ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రోజ్‌గార్ మేళా సందర్భంగా వీడియో మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 24 OCT 2025 12:53PM by PIB Hyderabad

మిత్రులారా!

ఈ ఏడాది వెలుగుజిలుగుల దీపావళి పండుగ మీ అందరి జీవితాల్లో కొత్త దివ్వెలు వెలిగించింది. ఈ ఉత్సాహపూరిత ఉత్సవ వాతావరణం నడుమ మీరంతా శాశ్వత ఉద్యోగ నియామక పత్రం పొందడమంటే, వేడుకల ఆనందంతోపాటు విజయం రెట్టింపైనంత సంతోషం కలుగుతుంది. ఇనుమడించిన ఈ ఆనందం నేడు దేశవ్యాప్తంగా 51 వేల మందికిపైగా యువతరం సొంతమైంది. మరోవైపు మీ కుటుంబాలన్నిటా కూడా ఆనందోత్సాహాలు ఎంతగా వెల్లువెత్తుతుంటాయో నేను ఊహించగలను. ఈ సందర్భంగా మీతోపాటు మీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీ జీవితాల్లో ఈ సరికొత్త ప్రారంభానికిగాను నా శుభాకాంక్షలు.

మిత్రులారా!

మీ ఉత్సాహం, శ్రమించగల సామర్థ్యం, కలలు సాకారం కావడంతో పెల్లుబికిన మీ విశ్వాసం, దేశం కోసం ఏదైనా చేయాలనే మీ తపన... అన్నీ కలగలిస్తే- ఇది వ్యక్తిగతంగా కాకుండా దేశానికే విజయంగా మారుతుంది. ఇవాళ మీకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రం లభించడమే కాదు... దేశ సేవలో చురుగ్గా సహకరించే అవకాశం లభించింది. ఈ స్ఫూర్తి ప్రాతిపదికగా నీతినిజాయతీలతో పని చేస్తారని, భవిష్యత్ భారత్‌ కోసం మెరుగైన వ్యవస్థల సృష్టిలో మీ వంతు పాత్రను పోషించగలరని నాకు నమ్మకం కలుగుతోంది. ఇక ‘పౌర దేవో భవః’ అన్నది మన తారకమంత్రం అనే సంగతి మీకందరికీ తెలిసిందే. కాబట్టి- సేవా స్ఫూర్తి, అంకితభావంతో మనం ప్రతి పౌరుడి జీవితంలో ఎంతగా ఉపయుక్తం కాగలమో ఎన్నడూ విస్మరించకూడదు.

మిత్రులారా!

దేశాన్ని ‘వికసిత భారత్‌’గా రూపుదిద్దాలనే సంకల్ప సాకారం దిశగా గత 11 ఏళ్ల నుంచీ మనం ముందడుగు వేస్తున్నాం. ఈ కృషిలో అతి కీలక పాత్ర యువతరానిది... అంటే- మీ అందరిదీ అన్నమాట! కాబట్టే, యువతరానికి సాధికారత కల్పన బీజేపీ-ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రాథమ్యంగా మారింది. ఈ దిశగా ఉపాధి సమ్మేళనాలు యువత కలలను నెరవేర్చే ఒక మార్గంగా రూపొందాయి. ఇటువంటి సమ్మేళనాల ద్వారా ఇటీవలి కాలంలో 11 లక్షలకుపైగా నియామక లేఖలు పంపిణీ చేశాం. ఈ కృషి ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే పరిమితం కాదు... దీనికితోడు దేశవ్యాప్తంగా ‘ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్‌గార్ యోజన’కూ శ్రీకారం చుట్టాం. దీనికింద 3.5 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పన మా లక్ష్యం.

మిత్రులారా!

దేశంలో ఒకవైపు నైపుణ్య భారతం (స్కిల్ ఇండియా మిషన్) కార్యక్రమాల ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ లభిస్తోంది. మరోవైపు ‘నేషనల్ కెరీర్ సర్వీస్ ప్లాట్‌ఫామ్’ వంటి కార్యక్రమాలు వారిని కొత్త అవకాశాలతో అనుసంధానిస్తున్నాయి. ఈ విధంగా 7 కోట్లకుపైగా ఉద్యోగ ఖాళీల గురించి వారికి వివరాలు అందుబాటులోకి వచ్చినట్లు నాకు సమాచారం అందింది... ఇదేమీ చిన్న సంఖ్య కాదు!

మిత్రులారా!

యువత భవిత కోసం “ప్రతిభా సేతు పోర్టల్” ద్వారా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఆ మేరకు ‘యూపీఎస్‌సీ’ తుది జాబితాలో స్థానం సంపాదించినప్పటికీ, ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థుల శ్రమ ఇకపై వృథా కాదు. ఆ జాబితా ఆధారంగా ప్రైవేట్-ప్రభుత్వ సంస్థలు ఈ పోర్టల్ ద్వారా అటువంటి యువతకు అవకాశాలు కల్పించవచ్చు. ఆ మేరకు వారిని తమ సంస్థల్లో ఉద్యోగాల కోసం ఆహ్వానించి, ఇంటర్వ్యూ నిర్వహించి, ఎంపిక చేసుకోవచ్చు. ఈ పంథాలో యువతరం ప్రతిభ సద్వినియోగం ద్వారా భారత  యువశక్తి సామర్థ్యం ప్రపంచానికి విదితమవుతుంది.

