ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
రసాయన సంబంధ ప్రమాదాలు: శిక్షణ మాడ్యూళ్లను విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య కార్యదర్శి
రసాయన ప్రమాద సమయాల్లో... సత్వర, ప్రతిభావంత స్పందన కోసం
ప్రజారోగ్య వృత్తి నిపుణులకూ, సహాయకులకూ ఉపయోగం
Posted On:
23 OCT 2025 9:45AM by PIB Hyderabad
రసాయనికంగా అత్యవసర స్థితులు ఇటు ప్రజారోగ్యానికీ, అటు పర్యావరణ సంరక్షణకే కాక సామాజిక స్థిరత్వానికి కూడా సరికొత్త ముప్పుల్ని తెచ్చిపెడతాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని జాతీయ స్థాయిలో సముచిత సన్నద్ధత చర్యలనూ, శీఘ్రంగా ప్రతిస్పందించగల యంత్రాంగాలనూ బలపరుచుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది. వేగంగా పురోగమిస్తున్న ప్రస్తుత పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలో, ఈ విధమైన అత్యవసర స్థితుల్ని ఎదుర్కొని పరిష్కరించేందుకు తగిన తాజా వ్యూహాన్ని రూపొందించుకొని, సిద్ధంగా ఉండడం అత్యంత కీలకంగా మారింది.
రసాయనికంగా ఆకస్మిక ఆపద స్థితులు తలెత్తితే వెనువెంటనే చేపట్టాల్సిన ప్రజారోగ్య సంరక్షణ చర్యలకు సంబంధించిన శిక్షణ మాడ్యూళ్లను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఈ రోజు న్యూఢిల్లీలోని నిర్మాణ్ భవన్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు. ఇది, దీనికి సంబంధించిన సన్నద్ధతను మరింతగా పెంచే దిశలో ఓ ముఖ్య నిర్ణయమని చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో వివిధ మంత్రిత్వ శాఖలు, జాతీయ ఏజెన్సీలు, ప్రయివేటు రంగం, పారిశ్రామిక, విద్య బోధన రంగాలకు చెందిన నిపుణులు పాలుపంచుకున్నారు.

రసాయనిక అత్యవసర స్థితులు తలెత్తిన కాలంలో ప్రజారోగ్య నిర్వహణ అంశంపై మూడు విశేష శిక్షణ మాడ్యూళ్లను కేంద్ర ప్రభుత్వంలోని ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ)లు రూపొందించాయి. దీనికోసం అవి జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్డీఎంఏ) సహకారంతో పాటు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ ఇండియా) నుంచి సాంకేతిక సహకారాన్ని పొందాయి.
మూడు మాడ్యూళ్లలో ఈ కింది అంశాలు భాగంగా ఉంటాయి:
• ఒకటో మాడ్యూల్: రసాయనిక అత్యవసర స్థితుల్లో ప్రజారోగ్య నిర్వహణకు సన్నద్ధం కావడం, పర్యవేక్షించడం, ప్రతిస్పందించడం.
• రెండో మాడ్యూల్: రసాయనిక అత్యవసర స్థితుల్లో ఆసుపత్రికి తీసుకువెళ్లే ముందుగా చేపట్టాల్సిన చర్యలు.
• మూడో మాడ్యూల్: రసాయనిక అత్యవసర స్థితుల్లో అందించాల్సిన వైద్య చికిత్స.

రసాయనిక ఘటనలు చోటుచేసుకొన్నప్పుడు సమయానికి తగ్గట్టుగా, ప్రభావశీల నిర్వహణ చర్యల్ని తీసుకోవడానికి అవసరమైన జ్ఞానాన్నీ, ప్రావీణ్యాలనూ, ఆయా కార్యక్రమాల్లో ఉపయోగించాల్సిన సాధనాలనూ ప్రజారోగ్య వృత్తినిపుణులకూ, ఆరోగ్యసంరక్షణ కార్యకర్తలకూ, అత్యవసర స్థితిలో రంగంలోకి దిగి సేవలందించాల్సిన సంబంధిత వర్గాలకూ, విధాన రూపకర్తలకూ అందించడమే ఈ మాడ్యూళ్ల ఉద్దేశం. అంతర్జాతీయ ఆరోగ్య నియమనిబంధనల (ఐహెచ్‌ఆర్ 2005)లో భాగంగా, రసాయనిక అత్యవసర స్థితుల నిర్వహణను పటిష్ఠపరచడం జాతీయ ఆరోగ్య భద్రతతో పాటు అంతర్జాతీయ ఆరోగ్య భద్రత పరంగా ముఖ్య పాత్రను పోషించే కీలక సామర్థ్యాలకు కూడా తోడ్పడేదే కానుంది.
ఈ మాడ్యూల్ పరిచయ కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఎన్డీఎంఏ, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలూ, కేంద్రీయ సంస్థలూ, విద్య బోధన రంగం, భారత్లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయ ప్రతినిధులతో పాటు ఇతర ముఖ్య భాగస్వామ్య సంస్థల అధికారులు పాల్గొన్నారు. ‘‘స్వయంసమృద్ధితో పాటు సుదృఢ దేశ’’ నిర్మాణానికి కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
***
(Release ID: 2181798)
Visitor Counter : 12