సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
హైదరాబాద్‌లో ప్రారంభమైన వేవ్స్ యానిమేషన్ బజార్- ఇండియా జాయ్-2025 8వ ఎడిషన్
త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ)
భారతీయ సినిమాకు పెరుగుతున్న పైరసీ ముప్పును ఎదుర్కోవడానికి అవిశ్రాంత కృషి: సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు
Posted On:
01 NOV 2025 6:43PM by PIB Hyderabad
గేమింగ్, యానిమేషన్, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమల వృద్ధిని మరింత బలోపేతం చేయడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ) ప్రాంతీయ కేంద్రాన్ని త్వరలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు శనివారం ప్రకటించారు.

హైటెక్స్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన వేవ్స్ యానిమేషన్ బజార్, ఇండియా జాయ్-2025 8వ ఎడిషన్ ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ సంజయ్ జాజు... “దేశంలో మొట్టమొదటి సారిగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ను దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నాం. త్వరలోనే ఒక శాఖను హైదరాబాద్‌లోనూ ఏర్పాటు చేస్తున్నాం” అని ప్రకటించారు.
ఏవీజీసీ రంగాన్ని ప్రోత్సహించడంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ సహకారాన్ని, తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలను ప్రముఖంగా ప్రస్తావించిన శ్రీ సంజయ్ జాజు... భారత యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) వ్యవస్థకు కేంద్రంగా హైదరాబాద్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూనే ఉందన్నారు. ఇది దేశ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుందని శ్రీ సంజయ్ జాజు తెలిపారు. "దేశంలో మీడియా- వినోద రంగం వేగంగా విస్తరిస్తోంది. ఇది మన దేశ సాఫ్ట్ పవర్ వ్యక్తీకరణలో కీలకం" అని ఆయన వ్యాఖ్యానించారు.

గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రూపొందించిన వేవ్స్ కార్యక్రమాన్ని గురించి శ్రీ సంజయ్ జాజు మాట్లాడుతూ, ఈ కార్యక్రమం సృజనాత్మకత, డిజిటల్ ఆవిష్కరణల్లో దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుతుందన్నారు. "భారతీయ సినిమా, సృజనాత్మక సాంకేతికతను ముందుకు నడిపించడంలో దక్షిణ భారతం... ముఖ్యంగా హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచ స్థాయి స్టూడియోలు, ఆవిష్కరణలు, కళాత్మక నైపుణ్యాన్ని ప్రోత్సహించే విధానపరమైన ప్రణాళికల మద్దతుతో అనేక పాన్-ఇండియా సినిమాలు హైదరాబాద్ నుంచి వచ్చాయి" అని ఆయన తెలిపారు. ఐపీఎల్ భారత క్రికెట్టును మార్చివేసినట్లే, వేవ్స్ కార్యక్రమం సృజనాత్మకతను సాంకేతికతతో అనుసంధానించడం ద్వారా... సహకారం, ఆవిష్కరణల కోసం ప్రపంచస్థాయి వేదికను అందించడం ద్వారా... భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
మీడియా-వినోద రంగంలో అంకురసంస్థల ఇంక్యుబేషన్, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ), టీ-హబ్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది.
కంటెంట్ సృష్టికర్తలను కొనుగోలుదారులు, ఓటీటీ వేదికలతో అనుసంధానించే ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ అయిన వేవ్స్ బజార్‌ను ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ సంజయ్ జాజు ప్రారంభించారు. సృష్టికర్తలు తమ పని ద్వారా లాభపడేందుకూ, సాధికారత కల్పిస్తూ... పరిశ్రమ వృద్ధిని వేగవంతం చేయడం ఈ వేదిక లక్ష్యం.

అనంతరం తెలుగు, మలయాళ చిత్ర నిర్మాతలతో నిర్వహించిన ఐఎఫ్ఎఫ్ఐ రౌండ్ టేబుల్ సమావేశానికి శ్రీ సంజయ్ జాజు అధ్యక్షత వహించారు. ఐఎఫ్ఎఫ్ఐ-2025 కోసం జపాన్‌ను భాగస్వామ్య దేశంగా ప్రకటించారు. రాబోయే వేవ్స్ కార్యక్రమం సృజనాత్మకత, సాంకేతికతను సమగ్రపరచడం ద్వారా భారతీయ సినిమాను పూర్తిగా మార్చివేస్తుందని ఆయన అన్నారు. భారతీయ సినిమాకు పెరుగుతున్న పైరసీ ముప్పును ఎదుర్కోవడానికి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అవిశ్రాంతంగా కృషి చేస్తోందని ఆయన పునరుద్ఘాటించారు. బహుభాషా చలనచిత్రాల సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించడానికి, సరళీకృతం చేయడానికి మంత్రిత్వ శాఖ కొత్త వ్యవస్థను ప్రవేశపెడుతోందన్నారు.

వేవ్స్ యానిమేషన్ బజార్, ఇండియా జాయ్-2025 కార్యక్రమాలను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం చలనచిత్రాలు, ఇ-స్పోర్ట్స్, వీఎఫ్ఎక్స్, యానిమేషన్, ఓటీటీ, కామిక్స్, అభివృద్ధి చెందుతున్న ఇతర డిజిటల్ వినోద రంగాల్లో భారత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ప్రదర్శిస్తుంది.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, నిర్మాత శ్రీ దిల్ రాజు, నటుడు శ్రీ తేజ సజ్జా, టీవీఏజీఏ, తెలుగు సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
****
(Release ID: 2185315)
Visitor Counter : 18