నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) అసెంబ్లీ ఎనిమిదవ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
137 దేశాల ప్రతినిధుల సమక్షంలో సమ్మిళిత సౌర విద్యుత్ అభివృద్ధికి నాయకత్వం వహించాలని అభివృద్ధి చెందుతున్న దేశాలకు పిలుపు
సౌరశక్తితో ప్రపంచాన్ని నడిపించేందుకు ఐఎస్ఏ సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి భారత్ తిరుగులేని నిబద్ధతతో ఉంది: రాష్ట్రపతి ముర్ము
ఐఎస్ఏ ద్వారా భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల (గ్లోబల్ సౌత్) ఆకాంక్షను కార్యాచరణగా మారుస్తోంది: కేంద్రమంత్రి, ఐఎస్ఏ అధ్యక్షుడు శ్రీ ప్రహ్లాద్ జోషి
సౌర విప్లవానికి కేంద్రంగా గ్లోబల్ సౌత్: సమ్మిళిత, సుస్థిర, సౌరశక్తితో కూడిన భవిష్యత్తు వైపు పురోగమిస్తున్న భారత్, ఐఎస్ఏ
Posted On:
28 OCT 2025 6:11PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈ రోజు జరిగిన అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) అసెంబ్లీ ఎనిమిదవ సమావేశంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కీలకోపన్యాసం చేశారు. ఇది సౌర ఇంధన రంగంలో ప్రపంచ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఐఎస్ఏ నాయకత్వానికి భారత్ నిబద్ధతను, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన "ఒకే ప్రపంచం, ఒకే సూర్యుడు, ఒక గ్రిడ్" దార్శనికతను చాటిచెబుతూ భారత రాష్ట్రపతి ఐఎస్ఏ అసెంబ్లీలో చేసిన తొలి ప్రసంగంగా నమోదైంది, రాష్ట్రపతి ప్రసంగం సదస్సులో ఉన్నత స్థాయి చర్చలకు ప్రాతిపదికను నిర్దేశించింది. సౌరశక్తిలో ప్రపంచ సహకారాన్ని, పెట్టుబడులను వేగవంతం చేయాలనే ఏకగ్రీవ ఉద్దేశ్యంతో 125 సభ్య దేశాలు, సంతకం చేసిన దేశాల నుంచి మంత్రులు, విధాన నిర్ణేతలు, అంతర్జాతీయ భాగస్వాములు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. 550 పైగా ప్రతినిధులు, 30 మంది మంత్రులు, సహాయ మంత్రులు పాల్గొంటున్న ఈ సమావేశం త్వరలో బ్రెజిల్‌లో జరగబోయే సీఓపీ30కి సన్నాహక సమావేశంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము తమ ప్రసంగంలో “అంతర్జాతీయ సౌర కూటమి ఇప్పటికే గ్లోబల్ సౌర కేంద్రం, చిన్న ద్వీపాల అభివృద్ధి దేశాల వేదిక, ఆఫ్రికా సౌర మినీగ్రిడ్‌లు, అభివృద్ధి చెందుతున్న డిజిటల్ కొత్త ఆవిష్కరణలు మొదలైన వాటితో విప్లవాత్మక పురోగతిని సాధించింది. తదుపరి అడుగు సౌర విప్లవంలో ఏ మహిళ, ఏ రైతు, ఏ గ్రామం, ఏ చిన్న ద్వీపం వెనకబడకుండా మరింత సమ్మిళితానికి చేరువ కావాలి. చిన్న ద్వీపం నుంచి అతిపెద్ద ఖండం వరకు ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా ప్రతి ఐఎస్ఏ సభ్య దేశంతో కలిసి సౌరశక్తి ఆధారిత ప్రపంచాన్ని నిర్మించడానికి భారత్ కట్టుబడి ఉంది” అని అన్నారు.
