో ఒకే ఒక మాజీ ప్రధానమంత్రి పేరుతో మ్యూజియం ఉండేది. మేం రాజకీయ అంటరానితనానికి అతీతంగా ఎదిగి... దేశంలోని ప్రధానులందరి కృషికి నిదర్శనంగా నిలిచే ప్రధానమంత్రి మ్యూజియంను ఏర్పాటు చేశాం. కర్పూరి ఠాకూర్ వంటి ప్రముఖ నాయకుడికి భారతరత్న పురస్కారం ప్రదానం చేశాం. కాంగ్రెస్ పార్టీకి తన జీవితాన్ని అంకితం చేసిన ప్రణబ్ దాకు మేం భారతరత్నను ప్రదానం చేశాం. భిన్నమైన భావజాలం కలిగిన ములాయం సింగ్ యాదవ్ వంటి నాయకులనూ పద్మ పురస్కారంతో సత్కరించాం. రాజకీయ విభేదాలకు అతీతంగా దేశం కోసం ఐక్యతా స్ఫూర్తిని బలోపేతం చేయడమే ఈ నిర్ణయాల వెనక ఉన్న ఆలోచన. ఆపరేషన్ సిందూర్ తర్వాత విదేశాలకు వెళ్లిన మా అఖిలపక్ష ప్రతినిధి బృందంలోనూ ఈ ఐక్యతా దృక్పథాన్ని మనం చూశాం.
మిత్రులారా,
దేశ సమైక్యతపై రాజకీయ లబ్ధి కోసం దాడి చేయాలనే ఆలోచన బానిసత్వ మనస్తత్వంలో భాగం. కాంగ్రెస్ పార్టీ బ్రిటీష్ వారి నుంచి పార్టీని, అధికారాన్నీ వారసత్వంగా పొందడమే కాక, ఆ బానిసత్వ మనస్తత్వాన్ని కూడా పుణికిపుచ్చుకుంది. చూడండి - ఇంకొన్ని రోజుల్లోనే మన జాతీయ గేయం వందే మాతరానికి 150 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. 1905లో బ్రిటిష్ వారు బెంగాల్‌ను విభజించినప్పుడు, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతి భారతీయుడి నోట ‘వందే మాతరం‘ ప్రతిధ్వనించింది. ‘వందే మాతరం‘ దేశ ఐక్యతకు, సంఘీభావానికి ప్రతీకగా మారింది. చివరికి ‘వందేమాతరం’ ఆలోచనను కూడా నిషేధించడానికి బ్రిటీష్ వారు ప్రయత్నించారు. కానీ, ఆ ప్రయత్నంలో వారు విఫలమయ్యారు! ‘వందేమాతరం‘ నినాదం భారతదేశం నలుమూలల నుంచి ప్రతిధ్వనిస్తూనే ఉంది. అయితే, బ్రిటీష్ వారు చేయలేని పనిని కాంగ్రెస్ చేసింది. మతపరమైన కారణాల వల్ల వందేమాతరంలోని ఒక భాగాన్ని కాంగ్రెస్ తొలగించింది. అంటే, కాంగ్రెస్ సమాజాన్ని విభజించడమే కాక, బ్రిటీష్ వారి ఎజెండాను కూడా ముందుకు నడిపింది. ఈ రోజు నేను చాలా బాధ్యతతో ఒక విషయం చెబుతున్నా - ఏ రోజునైతే కాంగ్రెస్ వందేమాతరాన్ని విచ్ఛిన్నం చేసి, విభజించాలని నిర్ణయించుకుందో, ఆ రోజునే అది భారతదేశ విభజనకు పునాది వేసింది. కాంగ్రెస్ ఆ పాపాన్ని చేసి ఉండకపోతే, ఈ రోజు భారతదేశ ముఖచిత్రం వేరే విధంగా ఉండేది!
