చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                    
                    
                        పత్రికా ప్రకటన
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                30 OCT 2025 7:29PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                భారత రాజ్యాంగం ద్వారా దఖలు పడిన అధికారాల మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ సూర్యకాంత్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా నియమిస్తున్నట్లు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రకటించారు. ఈ నియామకం 2025 నవంబరు 24 నుంచి అమలులోకి వస్తుంది.
భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన శ్రీ జస్టిస్ సూర్యకాంత్
భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శ్రీ సూర్యకాంత్‌ను నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలపై గౌరవ రాష్ట్రపతి సంతకం చేశారు. తదనుగుణంగా కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ఈ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ శ్రీ సూర్యకాంత్ 2025 నవంబరు 24న ‘సీజేఐ’గా బాధ్యతలు స్వీకరిస్తారు.
జస్టిస్ శ్రీ సూర్యకాంత్ జీవిత విశేషాలు
హర్యానాలోని హిసార్ జిల్లా, పెట్వార్ గ్రామంలో 1962 ఫిబ్రవరి 10న జన్మించిన ఆయన, 1984లో రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. అదే సంవత్సరం హిసార్‌లోని జిల్లా కోర్టుల ప్రాంగణంలో న్యాయవాదిగా పనిచేశారు. 1985లో చండీగఢ్‌లోని పంజాబ్-హర్యానా హైకోర్టుకు మారారు. రాజ్యాంగం, సర్వీసులు, పౌర అంశాల్లో ప్రత్యేకత సాధించారు. అనంతరం సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందడంతోపాటు 2000 జూలై 7న హర్యానా అడ్వకేట్ జనరల్‌గా నియమితులైన అతి పిన్న వయస్కుడుగా రికార్డులకెక్కారు. ఆ తర్వాత 2004 జనవరి 9న పంజాబ్-హర్యానా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యేదాకా అడ్వకేట్ జనరల్‌గా కొనసాగారు.
న్యాయమూర్తి హోదాలో 2007 నుంచి 2011 వరకూ ‘నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ’ (నల్సా) పాలకమండలిలో పనిచేశారు. అటుపైన 2011లో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ ఫస్ట్ క్లాసులో ఉత్తీర్ణులయ్యారు. అనంతరం 2018 అక్టోబరు 5న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులై, 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఇక 2025 మే 14 నుంచి ‘నల్సా’ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించడంతోపాటు ఇండియన్ లా ఇనిస్టిట్యూట్ కమిటీలలో కూడా పనిచేశారు.
జస్టిస్ శ్రీ సూర్యకాంత్ న్యాయవాదిగా, న్యాయమూర్తిగానే కాకుండా ఇతర హోదాలలో నాలుగు దశాబ్దాల కాలంలో వేలాది కేసులను విచారించారు. న్యాయసూత్రాలకు వినూత్న భాష్యాలతో విప్లవాత్మక తీర్పులను వెలువరించారు. సంక్లిష్ట రాజ్యాంగ అంశాల నుంచి మానవ హక్కుల పిటిషన్ల దాకా విచారణలో కరుణార్ద్రత, న్యాయవిద్యా నైపుణ్యంతోపాటు న్యాయసేవలో అకుంఠిత నిబద్ధతతో కూడిన సమభావన.. ఆయన అనుభవంలో ప్రతిబింబిస్తుంది.
 
***
                
                
                
                
                
                (Release ID: 2184444)
                Visitor Counter : 4