“ఈ అసెంబ్లీ భవిష్యత్తు దిశగా చర్చించేటప్పుడు, అన్ని సభ్య దేశాలు మౌలిక సదుపాయాలను మించి ముందుకు వెళ్లి ప్రజల జీవన పరిస్థితులపై దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను. సౌరశక్తిని ఉద్యోగ సృష్టి, మహిళల నాయకత్వం, గ్రామీణ జీవనోపాధులు జీవనాధారాలు డిజిటల్ సమ్మిళిత్వంతో అనుసంధానించే ఒక సమష్టి కార్యాచరణ ప్రణాళికను ఈ అసెంబ్లీ రూపొందించాలని నేను కోరుతున్నాను. మన పురోగతిని కేవలం మెగావాట్ల రూపంలోనే కాకుండా, వెలుగునిచ్చిన జీవితాల సంఖ్య, బలోపేతమైన కుటుంబాల సంఖ్య, మార్పు చెందిన సమాజాల సంఖ్య ద్వారా కూడా కొలవాలి. గరిష్ట ప్రయోజనం కోసం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిపై, అలాగే సరికొత్త, ఆధునిక సాంకేతికతలను అందరితో పంచుకోవడంపై కూడా దృష్టి పెట్టాలి. మనం పెద్ద ఎత్తున సౌరశక్తి వ్యవస్థలను విస్తరిస్తున్నప్పుడు, ఆ ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చూసుకోవాలి. ఎందుకంటే, భవిష్యత్తు కోసం మనం హరిత ఇంధనానికి మారడానికి పర్యావరణ పరిరక్షణే మూలం” అని రాష్ట్రపతి స్పష్టం చేశారు.
పారిస్‌లో జరిగిన సీఓపీ 21 సదస్సులో ప్రకటించిన అంతర్జాతీయ సౌర కూటమి 'ఆశయం నుంచి ఆచరణ' అనే భావనకు ప్రాధాన్యమిస్తూ విశ్వసనీయమైన, ఫలితాల ఆధారిత సంస్థగా రూపాంతరం చెందింది. గత దశాబ్దంలో, ఇది సౌర శక్తి కోసం ప్రపంచ దృష్టిని నిర్దేశించడం నుంచి సభ్య దేశాలలో గుర్తించదగిన ప్రభావాన్ని అందించే దిశగా ముందుకు సాగింది. నాలుగు వ్యూహాత్మక అంశాలు - కేటలిటిక్ ఫైనాన్స్ హబ్, గ్లోబల్ కేపాబిలిటీ సెంటర్ అండ్ డిజిటైజేషన్, ప్రాంతీయ, దేశ స్థాయి కార్యాచరణ, సాంకేతిక మార్గదర్శక ప్రణాళిక, విధానాలు - తో రూపుదిద్దుకున్న మార్గదర్శకత్వంతో ఈ కూటమి పెట్టుబడిని సమీకరించే, సామర్థ్యాన్ని పెంచే, విధానాన్ని తెలియజేసే, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించే సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది.
కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ శాఖ మంత్రి, ఐఎస్ఏ అసెంబ్లీ అధ్యక్షుడు శ్రీ ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ఐఎస్ఏ ప్రపంచ సహకారం, ఉమ్మడి లక్ష్యానికి నిజమైన చిహ్నం. వేల సంవత్సరాలుగా, విశ్వాసం, పురోగతి, ప్రకృతి, అభివృద్ధి సామరస్యంగా ఎలా కలిసి ముందుకు సాగవచ్చో భారతదేశం చూపించింది. కేవలం దశాబ్దం క్రితం, భారత పునరుత్పాదక ఇంధన ప్రయాణం ప్రారంభం మాత్రమే. కోట్లాది గృహాలకు వెలుగును తీసుకురావడం మా ముందున్న సవాలు. ఈ రోజు, భారత్ కేవలం ఒక భాగస్వామిగా మాత్రమే కాక, ప్రపంచ ఇంధన మార్పులో నాయకత్వ స్థానంలో ఉంది. పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద దేశంగా ఉంది. ఈ మార్పునకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. ఆయన నాయకత్వంలో, శిలాజేతర వనరుల నుంచి 50% సామర్థ్యం సాధించే జాతీయ నిర్ధారిత లక్ష్యాన్ని గడువుకు 5 సంవత్సరాల ముందుగానే చేరుకుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల (గ్లోబల్ సౌత్) కు భారత్ స్వరంగా మారింది. ఐఎస్ఏ ద్వారా, ఆ స్వరాన్ని మేం ఆచరణగా మారుస్తున్నాం. సౌరశక్తిని ఉపయోగించుకోవడానికి, సాంకేతికతను పంచుకోవడానికి ఇతర దేశాలకు సహాయం చేస్తున్నాం” అని అన్నారు.