మిత్రులారా,
అప్పటి ప్రభుత్వంలో కూర్చున్న వారి ఈ విధమైన ఆలోచనల కారణంగానే, దేశం అనేక దశాబ్దాలుగా బానిసత్వపు చిహ్నాలను మోసింది. మీకు గుర్తుండే ఉంటుంది - మీరు మాకు దేశసేవ చేసే అవకాశం ఇచ్చి, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నౌకాదళ పతాకం నుంచి బానిసత్వ ముద్ర తొలగిపోయింది. రాజ్‌పథ్ కూడా కర్తవ్యపథ్‌గా మారింది. స్వాతంత్య్ర పోరాటంలో విప్లవకారులు ప్రాణాలు అర్పించిన అండమాన్‌లోని సెల్యులార్ జైలుకు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జాతీయ స్మారక చిహ్నం హోదా లభించింది. కొంత కాలం క్రితం వరకు అండమాన్ దీవులకు కూడా బ్రిటీష్ వారి పేర్లే ఉండేవి. ఆ దీవులకు మేం నేతాజీ సుభాష్ పేరు పెట్టాం. అనేక ద్వీపాలకు పరమ వీర చక్ర విజేతల పేర్లు పెట్టాం. ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశాం.
మిత్రులారా,
దేశ రక్షణలో అమరులైన సైనికులకు కూడా బానిసత్వ మనస్తత్వం కారణంగా సరైన గౌరవం దక్కలేదు. ఆ వీర జవాన్ల స్మృతులను శాశ్వతంగా నిలబెట్టడానికి మేం జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించాం. దేశ అంతర్గత భద్రత కోసం కూడా 36 వేల మంది సైనికులు - మన పోలీసు దళంలోని వీరు - ఖాకీ దుస్తుల్లోని ఈ వీరులు తమ ప్రాణాలు అర్పించారనే విషయం కూడా దేశం సరిగా తెలుసుకోలేదు. 36 వేల మంది అమరవీరులు - ఈ సంఖ్య చిన్నదేమీ కాదు. మన పోలీసులు, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, మన పారామిలటరీ బలగాలన్నింటి శౌర్యం కూడా సరైన గౌరవానికి నోచుకోలేదు.ఆ అమరవీరుల గౌరవార్థం పోలీస్ స్మారక చిహ్నాన్ని నిర్మించి వారిని గౌరవించింది మా ప్రభుత్వమే. ఈ రోజు, సర్దార్ పటేల్ పాదాల చెంత నిలబడి, నేను దేశవ్యాప్తంగా పోలీస్ బలగాలలో ఉండి సేవ చేసిన వారందరికీ, ఈ రోజు పోలీస్ బలగాలలో ఉండి దేశానికి సేవ చేస్తున్న వారందరికీ నమస్కరిస్తున్నా. వారి గురించి గర్విస్తున్నా, వారికి గౌరవం ఇస్తున్నా. దేశం ఈ రోజు బానిసత్వ మనస్తత్వపు ప్రతి చిహ్నాన్ని తొలగిస్తోంది. దేశం కోసం త్యాగాలు చేసిన వారిని గౌరవించడం ద్వారా, మనం ‘దేశమే తొలి ప్రాధాన్యం’ స్ఫూర్తిని బలోపేతం చేస్తున్నాం.
నా ప్రియమైన దేశవాసులారా,
దేశం, సమాజం మనుగడకు ఐక్యతే పునాది. సమాజంలో ఐక్యత ఉన్నంత కాలం, దేశ సమగ్రత సురక్షితంగా ఉంటుంది. అందుకే, అభివృద్ధి చెందిన భారతదేశం అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి... దేశ ఐక్యతను భంగపరిచే ప్రతి కుట్రను మనం సంఘటితంగా తిప్పికొట్టాలి. నేడు దేశం జాతీయ ఐక్యతకు సంబంధించిన ప్రతి రంగంలో నిరంతరం కృషి చేస్తోంది. భారతదేశ ఈ ఐక్యతా సంకల్పానికి నాలుగు మూలస్తంభాలు ఉన్నాయి. ఐక్యతకు మొదటి స్తంభం సాంస్కృతిక ఐక్యత. రాజకీయ పరిస్థితులతో సంబంధం లేకుండా, వేల సంవత్సరాలుగా భారతదేశాన్ని ఒక దేశంగా సజీవంగా ఉంచింది భారతదేశ సంస్కృతే. మన పన్నెండు జ్యోతిర్లింగాలు, ఏడు పురీ క్షేత్రాలు, నాలుగు ధామాలు, 50కి పైగా శక్తిపీఠాలు, తీర్థయాత్రల సంప్రదాయం - ఇవన్నీ భారతదేశాన్ని చైతన్యవంతమైన దేశంగా ఉంచే జీవశక్తి. ఈ రోజు, మనం సౌరాష్ట్ర తమిళ సంగమం, కాశీ తమిళ సంగమం వంటి కార్యక్రమాల ద్వారా ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా, భారత గొప్ప యోగ శాస్త్రానికి మనం కొత్త గుర్తింపును కూడా తెస్తున్నాం. ఈ రోజు, మన యోగా ప్రజలను కలిపే మాధ్యమంగా మారుతోంది.
