ఆర్థిక మంత్రిత్వ శాఖ
ట్యూటికోరిన్ ఓడరేవులో 'ఆపరేషన్ ఫైర్ ట్రైల్'లో భాగంగా రూ. 5.01 కోట్ల విలువైన 83,520 చైనా బాణసంచాల అక్రమ రవాణాను నిరోధించిన డీఆర్ఐ.. నలుగురు అరెస్టు
प्रविष्टि तिथि:
19 OCT 2025 6:42PM by PIB Hyderabad
దీపావళికి ముందు అక్రమ బాణసంచా దిగుమతిని అరికట్టేందుకు డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 'ఆపరేషన్ ఫైర్ ట్రైల్' కొనసాగింపుగా ట్యూటికోరిన్ ఓడరేవులో 40 అడుగుల పొడవున్న రెండు కంటైనర్లను పట్టుకుంది. వీటిలో ఉన్న 83,520 చైనా బాణసంచాలను.. ఇంజనీరింగ్ వస్తువులనే తప్పుడు పేరుతో దిగుమతి చేసుకుంటున్నట్లు డీఆర్ఐ గుర్తించింది. రూ. 5.01 కోట్ల విలువైన ఈ అక్రమ వస్తువులను.. వీటిని దాచిపెట్టేందుకు ఉపయోగించిన సిలికాన్ సీలెంట్ తుపాకుల కార్గోతో పాటు స్వాధీనం చేసుకున్నారు.
2025 అక్టోబర్ 14 నుంచి 18 వరకు సమన్వయంతో చేపట్టిన ఆపరేషన్‌లో డీఆర్ఐ అధికారులు ట్యూటికోరిన్ దిగుమతిదారుడిని అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం చెన్నై, ట్యూటికోరిన్‌లో మరో ముగ్గురు వ్యక్తులను (ముంబయికి చెందిన ఇద్దరు వ్యక్తులతో సహా) అరెస్టు చేశారు. నలుగురికి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
విదేశీ వాణిజ్య విధానంలోని ఐటీసీ (హెచ్) వర్గీకరణ ప్రకారం బాణసంచా దిగుమతిపై ఆంక్షలున్నాయి. దిగుమతులు చేసుకోవాలంటే.. పేలుడు పదార్థాలకు సంబంధించిన నియమాలు-2008 ప్రకారం డీజీఎఫ్‌టీ, పెట్రోలియం- పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పీఈఎస్ఓ) నుంచి అనుమతి తీసుకోవాలి. అక్రమ దిగుమతి, వేరే వస్తువులుగా చెప్పి దిగుమతి చేసుకోవటం వల్ల విదేశీ వాణిజ్యం, భద్రతా నియమాలు ఉల్లంఘనకు గురవ్వటమే కాకుండా.. వాటికి ఉన్న పేలే స్వభావం వల్ల ప్రజా భద్రత, ఓడరేవు మౌలిక సదుపాయాలకు తీవ్రమైన ప్రమాదం కలిగే అవకాశం ఉంది.
అక్రమ రవాణాను అడ్డుకునేందుకు, మౌలిక సదుపాయాలను కాపాడటానికి, ప్రజా భద్రతకు డీఆర్ఐ కట్టుబడి ఉంది.
***
(रिलीज़ आईडी: 2181047)
आगंतुक पटल : 21