అంతర్జాతీయ సౌర కూటమి ఫ్రెంచ్ సహ అధ్యక్ష హోదాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఫ్రాంకోఫోనీ, అంతర్జాతీయ భాగస్వామ్యాలు, విదేశాలలో ఉన్న ఫ్రెంచ్ జాతీయుల వ్యవహారాల ఫ్రెంచ్ మంత్రి (మినిస్ట్రే డెలిగీ) ఎలియోనోర్ కరోయిట్ ఈ సమావేశానికి పంపిన ఒక వీడియో సందేశంలో “ సౌరశక్తి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అంతర్జాతీయ సౌర కూటమికి ఫ్రాన్స్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది, ఈ అలయెన్స్ 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైనప్పటి నుంచి, ఫ్రాన్స్ భారతదేశంతో కలసి సహ అధ్యక్ష సేవలందించడం ఫ్రాన్స్ గౌరవంగా భావిస్తోంది.ఈ దీర్ఘకాలిక భాగస్వామ్యం ఐఎస్ఏ విజయానికి, సౌరశక్తి వినియోగం ద్వారా ఇంధన మార్పును వేగవంతం చేయడంలో మన అచంచల కట్టుబాటును ప్రతిబింబిస్తుంది” అన్నారు.
యూరోప్, విదేశీ వ్యవహారాల ఫ్రెంచ్ మంత్రిత్వ శాఖ వాతావరణ వ్యవహారాల ప్రత్యేక దూత శ్రీ బెనోయిట్ ఫారాకో మాట్లాడుతూ, “కూటమి చేస్తున్న పని సిఓపి నిర్ణయాల అమలుకు నేరుగా దోహదం చేస్తుంది. పదేళ్ల క్రితం మేం పారిస్ ఒప్పందాన్ని స్వీకరించాం. గ్లోబల్ వార్మింగ్ ను పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేయాలనే ఉమ్మడి లక్ష్యం నిర్ణయించుకున్నాం. ఈ నవంబర్ లో జరిగే సీఓపీ 30 లో ఐఎస్ఏ విజయ ప్రదర్శన కోసం మేం ఎదురుచూస్తున్నాం” అని పేర్కొన్నారు. ఐఎస్ఏ. ప్రధాన కార్యక్రమం ఆఫ్రికా సోలార్ ఫెసిలిటీకి ఫ్రాన్స్ ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించింది.
అంతర్జాతీయ సౌర కూటమి డైరెక్టర్ జనరల్ శ్రీ ఆషిష్ ఖన్నా మాట్లాడుతూ, “సౌర విప్లవంలో ప్రపంచం మలుపు తీసుకుంటోంది. మొదటి 1,000 గిగావాట్ల సౌర సామర్థ్యాన్ని నిర్మించడానికి 25 సంవత్సరాలు పట్టినప్పటికీ, తదుపరి 1,000 గిగావాట్లను జోడించడానికి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే సరిపోయింది. నాలుగు సంవత్సరాల్లో ఈ సామర్థ్యం మళ్లీ రెట్టింపు కానుంది. ఈ మార్పులో గ్లోబల్ సౌత్ కేంద్రబిందువుగా ఉంది” అని అన్నారు. “ఐఎస్ఏ ఇప్పుడు ప్రతిపాదన స్థాయి దాటి కార్యాచరణ వైపు అడుగులు వేస్తోంది. పెద్ద స్థాయిలో సౌరశక్తి వినియోగం, ఆవిష్కరణ, తక్కువ వ్యయంపరంగా సౌరశక్తి రంగంలో విజయవంతమైన భారత్ అనుభవాన్ని గ్లోబల్ సౌత్ దేశాలకు తీసుకువెళుతోంది. అభివృద్ధి చెందుతున్న చిన్న ద్వీప దేశాల ఉమ్మడి కొనుగోలు, ఆఫ్రికా సౌర కేంద్రం, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభం, సర్క్యులారిటీ, వ్యర్థ నిర్వహణపై కొత్త కార్యక్రమాలు, అలాగే ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్ (ఓఎస్ఓడబ్ల్యూఓజి) పై ప్రత్యేక కార్యక్రమం వంటి పలు కార్యక్రమాల ద్వారా దేశాలను ప్రయోగ స్థాయి నుంచి విస్తృత స్థాయికి తీసుకువెళ్తున్నాం. దీర్ఘకాలిక, సమగ్ర పునరుత్పత్తిదాయక సౌర ఆర్థిక వ్యవస్థలను నిర్మించడంలో సహకరిస్తున్నాం. ఇది సమ్మిళిత, సుస్థిర, సౌరశక్తి ఆధారిత భవిష్యత్తును రూపుదిద్దడంలో గ్లోబల్ సౌత్ నాయకత్వం వహించే సమయం” అని కూడా ఆయన స్పష్టం చేశారు.
