ప్రధాన మంత్రి కార్యాలయం
గిరిజనుల గౌరవం, అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని ప్రస్తావిస్తూ తన ఛత్తీస్‌గఢ్ పర్యటన విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
01 NOV 2025 10:44PM by PIB Hyderabad
గిరిజనుల గౌరవం, ప్రగతి ప్రయాణం, ప్రజా సంక్షేమాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఛత్తీస్‌గఢ్ పర్యటన నుంచి పలు విశేషాలను పంచుకున్నారు.
‘ఎక్స్’ వేదికగా చేసిన పలు పోస్టుల ద్వారా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
"ఈ రోజు నేను నవా రాయ్‌పూర్ అటల్ నగర్‌లో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియాన్ని ప్రారంభించాను. ఇది ఛత్తీస్‌గఢ్ గిరిజన వర్గాల అజేయ ధైర్యం, త్యాగం, దేశభక్తికి అంకితమైంది. మ్యూజియంను సందర్శించడంతో పాటుగా అమరవీరుడు వీర్ నారాయణ్ సింగ్ స్మారక చిహ్నాన్ని ప్రారంభించి, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే భాగ్యం నాకు లభించింది."
"నవా రాయ్‌పూర్ అటల్ నగర్‌లో నిర్వహించిన రజతోత్సవ ప్రదర్శనలో ఛత్తీస్‌గఢ్ రెండున్నర దశాబ్దాల అభివృద్ధి ప్రయాణాన్ని వీక్షించడం నాకు చాలా సంతోషం కలిగించింది."
"ఛత్తీస్‌గఢ్‌లోని నిరుపేద కుటుంబాలకు చెందిన నా సోదరీసోదరులను కలవడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. వారికి ఇప్పుడు శాశ్వత గృహాలు లభించాయి. వారు ఇళ్ల తాళాలు అందుకున్న తర్వాత ఇంటి యజమానులుగా వారి ముఖాల్లో ఆనందం స్పష్టంగా కనిపించింది."
“ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అవతరణ రజతోత్సవ సభ సందర్భంగా నన్ను ఆశీర్వదించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నా కుటుంబ సభ్యులకు చాలా అభినందనలు!
జై జోహార్!”
"25 సంవత్సరాల కిందట ఛత్తీస్‌గఢ్ ఏర్పాటుతో పూజ్య అటల్ జీ నాటిన విత్తనాలు ఇప్పుడు అభివృద్ధి అనే మర్రి వృక్షంగా వికసించాయి. ఈ సమయంలో ఇక్కడి నా సోదరీసోదరులు నన్ను గర్వపడేలా చేసే లెక్కలేనన్ని విజయాలను సాధించారు!"
"ఛత్తీస్‌గఢ్‌లోని మన గిరిజన సమాజం భారత వారసత్వ పరిరక్షణకు, అభివృద్ధికీ సాటిలేని కృషి చేసింది. ఈ రోజు ప్రారంభించిన అమరవీరుడు వీర్ నారాయణ్ సింగ్ స్మారక చిహ్నం, గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం వారికి అంకితం. ఇది రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది."
"పదకొండు సంవత్సరాల కిందట ఛత్తీస్‌గఢ్‌ను, మొత్తం దేశాన్నీ నక్సలైట్లు, మావోయిస్టుల తీవ్రవాదం నుంచి విముక్తి చేస్తామని మేం ప్రతిజ్ఞ చేశాం. దాని ఫలితాలను ఈ రోజు దేశమంతా చూస్తోంది. దశాబ్దాలుగా ఈ తీవ్రవాదానికి బలమైన స్థావరాలుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని ప్రాంతాలు ఈ రోజు అభివృద్ధికి ఆనవాలుగా నిలవడం నాకు సంతోషం కలిగిస్తోంది."
***
(Release ID: 2185512)
Visitor Counter : 6