|
రక్షణ మంత్రిత్వ శాఖ
త్రివిధ దళాల సంయుక్త.. సమ్మిళిత అసాధారణ శౌర్యపరాక్రమాలకు నిదర్శనం ఆపరేషన్ సిందూర్: రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
· “ఆకస్మిక సవాళ్లను ఎదుర్కొనే దిశగా సమన్వయంతో సానుకూల… ముందస్తు వ్యూహాల రూపకల్పనపై ప్రభుత్వ సంకల్పాన్ని ఈ ఆపరేషన్ పునరుద్ఘాటించింది” · “భవిష్యత్ సంసిద్ధ సాయుధ దళాల రూపకల్పన ద్వారా జాతీయ భద్రత.. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి ప్రభుత్వం భరోసా ఇస్తోంది” · “నేటి ప్రపంచ దృక్కోణంలో పౌర-సైనిక సమ్మేళనం అత్యంత కీలకం” · “పౌర-సైనిక సమ్మేళనాన్ని ఏకీకరణగా కాకుండా ఆవిష్కరణలను ప్రోత్సహించే… ప్రతిభను పరిరక్షించే… దేశాన్ని సాంకేతిక స్వావలంబన వైపు నడిపే వ్యూహాత్మక దోహదకారిగా పరిగణించాలి”
Posted On:
22 OCT 2025 6:33PM by PIB Hyderabad
“భారత త్రివిధ దళాల సంయుక్త, సమ్మిళిత అసాధారణ శౌర్యపరాక్రమాలకు ఆపరేషన్ సిందూర్ నిదర్శనం” అని రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో ఈ రోజు “సివిల్-మిలిటరీ ఫ్యూజన్ యాజ్ ఎ మెట్రిక్ ఆఫ్ నేషనల్ పవర్ అండ్ కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ” పేరిట లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) రాజ్ శుక్లా రాసిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- “మారుతున్న ప్రపంచ పరిస్థితులు, ఆధునిక యుద్ధపద్థతుల నుంచి ఎదురయ్యే ఆకస్మిక సవాళ్లను ఎదుర్కొనే దిశగా సమన్వయంతో సానుకూల, ముందస్తు వ్యూహాల రూపకల్పనపై ప్రభుత్వ సంకల్పాన్ని ఇది పునరుద్ఘాటించింది” అని పేర్కొన్నారు.
యుద్ధాలు సరిహద్దుల్లో మాత్రమేగాక మిశ్రమ, అసమతుల రూపం సంతరించుకున్న నేటి పరిస్థితులలో సంప్రదాయ రక్షణ దృక్పథం ఒక్కటే చాలదని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. అందుకే, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం జాతీయ భద్రత సహా దేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి భరోసా ఇస్తూ, భవిష్యత్ సంసిద్ధ సాయుధ దళాల రూపకల్పన దిశగా అనేక సాహసోపేత, నిర్ణయాత్మక సంస్కరణలను చేపట్టిందని ఆయన వివరించారు.
“త్రివిధ దళాల మధ్య సమన్వయం, సమష్టి చర్యల బలోపేతం దిశగా ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్’ పదవిని సృష్టించడం వీటిలో ఒక చరిత్రాత్మక చర్య. త్రివిధ దళాల సంయుక్త, సమ్మిళిత శక్తి ఫలితాలు ఎలాంటివో ఆపరేషన్ సిందూర్ సమయంలో యావత్ ప్రపంచం చూసింది. ఆ మేరకు సాయుధ బలగాలు కొట్టిన చావుదెబ్బ నుంచి పాకిస్థాన్ ఇప్పటికీ కోలుకునే స్థితిలో లేదు” శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
పౌర-సైనిక సమ్మేళనాన్ని ఏకీకరణగా కాకుండా ఆవిష్కరణలను ప్రోత్సహించే, ప్రతిభను పరిరక్షించే, దేశాన్ని సాంకేతిక స్వావలంబన వైపు నడిపే వ్యూహాత్మక దోహదకారిగా పరిగణించాలని ఆయన అన్నారు. లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) రాజ్ శుక్లా రాసిన పుస్తకం నుంచి మనం అనుసరించాల్సిన కీలకాంశాల్లో ఇదొకటని చెప్పారు. అయితే, “మన పౌరుల శ్రమశక్తి, ప్రైవేట్ రంగం, విద్యా వ్యవస్థ, రక్షణ రంగాలను సమష్టి జాతీయ ప్రయోజనం కోసం అనుసంధానిస్తే ఈ ఏకీకరణ సాధ్యం. ఇది మన ఆర్థిక ఉత్పాదకత, వ్యూహాత్మక ప్రయోజనాలను ఇనుమడింపజేస్తుంది” అని స్పష్టం చేశారు.
