|
కేంద్ర మంత్రివర్గ సచివాలయం
బంగాళాఖాతంలో తుఫాను రాకపై అంచనాల నేపథ్యంలో యంత్రాంగం సంసిద్ధతపై మంత్రిమండలి కార్యదర్శి డాక్టర్ టి.వి.సోమనాథన్ అధ్యక్షతన జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ సమావేశంలో సమీక్ష
Posted On:
25 OCT 2025 7:41PM by PIB Hyderabad
బంగాళాఖాతంలో తుఫాను రాకపై అంచనాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధతపై కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి డాక్టర్ టి.వి.సోమనాథన్ అధ్యక్షతన జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ సమావేశం సమీక్షించింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గత 6 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదులుతోంది. ఎప్పటికప్పుడు దీని కదలికలను పర్యవేక్షిస్తున్న భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారులు దీనిపై తమ అంచనాలను సమావేశంలో వివరించారు. ప్రస్తుతం ఈ అల్పపీడనం చెన్నై (తమిళనాడు)కి తూర్పు-ఆగ్నేయంగా 950 కిలోమీటర్లు, విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)నగరానికి ఆగ్నేయంగా 960 కిలోమీటర్లు, కాకినాడ (ఆంధ్రప్రదేశ్)కు ఆగ్నేయంగా 970 కిలోమీటర్లు, గోపాల్‌పూర్ (ఒడిశా)కు ఆగ్నేయంగా 1030 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది దాదాపు పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ, 26వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడి, 27వ తేదీ ఉదయానికి నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది మరింత వాయవ్య, అనంతరం ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ 28వ తేదీ ఉదయానికి తీవ్ర తుఫానుగా రూపుదాలచ్చవచ్చునని అంచనా. ఆ మేరకు ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ, అక్టోబరు 28 సాయంత్రం లేదా రాత్రి వేళ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ పరిసరాల్లోగల మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీవ్ర తుఫానుగా మారితే గంటకు 90-100... గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ‘ఐఎండీ’ అధికారులు వివరించారు.
తుఫాను నేపథ్యంలో ప్రజలకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వంతోపాటు స్థానిక పాలన సంస్థలు చేపడుతున్న ముందు జాగ్రత్త చర్యల గురించి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఒడిశా అదనపు ప్రధాన కార్యదర్శి ఈ సందర్భంగా కమిటీకి వివరించారు. ప్రజలను సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లతోపాటు పునరావాస శిబిరాలను కూడా సిద్ధం చేసినట్లు వారు తెలిపారు. అలాగే జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలను (ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్) సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. జిల్లాల్లో కంట్రోల్ రూములను అప్రమత్తం చేసి, పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో అక్టోబరు 26 నుంచి 29వ తేదీ వరకూ నైరుతి, ఆ పరిసరాల్లోని మధ్య బంగాళాఖాతం, తమిళనాడు తీరం వెంబడి-వెలుపల, అలాగే ఆంధ్రప్రదేశ్, యానాం (పుదుచ్చేరి), ఒడిశా తీరం వెంబడి-వెలుపలి ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లవద్దని జాలర్లను అప్రమత్తం చేశారు. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లినవారు తక్షణం తీరానికి చేరుకోవాలని వర్తమానం పంపారు.
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అన్నిరకాల ప్రామాణిక కార్యకలాపాల విధివిధానాలను అమలులోకి తెచ్చినట్లు సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రిత్వ శాఖలు-విభాగాల అధికారులు వెల్లడించారు. ఈ దిశగా అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయడంతోపాటు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టనివారణకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని కమిటీకి తెలియజేశారు.
ప్రస్తుత తమ బృందాలతోపాటు అదనపు సిబ్బందిని కూడా ఇప్పటికే సంసిద్ధం చేశామని, అక్టోబరు 26న వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు అంతా సిద్ధమని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) అధికారులు తెలిపారు. దీంతోపాటు సైనిక, నావికా, వైమానిక దళం సహా తీరరక్షక దళం రక్షణ-సహాయ బృందాలు కూడా నౌకలు, విమానాలతో సిద్ధంగా ఉన్నాయి. భారత తీరరక్షక దళం ఇప్పటికే 900కు పైగా నౌకలను జెట్టీ/తీరాలకు తరలించగా, సముద్ర జలాల్లోగల మరికొన్నిటిని తీరానికి రావాల్సిందిగా అధికారులు అప్రమత్తం చేశారు. హోం మంత్రిత్వశాఖ, ఎన్‌డీఎంఏ, ఐఎండీ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుండగా మంత్రిత్వ శాఖలు-విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థలతో సమన్వయం దిశగా అన్ని చర్యలూ తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సంసిద్ధత చర్యలను మంత్రిమండలి కార్యదర్శి శ్రీ డాక్టర్ టి.వి.సోమనాథన్ సమీక్షించారు. ప్రాణనష్టం నివారణ, ఆస్తి-మౌలిక సదుపాయాల నష్టం తగ్గింపు లక్ష్యంగా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. అలాగే ఈ నష్టాలను సకాలంలో సరిదిద్ది, అత్యవసర సేవల పునరుద్ధరణకు పటిష్ఠం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, ఒడిశా అదనపు ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి సహా పెట్రోలియం-సహజ వాయువు, మత్స్య, విద్యుత్, టెలికమ్యూనికేషన్లు, ఓడరేవులు-షిప్పింగ్-జలమార్గాల మంత్రిత్వ శాఖల కార్యదర్శులతోపాటు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ కార్యదర్శి, సభ్యుడు, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ నుంచి ఛైర్మన్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్, ఇండియన్ కోస్ట్ గార్డ్ అదనపు డైరెక్టర్ జనరల్, భారత వాతావరణ శాఖ, హోం వ్యవహారాల శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 2182550)
|