సౌరశక్తి రంగంలో భారత్ సాధించిన విజయాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలోని మూడవ అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి దేశంగా ఉన్న భారత్ 2030 నాటి మొత్తం స్థాపిత సామర్థ్య లక్ష్యంలో 50 శాతాన్ని శిలాజ రహిత ఇంధన వనరుల ద్వారా ఐదేళ్ల ముందుగానే సాధించింది. తద్వారా శిలాజ ఇంధన దిగుమతులు, కాలుష్య సంబంధిత దాదాపు రూ. 4 లక్షల కోట్ల (46 బిలియన్ డాలర్లు) ఖర్చును నివారించింది. 1,08,000 గిగావాట్ గంటల (జీడబ్ల్యూహెచ్) సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసింది. ఐఎస్ఏ ద్వారా భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో - ముఖ్యంగా ఆఫ్రికా, చిన్న ద్వీప దేశాల్లో - పీఎం సూర్య ఘర్ - ముఫ్త్ బిజిలీ యోజన, పీఎం - కుసుమ్ వంటి విజయవంతమైన కార్యక్రమాలను విస్తరించడంలో సహకరించనుంది. ఈ కార్యక్రమాలు వికేంద్రీకృత, ప్రజాకేంద్రీత ఇంధన పరిష్కారాల మార్పు సామర్ధ్యాన్ని స్పష్టంగా ప్రదర్శిస్తాయి. ఇవి ఇళ్లకు విద్యుత్ అందించడమే కాకుండా, జీవనోపాధులను ప్రోత్సహించి, చివరి వ్యక్తివరకు విద్యుత్ లభ్యతను విస్తరిస్తున్నాయి. అనుభవాలను పంచుకోవడం, పరిష్కారాలను విస్తరించడం, ప్రపంచ స్థాయిలో సౌరశక్తి స్వీకరణను వేగవంతం చేయడంలో ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారానికి ఒక స్పష్టమైన ఉదాహరణ.
ప్రధానాంశాలు
*రీసైక్లింగ్, ఇన్నోవేషన్, వాటాదారుల భాగస్వామ్యం కోసం సోలార్ అప్సైక్లింగ్ నెట్వర్క్ - సన్ రైజ్ ప్రారంభం: సన్ రైజ్ సౌర వ్యర్థాలలో దాగి ఉన్న విలువను వెలికితీసేందుకు ప్రభుత్వాలు, పరిశ్రమలు, ఆవిష్కర్తలను కలుపుతుంది. ఇది శాశ్వత సవాళ్లను కొత్త పారిశ్రామిక వృద్ధి, హరిత ఉద్యోగాలు, వనరుల సుస్థిర నిర్వహణకు దారితీసే శక్తిగా మారుస్తుంది
*ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్ (వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ - ఓఎస్ఓడబ్ల్యూఓజీ) కార్యక్రమం: ప్రాంతీయ సౌర అనుసంధానాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రత్యేక విభాగాన్ని సృష్టిస్తుంది. త్వరలో వెలువడనున్న నివేదికలో తూర్పు ఆసియా - దక్షిణ ఆసియా, దక్షిణ ఆసియా - మధ్యప్రాచ్యం, మధ్యప్రాచ్యం - యూరప్, యూరప్ -ఆఫ్రికా మధ్య ప్రాధాన్య అనుసంధానాలను గుర్తిస్తుంది. రాబోయే 2-3 సంవత్సరాలలో సాధ్యాసాధ్యాల అధ్యయనాలు, నియంత్రణ పనులు ప్రారంభమవుతాయి.