మిత్రులారా,
మన ఐక్యతకు రెండో స్తంభం భాష. వందలాది భాషలు, మాండలికాలు భారతదేశ విశాలమైన, సృజనాత్మక ఆలోచనకు చిహ్నాలు. ఎందుకంటే, ఇక్కడ ఏ సమాజం, అధికారం లేదా వర్గం కూడా భాషను తమ ఆయుధంగా ఎప్పుడూ మార్చుకోలేదు. ఒకే భాషను రుద్దే ప్రయత్నం ఎప్పుడూ జరగలేదు. అందుకే భాషా వైవిధ్యం విషయంలో భారతదేశం ప్రపంచంలోనే ఇంత సంపన్న దేశంగా మారింది. మన భాషలు సంగీతంలోని వివిధ స్వరాల మాదిరిగా మన గుర్తింపును బలోపేతం చేశాయి. అందుకే మిత్రులారా, మనం ప్రతి భాషను జాతీయ భాషగా భావిస్తాం. భారతదేశంలో ప్రపంచంలోనే అతి పురాతనమైన భాష - తమిళం ఉందని మనం గర్వంగా చెబుతాం. దానికి మనం గర్విస్తాం. మనకు సంస్కృతం వంటి విజ్ఞాన వారసత్వ సంపద ఉంది. అదేవిధంగా, ప్రతి భారతీయ భాషకు దాని స్వంత ప్రత్యేకత, దాని స్వంత సాహిత్య, సాంస్కృతిక సంపద ఉన్నాయి. ప్రతి భారతీయ భాషను మేం ప్రోత్సహిస్తున్నాం. దేశంలోని పిల్లలు తమ మాతృభాషలో చదువుకుని, అభివృద్ధి సాధించాలని మేం కోరుకుంటున్నాం. భారత ప్రజలు దేశంలోని ఇతర భాషలను కూడా తెలుసుకోవాలి.నేర్చుకోవాలి. భాషలు మన ఐక్యతకు సంధానకర్తలుగా మారాలి. ఇది ఒక్క రోజులో పూర్తయ్యే పని కాదు. ఇది నిరంతర ప్రక్రియ. దీనికి మనమందరం కలిసి బాధ్యత వహించాలి.
మిత్రులారా,
మన ఐక్యతకు మూడో స్తంభం వివక్ష లేని అభివృద్ధి. ఎందుకంటే పేదరికం, వివక్ష అనేవి సామాజిక వ్యవస్థలో ఉన్న అతిపెద్ద బలహీనతలు. దేశ శత్రువులు ఎప్పుడూ ఈ బలహీనతలనే అవకాశంగా మార్చుకున్నారు. అందుకే సర్దార్ సాహెబ్ పేదరికానికి వ్యతిరేకంగా దేశం కోసం ఒక దీర్ఘకాలిక ప్రణాళికపై పనిచేయాలని కోరుకున్నారు. 1947 కంటే 10 సంవత్సరాల ముందు భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి ఉంటే, 1947 నాటికి భారతదేశం ఆహార కొరత సంక్షోభం నుంచి విముక్తి పొందేదని సర్దార్ పటేల్ ఒకసారి అన్నారు. స్వదేశీ సంస్థానాల విలీనం సవాలును ఎలాగైతే పరిష్కరించారో, అలాగే ఆహార కొరత సవాలును పరిష్కరించే వరకు తాను ఆగనని చెప్పడం సర్దార్ సాహెబ్ సంకల్ప బలం. అతిపెద్ద సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా మనం ఈ సంకల్ప బలాన్ని ప్రదర్శించాలి. సర్దార్ సాహెబ్ నెరవేరని సంకల్పాలను కూడా పూర్తి చేయడానికి మా ప్రభుత్వం పనిచేస్తోందని నేను గర్వంగా చెబుతున్నా. గత దశాబ్దంలో 25 కోట్ల మంది దేశ ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చాం. ఈ రోజు కోట్లాది మంది పేదలకు ఇళ్లు లభిస్తున్నాయి. ప్రతీ ఇంటికీ శుభ్రమైన నీరు చేరుతోంది. ఉచిత వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అంటే, ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవితం - ఇదే ఈ రోజు దేశ లక్ష్యం, ఆశయం. ఈ వివక్ష, అవినీతి రహిత విధానాలు ఈ రోజు జాతీయ ఐక్యతను బలోపేతం చేస్తున్నాయి.