మిత్రులారా!

ఈ సారి పండుగ వేడుకలకు జీఎస్‌టీ పొదుపు ఉత్సవం కొత్త వన్నెలు అద్దింది. జీఎస్‌టీ తగ్గింపు దేశంలో కీలక సంస్కరణ అన్నది మీకందరికి తెలిసిందే. దీని ప్రభావం ప్రజల ఆదాకు మాత్రమే పరిమితం కాదు... ఈ భావితరం సంస్కరణలతో ఉపాధి అవకాశాలు కూడా విస్తరిస్తున్నాయి. దైనందిన వస్తుసామగ్రి చౌకగా లభిస్తే, డిమాండ్ కూడా పెరుగుతుంది. తద్వారా ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు కూడా ఊపందుకుంటాయి. కర్మాగారాలు ఉత్పాదన పెంచినపుడు అది కొత్త ఉద్యోగాల సృష్టికి దోహదం చేస్తుంది. అందుకే, ఈ జీఎస్‌టీ పొదుపు వేడుక ఉపాధి పండుగగానూ రూపొందుతోంది. ధన్‌తేరస్, దీపావళి సందర్భంగా అమ్మకాలు పాత రికార్డులను బద్దలు చేస్తూ కొత్త రికార్డులు నమోదవుతాయి. జీఎస్‌టీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థలో నవ్యోత్సాహం నింపిన తీరును ఈ పరిణామం ప్రతిబింబిస్తుంది. అలాగే, ‘ఎంఎస్‌ఎంఈ’ రంగంతోపాటు చిల్లర వాణిజ్యంలోనూ ఈ కొత్త సంస్కరణ ప్రభావం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు తయారీ రంగంలోనే కాకుండా రవాణా, ప్యాకేజింగ్, పంపిణీ తదితర రంగాల్లోనూ అనేక కొత్త ఉపాధి అవకాశాలు అందివస్తాయి.

మిత్రులారా!

భారత్‌ ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక యువశక్తిగల దేశం. మన యువతరమే దేశానికి అతిపెద్ద బలమన్నది మా విశ్వాసం. ప్రతి రంగంలోనూ ఈ దార్శనికత, విశ్వాసంతో మనం ముందడుగు వేస్తున్నాం. మన విదేశాంగ విధానానికీ యువతరం ప్రయోజనాలే ప్రాతిపదిక. దౌత్యపరమైన చర్చలు, అంతర్జాతీయ అవగాహన ఒప్పందాలు, యువతకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన తదితరాలన్నీ అందులు అంతర్భాగాలే. బ్రిటన్‌ ప్రధానమంత్రి ఇటీవల భారత్‌లో పర్యటించారు. ఆ సందర్భంగా భారత్‌-బ్రిటన్ల మధ్య ఏఐ, ఫిన్‌టెక్, కాలుష్య రహిత ఇంధనం తదితర రంగాల్లో పెట్టుబడులను పెంచేందుకు అంగీకారం కుదిరింది. కొన్ని నెలల కిందట భారత్‌-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు పూర్తయిన నేపథ్యంలో కొత్త అవకాశాలు అందివస్తాయి. అదేవిధంగా అనేక ఐరోపా దేశాలతో పెట్టుబడి భాగస్వామ్యాలు ఏర్పడ్డాయి. వీటివల్ల కూడా వేలాది కొత్త ఉద్యోగాల సృష్టికి వీలుంటుంది. బ్రెజిల్, సింగపూర్, కొరియా, కెనడా వంటి దేశాలతో ఒప్పందాల వల్ల పెట్టుబడులు ఇనుమడిస్తాయి. అంకుర సంస్థలు, ‘ఎంఎంస్‌ఎంఈ’లకు మద్దతు లభిస్తుంది. ఎగుమతులు పెరుగుతాయి... యువతకు ప్రపంచ ప్రాజెక్టులలో పనిచేసే అవకాశాలు లభిస్తాయి.

మిత్రులారా!

భారత్‌ దార్శనికత, దేశం సాధించిన విజయాల గురించి మనమివాళ మాట్లాడుతున్నాం. అయితే, భవిష్యత్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించేది మీరే. ‘వికసిత భారత్‌’ లక్ష్యం దిశగా మనం నిరంతరం కృషి చేయాలి. ఈ సంకల్ప సిద్ధిలో మీలాంటి యువ కర్మయోగుల భాగస్వామ్యమే అత్యంత ప్రధానం. ఈ పురోగమనంలో ‘ఐగాట్-కర్మయోగి భారత్’ వేదిక మీకెంతో తోడ్పాటునిస్తుంది. సుమారు 1.5 కోట్ల మంది ఉద్యోగులు ఈ వేదికలో భాగస్వాములై నైపుణ్యం పెంచుకోవడమే కాకుండా సరికొత్త నైపుణ్యం  కూడా సముపార్జిస్తున్నారు. మీరు కూడా వారితో కలిస్తే, మీలోనూ కొత్త పని సంస్కృతి, సుపరిపాలన భావన బాగా బలోపేతం అవుతాయి. తదనంతరం మీ కృషితో దేశ భవిష్యత్తు ఉజ్వలమై, ప్రజల స్వప్నాలు సాకారం కాగలవు. మీకందరికీ మరోసారి నా శుభాకాంక్షలు.

అనేకానేక ధన్యవాదాలు!

 

***


(Release ID: 2182347) Visitor Counter : 11