*అంతర్జాతీయ సౌర కూటమి, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన చిన్న దీవుల అభివృద్ధి దేశాల (ఎస్ఐడిఎస్) వేదిక ద్వారా కొనుగోళ్ల కోసం సూత్రప్రాయ అవగాహన ఒప్పందంపై ఎస్ఐడిఎస్ మంత్రులు, ప్రతినిధివర్గాల నాయకులు సంతకం చేశారు. ఈ ఒప్పందం ద్వారా 16 సభ్య దేశాలు - ఆంటిగ్వా అండ్ బార్బుడా, బెలీజ్, కామన్‌వెల్త్ ఆఫ్ డొమినికా, శ్రీలంక, డొమినికన్ రిపబ్లిక్, పాపువా న్యూ గినియా, కిరిబాటి, నౌరూ, సురినామ్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సోలమన్ దీవులు, మాల్దీవులు, సెయ్షెల్స్, మారిషస్, ఫిజీ, మార్షల్ దీవులు - సౌరశక్తి విస్తరణను ప్రోత్సహించడంలో తమ కట్టుబాటును పునరుద్ఘాటించాయి. సమన్వయ కొనుగోలు, డిజిటల్ సమన్వయం, సామర్థ్యవృద్ధి కార్యక్రమాల ద్వారా ఇంధన సుస్థిరతను పెంచుతూ సౌరశక్తి వినియోగాన్ని విస్తరించేందుకు అంగీకరించాయి.
*భారతదేశంలో “సౌరశక్తికి సిలికాన్ వ్యాలీ” దృష్టితో రూపొందిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ఆవిష్కరించారు. ఇది హబ్-అండ్-స్పోక్ మోడల్ ఆధారంగా పనిచేస్తూ, దేశంలోని ఉన్నత ప్రమాణాల జాతీయ విశిష్టతా కేంద్రాలను సౌర టెక్నాలజీ అప్లికేషన్ రిసోర్స్ సెంటర్ (స్టార్ - సీ) రూపంలో అనుసంధానిస్తుంది. కృత్రిమ మేధ ఆధారిత వ్యక్తిగత విద్యా మార్గాలను అందించే ఆన్‌లైన్ వేదికగా సౌరశక్తి సంబంధిత విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రారంభించిన ఐఎస్ఏ అకాడమీని కూడా పరిచయం చేశారు.
ఐఎస్ఏ అసెంబ్లీ సందర్భంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ సోలార్ 2025, సోలార్ పీవీ స్కిల్స్ అండ్ జాబ్స్ ఇన్ ఆఫ్రికా, సోలార్ కంపాస్: స్పెషల్ ఇష్యూ ఆన్ ఇంటిగ్రేటెడ్ ఫోటోవోల్టాయిక్స్, గ్లోబల్ ఫ్లోటింగ్ సోలార్ ఫ్రేమ్వర్క్, గ్లోబల్ సోలార్ ట్రెండ్స్ అండ్ అవుట్ లుక్ 2025 అనే ఐదు విజ్ఞాన నివేదికల ఆవిష్కరణ కూడా జరుగనుంది. :ఈ నివేదికలు ప్రపంచ సౌరశక్తి రంగాన్ని మారుస్తున్న ప్రధాన ధోరణులను స్పష్టంగా వివరిస్తాయి.
*2024లో ఇంధన మార్పు కోసం ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు 2,083 బిలియన్ డాలర్లకు చేరినట్టు ఈజ్ ఆఫ్ డూయింగ్ సోలార్ (ఈఓడీఎస్) ఇందులో ఐ.ఎస్ఏ సభ్య దేశాలు 861.2 బిలియన్ డాలర్ల వాటాను అందించాయి. ఇది స్వచ్ఛ ఇంధన భవిష్యత్తును రూపొందించడంలో పెరుగుతున్న గ్లోబల్ సౌత్ నాయకత్వ స్థాయిని తెలియ చేస్తుంది. పునరుత్పాదక ఇంధన రంగానికి 725 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా అందులో సౌరశక్తి విద్యుత్ 521 బిలియన్ డాలర్లను ఆకర్షించింది. ఇది ప్రపంచ ఇంధన మార్పులో ప్రధాన చోదకంగా సౌరశక్తి స్థానాన్ని బలోపేతం చేస్తుంది.
