శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శాస్త్ర-సాంకేతిక.. ఆవిష్కరణ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభకు గుర్తింపుగా ‘జాతీయ విజ్ఞాన పురస్కారం-2025’ విజేతలను ప్రకటించిన ప్రభుత్వం

Posted On: 26 OCT 2025 2:57PM by PIB Hyderabad

శాస్త్ర, సాంకేతిక, సాంకేతిక ఆధారిత ఆవిష్కరణ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఆవిష్కర్తలను సత్కరించే దిశగా “జాతీయ విజ్ఞాన పురస్కారం-2025” విజేతలను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది.

వినూత్న పరిశోధనలు, స్ఫూర్తిదాయక విజయాలకు గుర్తింపుతో పాటు ప్రోత్సాహం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని కింద పేర్కొన్న 4 విభాగాలలో ప్రదానం చేస్తారు:

1.     విజ్ఞాన రత్న(వీఆర్‌): శాస్త్ర-సాంకేతిక రంగాల్లో దేనిలోనైనా జీవిత కాలంలో సాధించిన విజయాలతో పాటు ఆ దిశగా చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభిస్తుంది.

2.     విజ్ఞాన శ్రీ (వీఎస్‌): శాస్త్ర-సాంకేతిక రంగాల్లో ఎందులోనైనా విశిష్ట కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

3.     విజ్ఞాన యువ-శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ (వివై-ఎస్‌ఎస్‌బీ): శాస్త్ర-సాంకేతిక రంగాల్లో దేనిలోనైనా అసాధారణ కృషి చేసిన యువ శాస్త్రవేత్తలను (45 ఏళ్లదాకా వయోపరిమితితో) గుర్తించి ప్రోత్సహిస్తూ ఈ పురస్కార ప్రదానం చేస్తారు.

4.     విజ్ఞాన బృందం (వీటీ): శాస్త్ర-సాంకేతిక రంగాల్లో ఎందులోనైనా విశేష కృషి చేసిన ముగ్గురు.. అంతకన్నా ఎక్కువ మంది శాస్త్రవేత్తలు లేదా పరిశోధకులు లేదా ఆవిష్కర్తల బృందానికి ఈ పురస్కారం లభిస్తుంది.

మొత్తం 13 విభాగాలలో- భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవ శాస్త్రాలు, గణితం-కంప్యూటర్ సైన్స్, భూ విజ్ఞాన శాస్త్రం, వైద్యం, ఇంజినీరింగ్ శాస్త్రాలు, వ్యవసాయ శాస్త్రం, పర్యావరణ శాస్త్రం, సాంకేతికత-ఆవిష్కరణ, అణుశక్తి, అంతరిక్ష శాస్త్రం-సాంకేతికత, ఇతర అనుబంధ రంగాల్లో ఈ సత్కారం లభిస్తుంది. ఈ మేరకు జాతీయ అభివృద్ధి లక్ష్యంగా శాస్త్రీయ నైపుణ్యం, సాంకేతిక ముందంజను ప్రోత్సహించడంలో భారత్‌ నిబద్ధతకు ఈ పురస్కారం ఒక నిదర్శనం.

‘జాతీయ విజ్ఞాన పురస్కారం-2025’ కోసం ప్రతిపాదనలు పంపాల్సిందిగా 2024 అక్టోబరు 4న ప్రభుత్వం ప్రకటన జారీచేసింది. ప్రత్యేక పోర్టల్ https://awards.gov.in ద్వారా 2024 నవంబరు 17లోగా అందేవిధంగా పంపాలని అందులో స్పష్టం చేసింది. ఈ మేరకు అందిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రవిజ్ఞాన సలహాదారు, జాతీయ విజ్ఞాన పురస్కారాల కమిటీ చైర్‌పర్సన్, శాస్త్రవిజ్ఞాన విభాగాల కార్యదర్శులు, అకాడమీల అధిపతులు, జాతీయ విజ్ఞాన పురస్కార సచివాలయ సమన్వయంతో పనిచేసే ఆయా రంగాల నిపుణులు సహా ప్రముఖ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల బృందం అత్యంత సునిశితంగా పరిశీలించింది.