మిత్రులారా,
జాతీయ ఐక్యతకు నాలుగో స్తంభం - కనెక్టివిటీ ద్వారా ప్రజల అనుసంధానం! ఈ రోజు దేశంలో రికార్డు స్థాయిలో హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మాణంలో ఉన్నాయి. వందే భారత్, నమో భారత్ వంటి రైళ్లు భారతీయ రైల్వేలన రూపు మారుస్తున్నాయి. చిన్న నగరాలకు కూడా ఇప్పుడు విమానాశ్రయ సదుపాయాలు లభిస్తున్నాయి. ఈ ఆధునిక మౌలిక సదుపాయాలు భారతదేశం పట్ల ప్రపంచ దృక్పథాన్ని పూర్తిగా మారుస్తున్నాయి. ఇది దేశంలో ఉత్తర -దక్షిణ, తూర్పు - పడమరల మధ్య దూరాన్ని కూడా తగ్గించింది. ఈ రోజు ప్రజలు పర్యాటకం, వ్యాపారం కోసం సులభంగా ఇతర రాష్ట్రాలకు ప్రయాణిస్తున్నారు. ఇది ప్రజల మధ్య సంబంధాలకు, సాంస్కృతిక మార్పిడికి కొత్త శకం. ఇది జాతీయ ఐక్యతను బలోపేతం చేస్తోంది. డిజిటల్ విప్లవం కూడా ఈ ఐక్యతను బలోపేతం చేయడానికి ఒక అవకాశాన్ని కల్పించింది. ఈ రోజు డిజిటల్ కనెక్టివిటీ కూడా ప్రజలను కలపడానికి ఒక కొత్త మార్గాన్ని సుగమం చేస్తోంది.
మిత్రులారా,
"దేశం కోసం నేను పనిచేసినప్పుడే నాకు గొప్ప ఆనందం లభిస్తుంది" అని సర్దార్ పటేల్ ఓసారి చెప్పారు. ఈ రోజు నేను కూడా దేశంలోని ప్రతి పౌరుడికి అదే విజ్ఞప్తి చేస్తున్నా. దేశం కోసం పనిచేయడం కంటే గొప్ప ఆనందం మరొకటి ఉండదు. భారతమాత ఆరాధనే దేశంలోని ప్రతి పౌరుడికి అత్యుత్తమ ఆరాధన. 140 కోట్లమంది భారతీయులు ఒకటిగా నిలబడినప్పుడు రాళ్లే పక్కకు తప్పుకుంటాయి. 140 కోట్ల ప్రజలు ఒకే స్వరంలో మాట్లాడినప్పుడు, ఆ మాటలు భారత విజయ ఘోషగా మారతాయి. ఈ ఐక్యత అనే మౌలిక మంత్రాన్ని మన సంకల్పంగా మార్చుకోవాలి. మనం విడిపోకూడదు, బలహీనపడకూడదు.
ఇదే సర్దార్ సాహెబ్ కు మన నిజమైన నివాళి. 'వన్ ఇండియా, బెస్ట్ ఇండియా' సంకల్పాన్ని మనమందరం కలిసి బలోపేతం చేస్తామని నేను విశ్వసిస్తున్నా. అభివృద్ధి చెందిన భారతదేశం, స్వావలంబన భారతదేశం కలను మనం కలిసి నెరవేరుస్తాం. ఈ విశ్వాసంతో మరోసారి సర్దార్ సాహెబ్ పాదాలకు నివాళులర్పిస్తున్నా. నాతో పాటు చెప్పండి - భారత్ మాతా కీ జై. మిత్రులారా, ఈ స్వరం దేశం నలుమూలలా చేరాలి.
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
***