*సోలార్ పీవీ స్కిల్స్ అండ్ జాబ్స్ ఇన్ ఆఫ్రికా నివేదిక ప్రకారం, ఆఫ్రికా ఖండంలో సౌర ఇంధన సామర్థ్యం ప్రస్తుత 2,26,000 నుంచి 2050 నాటికి 2.5–4.2 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. ఈ వృద్ధిని సాంకేతిక నిపుణులే నడిపించనున్నారని, 1.3 మిలియన్ ఉద్యోగాలు రావచ్చని, అలాగే చిన్న తరహా రంగంలో మొత్తం ఉద్యోగాలు 55% వరకు ఉంటాయని నివేదిక తెలిపింది. ఐఎస్ఏ ఆఫ్రికాలో స్వచ్ఛ ఇంధనానికి నైపుణ్యమైన సౌర ఉద్యోగులను అందించడానికి l కచ్చితమైన సర్టిఫికేషన్, భవిష్యత్తుకు సిద్ధమైన శిక్షణ, డిజిటల్ లెర్నింగ్, ప్రాంతీయ సహకారం అవసరమని పిలుపునిచ్చింది.
*గ్లోబల్ సోలార్ ట్రెండ్స్ అండ్ అవుట్లుక్ 2025 - అభివృద్ధి చెందుతున్న సాంకేతికత నుంచి ప్రపంచ స్వచ్ఛ ఇంధన విస్తరణలో సౌర విద్యుత్ ప్రధాన శక్తిగా ఆవిర్భవించడాన్ని విశ్లేషిస్తుంది. ఈ సమగ్ర నివేదిక విధాన నిర్ణేతలు, పెట్టుబడిదారులు, అభివృద్ధి భాగస్వాములకు మారుతున్న సౌరశక్తి దృశ్యంపై కీలకమైన అవగాహన అందిస్తుంది.
*సమీకృత పీవీ అనువర్తనాలపై సౌర దిక్సూచి ప్రత్యేక సంచిక (సోలార్ కంపాస్: స్పెషల్ ఇష్యూ ఆన్ ఇంటిగ్రేటెడ్ పీవీ అప్లికేషన్స్) సౌర ఆవిష్కరణలో దక్షిణ ప్రాంత దేశాల నాయకత్వానికి ఇదే సరైన సమయం అని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో దాదాపు 70% భవనాలు ఇంకా నిర్మించవలసి ఉన్నందున, బిల్డింగ్ ఇంటిగ్రేటెడ్ ఫోటోవోల్టాయిక్స్ (బీఐపీవీ) సాంకేతికత భవిష్యత్తు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో సౌర శక్తిని అంతర్లీనం చేయడానికి ఒక మార్పుదాయక అవకాశాన్ని అందిస్తుంది. ఐఎస్ఏ l కార్యక్రమాల ద్వారా, బీఐపీవీ ఖర్చులను సాధారణ రూఫ్‌టాప్ సోలార్ స్థాయికి తగ్గించడానికి, 'సోలార్-రెడీ హౌసింగ్ కోడ్‌ల' వంటి సహాయక విధానాలను దక్షిణ ప్రాంత దేశాల్లో ప్రోత్సహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
*గ్లోబల్ ఫ్లోటింగ్ సోలార్ ఫ్రేమ్‌వర్క్ అంచనా ప్రకారం, రాబోయే దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా తేలియాడే సౌర శక్తి (ఫ్లోటింగ్ సోలార్ ) సామర్థ్యం వేగంగా విస్తరిస్తుంది. ఈ పెరుగుదలలో ఆసియా పసిఫిక్ ప్రాంతం ముందుంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కే డబ్ల్యూహెచ్ కి $0.05 నుంచి న $0.07 మధ్య ఉన్న విద్యుత్ ఉత్పాదన ఖర్చులు తగ్గడం, నిరంతర డిజైన్ ఆవిష్కరణలు ఈ విస్తరణకు కారణాలు. ఈ ఆవిష్కరణలు ఫ్లోటింగ్ సోలార్‌ను భూమి ఆధారిత వ్యవస్థలకు ఆచరణీయమైన ప్రత్యామ్నాయంగా మారుస్తున్నాయి. దేశాలు తమ ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులు, మార్కెట్‌లు, సామాజిక సందర్భాలకు అనుగుణంగా వ్యూహాలను అభివృద్ధి చేయడానికి అవసరమైన సాధనాలను ఈ ఫ్రేమ్‌వర్క్ అందిస్తుంది.