తదనుగుణంగా 2025 సంవత్సరానికిగాను శాస్త్ర-సాంకేతిక రంగాలకు సంబంధించి ప్రకటించిన జాబితాలోని పురస్కార విజేతలు వీరే:

1.     విజ్ఞాన రత్న(వీఆర్‌): కీర్తిశేషులైన ప్రొఫెసర్ జయంత్ విష్ణు నార్లికర్ (భౌతిక శాస్త్రం).

2.     విజ్ఞాన శ్రీ (వీఎస్‌): డాక్టర్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ (వ్యవసాయ శాస్త్రం), డాక్టర్ యూసుఫ్ మహ్మద్ సేఖ్ (అణుశక్తి), డాక్టర్ కె.తంగరాజ్ (జీవశాస్త్రాలు), ప్రొఫెసర్ ప్రదీప్ తలప్పిల్ (రసాయన శాస్త్రం), ప్రొఫెసర్ అనిరుద్ధ భాలచంద్ర పండిట్ (ఇంజినీరింగ్ శాస్త్రాలు), డాక్టర్‌ ఎస్.వెంకట మోహన్ (పర్యావరణ శాస్త్రం), ప్రొఫెసర్ మహాన్ జీ (గణితం-కంప్యూటర్ సైన్స్), శ్రీ జయన్ ఎన్ (అంతరిక్ష శాస్త్రం-సాంకేతికత).

3.     విజ్ఞాన యువ-శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ (వివై-ఎస్‌ఎస్‌బీ): డాక్టర్ జగదీష్‌ గుప్తా కాపుగంటి, డాక్టర్ సతేంద్ర కుమార్ మాంగ్రౌథియా (వ్యవసాయ శాస్త్రం), శ్రీ దేబార్క సేన్‌గుప్తా, డాక్టర్‌ దీపా అగాషే (జీవశాస్త్రాలు), డాక్టర్ దిబ్యేందు దాస్ (రసాయన శాస్త్రం), డాక్టర్ వలియూర్ రెహమాన్ (భూ విజ్ఞాన శాస్త్రం), ప్రొఫెసర్ అర్కప్రవా బసు (ఇంజినీరింగ్ శాస్త్రాలు), ప్రొఫెసర్ సబ్యసాచి ముఖర్జీ, ప్రొఫెసర్ శ్వేత ప్రేమ్ అగర్వాల్ (గణితం-కంప్యూటర్ సైన్స్), డాక్టర్ సురేష్ కుమార్ (వైద్యం), ప్రొఫెసర్ అమిత్ కుమార్ అగర్వాల్ (భౌతిక శాస్త్రం), ప్రొఫెసర్ సుర్హుద్ శ్రీకాంత్ మోరే (భౌతిక శాస్త్రం), శ్రీ అంకుర్ గార్గ్ (అంతరిక్ష శాస్త్రం-సాంకేతికత), ప్రొఫెసర్ మోహన శంకర్ శివప్రకాశం (సాంకేతికత-ఆవిష్కరణ).

4.     విజ్ఞాన బృందం (వీటీ): ‘టీమ్‌- అరోమా మిషన్’ సీఎస్‌ఐఆర్‌ (వ్యవసాయ శాస్త్రం).

శాస్త్ర-సాంకేతిక రంగాల్లో దేశంలోని దార్శనికులను సముచిత రీతిలో సత్కరించడం ద్వారా భావితరానికి స్ఫూర్తినివ్వడంతోపాటు పరిశోధనావరణ వ్యవస్థ బలోపేతం, శాస్త్ర-సాంకేతిక రంగాల్లో ప్రపంచ అగ్రగామిగా భారత్‌ పురోగమనాన్ని వేగిరపరచడమే జాతీయ విజ్ఞాన పురస్కారం ప్రధాన లక్ష్యాలు. విజేతల జాబితాను ప్రకటించిన నేపథ్యంలో వారందరికీ వ్యక్తిగత సమాచారం పంపడంతో పాటు పురస్కార ప్రదానోత్సవం నిర్వహణ తేదీని ప్రభుత్వం త్వరలో ప్రకటిస్తుంది.

***


(Release ID: 2182737) Visitor Counter : 4