|
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ పథకం కింద ₹5500 కోట్లకు పైగా పెట్టుబడితో చేపట్టే 7 ప్రాజెక్టుల తొలి బ్యాచ్‌కు ప్రభుత్వ ఆమోదం
· ఈ ప్రాజెక్టులలో తయారీ విలువ ₹36,559 కోట్లు… 5,100కు పైగా ప్రత్యక్ష ఉద్యోగాల సృష్టికి వీలు… ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో యూనిట్లు · దేశీయంగా 100 శాతం కాపర్ క్లాడ్ లామినేట్.. 20 శాతం ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు.. 15 శాతం కెమెరా మాడ్యూళ్ల డిమాండ్‌ను తీర్చగల కొత్త ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్లు.. ఉత్పత్తులలో 60 శాతం ఎగుమతి: అశ్వినీ వైష్ణవ్ · ఈ ప్రాజక్టుల ద్వారా పరికరాల తయారీ రంగంలో భారత్ పటిష్ఠ ప్రవేశం… దిగుమతి పరాధీనత తగ్గింపు.. ఉత్తమ నైపుణ్య ఉద్యోగాల సృష్టి.. రక్షణ-టెలికాం-ఈవీలు సహా పునరుత్పాదక ఇంధన విశ్వసనీయ సరఫరా వ్యవస్థల నిర్మాణం
Posted On:
27 OCT 2025 5:25PM by PIB Hyderabad
దేశంలో ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ పథకం (ఈసీఎంఎస్) కింద ₹5500 కోట్లకు పైగా పెట్టుబడితో చేపట్టే 7 ప్రాజెక్టుల తొలి బ్యాచ్‌కు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతికత శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఇకపై “మల్టీ-లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు (పీసీబీ)లు, హెచ్‌డీఐ పీసీబీలు, కెమెరా మాడ్యూళ్లు, కాపర్ క్లాడ్ లామినేట్లు, పాలీప్రొఫైలిన్ ఫిల్ములు” వంటివి దేశీయంగా తయారవుతాయని ఆయన పేర్కొన్నారు.

దీంతో సంపూర్ణ ఉత్పత్తులనే కాకుండా వాటి కోసం వినియోగించే విడి పరికరాల తయారీకి కావాల్సిన మాడ్యూళ్లు, విడి భాగాలు, పదార్థాలు-యంత్రాల ఉత్పత్తి వరకూ ఓ కీలక ముందడుగు పడింది.
‘ఈసీఎంఎస్’కు అద్భుత ప్రతిస్పందన
ఈ పథకానికి జాతీయ, అంతర్జాతీయ కంపెనీల నుంచి అద్భుత స్పందన లభించింది. ఈ మేరకు మొత్తం 249 దరఖాస్తులు అందిన నేపథ్యంలో ₹1.15 లక్షల కోట్ల పెట్టుబడి, ₹10.34 లక్షల కోట్ల ఉత్పత్తి సహా 1.42 లక్షల ఉద్యోగాల సృష్టికి ఇవి దోహదం చేస్తాయి. భారత ఎలక్ట్రానిక్స్ రంగంలో ఇప్పటిదాకా అత్యధిక పెట్టుబడులకు హామీ రావడం విశేషం.
ఈ నేపథ్యంలో ₹5,532 కోట్ల విలువైన 7 ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. వీటిద్వారా మొత్తం ₹36,559 కోట్ల విలువైన విడి భాగాల ఉత్పత్తితోపాటు 5,100కు పైగా ప్రత్యక్ష ఉద్యోగాల సృష్టికి బాటలు పడతాయి.
ప్రభుత్వం ఆమోదించిన ఈ ప్రాజెక్టులలో 5 తమిళనాడులో, 1 ఆంధ్రప్రదేశ్‌లో, 1 మధ్యప్రదేశ్‌లో ఏర్పాటవుతాయి. సమతుల ప్రాంతీయ వృద్ధితోపాటు మహా నగరాలకు మించి విస్తరిస్తున్న అత్యాధునిక తయారీ రంగాన్ని బలోపేతం చేస్తుంది.

డిమాండ్-సరఫరా అంతరం తగ్గింపు
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ అశ్వివీ వైష్ణవ్ మాట్లాడుతూ- “ఈ కొత్త యూనిట్లు దేశీయంగా 20 శాతం ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, 15 శాతం కెమెరా మాడ్యూళ్ల సబ్-అసెంబ్లీ డిమాండును తీర్చగలవు” అని ప్రకటించారు.
అలాగే 100 శాతం కాపర్ క్లాడ్ లామినేట్ డిమాండ్ కూడా ఇప్పుడు పూర్తిస్థాయిలో దేశీయంగానే తీరుతుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఈ ప్లాంట్ల ద్వారా అదనంగా 60 శాతం ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి.