సమావేశాల చివరిలో బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్ కు చెందిన భారతదేశంలోనే అతిపెద్ద స్వతంత్ర అర్బన్ బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థ (బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం) సైట్ సందర్శన ఉంటుంది. అలాగే, జనక్‌పురిలోని నెట్‌వర్క్ ప్రాజెక్ట్ డిజిటల్ ట్విన్ ను కూడా సందర్శిస్తారు. ఇది విద్యుత్ పంపిణీ కోసం భారతదేశంలోనే మొట్టమొదటి పెద్ద ఎత్తున రియల్ టైమ్ డిజిటల్ ట్విన్‌ను పరిచయం చేస్తున్న ఒక ముఖ్యమైన కార్యక్రమం.
ఐఎస్ఏ అసెంబ్లీ ఎనిమిదవ సమావేశం ప్రపంచ సౌర ఇంధన భాగస్వామ్యం, ఆవిష్కరణ, సుస్థిర అభివృద్ధికి కూటమి నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. భాగస్వామ్యాలు, విజ్ఞానాన్ని పంచుకోవడం, సాంకేతికత కలిసి అందరికీ సౌర శక్తితో నడిచే భవిష్యత్తును ఎలా అందించగలవో ఇది ప్రదర్శిస్తుంది.
అంతర్జాతీయ సౌర కూటమి గురించి
అంతర్జాతీయ సౌర కూటమి 2015లో పారిస్‌లో జరిగిన సీఓపీ21 సదస్సులో భారత్, ఫ్రాన్స్ కలసి ప్రారంభించిన ఒక ప్రపంచ కార్యక్రమం. ఇందులో 125 సభ్య, సంతకం చేసిన దేశాలు ఉన్నాయి. ఈ కూటమి ప్రపంచవ్యాప్తంగా ఇంధన లభ్యత, భద్రతను మెరుగుపరచడానికి ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది. స్వచ్ఛమైన ఇంధన భవిష్యత్తుకు ఒక సుస్థిరమైన మార్పుగా సౌరశక్తిని ప్రోత్సహిస్తుంది.
అంతర్జాతీయ సౌర కూటమి నాలుగు వ్యూహాత్మక అంశాలపై ఆధారపడి తన దార్శనికతను విస్తరిస్తోంది. 1. కేటలిటిక్ ఫైనాన్స్ హబ్: పెద్ద ఎత్తున పెట్టుబడులను అన్వేషించి ఆకర్షించడం. 2.గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ అండ్ డిజిటైజేషన్ - సభ్య దేశాలలో ఆవిష్కరణ, డిజిటల్ వేదికలు, సామర్థ్య వృద్ధిని ప్రోత్సహించడం. 3. ప్రాంతీయ, దేశ స్థాయి కార్యాచరణ - వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా లక్ష్యప్రాయమైన చర్యలను ముందుకు తీసుకెళ్ళడం. 4. సాంకేతిక దిశా ప్రణాళిక, విధానం ద్వారా కార్యాచరణ ప్రణాళిక, విజ్ఞాన వనరులతో అభివృద్ధి చెందుతున్న సౌర సాంకేతికతల విస్తరణను వేగవంతం చేయడం.
సౌరశక్తి ఆధారిత పరిష్కారాల కోసం ఐఎస్ఏ అవగాహన ద్వారా, ప్రపంచవ్యాప్తంగా సమాజాల జీవనాన్ని మార్చడం, శుభ్రమైన, నమ్మదగిన, తక్కువ ధర విద్యుత్ అందించడం, సుస్థిర అభివృద్ధికి ఇంధనాన్ని అందించడం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. 2017 డిసెంబర్ 6న, 15 దేశాలు ఐఎస్ఏ ప్రణాళిక ఒప్పందంపై సంతకం చేసి ఆమోదించాయి. దీనిద్వారా భారత్‌లో కేంద్ర కార్యాలయం కలిగిన మొదటి అంతర్జాతీయ, అంతర్ ప్రభుత్వ సంస్థగా ఐఎస్ఏ నిలిచింది.
***
(Release ID: 2183593)
Visitor Counter : 8