నేటి ప్రపంచం ‘శ్రమ విభజన’ భావనను అధిగమించి, ‘లక్ష్యాల ఏకీకరణ’ వైపు పయనిస్తున్నదని రక్షణ మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో విభిన్న బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ, ఉమ్మడి దృక్పథంతో కృషి చేయడం అవశ్యమని చెప్పారు. “శ్రమ విభజన పరంగా మన పౌర పరిపాలన, సైనిక బలగాల స్థాయి వేర్వేరుగా ఉండటం వాస్తవం. అయితే, మన ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచీ పరిపాలనలో ఏ విభాగం కూడా ఒంటెత్తు పోకడతో పనిచేయడం ఇక కుదరదని నిర్ద్వంద్వంగా ఆదేశించారు. ప్రతి ఒక్కటీ పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని స్పష్టమైన రీతిలో మార్గనిర్దేశం చేశారు” అని ఆయన వివరించారు.
ప్రస్తుత సాంకేతికత ఆధారిత యుగంలో పౌర-సైనిక సమ్మేళనం స్వభావాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు. అంతర్జాతీయ తీర్మానాలను దృష్టిలో ఉంచుకుంటూ- సైనిక రంగంలో పౌర సాంకేతిక సామర్థ్యాల సమర్థ వినియోగానికిగల ప్రధాన సవాళ్లను గుర్తించి, కేంద్రీకృత విధానాన్ని అవలంబించడం అవశ్యమని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. “నేటి ప్రపంచ దృక్పథంలో పౌర-సైనిక రంగాలు క్రమంగా ఏకమవుతున్నాయి. సాంకేతికత, ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రత మునుపటితో పోలిస్తే ఇవాళ మరింత ముడిపడి ఉన్నాయి. సమాచారం, సరఫరా వ్యవస్థ, వాణిజ్యం, కీలక ఖనిజాలు, అత్యాధునిక సాంకేతికత వగైరాలన్నీ రెండు రంగాల్లోనూ వినియోగంలో ఉన్నాయి. ఈ పరిస్థితుల నడుమ పౌర-సైనిక కేవలం ఆధునిక ధోరణిగా కాకుండా నేటి తక్షణావసరంగా మారింది. దీన్ని విస్మరిస్తే వ్యూహాత్మక వృద్ధికి విఘాతం కలుగుతుంది. మన కీలక సాంకేతిక పరిజ్ఞానాలు చాలావరకూ పౌర వినియోగానికే పరిమితం అవుతున్నాయి. కాబట్టి, ద్వంద్వ-వినియోగ దృక్కోణంతో ఈ ఆవిష్కరణలను సైనిక-పౌర అనువర్తనాలకు పరస్పరం అన్వయిస్తే మన జాతీయ సామర్థ్యం అనేక రెట్లు ఇనుమడిస్తుంది” అని ఆయన విశదీకరించారు.
పౌర-సైనిక సమ్మేళనం దిశగా ప్రభుత్వం చేపట్టిన నిర్దిష్ట చర్యలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ- సాయుధ దళాలు, ప్రభుత్వం, పరిశ్రమలు, అంకుర సంస్థలు, పరిశోధన సంస్థలు, యువ ఆవిష్కర్తలు ఈ లక్ష్య సాధనలో సమష్టిగా కృషిచేస్తున్నారని రక్షణ మంత్రి అన్నారు. భారత రక్షణావరణ వ్యవస్థలో కొన్నేళ్లుగా చారిత్రక రూపాంతరీకరణ చోటుచేసుకున్నదని గుర్తుచేశారు. ఆ మేరకు ప్రపంచంలో అతిపెద్ద రక్షణ దిగుమతిదారుగా ఉన్న భారత్ శరవేగంగా ముందడుగు వేస్తూ నేడు తయారీ కూడలిగా వృద్ధి చెందుతోందన్నారు. “మా నిరంతర కృషి ఫలితంగా, భారత రక్షణ రంగం అత్యున్నత శిఖరాలకు చేరుకుంటోంది. ఎలాగంటే- దశాబ్దం కిందట దేశీయ రక్షణ ఉత్పాదన దాదాపు రూ.46,000 కోట్లు కాగా, ఇప్పుడు రికార్డు స్థాయిలో రూ.1.51 లక్షల కోట్లకు పెరిగింది. ఇందులో ప్రైవేట్ రంగం వాటా దాదాపు రూ.33,000 కోట్లు” అని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్’ జనరల్ అనిల్ చౌహాన్, ‘చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్’ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ‘యునైటెడ్ సర్వీస్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’ డైరెక్టర్ జనరల్ (రిటైర్డ్) మేజర్ జనరల్ బి.కె.శర్మ, సీనియర్ సివిల్, మిలిటరీ అధికారులు, నిపుణులు పాల్గొన్నారు.
***
(Release ID: 2181822)
|