ఉత్పత్తుల వివరాలు
ఆమోదం పొందిన ప్రాజెక్టులలో “హై-డెన్సిటీ ఇంటర్‌కనెక్ట్ (హెచ్‌డీఐ) పీసీబీలు, మల్టీ-లేయర్ పీసీబీలు, కెమెరా మాడ్యూళ్లు, కాపర్ క్లాడ్ లామినేట్లు, పాలీప్రొఫైలిన్ ఫిల్ములు” వంటి కీలక విడి భాగాలు తయారవుతాయి.
కెమెరా మాడ్యూళ్లు అంటే- ఎలక్ట్రానిక్ పరికరాలలో ఫోటోలు, వీడియోలను సంగ్రహించే సూక్ష్మ ఇమేజింగ్ యూనిట్లు. ఇవి దేశీయంగా ఉత్పత్తయితే స్మార్ట్ ఫోన్లు, డ్రోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, వైద్య పరికరాలు, రోబోలు సహా ఆటోమోటివ్ వ్యవస్థలలో వినియోగం పెరుగుతుంది.
అలాగే హెచ్‌డీఐ, మల్టీ-లేయర్ పీసీబీలంటే- ప్రతి ఎలక్ట్రానిక్ పరికరాన్ని అనుసంధానించే, నియంత్రించే కీలక సర్క్యూట్ బోర్డులు. వీటిని స్మార్ట్ ఫోన్లతోపాటు ల్యాప్‌టాప్‌లు, ఆటోమోటివ్- పారిశ్రామిక వ్యవస్థలలో వినియోగిస్తారు.

మూల సరంజామా తయారీలో వ్యూహాత్మక ప్రగతి
పరికరాల తయారీ రంగంలో భారత్ పటిష్ఠ ప్రవేశాన్ని ‘ఈసీఎంఎస్’ ప్రస్ఫుటం చేస్తుంది.
దీనికింద భారత్ తొలిసారిగా కాపర్ క్లాడ్ లామినేట్ (సీసీఎల్) తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇది ‘మల్టీ-లేయర్ పీసీబీ’ల తయారీకి మూల సరంజామా తయారీ యూనిట్‌గా ఉంటుంది. ఈ ‘పీసీబీ’లను ప్రతి ఎలక్ట్రానిక్ పరికరంలో ఉపయోగిస్తారు. ప్రస్తుతం వీటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.

ఇక పాలీప్రొఫైలిన్ ఫిల్మ్ ప్రధానంగా కెపాసిటర్ల తయారీలో ఉపయోగించే పదార్థం. దేశీయంగా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, ఐసీటీ, ఇండస్ట్రియల్-మాన్యుఫాక్చరింగ్, టెలికమ్యూనికేషన్స్, కంప్యూటింగ్ పరికరాల కోసం దీన్ని తయారుచేస్తారు.

ఆర్థిక.. పారిశ్రామిక ప్రభావం
· ఈ ప్రాజెక్టులతో దిగుమతి పరాధీనత తగ్గడంతోపాటు జాతీయ మార్కెట్లో ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది.
· ఈ ప్రాజెక్టుల ద్వారా తయారీతోపాటు పరిశోధన-ఆవిష్కరణ రంగాల్లో అధిక నైపుణ్యంగల ఉద్యోగాల సృష్టికి వీలవుతుంది.
· రక్షణ-టెలికాం- ఈవీలు సహా పునరుత్పాదక ఇంధన విశ్వసనీయ సరఫరా వ్యవస్థల నిర్మాణం సాధ్యమవుతుంది.
పూర్తిస్థాయిలో ఎలక్ట్రానిక్ పరికరాలకు రూపకల్పన, తయారీతోపాటు ఎగుమతులు కూడా చేయగల దేశంగా మారే దిశగా భారత్ తన పయనం కొనసాగిస్తోంది. ఈ పథకం ‘పీఎల్‌ఐ’తోపాటు ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం) లక్ష్యాల సాధనలో దోహదం చేయగలదు.
పరికరాల నుంచి చిప్‌ల దాకా, విడి భాగాల నుంచి సరంజామా దాకా… తయారీ నుంచి ఆవిష్కరణ వరకూ నిరంతరాయ విలువ వ్యవస్థకు ఈ పథకం రూపమిస్తుంది.
***
(Release ID: 2183143)
|